మయన్మార్‌లో విమానం గల్లంతు | Debris of Myanmar military plane found in sea: Official | Sakshi
Sakshi News home page

మయన్మార్‌లో విమానం గల్లంతు

Published Thu, Jun 8 2017 1:42 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

మయన్మార్‌లో విమానం గల్లంతు - Sakshi

మయన్మార్‌లో విమానం గల్లంతు

సముద్రంలో శకలాలు గుర్తించినట్లు ప్రకటించిన సైన్యం
 
యాంగాన్‌: సుమారు 100 మందికి పైగా ప్రయాణిస్తున్న మయన్మార్‌ సైన్యానికి చెందిన ఓ విమానం బుధవారం గల్లంతైంది. ఆ తరువాత అండమాన్‌ సముద్రంలో దాని శకలాలను గుర్తించినట్లు ఎయిర్స్‌ఫోర్స్‌ అధికారులు వెల్లడించారు. చైనాలో తయారైన వై–8ఎఫ్‌–200 అనే సరకు రవాణా విమానం ఈ ప్రమాదానికి గురైంది. మైయెక్‌ పట్టణం నుంచి యాంగాన్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయినప్పటి నుంచి నేవీ ఓడలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు గాలింపు ప్రారంభించాయి. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలిసింది.

వారిలో కొందరు వైద్య పరీక్షలకు, మరికొందరు పాఠశాలలకు బయల్దేరినట్లు భావిస్తున్నారు. దావేయ్‌ పట్టణానికి 218 కి.మీ దూరంలో విమాన శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో మిలిటరీ అన్వేషణ కొనసాగిస్తోందని చెప్పారు. మధ్యాహ్నం 1.35 గంటలకు విమానం మయన్మార్‌ దక్షిణ తీరంలో ఉండగా సంబంధాలు తెగిపోయాయని కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయం వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యపై స్పష్టత రాలేదు. సైనికులు, వారి కుటుంబీకులు, సిబ్బంది మొత్తం కలిసి 120 దాకా ఉంటారని కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయం తెలిపింది. మయన్మార్‌లో ప్రస్తుతం వర్షాకాలం. అయితే విమానం గల్లంతైనపుడు వాతావరణం బాగానే ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement