‘లెహర్’తోవిమానాల రద్దు!
Published Tue, Nov 26 2013 2:33 AM | Last Updated on Fri, Jun 1 2018 9:35 PM
సాక్షి, చెన్నై: లెహర్ దెబ్బతో చెన్నై నుంచి అండమాన్‌కు బయలు దేరాల్సిన విమానాలు, అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వీరికి నగరంలోని పలు హోటళ్లలో వసతి కల్పించారు. సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు పట్టణాలు జలమయమయ్యాయి. అండమాన్ సమీపంలో బంగాళా ఖాతంలో ఏర్పడిన ద్రోణి తుపానుగా మారడంతో లెహర్ అని పేరు పెట్టారు. ఈ ప్రభావంతో రాష్ర్టంలోని సుముద్ర తీర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం రాత్రి చెన్నై శివారులు, కాంచీపురం, కడలూరు, నాగపట్నం, విల్లుపురం, తూత్తుకుడిల్లో భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలో ఉదయం 8 గంటల తర్వాత భానుడు ప్రతాపం చూపించాడు. లెహర్ ప్రభావంతో అండమాన్‌లో తీవ్ర వర్షం పడుతోంది. ఈ ద్రోణి ఆంధ్రా వైపుగా పయనిస్తుండటంతో రాష్ట్రం ఆ గండం నుంచి బయట పడ్డట్టేనని వాతావరణ కేంద్రం పేర్కొంది.
అయితే, చెన్నై - కడలూరు, నాగపట్నం తీరాల్లో వర్షాలు పడుతాయని ప్రకటించింది. అలల తాకిడి క్రమంగా తగ్గుతుండటంతో జాలర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. విమానాల రద్దు: లెహర్ ప్రభావంతో చెన్నై అండమాన్ మధ్య విమాన సేవలు రద్దు అయ్యాయి. ఉదయం ఐదు గంటలకు 120 మంది ప్రయాణికులతో అండమాన్‌కు బయలుదేరడానికి విమానం సిద్ధం అయింది. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితులు విమాన సేవలకు అనుకూలంగా లేదన్న సమాచారంతో ఆ విమానం 9 గంటలకు బయలు దేరుతుందని ప్రకటించారు. దీంతో విమానంలోనే ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఎంతకూ విమానం బయలుదేరక పోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. చివరకు వాతావరణం అనుకూలించని దృష్ట్యా, ఆ విమాన సేవను రద్దు చేస్తున్నట్టు ఆ యాజమాన్యం ప్రకటించింది.
ఉదయం ఏడు గంటలకు బయలు దేరాల్సిన ఎయిర్ వేస్, తొమ్మిది గంటలకు బయలు దేరాల్సిన బోయింగ్, పది గంటలకు బయలు దేరాల్సిన ప్రైవే టు విమాన సేవలు రద్దు అయ్యాయి. సుమారు 536 మంది ప్రయాణికులు అండమాన్‌కు వెళ్లాల్సి ఉండటంతో, వారంద రికీ నగరంలోని పలు హోటళ్లల్లో బస సౌకర్యం కల్పించారు. వాతావరణం అనుకూలించిన తర్వాత విమాన సేవలు అండమాన్‌కు పునరుద్ధరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అండమాన్ నుంచి ఇక్కడికి రావాల్సిన సుమారు ఐదు విమానాల సేవలు రద్దు అయ్యాయి. తమ వాళ్లకు ఆహ్వానం పలికేందుకు మీనంబాక్కంకు వచ్చిన బంధువులు, ఆప్తులు గంటల తరబడి పడిగాపులు కాసి, చివరకు సేవల రద్దుతో వెను దిరగాల్సి వచ్చింది.
Advertisement