తుఫాన్ పేరెత్తితేనే జిల్లా ప్రజ లు ఉలిక్కి పడుతున్నారు. ప్రతియేటా దాడి చేస్తున్న తుఫాన్లు, వాయుగుండాలు జిల్లా వ్యవసాయ, ఆర్థిక రంగాలను కుదేలు
తుఫాన్ల టై
Published Tue, Nov 26 2013 3:56 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తుఫాన్ పేరెత్తితేనే జిల్లా ప్రజ లు ఉలిక్కి పడుతున్నారు. ప్రతియేటా దాడి చేస్తున్న తుఫాన్లు, వాయుగుండాలు జిల్లా వ్యవసాయ, ఆర్థిక రంగాలను కుదేలు చేస్తుండటాన్ని తలచుకొని బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలోనే సువిశాల తీరుప్రాంతం కలిగి ఉన్న జిల్లాకు వాయుగుండాలు, తుఫాన్లు కొత్త కాకపోయినా.. గత పదేళ్లలో వీటి వల్ల వాటిల్లిన పంట, ఆస్తి నష్టాలు.. ఎదుర్కొన్న కష్టాలు పీడకలగా మిగిలిపోయాయి. ముఖ్యంగా ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు తుఫాన్లు, మధ్యలో భారీ వర్షాలు, వరదలు జిల్లాలో పంటలను ఊడ్చేశాయి. ఇవి చాలవన్నట్లు లెహర్ రూపంలో మరో పెను తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడం, మచిలీపట్నం-కళింగపట్నం మధ్య అది తీరం దాటవచ్చని సూచించడంతో బెంబేలెత్తుతున్నారు. గత నెల 12న సంభవించిన ైపై-లీన్, తర్వాత వారం రోజుల వ్యవధిలోనే కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదలతో రెండు లక్షలకు పైగా ఎకరాల్లో ఆహార, ఉద్యానవన పంటలు నాశనమయ్యాయి. వేలాది మత్స్యకారులు జీవన భృతి కోల్పోయారు.
ఇతర రంగాలపైనా వీటి ప్రభావం తీవ్రంగా ఉంది. వాటి నుంచి ప్రజలు ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఇప్పుడిప్పుడే పోయిన పంటల స్థానంలో మళ్లీ కొత్త పంట వేయడం, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో పెను తుఫాన్ లెహర్ వార్తలు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ తరుణంలో మిగిలిన కొద్దిపాటి పంటలను కాపాడుకోవడమెలా అని సతమతమవుతున్నారు. వరుస తుఫాన్లు, వాయుగుండాల నుంచి విముక్తి లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లెహర్‌కు ముందు గత పదేళ్లలో జిల్లాను ప్రభావితం చేసిన ప్రకృతి విపత్తుల క్రమం పరిశీలిస్తే... 2003 అక్టోబర్ 6,7 తేదీల్లో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు 51 వేల హెక్టార్లలో పంట నష్టం జగిరింది. సుమారు 25వేల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు.
2004 అక్టోబరు 3 నుంచి 5 తేదీల్లో తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు 2,900 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 20వేల మంది ప్రజలు అవస్థలు పడ్డారు. 2005 సెప్టెంబరు 18, 19 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులు పొంగి 15వేల హెక్టార్లలో పంటలు నేలపాలయ్యాయి. 40 వేల మంది ప్రజలు నష్టపోయారు. 2010 మే నెలలో లైలా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు, చెరువులు ఇతర ఆస్తులకు నష్టం వాటిల్లింది.
అదే ఏడాది.. అంటే 2010 అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు జల్ తుఫాన్ దాడి చేసింది. పెనుగాలులతో కూడిన వర్షాలతో సుమారు 3 లక్షల మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. 1.60 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇళ్లతోపాటు వందల కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి.
చేతికొచ్చిన పంటలు పోయి వందల కోట్ల నష్టం వాటిల్లగా ప్రభుత్వం రూ.88 కోట్ల పరిహారం మాత్రమే మంజూరు చేసింది. 2012 అక్టోబర్ 28 నుంచి నవంబర్ 6 వరకు నీలం తుఫాన్ జిల్లాను అతలాకుతలం చేసింది. నలుగురు మరణించగా, 3 లక్షల మంది ప్రభావితులయ్యారు. 28వేల హెక్టార్లలో పంటలు పోయాయి. 24 పశువులు మృతి చెందాయి. వందల సంఖ్యలో పూరిళ్లు నేలమట్టమవగా వందల కోట్ల నష్టం వాటిల్లింది. 2013 అక్టోబర్ 12న పెను తుపాను పై-లీన్ పంజా విసిరింది. ఉద్దానం ప్రాంతంలోని సుమారు 25 వేల ఎకరాల్లో కొబ్బరి, జీడి,
ఇతర ఉద్యానవన తోటలను నేలమట్టం చేసింది. వారం వ్యవధిలోనే అంటే అక్టోబర్ 22 నుంచి 27 వరకు వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలు జిల్లాను ముంచేశాయి. 2 లక్షలకుపైగా ఎకరాల్లో వరి, ఇతర ఆహార పంటలు నీటమునిగాయి. వందల గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రవాణా, సమాచార, నీటిపారుదల వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ రెండు విపత్తులతో అధికార అంచనాల ప్రకారమే సుమారు వె య్యి కోట్ల నష్టం వాటిల్లింది. 2013 నవంబర్ 13, 14 తేదీల్లో హెలెన్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిశాయి. వర్షాల తీవ్రత అంతగా లేకపోయినా పై-లీన్, భారీ వర్షాలతో నీటమునిగి అప్పటికే దెబ్బతిన్న పంటలు హెలెన్ వర్షాలతో మరింత దెబ్బతిన్నాయి. రైతులను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీశాయి.
Advertisement
Advertisement