లెహర్ ముప్పు తప్పింది
Published Fri, Nov 29 2013 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
సాక్షి, ఏలూరు : పెను తుపానుగా మొదలై అనూహ్యంగా బలహీనపడిన ‘లెహర్’ ప్రభావం జిల్లాపై పెద్దగా కనిపించలేదు. గురువారం తీవ్రతను తగ్గించుకుంటూ మచిలీ పట్నం సమీపంలోని పాలకాయల తిప్ప వద్ద తీరం దాటడంతో జిల్లాకు పెనుముప్పు తప్పింది. సముద్ర తీరం వెంబడి గాలులు, జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పనలమీదున్న వరి, హెలెన్ తుపానుకు నీటమునిగిన చేలు మరింతగా తడిసిపోవడంతో పనికిరాకుండా పోయి రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. కోలుకోలేని విధంగా నష్టపోయిన రైతుల్ని పూర్తిస్థాయిలో ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని కలెక్టర్ సిద్ధార్థజైన్ ప్రకటించారు. మరో 12గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని, 24 గంటలపాటువర్షాలు తప్పవని వాతావరణ శాఖ వెల్లడించడంతో అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.
పునరావాస కేంద్రాల్లోనే బాధితులు
లెహర్ తుపాను తీవ్రత దృష్ట్యా లోతట్టు ప్రాం తాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నరసాపురం మిషన్ హైస్కూల్‌లో పెదమైనవానిలంక, చినమైనవానిలంక, వేములదీవి వెస్ట్, ఈస్ట్ గ్రామాల ప్రజలకు, వేముల దీవి తూర్పు గ్రామస్తులకు ప్రాథమిక పాఠశాలలో, మొగల్తూరు మండలం కుమ్మరిపురుగుపాలెంలో ఆ గ్రామస్తులకు పునరావాస కేం ద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని కలెక్టర్‌తోపాటు విపత్తుల నివారణ ప్రత్యేక అధికారి సంజయ్‌జాజు పరిశీలించారు. మొత్తంమీద 51 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 8,059 మందికి భోజన వసతి, సౌకర్యాలు కల్పిం చారు. 46 మొబైల్ వైద్యబృందాలు, 240 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. తొలుత 22 వేల మందిని తరలించాలనుకున్నప్పటికీ తుపాను గండం గట్టెక్కడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
విపత్తును ఎదుర్కోవడానికి ముందుగా చేసిన ఏర్పాట్లను అధికారులు కొనసాగిస్తున్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా తీరప్రాంత గ్రామాల్లో 150 జనరేటర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాలలో సేవలందించేందుకు ఏర్పాటు చేసిన 160 మంది సభ్యులు గల 4 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 278 మంది గజ ఈతగాళ్లు వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే మకాం వేసి ఉన్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలను నిర్వహించేందుకు 140 వాహనాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖకు చెందిన 9 ఫైర్ ఇంజిన్లు, 130 మంది సిబ్బంది తీరంలోనే ఉన్నారు. తీరప్రాంతంలో సమాచా రం కోసం ఏర్పాటు చేసిన 30 వైర్‌లెస్ సెట్లను అలాగే ఉంచారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 3 క్రేన్‌లు, ఒక జేసీబీ రప్పించి, 700 విద్యుత్ స్తంభాలను సిద్ధం చేశారు. అత్యవసర సేవలు అందించేందుకు 550మంది విద్యుత్ సిబ్బందిని, 60మంది అధికారులను అందుబాటులో ఉంచారు. శుక్రవారం వరకూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటామని ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు. నరసాపురం ఆర్డీవో కార్యాలయంలో 20 మంది కలెక్టరేట్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌ను కొనసాగిస్తున్నారు.
పాలకొల్లులో అధిక వర్షపాతం
గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాలకొల్లులో 10.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిం దని జిల్లా ముఖ్యప్రణాళికాధికారి కె.సత్యనారాయణ తెలిపారు. కాగా, ద్వారకాతిరుమలలో 1.4, నిడదవోలులో 0.8, తాడేపల్లిగూడెం, ఉం గుటూరు, నిడమర్రు, ఉండ్రాజవరం, పెంటపాడులలో 2.6, పెదవేగి, ఏలూరులో 1.6, పెదపాడులో 0.6, గణపవరంలో 3.4, తణుకులో 3, పెరవలిలో, ఇరగవరంలో 3.4, అత్తిలిలో 4, ఉండిలో 7, ఆకివీడు, కాళ్లలో 6, భీమవరంలో 6.8, పాలకోడేరులో 6.4, వీరవాసరంలో 8.4, పెనుమంట్రలో 4.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పెనుగొండలో 4, ఆచంట, పోడూరులలో 6.2, యలమంచిలిలో 8.2, నరసాపురంలో 7.2, మొగల్తూరులో 9.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
త్వరలో సీఎం రాక : మంత్రి పితాని వెల్లడి
జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో పరిశీలిస్తారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, రోడ్లు భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.10 వేలు, కూలిన కొబ్బరి చెట్టుకు రూ.150నుంచి రూ.500 వరకూ నష్టపరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తుపానును ఎదుర్కోవడానికి ముందస్తు ఏర్పాట్లు చేసిన కలెక్టర్ సిద్ధార్థజైన్, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఇతర అధికారులను మంత్రి పితాని అభినందించారు.
Advertisement