మెరుపు వేగంతో అండమాన్‌కు.. | Flights Visakhapatnam to Andaman | Sakshi
Sakshi News home page

మెరుపు వేగంతో అండమాన్‌కు..

Oct 26 2017 12:03 PM | Updated on Oct 2 2018 7:37 PM

Flights Visakhapatnam to  Andaman - Sakshi

అండమాన్‌ ప్రయాణికులు (ఇన్‌సెట్‌) ఎయిరిండియా విమానం

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మొన్నటి వరకూ అండమాన్‌ ఎవరైనా వెళ్తున్నారంటే అబ్బో... అండమానే...అని ఆశ్చర్యంగా ప్రశ్నించే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రెండుంపావు గంటల్లోనే అండమాన్‌ చేరుకోవచ్చు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా  రెండేళ్లుగా పోర్టుబ్లెయిర్‌(అండమాన్‌)కు విమాన సర్వీసులు వారానికి రెండు మార్లు అందిస్తోంది. రెండుంపావు గంటల్లో పోర్టుబ్లెయిర్‌ నుంచి విశాఖకు చేరుస్తోంది. ఈ సర్వీసులకు డిమాండ్‌ పెరగడంతో ఆ సంస్థ  ఇంకో రెండు సర్వీసులు పెంచే నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మీదుగా కనెక్టివిటీ పెంచింది. మొత్తం ఢిల్లీ ప్రయాణికులే నెలకు 30 వేల మంది వరకూ ఉన్నారు. ఢిల్లీ, పోర్టుబ్లెయిర్‌లకు విమాన సర్వీసులు పెంచుతూ చర్యలు చేపట్టడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

ఢిల్లీ–విశాఖ–పోర్టుబ్లెయిర్‌–ఢిల్లీకి ఇలా...
ఢిల్లీ –విశాఖ–పోర్టుబ్లెయిర్‌ –ఢిల్లీకి సోమ, గురు, శనివారాల్లో సర్వీసులు అందించడానికి ప్రణాళిక చేసింది. ఆ రకంగా ఢిల్లీలో ఉదయం 5.30కి బయలుదేరి విశాఖకు 7.40కి చేరుతుంది. ఇక్కడి నుంచి ఉదయం 8.15కి బయలుదేరి 10.10కి పోర్టుబ్లెయిర్‌ చేరుతుంది. పోర్టుబ్లెయిర్‌లో 10.50కి బయలుదేరి ఢిల్లీకి మధ్యాహ్నం 2.35కి వెళ్తుంది.

ఢిల్లీ–పోర్టుబ్లెయిర్‌–విశాఖ–ఢిల్లీకి...
ఎయిరిండియా విమాన సంస్థ ఢిల్లీ–పోర్టుబ్లెయిర్‌–విశాఖ–ఢిల్లీకి మంగళ, బుధ, శుక్ర,ఆదివారాల్లో సర్వీసులు అందించనుంది. ఢిల్లీలో ఉదయం 5.30కి బయలుదేరి పోర్టుబ్లెయిర్‌కు 9.15కు చేరుతుంది. అక్కడి నుంచి 9.55కి బయలుదేరి విశాఖకు 11.55కి వస్తుంది. ఇక్కడి నుంచి మధ్యాహ్నం 12.30కి బయలుదేరి 2.35కి ఢిల్లీ చేరుతుంది.

వెయిటింగ్‌ లిస్ట్‌ పెరిగిపోతోంది...
అండమాన్‌కు కోస్తాంధ్ర జిల్లాలనుంచి ప్రయాణికులు, వ్యాపారులు, టూరిస్టులు విపరీతంగా పెరిగారు. శ్రీకా కుళం నుంచి అధికంగా ప్రయాణాలు జరుగుతున్నాయి. విశాఖ నుంచి  నేవీ అధికారులు,ఉద్యోగులూ రక్షణ రంగ అవసరాల కోసం తరచూ వెళ్లొస్తున్నారు. ప్రయాణాలకు వెయిటింగ్‌ లిస్టు పెరిగిపోతోంది.దీంతో ఎయిరిండియా విమాన సంస్థ వారానికి నాలుగు సార్లు ఢిల్లీకి కనెక్టివిటీ సర్వీసులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ప్రతి రోజూ సర్వీసులు ఇచ్చే ప్రతిపాదన జరుగుతోంది. – డి.వరదారెడ్డి,  భారత విమాన ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు

విమాన ప్రయాణం బాగుంది
అండమాన్‌ నుంచి విమాన ప్రయాణం చాలా బాగుంది. రెండుంపావు గంటల్లో పోర్టుబ్లెయిర్‌ నుంచి విశాఖకు వస్తున్నాం. ఓడలో కంటే విమాన ప్రయాణం హాయిగా ఉంది. గతంలో వ్యయ ప్రయాశపడేవాళ్లం. సులభప్రయాణం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది. – మాధవరావు, అండమాన్‌ ప్రయాణికుడు, శ్రీకాకుళం

అవస్థలు తప్పాయి
గతంలో షిప్‌పై అండమాన్‌ వెళ్లేవాళ్లం. ఇపుడు విమాన సదుపాయంతో అవస్థలు తొలగాయి. సులువుగా ప్రయాణిస్తున్నాం. తాజాగా కొత్త సర్వీసులు వస్తే మరింత సులభంగా ప్రయాణాలు సాగించవచ్చు. – సంగీత,అండమాన్‌ ప్రయాణికురాలు, కవిటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement