వారిఇంట సందడి లేదు! | Fishermans Family Waiting For He Is Relieving From Pakistan | Sakshi
Sakshi News home page

వారిఇంట సందడి లేదు!

Published Tue, Jan 15 2019 7:54 AM | Last Updated on Tue, Jan 15 2019 7:54 AM

Fishermans Family Waiting For He Is Relieving From Pakistan - Sakshi

తమ వారి కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు

సంక్రాంతి అంటే గ్రామాల్లో సందడిగా ఉంటుంది. వలస కార్మికులు, వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేసేవారు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు స్వగ్రామాలు చేరుకుంటారు. ఏడాదిలో తప్పని సరిగా ఈ పెద్ద పండుగకు ఇళ్లకు వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మత్స్యకార కుటుంబాలకు చెందిన వారు సైతం గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలస వెళ్లి సంక్రాంతి వేళ స్వగ్రామం చేరుకోవడం సంప్రదాయం. అయితే ఈసారి కొన్ని మత్స్యకార కుటుంబా లు ఆ సరదాకు నోచుకోలేదు. బతుకు తెరువు కోసం గుజరాత్‌ వెళ్లి.. అక్కడ ఓ కాంట్రాక్టర్‌ ద్వారా సముద్రంలో చేపల వేట చేస్తూ పొరపాటున పాక్‌ జలాల్లోకి చొచ్చుకెళ్లడంతో.. ఆ దేశ భద్రతా సిబ్బంది వారిని అరెస్టు చేశాయి. దీంతో వారి కుటుంబాలు పండగ సరదాకు దూరమయ్యాయి.

శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్‌: బతుకు తెరువు కోసం వలస వెళ్లి అనుకోని రీతిలో పాకిస్థాన్‌ చెరలో చిక్కుకున్న జిల్లాకు చెందిన మత్స్యకారుల కుటుంబాలు తమ వారి కోసం ఎదురు చూస్తున్నాయి. యోగ క్షేమాల కోసం నిరీక్షిస్తున్నాయి. విడుదలలో జాప్యం నెలకొనడంతో వీరి కుటుం బాల్లో సంక్రాంతి వేళ ఆనందం లేకుండాపోయింది. గత ఏడాది నవంబర్‌ 28వ తేదీన ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన మత్స్యకారులు గుజరాత్‌ రాష్ట్రంలోని వీరావల్‌ ప్రాంతంలోసముద్రంలో చేపల వేట చేస్తూ సరిహద్దు దాటడంతో పాక్‌ భద్రతా దళాలకు చిక్కుకున్నారు. దీంతో వారిని పాక్‌ పోలీసులు అరెస్టు చేశాయి. ఎచ్చెర్ల మండలంలోని డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన 10 మంది, బడివానిపేటకు చెందిన ముగ్గురు, తోటపాలెంకు చెందిన ఒకరు, శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఒకరు పాక్‌ చెరలో ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు తమవారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా ప్రభుత్వం రూ. 10 వేలు, రేషన్‌ సరుకులు అందజే సింది. ఎక్స్‌గ్రేషియాగా కుటుంబానికి రూ.2 లక్షలు, మత్స్యకారులు విడుదలయ్యే వరకు నెలకు రూ. 4,500 అందజేసే విషయం ఇంకా ప్రతిపాదన దశలో ఉంది. పాక్‌ చెరలో ఉన్న మత్స్యకారుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం శాఖ, విదేశాంగ శాఖలకు లేఖలు రాసింది. ప్రస్తుతం పాక్‌ విదేశాంగ శాఖతో సప్రదింపులు జరగుతున్నాయి.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు సైతం విదేశాంగ మంత్రి ద్వారా ప్రయత్నాలు చేసింది. అయితే మత్స్యకారుల విడుదల విషయంలో జాప్యం నెలకొంది. పాక్‌ దర్యాప్తులో ఉద్దేశ పూర్వకంగా కాకుండా దారితప్పి పొరపాటున మత్స్యకారులు భారత్‌ సరిహద్దు దాటి పాక్‌ సముద్ర జలాల్లోకి వెళ్లినట్టు నివేదిక రావాలి. ప్రస్తుతం అక్కడ ఈ కేసు మందకొడిగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలిసింది. కేసు దర్యాప్తులో పురోగతి ఉంటే గత ఏడాది  డిసెంబర్‌ నెలలోనే మన దేశ అధికారులకు మత్స్యకారులను అప్పగించేవారు. దర్యాప్తులో జాప్యం కారణంగా మత్స్యకారులు ఎప్పుడు విడుదల అవుతారన్న అందోళనలో కుటుంబ సభ్యులు,  గ్రామస్తులు ఉన్నారు. డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన సూరాడ అప్పారావు, అతని కుమారులు కిశోర్, కల్యాణ్‌ పాక్‌ చెరలో చిక్కుకున్నారు. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ ఇంటి సంక్రాంతి సరదా లేకుండా పోయింది. ఇదె? గ్రామానికి చెందిన మైలపల్లి సన్యాసి, ఆయనకు మారుడు రాంబాబు కూడా పాక్‌ చెరలో ఉన్నారు. వారి ఇంట కూడా ఇదే పరిస్థితి పరిస్థితి.  పాక్‌కు పట్టుబడిన గనగాళ్ల రామారావు, కేసుమ ఎర్రయ్య, కేసుం రాము, చీకటి గురుమూర్తి, బడివానిపేటకు చెందిన వాసుపల్లి శ్యామ్యూల్, బడి అప్పన్న, కోనాడ వేంకటేష్‌ కుటుంబ సభ్యులు తమ వారి రాక కోసం ఎదురు చూస్తు న్నారు. అందరూ సంక్రాంతి సందడిలో ఉండగా పాక్‌ చెరలో ఉన్న జలపుత్రుల కుటుంబ సభ్యుల్లో మాత్రం సందడి లేకుండా పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement