devendra fadnvis
-
Maharashtra: ‘వసూల్ రాజా’లకు ఫడ్నవీస్ వార్నింగ్
సాక్షి, ముంబై: మాతాడి ప్రాంతంలో వేతన జీవులనుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. నేవీముంబైలోని వేతన జీవులు ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాషిలోని ఏపీఎంసీ మార్కెట్లో మాతాడి వర్కర్లు అంతర్భాగమని, వారి నుంచి ఇతరులెవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే మాతాడీ ప్రాంతంలో వేతన జీవులనుంచి వసూల్ రాజాలకు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయని, వారి వల్ల మాతాడీ ప్రాంతానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ముంబైలోని వొర్లి–సెవ్రీ ఎలివేటెడ్ రోడ్ నిర్మాణంలో నిర్వాసితులైన వారి కష్టాలు వినేందుకు ఏక్నాథ్ శిందే రెండు కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. -
సోషల్ మీడియాలో మాజీ సీఎం భార్య రచ్చ.. ‘ఆ డ్రెస్ ఏంటి’
Devendra Fadnavis Wife Amruta Fadnavis Song Manike Mage Hithe in New Viral Video: సోషల్ మీడియా వాడకంతో సినీ, రాజకీయ ప్రముఖులు తమ అభిమానులకు మరింత దగ్గరయ్యే అవకాశాలు పెరిగాయి. తమకు సంబంధించిన ప్రతి అంశాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే దీని వల్ల లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఏదైనా మంచి చేస్తే ప్రశంసలు.. పిచ్చి వేశాలు వేస్తే.. విమర్శలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. ఇప్పుడీ టాపిక్ ఎందుకంటే.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి భార్య సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. అయితే వీడియోలో ఆమె డ్రెస్సింగ్ చూసి జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ వివరాలు.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఆమెకు సంభంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా అమృత ఫడ్నవీస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేశారు. అది ఇప్పుడు తెగ వైరలవ్వడంతో పాటు విమర్శల పాలు చేస్తోంది. (చదవండి: Devendra Fadnavis: మీ భార్యలు కొట్టినా మోదీ బాధ్యతేనా?) సింహళ పాట మణికే మాగే హితే ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పాట పలు వర్షన్లు.. వేరు వేరు భాషల్లోకి డబ్ అవ్వడమే కాక అక్కడ కూడా హిట్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా అమృత ఫడ్నవీస్ కూడా ఈ పాటకు తనదైన శైలీలో కొన్ని మార్పులు చేయడమే కాక స్వయంగా ఆడి పాడారు. హిందీలో పాడిన ఈ పాట కోసం అమృత ఎరుపు రంగు టైట్ ప్యాంట్, టీ షర్ట్.. దాని మీద తెలుపు రంగు షర్ట్ ధరించారు. (చదవండి: ‘మణికే మాగే హితే’ యొహానీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్) అమృత గాత్రం, ఆమె ఎక్స్ప్రెషన్స్ అన్ని సూపర్‌గా ఉన్నాయి. కానీ ఆమె ధరించిన బట్టలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. మాజీ సీఎం భార్య.. అంటే ఎంత పద్దతిగా ఉండాలి.. మరీ ఇంత అతి అవసరం లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన వదిన.. అందరి చూపు ఆమె వైపే View this post on Instagram A post shared by Amruta Fadnavis (@amruta.fadnavis) -
‘కరోనా పురుగు దొరికితే మాజీ సీఎం నోట్లో వేస్తాను’
ముంబై: కరోనా విజృంభిస్తోన్న వేళ రెమిడెసివీర్ ఔషధానికి భారీ డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ముంబైలో రెమిడెసివీర్ డోసులను అక్రమంగా నిల్వ ఉంచాడనే ఆరోపణలపై పోలీసులు ప్రముఖ ఫార్మ కంపెనీ సీఈఓని అరెస్ట్ చేశారు. దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ముంబై పోలీసులు అనవసరంగా సదరు ఫార్మ కంపెనీ సీఈఓని వేధిస్తున్నారన్నారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపాయి. దీనిపై శివసేన, బీజేపీ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శివసేన ఎమ్మెల్యే ఒకరు ఫడ్నవీస్‌ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తనకు కనుక కరోనాకు కారణమైన క్రిమి దొరికితే వెంటనే దాన్ని తీసుకువచ్చి.. ఫడ్నవీస్ నోట్లో వేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివసేన ఎమ్మేల్యే సంజయ్ గైక్వాడ్ శనివారం రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కోవిడ్ విశ్వరూపం దాల్చింది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బీజేపీ.. మమ్మల్ని అప్రదిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ నాకే గనుక కోవిడ్‌కు కారణమైన క్రిమి దొరికితే.. వెంటనే దాన్ని తీసుకువచ్చి ఫడ్నవీస్ నోట్లో వేస్తాను’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి విజృంభిస్తోన్న వేళ బీజేపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. అంతేకాక ‘‘కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు సరిపడా ఆక్సిజన్ని సరఫరా చేయడం లేదు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం అయిన గుజరాత్‌కి మాత్రం ఉచితంగా 50 వేల డోసుల రెమిడెసివీర్ ఇంజక్షన్లను సరఫరా చేసింది. కానీ ఇక్కడ జనాలు చనిపోతున్నా పట్టించుకోవడం’’ లేదు అని సంజయ్ ఆరోపించారు. సంజయ్‌పై కేసు నమోదు సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సంజయ్ గైక్వాడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన దిష్టి బొమ్మలు దగ్దం చేశారు. సంజయ్ తన వ్యాఖ్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ముంబై ప్రెసిడెంట్ ఎంపీ లోధా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: వచ్చే 15 రోజుల్లో యాక్టివ్ కేసులు రెట్టింపు -
అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం రేపిన కలకలం మరింత ముదురుతోంది. ముంబైలోని అంబానీ ఇంటిముందు అనుమానాస్పందంగా కనిపించిన స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరెన్ (45) శవమై తేలడం వివాదాన్ని మరింత రాజేస్తోంది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా మహారాష్ట్ర మాజీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో చోటుచేసుకున్న అనేక సంఘటనలు అనుమానాలకు తావిస్తోందనీ, దీనిపై ఉన్నత స్థాయి దర్యప్తు జరపాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్' మహారాష్ట్ర పోలీసు అధికారి సచిన్ వాజ్ పాత్రపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. (అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్ మృతి) రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై రాష్ట్ర శాసనసభలో శుక్రవారం మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబానీ బెదిరింపు కేసులో అనుమానాలకు దారితీసే అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మన్సుఖ్‌ని, వాజ్ టెలిఫోన్ సంభాషణ జరిగిందని ఆరోపించారు. అంతేకాదు పోలీసు కమిషనరేట్‌కు సమీపంలో ఉన్న దక్షిణ ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో మన్సుఖ్‌ని వాజ్ కలిశారని చెప్పుకొచ్చారు. అలాగే కొంతమంది పోలీసులు అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మన్సుఖ్ తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. ఇన్ని అనుమానాల నేపథ్యంలోఈ కేసు దర్యాప్తు తప్పనిసరిగా ఎన్ఐఏకు అప్పగించాలన్నారు. (అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు) మరోవైపు మన్సుఖ్ను కలిసారాన్న ఆరోపణలను సచిన్ వాజ్ ఖండించారు. మన్సుఖ్ థానేకు చెందినవాడు కాబట్టి తనకు తెలుసు అంతేకానీ, ఇటీవలి కాలంలో అతడిని కలవలేదన్నారు. అలాగే తనను వేధిస్తున్నట్టుగా మన్సుఖ్ ఫిర్యాదు చేశాడని ధృవీకరించారు. అలాగే ఈ కేసులోఅంబానీ నివాసానికి చేరుకున్న మొదటి వ్యక్తిని తాను కాదన, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గామ్దేవి అని, ఈ తరువాత క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు స్పాట్ చేరుకున్నానని వివరణ ఇచ్చారు. అలాగే క్రాఫోర్డ్ మార్కెట్లో మన్సుఖ్ను కలిశాననే ఆరోపణలు అబద్ధమని కొట్టి పారేశారు. కాగా ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ మన్సుఖ్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వాహన విడిభాగాల వ్యాపారం చేసే మన్సుఖ్, తన ఎస్‌యూవీని ఎవరో దొంగిలించారంటూ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే గురువారం రాత్రి కనిపించకుండా పోయిన మన్సుఖ్ శుక్రవారం అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. -
ఫడ్నవిస్‌తో శరద్ పవార్ భేటీ..!
సాక్షి, ముంబై : భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో పలువురు నాయకులు బీజేపీలో చేరుతారని అన్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరడానికి దాదాపు 10 మంది వరకు బీజేపీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని ఎన్సీపీ చీఫ్ జయంత్‌పాటిల్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఫడ్నవిస్ ఈ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. జయంత్ వ్యాఖ్యలపై ఫడ్నవిస్ స్పందిస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి నుంచి అసంతృప్త ఎమ్మెల్యేలు బయటికి వెళ్లకుండా ఉండటానికే ఇటువంటి వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. మహా వికాస్ ఆఘాడీ ఒక్కటిగా పోటీచేసి బీజేపీకి ఎక్కువ సామర్థ్యాన్ని ఇస్తుందని, ఇది బీజేపీ రాజకీయ క్షేత్రం ఏర్పరుచుకునేలా చేస్తుందని తెలిపారు. బీజేపీ కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో విస్తరించి ప్రభుత్వాలను ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు. మహారాష్ట్రలో మన సొంత బలం మీద ఎదగడానికి అధికార పార్టీలు తమకు అవకాశం కల్పించాయని, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీని సృష్టిస్తామని ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ‘చెక్కు చెదరకుండా‘ ఉన్నారని, తన పార్టీలో చేరిన నాయకులు పరిణతి చెందినవారు, రాజకీయాలను అర్థం చేసుకున్నారని, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, యూపీఏ దేశ భవిష్యత్తు కాదని ఫడ్నవిస్ చురకలంటించారు. ఈ దేశం భవిష్యత్తు ప్రధాని నరేంద్రమోదీ అని ప్రజలకు ఒక ఆలోచన ఉందని మాజీ సీఎం వ్యాఖ్యానించారు. (అమిత్ షా ఎత్తుగడ.. మమతకు మద్దతు! ) ఫడ్నవిస్‌తో పవార్ భేటీ.. కంజూర్ మార్గ్‌లో మెట్రోకార్ షెడ్ నిర్మాణం విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడం కోసం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీనికోసం పవార్ ప్రతిపక్ష పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయినట్లు సమాచారం. కంజూర్ మార్గ్ స్థలం తమదంటే తమదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాదించుకంటూ ఉండటంతో హైకోర్టు కార్‌షెడ్ పనులపై స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో స్థలం విషయం చర్చల ద్వారా పరిష్కరించుకుందామని సీఎం ఉద్ధవ్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే నేరుగా పవార్ రంగంలోకి దిగినట్లు తెలిసిందే. కంజూర్ స్థలం విషయంలో ఫడ్నవిస్, ఉద్ధవ్‌లతో వేరువేరుగా భేటీ అయి చర్చించినట్లు సమాచారం. -
బిహార్ ఫలితాలు: శివసేనకు ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై : ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా ఆఘాడీ ప్రభుత్వం ప్రజా గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిపై వ్యక్తిగత కక్ష పెంచుకుని, ఆయన్ను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ ఆత్మహత్య కేసులో నవంబర్ 4న అర్నబ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మేజిస్ట్రేట్ అర్నబ్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరిస్తూ నవంబర్ 18 వరకు జ్యూడీషియల్ రిమాండ్‌కు అనుమతించింది. అయితే హైకోర్టులో అర్నబ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బెంచీ కొట్టివేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. (‘మహా’ ప్రభుత్వం పతనం ఖాయం.!) అయితే అర్నబ్ మధ్యంతర బెయిల్ కోసం సుప్రీం తలుపు తట్టారు. అర్నబ్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. శివసేన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ప్రభుత్వ స్థానాన్ని సుప్రీం చూపించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు అనుమతి తీసుకోకుండా, మూసివేసిన కేసును తిరిగి తెరిచి, అర్నబ్‌ను వీధి నేరస్థుడిలా చూసిందని మండిపడ్డారు. అతన్ని ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని, అతన్ని ఒక జైలు నుంచి మరొక జైలుకు మార్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రజల గొంతును అణిచివేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఇష్టపడుతోందని ఫడ్నవీస్ ఆరోపించారు. ఇది రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని అన్నారు. శివసేనకు ఎదురుదెబ్బే.. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం సరిగా లేదని, ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. బిహార్‌లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడంపై ఆయన స్పందించారు. ఫడ్నవిస్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నందుకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఫలితం అనుభవిస్తుందని వ్యాఖ్యానించారు. బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందని ఫడ్నవిస్ స్పష్టంచేశారు. గ్రామగ్రామానికి బీజేపీ అభివృద్ధి మంత్రం పనిచేసిందని, వారి వరకు తీసుకెళ్లగలిగామన్నారు. కాంగ్రెస్ చర్యలు భవిష్యత్తులో మహా రాజకీయాలను ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఆ ప్రభావం శివసేనపై పడుతుందని, ఇపుడు సేనకు అర్థం కాబోదని, వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తగలబోయే ఎదురుదెబ్బతో తెలుస్తుందని ఫడ్నవిస్ జోస్యం చెప్పారు. బాధితులకూ న్యాయం జరగాలి: మంత్రి మలిక్ వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ ఉంటుందని అదే సమయంలో బాధితులకూ న్యాయం జరగాలని ఎన్సీపీ నేత, మైనార్టీ వ్యవహారాల శాఖమంత్రి నవాబ్ మలిక్ వ్యాఖ్యానించారు. కాగా, అర్నబ్ అరెస్టు గురించి కోర్టు వ్యాఖ్యానిస్తూ.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సబబు కాదని, అది న్యాయాన్ని అపహాస్యం చేయడమేనంది. భావజాలం, అభిప్రాయ భేదాల నడుమ కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకోవడం పట్ల కూడా సుప్రీం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా మంత్రి మలిక్ మాట్లాడుతూ.. దేశ న్యాయవ్యవస్థను గౌరవించడం అందరి బాధ్యత అని వ్యక్తి యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడారని, అదే సమయంలో బాధితుడికి న్యాయం కూడా జరగాలని వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. -
రెబల్స్‌కు ఫడ్నవీస్ వార్నింగ్ !
బిహార్: లోక్ జన్‌శక్తి పార్టీ తరపున ఎవరైనా పోటీ చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్త్ర మాజీ ముఖ్యమంత్రి, బిహార్ ఎన్నికల ఇన్‌ఛార్జి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చారించారు. భాజపా నుంచి కొందరు రెబల్స్ ఎల్జేపీ తరుపున పోటీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా ఎవరి పేర్లు బయటకు చెప్పనప్పటికీ ఈ హెచ్చరిక రెబల్స్‌కే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఫడ్నవీస్, బిహార్‌లో ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమారే అని వెల్లడించారు. ఎన్నికల తర్వాత భాజపా- ఎల్జేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఆరోపణలను ఆయన కొట్టిపడేసారు. ముఖ్యమంత్రి కావాలని చిరాగ్ పస్వాన్ ఆశిస్తున్నాడని, అది సాధ్యమయ్యే పని కాదని ఫడ్నవీస్ తెలిపారు. మోది పేరు వాడొద్దు... భాజపా రాష్త్ర అధ్యక్షుడు సంజయ జైశ్వాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... బిహార్‌లో ఎన్డీయే తరపున పోటీ చేసే అభ్యుర్థులు కచ్చితంగా నితీశ్ కుమార్ నాయకత్వాన్ని ఆహ్వానించాలన్నారు. ఎన్డేయేతర అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది పేరును వాడుకొని ఓట్లు అడిగే హక్కు లేదని, అలా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఫడ్నవిస్‌పై శివసేన ప్రశంసలు
సాక్షి, ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌పై శివసేన ప్రశంసల వర్షం కురిపించింది. ప్రతిపక్ష నేత బాధ్యతలకు ఆయన సరైన న్యాయం చేస్తున్నారని, విపక్షనేత పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని వ్యంగ్యంగా ఆకాశానికెత్తింది. అంతేకాకుండా కరోనా నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఫడ్నవిస్ అభినందించారని, ఇది తమకు ఎంతో నైతిక బలనిచ్చిందని శివసేన సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం తన అధికారిక పత్రిక సామ్నాలో ఎడిటోరియల్‌ను ప్రచురించింది. (ఆపరేషన్ కమల్‌పై బీజేపీ క్లారిటీ) ‘దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించారు. చాలా ధైర్యంగా, డైనమిక్‌గా వ్యవహరించారు. తనకు కోవిడ్ పాజిటివ్ వస్తే... కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం తీసుకుంటా అని ప్రకటించడం చెప్పడం మంచి పరిణామం. ప్రతిపక్ష నేతగా ఆయన నూటికి నూరుపాళ్లూ సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ వ్యవస్థపై ఆయనకు ఎంతో విశ్వాసం ఉంది’ అనిని శివసేన ఎడిటోరియ్లో పేర్కొంది. కాగా కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ఫడ్నవిస్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసిన విషయం తెలిసిందే. -
ఆపరేషన్ కమల్ : టార్గెట్ అదేనా..?
సాక్షి, ముంబై : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నా బీజేపీ మాత్రం ప్రభుత్వాల ఏర్పాటుకు తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాలనే రాజస్తాన్, మహరాష్ట్రాల్లోనూ అమలు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజస్తాన్‌లో మాత్రం బీజేపీకి గట్టి పరిణామాలే ఎదురైయ్యాయి. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ రూపంలో వచ్చిన పెను విపత్తును రాజకీయాల్లో కాకలు తీరిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ సమర్థవంతంగా ఎదుర్కొగలిగారు. దీంతో సంకీర్ణ సర్కార్‌తో ఊగిసలాడుతున్న మహారాష్ట్రపై బీజేపీ కన్ను పడినట్లు తెలుస్తోంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి కాషాయ జెండా ఎగరేసే విధంగా కేంద్రంలోని అధికార పార్టీ ఇప్పటికే వ్యూహాలు రచించినట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (రసవత్తరంగా రాజస్తాన్ డ్రామా) శరద్ పవార్‌కు గాలం..! దీనిలో భాగంగానే ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ముందుగా ఎన్డీయేలో చేర్చుకునే విధంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ పవార్‌కు ఇటీవల ఆహ్వానం సైతం పంపారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌లో ఎన్సీపీ చేరితే దేశ, రాష్ట్ర అభివృద్దికి ఎంతో మంచిదని కేంద్రమంత్రి సెలవిచ్చారు. దీనిపై శరద్ పవార్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భేదాభిప్రాయాలు ఉన్నాయని, మరికొంత కాలంలోనే ప్రభుత్వం కూలిపోవడం ఖయమని పలువురు బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు. (రండి.. ఎన్డీయేలో చేరండి.. అప్పుడే..!) ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌నేత దేవేంద్ర ఫడ్నవిస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శనివారం భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఫడ్నవిస్ పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్లతో వరస భేటీలు నిర్వహిస్తున్నారు. ‘ఆపరేషన్ కమల్’ పై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే భేటీలపై వస్తున్న రాజకీయపరమైన వార్తలను ఫడ్నవిస్ కొట్టిపారేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే తాను ఢిల్లీ పర్యటనకు వెళ్లానని స్పష్టం చేశారు. అందరూ అనుకుంటున్నట్లు మహారాష్ట్రలో ఆపరేషన్ కమల్ లేదని తెలిపారు. కానీ సంకీర్ణ ప్రభుత్వంలో నెలకొన్ని మనస్పర్ధాలు ప్రభుత్వాన్ని కూల్చక తప్పదని జోస్యం చెప్పారు. -
కరోనా: రాజకీయ సంక్షోభం తప్పదా..!
సాక్షి, మహారాష్ట్ర : దేశ వ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రజలు కరోనాతో అల్లాడుతున్నా ఇవేవీ పట్టని నేతలు రాజకీయ విమర్శలకు దిగుతూ అధికార పీఠం కోసం పావులు కదుపుతున్నారు. కరోనా వైరస్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌స్పాట్ కేంద్రంగా మారుతున్న ముంబై మహానగరం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎసరుపెట్టేలా ఉంది. సిద్ధాంత వైరుధ్యం గల శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలు జట్టుకట్టడం ఏమాత్రం జీర్ణించుకులేకపోతున్న ప్రతిపక్ష బీజేపీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. (మహారాష్ట్రలో అనూహ్యం) రాష్ట్రపతి పాలనకు డిమాండ్.. మహారాష్ట్రలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 50వేలు దాటగా.. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోనే సగానికి పైగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. వైరస్ కట్టడికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్ కేసులు ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. మరోవైపు పౌరులు ప్రాణాలు కోల్పోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలకు మరింత పదునుపెట్టింది. వైరస్ కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో భేటీ కావడం, రాష్ట్రంలో పరిస్థితి అదుపులోదని రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ ఉద్ధేశ పూర్వకంగానే గవర్నర్‌తో మంతనాలు చేస్తోందని తెలుస్తోంది. (మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్) ఇక ఉద్ధవ్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌లో మంత్రులు, నేతల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది. వైరస్ వ్యాప్తి ఒకవైపు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరోవైపు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. లాక్డౌన్ ఎత్తివేతపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే భినాభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే లాక్‌డౌన్‌ను ఎత్తివేయక తప్పదని పవార్ సూచించగా.. వైరస్‌ను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ఒక్కటే మార్గమని ఠాక్రే స్పష్టం చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకే ఆంక్షల్లో సడలింపు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. మరోవైపు ప్రభుత్వంలో అసంతృప్తిని పసిగట్టిన బీజేపీ నేతలు సర్కార్‌కు పడేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో శరద్ పవార్ మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైరస్ కట్టడి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. భేటీ అనంతరం పవర్ మీడియా మాట్లాడుతూ.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై కేంద్ర హోమంత్రి అమిత్ షా కూడా ఆరా తీసినట్లు సమాచారం. మొత్తానికి కరోనా కష్ట కాలంలోనూ మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. -
ఫడ్నవిస్‌కు మరో షాకిచ్చిన ఉద్ధవ్ ఠాక్రే!
సాక్షి ముంబై : రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఆరు జిల్లా పరిషత్‌లలో నాలుగు జిల్లాల్లో మహావికాస్ ఆఘాడి విజయ ఢంకా మోగించింది. మాజీ ముఖ్యమంత్రి దేశ్‌ముఖ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల ప్రాంతమైన విదర్భలోని నాగ్‌పూర్, నందుర్బా, వాశీం జిల్లాల్లో బీజేపీకి పరాజయం చవిచూడాల్సివచ్చింది. మరోవైపు పాల్ఘర్ జిల్లాలో కూడా మహావికాస్ ఆఘాడి విజయం సాధించగా అకోలా జిల్లాలో మాత్రం ఎవరికీ పూర్తి మెజార్టీ రాలేదు. అయితే ధులేలో మాత్రం బీజేపీ పూర్తి మెజార్టీతో విజయం సాధిం చి మహావికాస్ ఆఘాడిని ఖంగు తిన్పించింది. (ఉద్ధవ్‌కు చెక్.. రాజ్‌ఠాక్రే సరికొత్త వ్యూహం..!) ఫడ్నవిస్ ఇలాకాలోనూ.. రాష్ట్రంలోని పాల్ఘర్, నాగ్‌పూర్, ధులే, నందుర్బార్, అకోలా, వాషీం జిల్లా పరిషత్ ఎన్నికలు జరగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం తొలిసారిగా జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. దీంతో ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రికృతమైంది. ఇలాంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. ఎంతో ఉత్కంఠతగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో బీజేపీకి ఓటర్లు షాక్ నిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల సొంత జిల్లా నాగ్‌పూర్‌లో బీజేపీ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. బీజేపీకి పెట్టని కోటగా ఉన్న నాగ్‌పూర్ జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ పాగా వేసింది. నాగ్‌పూర్ జిల్లా పరిషత్‌లోని మొత్తం 58 స్థానాల్లో కాంగ్రెస్ 30, ఎన్సీపీ 10, శివసేన ఒక స్థానం దక్కించుకున్నాయి. మరోవైపు బీజేపీ మాత్రం కేవలం 15 స్థానాలతో సంతృప్తి పడాల్సివచ్చింది. మరోవైపు ఇండిపెండెంట్, శేత్కరీ కామ్‌గార్ పార్టీలు చెరొక స్థానం దక్కించుకున్నాయి. (శివసేనకు చెక్.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..!) కలసి.. విడిపోయి గతేడాది అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక మాదిరిగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ చిత్రం పూర్తిగా మారింది. ఊహించని ట్విస్ట్‌లతో ప్రజలతోపాటు రాజకీయ పార్టీల కార్యకర్తలను ఆయోమయంలో పడేశాయి. 2019లో లోకసభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. శివసేన, బీజేపీలు లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఒక్కటయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీలు, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా పోటీ చేశాయి. ఫలితాలు శివసేన, బీజేపీల కూటమికి అనుకూలంగా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 శివసేనకు 56 ఇలా పూర్తి మెజార్టీ లభించింది. అయితే ఫిఫ్టీ–íఫ్టీ మార్పుల ఒప్పందంతో విబేధాలు ఏర్పడ్డాయి. ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినప్పటికీ శివసేన, బీజేపీలు విడిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో మహావికాస్ ఆఘాడీగా ఏర్పడి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కూటమితోనే జిల్లా పరిషత్ ఎన్నికలకు మహావికాస్ ఆఘాడీ వెళ్లింది. భారీ మెజారిటీ సాధించింది. -
ఫడ్నవిస్‌తో రాజ్‌ఠాక్రే భేటీ..!
సాక్షి, ముంబై : సంచలన రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలిచిన మహారాష్ట్రలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఫడ్నవిస్ నివాసంలో ఠాక్రే సమావేశమయ్యారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కూటమిగా ఏర్పడ్డ శివసేనకు చెక్ పెట్టేందుకు బీజేపీ, ఎమ్ఎన్ఎస్ కలుస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రానున్న జిల్లాపరిషత్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఎమ్ఎన్ఎస్-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని సమాచారం. దీనిపై చర్చించేందుకే రాజ్‌ఠాక్రే ఫడ్నవిస్‌తో సమావేశమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటి భేటీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
శివసేనకు చెక్.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..!
సాక్షి, ముంబై : సంచలన రాజకీయాలకు ఇటీవల వేదికగా నిలిచిన మహారాష్ట్రలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీకి ఆమడదూరంలో ఉండే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే కేంద్ర ప్రభుత్వంతో జట్టు కట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కూడిన పోస్టర్లు పాల్గాడ్‌లో వెలవడం తీవ్ర సంచలనంగా మారింది. స్థానిక బీజేపీ కార్యకర్తలు ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలు కేటాయించిన రోజునే ఈ పరిణామం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే హిందుత్వవాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎన్సీపీతో కూటమిగా ఏర్పడ్డ శివసేనకు చెక్ పెట్టేందుకు బీజేపీ, ఎమ్ఎన్ఎస్ కలుస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రానున్న జిల్లాపరిషత్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఎమ్ఎన్ఎస్-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, వీరి కూటమి తరఫున రాజ్‌ఠాక్రే ప్రచారం చేస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్‌తో కలవడంపై ఎమ్ఎన్ఎస్ తొలినుంచి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇరు పార్టీలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
అది బ్యాంక్ ఉద్యోగి పనికాదు..
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, శివసేన నేత ప్రియాంక చతుర్వేదిల మధ్య సంవాదం ముదురుతోంది. తనను టార్గెట్ చేస్తున్నారన్న అమృత వ్యాఖ్యలపై ప్రియాంక తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ ఖాతాలను యాక్సిస్ బ్యాంక్ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు మార్చాలని థానే మేయర్ తీసుకున్న నిర్ణయం వివాదానికి కేంద్ర బిందువైంది. అమృత ఫడ్నవీస్ యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి అయినందునే అప్పట్లో యాక్సిస్ బ్యాంకుకు థానే మున్సిపల్ కార్పొరేషన్ ఖాతాలను మళ్లించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. యాక్సిస్ బ్యాంకుకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రియాంక సందేహం వ్యక్తం చేశారు. యాక్సిస్ బ్యాంకుకు ఖాతాలు బదలాయించిన తర్వాత బ్యాంకు సీఎస్ఆర్ నిధుల నుంచి బీజేపీ పథకాలకు ఎంత నిధులు వచ్చాయనేది విచారణలో నిగ్గుతేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రజలకు సలహాలివ్వడం, బోధనలు చేయడం యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి పరిధిలోకి రాని అంశాలని అమృతా ఫడ్నవీస్‌కు ప్రియాంక చతుర్వేది చురకలు అంటించారు. మరోవైపు ఖాతాలను జాతీయ బ్యాంకులకు బదలాయించాలని, యాక్సిస్ బ్యాంక్‌ను పోషించింది చాలని బీఎంసీ సేన కార్పొరేటర్ సమాధాన్ సర్వంకర్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్‌లో ఫడ్నవీస్ భార్య పనిచేస్తున్నందునే ప్రభుత్వ ఖాతాలను ఆ బ్యాంకుకు మళ్లించారని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. చదవండి : యాక్సిస్‌కు దూరమైన ‘అమృత’ ఘడియలు! -
ప్రభుత్వం ఏర్పడింది 80 రోజుల కోసం కాదు..
ముంబై: మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు అన్ని చర్యలు తీసుకుంటోందని శివసేన పేర్కొంది. కేబినెట్‌ను ఏర్పాటు చేయడంలో మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత ఆశీష్ శెల్లర్ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు మంత్రి పదవులు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం..కనీసం ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. అయితే ఆశీష్ వ్యాఖ్యలను శివసేన తిప్పికొట్టింది. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో కేబినెట్ విస్తరణకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించింది. కేబినెట్‌ను ఎప్పుడూ విస్తరించాలో ప్రభుత్వానికి తెలుసునని పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా కార్యకలాపాలను నిర్వహించే సత్తా ఉందని తెలిపింది. మంత్రులకు శాఖలను కేటాయించనంత మాత్రాన వారికి ప్రాధాన్యత లేదనడం సరికాదని పేర్కొంది. నాగ్‌పూర్ సమావేశం చాలా ముఖ్యమని.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. కాగా, మహారాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఎలాంటి సందేహం అక్కర్లేదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం 80 రోజుల కోసం ఏర్పాటు చేసింది కాదని కచ్చితంగా ఐదు సంవత్సరాలు పాలిస్తుందని తెలిపింది. మరోవైపు ఉద్దవ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడింది. -
..అందుకే ఫడ్నవీస్‌ను సీఎం చేశాం!
బెంగళూరు: ‘రూ. 40 వేల కోట్ల నిధులను కాపాడేందుకే మహారాష్ట్రలో హుటాహుటిన ఫడ్నవీస్‌ను సీఎం చేశాం’ అంటూ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఫడ్నవీస్ ఖండించారు. హెగ్డే వ్యాఖ్యల్లో వాస్తవం ఉంటే ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ, ఇది మహారాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనని శివసేన మండిపడ్డాయి. కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం అనంత్ కుమార్ హెగ్డే పై వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీకి మెజారిటీ లేకపోయినా, మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ను ఎందుకు సీఎం చేశారన్న ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. అదంతా ముందుగా అనుకున్న ప్రణాళికే. మహారాష్ట్రలో సీఎం నియంత్రణలో రూ. 40 వేల కోట్లు ఉన్నాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ నిధులు దుర్వినియోగమవుతాయి. ఆ నిధులను కాపాడటం కోసమే హుటాహుటిన ఫడ్నవీస్‌ను సీఎం చేశాం.. వాటిని అభివృద్ధి పనులకు కేటాయించడం కోసమే ఆ డ్రామా ఆడాం. ఫడ్నవీస్ సీఎం అయిన 15 గంటల్లోనే ఆ నిధులను ఎక్కడికి పంపాలో అక్కడికి పంపి, వాటిని కాపాడారు. ఆ నిధులను కేంద్రానికి తిరిగి పంపించనట్లయితే.. అవి శివసేన కూటమి సీఎం చేతిలో పడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు’ అంటూ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ మద్దతుతో నవంబర్ 23న ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం, ఆ తరువాత మెజారిటీ నిరూపించుకోలేని పరిస్థితుల్లో 80 గంటల్లోపే రాజీనామా చేయడం తెలిసిందే. అదంతా అబద్ధం: ఫడ్నవీస్ హెగ్డే వ్యాఖ్యలను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అబద్ధాలంటూ ఖండించారు. తాను సీఎంగా ఉన్న ఆ మూడు రోజుల్లో ఎలాంటి నిధుల గురించి కేంద్రం అడగలేదని, తాము కూడా కేంద్రానికి నిధులను పంపించలేదని సోమవారం స్పష్టం చేశారు. ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ కంపెనీ చేపట్టింది. వారికి భూ సేకరణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం మమ్మల్ని నిధులు అడగలేదు. మేం పంపించలేదు. ఏ ప్రాజెక్టు నుంచి కూడా మహారాష్ట్రకు చెందిన ఒక్క రూపాయిని కూడా కేంద్రానికి పంపించలేదు’ అని ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు. -
‘మళ్లీ నేనే ప్రాజెక్టులను కొనసాగిస్తానేమో..’
ముంబై: మహారాష్ట్రలో 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా అధికారం చెపట్టలేకపోయిందని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నెంబర్ గేమ్‌లో వెనకబడ్డామని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడానికి పలు కారణాలను విశ్లేషించారు. ఎన్నికల ఫలితాలపై ఫడ్నవీస్ స్పందిస్తూ 40శాతం మార్కులు సాధించిన శివసేన కూటమి అధికారం కైవసం చేసుకోగా, 70శాతం సాధించిన బీజేపీ ప్రతిపక్షంలో సరిపెట్టుకోందని వ్యాఖ్యానించారు. అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మహా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫడ్నవీస్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడతానని చెప్పడాన్ని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో.. వారికి కౌంటర్‌గా ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో తాను రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను ప్రారంభించానని చెప్పారు. మళ్లీ ఆ ప్రాజెక్టులను తానే కొనసాగిస్తామోనని వ్యాఖ్యానించడం గమనార్హం. -
‘ఫడ్నవీస్‌వి చిన్న పిల్లల తరహా ఆరోపణలు’
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చిన్న పిల్లల తరహా ఆరోపణలు చేస్తున్నారని శివసేన ముఖ్యనేత రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. సంజయ్ రౌత్ శివసేన పత్రిక సామ్నాలో రొహతక్ కాలమ్‌లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిని ప్రస్తావించారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని కూటమిని మహారాష్ట్రతో పాటు దేశం మొత్తం స్వాగతించిందని తెలిపారు. శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా త్రయాన్ని ఢీకొట్టి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మా కూటమి ప్రభుత్వం కచ్చితంగా ఐదేళ్లు కొనసాగుతుందని సంజయ్ రౌత్ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షమే లేదంటూ ఫడ్నవీస్ అతివిశ్వాసం ప్రదర్శించారని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చొరవతోనే కూటమి సాధ్యమయిందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో విభేదాల గురించి రౌత్ స్పందిస్తూ కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌ను సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం లోని ‘మహా వికాస్ ఆఘాడి’ విశ్వాస పరీక్షలో నెగ్గి ఉద్దవ్ థాక్రే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 కాగా 169 మంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరేసి చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. -
బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ సర్కార్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలకమైన బలపరీక్షలో విజయం సాధించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్ దిలీప్ శనివారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వానికి 169 మంది సభ్యుల మద్దతు ఉందని, విశ్వాస పరీక్షలో ఉద్ధవ్ ప్రభుత్వం నెగ్గిందని ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుతీరింది. కాగా సభ ప్రారంభమైన అనంతరం శాసససభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్పీకర్ సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్ కొలంబకర్‌ను నియమించారని.. ఉద్ధవ్ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
మహా బలపరీక్ష: అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలకమైన బలపరీక్షకు సిద్ధమయ్యారు. అధికార విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ముందుగా సభలో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ శాసనసభపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపించారు. గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్ కొలంబకర్‌ను నియమించారని.. ఉద్ధవ్ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆయన స్థానంలో ఎన్సీపీకి చెందిన దిలీప్‌ను నూతన ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా కనీసం వందేమాతరం కూడా ఆలపించలేదని ప్రభుత్వంపై పఢ్నవిస్ విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్పీకర్ సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విశ్వాస పరీక్షను ప్రారంభిస్తున్నామని, సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చోవాలని ప్రొటెం స్వీకర్ కోరారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా మొత్తం 288 స్థానాలకు గత మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సభ్యుల మద్దతు ఉంది. 29 మంది స్వతంత్ర సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం నిలబడాలంటే 145 మంది సభ్యులు మద్దతు కావాలి. అయితే తమకు 170 మంది సభ్యులకు పైగా మద్దతు ఉందని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం సభలో ప్రకటించింది. అనంతరం ఇటీవల మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ఉద్ధవ్ సభకు పరిచయం చేశారు. కాగా కీలకమైన బలపరీక్ష నేపథ్యంలో అన్ని పార్టీలు సభ్యులకు విప్ జారీచేశాయి. -
మహారాష్ట్ర గవర్నర్ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం ఫడ్నవిస్ రాజీనామా అనంతరం.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి, సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గవర్నర్ ఆదేశాల మేరకు బుధవారమే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బలపరీక్షను నిర్వహించనున్నారు. మరోవైపు అసెంబ్లీ బలపరీక్ష చేపట్టేందుకు గవర్నర్ చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ప్రొటెం స్వీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ శాసనసభ్యుడు కాళిదాస్ కోలంబకర్‌ను నియమించారు. నిబంధనలు ప్రకారం సభలో సీనియర్ సభ్యుడైన ఎమ్మెల్యేను ప్రొటెం స్వీకర్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు సభకు ఎనిమిది సార్లు ఎన్నికయిన కాళిదాస్‌కు గవర్నర్ ఆ బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులచే ఆయన ప్రమాణ స్వీకారం చేయించి, బలపరీక్షను నిర్వహించనున్నారు. మహారాష్ట్ర వ్యవహారాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల లోగా బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఆలోపే ఫడ్నవిస్ రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన నేతృత్వలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సిద్ధమయింది. కూటమి నేతగా ఉద్దవ్ ఠాక్రేను ఎన్నుకునేందుకు మూడు పార్టీల నేతలంతా సమావేశం అయ్యారు. అనంతరం గవర్నర్‌ను కలువనున్నారు. -
అజిత్ పవార్ దారెటు..!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర సంక్షోభానికి మూల కారణమైన ఎన్సీపీ నేత అజిత్ పవార్ మూడు రోజుల వ్యవధిలోనే సంచలనంగా మారారు. శివసేనతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన తరుణంలో బీజేపీకి మద్దతు ప్రకటించి రాజకీయాలను ఊహించని మలుపు తిప్పారు. అనంతరం తనతో పాటు ఎమ్మెల్యేలు కూడా వస్తారని భావించిన అజిత్.. అత్యాశకు పోయి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే దశాబ్దాల రాజకీయ అనుభవం, వ్యూహ చతురతలో దిట్టగా పేరొందిన శరద్ పవార్ ముందు అజిత్ కుప్పి గంతులు ఏమీ పనిచేయలేదు. అజిత్ నిర్ణయానికి షాకైన.. ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ తన చాతుర్యంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నారు. మొత్తం 54 ఎమ్మెల్యేలలో దాదాపు అందరినీ సమీకరించుకోవడంలో శరద్ విజయం సాధించారు. దీంతో పార్టీని చీల్చిన అజిత్ చివరికి ఒంటరిగా మిగిలారు. (సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా) అజిత్‌ను శరద్ నమ్ముతారా? ఈ నేపథ్యంలో అజిత్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా శరద్ పావులు కదిపారు. పలువురు కీలక నేతలను పంపి.. ఆయనతో చర్చలు జరిపారు. అంతకీ అజిత్ వెనక్కితగ్గకపోవడంతో శరద్ పవార్ భార్యను రంగంలోకి దింపి చివరికి విజయం సాధించారు. ఆమె అజిత్‌తో సమావేశమైన గంటల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరమే సీఎం పదవి నుంచి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా తప్పుకోక తప్పలేదు.అయితే శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసిన అజిత్ భవిష్యత్తు ఏంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తదుపరి ఏర్పడే శివసేన ప్రభుత్వంలో ఆయనకు స్థానం లభిస్తుందా? లేక పార్టీని చీల్చినందుకు పక్కన పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీ శాసనసభాపక్ష పదవి నుంచి ఇప్పటికే తొలగించిన శరద్.. మరోసారి అజిత్‌ను నమ్ముతారా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కూటమి నేతను ఎన్నుకునేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. సాయంత్రం 6 గంటకు ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో అజిత్ భవితవ్యంపై కూడా చర్చించే అవకాశం ఉంది. (పదవికి అజిత్ పవర్ రాజీనామా) అయితే సంజయ్ రౌత్ లాంటి వాళ్లు మాత్రం అజిత్ ఎన్సీపీలోనే ఉంటారని ఇది వరకే ప్రకటించారు. బీజేపీతో చేతులు కలిపిన అనంతరం అజిత్‌తో రాయబారం నడిపిన ఎన్సీపీ నేతలు తిరిగి రావాల్సిందిగా కోరారని, శివసేన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా అప్పగిస్తామని భరోసా ఇచ్చినట్లు ఎన్సీపీ వర్గాల సమాచారం. వారి ప్రతిపాదనలకు ఒప్పుకున్న తరువాతనే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. అయితే అజిత్ రాజీనామాపై శరద్ ఇంకా స్పందించలేదు. శివసేన, కాంగ్రెస్ నేతలు కూడా ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. -
సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా
సాక్షి, ముంబై: అసెంబ్లీ బలపరీక్షకు ముందే బీజేపీ వెనక్కితగ్గింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామా చేసిన గంట వ్యవధిలోనే ఫడ్నవిస్ కూడా వైదొలిగారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 79 గంటల్లోనే ఆయన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు ముంబైలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఫడ్నవిస్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులను పోత్సహించే తత్వం తమది కాదని, ప్రతిపక్షనేతగా ప్రజల పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. కేవలం అధికారం కోసం ఏర్పడిన శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మధ్యలోనే కూలిపోక తప్పదని జోస్యం చెప్పారు. బుధవారం సాయంత్రలోగా ఫడ్నవిస్ ప్రభుత్వం బలపరీక్షను ఎదర్కొవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎన్సీపీపై తిరుగుబాటు చేసేలా అజిత్‌ను ప్రోత్సహించిన బీజేపీ.. డిప్యూటీ సీఎంగా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించింది. అయితే అజిత్ వెంట కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారని భావించిన ఫడ్నవిస్ అంచనాలు తలకిందులయ్యాయి. శరద్ పవార్ చాతుర్యంతో అజిత్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గుకురాలేమని భావించిన ఫడ్నవిస్ రాజీనామాను ప్రటకించారు. రాజీనామా సందర్భంగా మీడియా సమావేశంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ.. శివసేనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకున్న శివసేన ఆ తరువాత దారుణంగా మోసం చేసింది. అధికారం కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. ఓ వైపు మాతో మాట్లాడుతూ.. విపక్షాలతో చర్చలు జరిపింది. ప్రజల తీర్పుకు విరుద్ధంగా శివసేన వ్యవహరించింది. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉద్ధవ్ ఠాక్రే బేరాలకు దిగారు. ఎన్నికల్లో బీజేపీని అతిపెద్ద పార్టీగా మరాఠా ప్రజలు నిలిబెట్టారు. ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటా. అసెంబ్లీలో బలం లేనందును సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా’ అని ప్రకటించారు. -
సుప్రీం తీర్పు చరిత్రాత్మకం : సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని అభివర్ణించారు. బలపరీక్షలో విపక్షాలదే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని శివసేన పేర్కొంది. ఇది ప్రజాస్వామ్య విజయమని తెలిపింది. సుప్రీం ఉత్తర్వులతో శివసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం తీర్పు అనంతరం ఖేల్ ఖతం అంటూ ఆ పార్టీ నేత నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. -
మహా తీర్పు : అసెంబ్లీలో బుధవారమే బలపరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీకి సర్వోన్నత న్యాయస్ధానంలో చుక్కెదురైంది. మహారాష్ట్ర వ్యవహారాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల లోగా బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం చేసింది. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరింది. బుధవారం సాయంత్రం ఐదు గంటలలోపు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలని వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని ఆదేశించింది. రహస్య ఓటింగ్ నిర్వహించరాదని, బుధవారం బలపరీక్ష ఎదుర్కోవాలని ఫడ్నవీస్‌కు స్పష్టం చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ తీర్పును చదివి వినిపించారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు. జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన సుప్రీం బెంచ్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు సుప్రీం నిర్ణయంతో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ శిబిరంలో ఉత్తేజం నెలకొంది. బలపరీక్ష జరిగే వరకూ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా మూడు పార్టీలు చర్యలు చేపట్టగా, ఎన్సీపీ చీలిక వర్గ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో బలపరీక్షలో బయటపడాలని బీజేపీ యోచిస్తోంది. మహా తీర్పును కాంగ్రెస్ సహా విపక్షాలు స్వాగతించాయి. ఇది చరిత్రాత్మక తీర్పని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభివర్ణించగా, ప్రజాస్వామ్య విజయమని శివసేన హర్షం వ్యక్తం చేసింది. -
‘విశ్వాసం’పై నేడు ఆదేశాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనడానికి సంబంధించి మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ బీజేపీ నేత ఫడ్నవీస్ ను ఆహ్వానిస్తూ పంపిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫడ్నవీస్ గవర్నర్‌కు ఇచ్చిన లేఖను సోమవారం ధర్మాసనం పరిశీలించింది. అనంతరం, ‘ఇక ముఖ్యమంత్రికి అసెంబ్లీలో మెజారిటీ ఉందా? లేదా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించింది. ఫడ్నవీస్‌కు బలనిరూపణ కోసం గవర్నర్ నవంబర్ 23న 14 రోజుల గడువు ఇచ్చినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఫడ్నవీస్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఫడ్నవీస్ ప్రభుత్వం తక్షణమే విశ్వాసపరీక్ష ఎదుర్కొనేలా ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్– ఎన్సీపీ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, శివసేన తరఫు లాయర్ కపిల్ సిబల్ కోర్టును మరోసారి కోరారు. మెజారిటీ ఉందని నమ్మకం ఉన్నప్పుడు బలపరీక్షకు వెనకడుగు ఎందుకని ప్రశ్నించారు. కేంద్రం, గవర్నర్ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించిన తుషార్ మెహతా.. ‘ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలున్నారు? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు? అని గవర్నర్ లెక్కలు వేసుకోలేరు’ అని వ్యాఖ్యానించారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా మూడు పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ ప్రెస్మీట్లో పేర్కొన్న విషయాన్ని సిబల్ ప్రస్తావించారు. ‘తెల్లవారుజామున 5.27 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేయాల్సినంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది?’ అని సిబల్ ప్రశ్నించారు. అజిత్ పవార్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఏ ఒక్క ఎన్సీపీ ఎమ్మెల్యే కూడా ముందుకు రాలేదని ఎన్సీపీ న్యాయవాది సింఘ్వీ వ్యాఖ్యానించారు. ‘ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో బీజేపీని ఆహ్వానించారు. మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ స్పష్టంగా పేర్కొన్నారు. గవర్నర్ చెప్పిన గడువులోగా కాకుండా.. ఆ లోపే బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించే అధికారం కోర్టుకు ఉందా?’ అని రోహత్గీ ప్రశ్నించారు. ‘సభలో బలనిరూపణ తప్పదు. అది ఎప్పుడు జరగాలనేది కోర్టు నిర్ణయించలేదు’ అని వాదించారు. దీనిపై సింఘ్వీ స్పందిస్తూ.. 24 గంటల్లో, 48 గంటల్లో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన దృష్టాంతాలు గతంలో ఉన్నాయన్నారు. వాదనల అనంతరం, మంగళవారం ఉదయం 10.30 గంటలకు విశ్వాస పరీక్షకు సంబంధించి ఆదేశాలిస్తామని కోర్టు పేర్కొంది. తుషార్, సిబల్‌ల వాగ్యుద్ధం అధికారం చేపట్టేందుకు వీలుగా ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టడాన్ని ఇంగ్లిష్‌లో ‘హార్స్ ట్రేడింగ్’ అంటారనే విషయం తెలిసిందే. వాదనల సందర్భంగా తుషార్ మెహతా.. ‘ఇది హార్స్ ట్రేడింగ్ కాదు. ఇక్కడ మొత్తం గుర్రపు శాలనే మరోవైపునకు తరలిపోయింది (అజిత్ పవార్‌తో పాటు ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ బీజేపీ వైపు వెళ్లారనే అర్థంలో)’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కపిల్ సిబల్ స్పందిస్తూ.. ‘గుర్రపు శాల ఇక్కడే ఉంది. జాకీ(అజిత్ పవార్) మాత్రమే వెళ్లిపోయాడు’ అని రిటార్ట్ ఇచ్చారు. మరో సందర్భంలో.. ‘కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు సుప్రీంకోర్టులో ఒక్కటిగా ఒకే పిటిషన్ వేశామన్నాయి. కానీ న్యాయవాదులను మాత్రం మూడు పార్టీలు వేరువేరుగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆ కూటమి తీరేంటో దీంతో అర్థమవుతుంది’ అని మరో సందర్భంలో తుషార్ వ్యాఖ్యానించారు. -
మా బలం 162
సాక్షి, ముంబై: ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ గ్రాండ్ హయత్ సోమవారం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి బలప్రదర్శనకు వేదికైంది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోవడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చే రోజుకు ఒక రోజు ముందు.. సోమవారం సాయంత్రం మూడు పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ తమ ఎమ్మెల్యేలతో గ్రాండ్ హయత్ హోటల్లో పరేడ్ నిర్వహించింది. 162 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని, ఇది గవర్నర్ కోశ్యారీ చూస్తున్నారనే భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. శివసేనకు చెందిన 56, ఎన్సీపీకి చెందిన 51, కాంగ్రెస్‌కు చెందిన 44, మిత్రపక్షాలు, ఇతరులు 11 మంది.. మొత్తం 162 మంది ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆసక్తి సృష్టించిన ఈ ‘మహా పరేడ్’లో శివసేన నేతలు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, సునీల్ తట్కరే, సుప్రియా సూలే, కాంగ్రెస్ నేతలు ఖర్గే, అశోక్ చవాన్, ఆయా పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వారితో పాటు సమాజ్‌వాదీ నేత అబూ ఆజ్మీ, ‘స్వాభిమాని షెట్కారీ సంఘటన్’ చీఫ్ రాజు శెట్టి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో ‘ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని, తమ పార్టీ నేతల ఆదేశానుసారమే నడుచుకుంటామని’ ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యేలతో పాటు నేతలు సైతం ప్రతిజ్ఞ చేశారు. పరేడ్ సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ప్రసంగించారు. అంతకుముందు, ఈ మూడు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుందని, తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. సభ్యత్వంపై నాదీ భరోసా ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ కనుక, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలంటూ ఆయన జారీ చేసే విప్‌ను ధిక్కరిస్తే శాసనసభ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందనే భయాలు అక్కర్లేదని, ఎన్సీపీ ఎమ్మెల్యేల సభ్యత్వానికి తనదే బాధ్యత అని శరద్ పవార్ హామీ ఇచ్చారు. విప్‌ను ధిక్కరిస్తే సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందంటూ తమ ఎమ్మెల్యేలను బీజేపీ భయాందోళనలకు గురి చేస్తోందని పవార్ విమర్శించారు. ‘రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించాను. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలను పరిశీలించాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్‌ను తొలగించాం. కాబట్టి, పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం తనకు లేదు. జారీ చేసినా ఆ విప్ చెల్లదు’ అని పవార్ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారు. ‘భయం, ఆందోళన వద్దు. మీ సభ్యత్వానికి నాదీ భరోసా. అక్రమంగా అధికారంలోకి వచ్చినవారిని గద్దె దింపాల్సిన సమయం వచ్చింది’ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై శరద్ పవార్ నిప్పులు చెరిగారు. ‘అక్రమంగా, మెజారిటీ లేకున్నా అధికారంలోకి రావడానికి ఇది గోవా కాదు.. మహారాష్ట్ర. ఈ విషయం బీజేపీ పెద్దలు గుర్తుంచుకోవాలి’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మాట్లాడుతూ.. ఇక్కడున్న 162 మంది ఎమ్మెల్యేలే కాదు.. తమ వెనుక ఇంకా ఎక్కువ మంది శాసన సభ్యులే ఉన్నారన్నారు. ‘కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటాం. బీజేపీని అడ్డుకునే దిశగా ఈ అవకాశం మాకు కల్పించిన మా పార్టీ చీఫ్ సోనియాకు కృతజ్ఞతలు’ అన్నారు. నేరస్తుల్లా పరేడ్: బీజేపీ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నిర్వహించిన బల ప్రదర్శనపై బీజేపీ మండిపడింది. నేరస్తుల తరహాలో పరేడ్ నిర్వహించి, దేశం ముందు మహారాష్ట్ర పరువు తీశారని బీజేపీ నేత ఆశిశ్ షెలార్ విమర్శించారు. పరేడ్‌లో 162 కాదు.. 145 మంది కూడా లేరని వ్యాఖ్యానించారు. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ల నేతృత్వంతో రాష్ట్రంలో అయిదేళ్ల పాటు సుస్థిర పాలన కొనసాగుతుందన్నారు. అయితే, ఈ పరేడ్‌కు 137 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారని సమాచారం. అడ్డు తొలగండి – ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడ్డు తొలగాలని బీజేపీని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ‘మళ్లీ వస్తాను’ అనే ఫడ్నవీస్ ఎన్నికల ప్రచార నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘మేం ఆల్రెడీ వచ్చేశాం’ అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. అధికారం కోసం బీజేపీ అత్యంత హేయంగా వ్యవహరిస్తోందన్నారు. మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించాక సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన చెక్కుపై తొలి సంతకం చేస్తున్న ఫడ్నవీస్ -
బలనిరూపణ అంటే బీజేపీ పారిపోతోంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బలం నిరూపించాల్సిందిగా బీజేపీని కోరితే ఆ పార్టీ పారిపోతోందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. తగినంత సంఖ్యా బలం లేకపోవడం వల్లే బీజేపీ వెనకడుగు వేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో చెప్పారు. సంఖ్యాబలం లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అక్రమమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. సంఖ్యాబల నిరూపణకు వెళదామని, అక్కడే ఎవరి బలమేమిటో తేలిపోతుందని బీజేపీకి చురకలంటించారు. బలనిరూపణకు వెళ్తే తమ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. గవర్నర్ కార్యాలయాన్ని ఉపయోగించుకొని బీజేపీ అక్రమ చర్యలకు దిగిందని ఆరోపించారు. -
చిన్న పార్టీల దారెటు?
ముంబై: ఫడ్నవీస్ ప్రభుత్వం త్వరలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో.. చిన్న చిన్న పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇటీవలి ఎన్నికల్లో చిన్న పార్టీల నుంచి 16 మంది, స్వతంత్రులు 13 మంది ఎమ్మెల్యేలయ్యారు. అసెంబ్లీలోని మొత్తం 288 మందిలో మెజారిటీకి 145 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ ‘ఇతర’ ఎమ్మెల్యేల్లో తమ వైపు ఏడుగురున్నారని శివసేన, తమవైపు 14 మంది ఉన్నారని బీజేపీ చెబుతున్నాయి. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్‌కు ఎన్సీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారన్నది ఇప్పటి వరకు కచ్చితంగా వెల్లడి కాలేదు. అయితే, వీరు కాకుండా పలువురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కమలదళం చెబుతోంది. ఆ నలుగురు కీలకం బలపరీక్ష నేపథ్యంలో.. మేజిక్ మార్క్ 145కి చేరేందుకు బీజేపీ ముఖ్యంగా నలుగురు నేతలపై ఆధారపడుతోంది. వారు నారాయణ్ రాణె, రాధాకృష్ణ విఖె పాటిల్, గణేశ్ నాయక్, బాబన్‌రావు లోనికర్. వీరిలో నారాయణ్ రాణె, విఖె పాటిల్ గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించినవారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలామందితో ప్రత్యక్ష సంబంధాలున్నావారు. గణేశ్ నాయక్, బాబన్‌రావు మాజీ ఎన్సీపీ నేతలు. ప్రస్తుత ఎన్సీపీ ఎమ్మెల్యేలతో మంచి సంబంధాలున్నవారు. అందుకే బీజేపీ వీరిపై ఆధారపడుతోంది. -
అసలు సీనంతా మోదీ, పవార్ భేటీలోనే..!
పెళ్లికి ముహూర్తం కుదిరింది. రాత్రి శుభలేఖలు అచ్చయ్యాయి. ఉదయాన్నే పెళ్లి జరిగింది!!. కాకపోతే పెళ్లి కొడుకు మారిపోయాడు. ఇదీ... మహారాష్ట్ర పదవీ కల్యాణానికి శుభం కార్డు పడిన తీరు!!. బహుశా... దీనికి మించిన అర్ధరాత్రి డ్రామాను చూడలేమేమో!!. ఎందుకంటే శుక్రవారం రాత్రి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. ఆ వార్తను శనివారం ఉదయం పత్రికల్లో చదువుతుండగానే... బీజేపీ నేత ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్‌పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు టీవీల్లో, మొబైల్ ఫోన్లలో ఫ్లాష్‌లు వెల్లువెత్తాయి. రాత్రికి ఆ ఫ్లాష్ల తీరూ మారింది. శరద్ పవార్ తన పవర్ చూపిస్తారా? మరి ఈ మహా ‘మలుపు’లో ఎవరి భాగమెంత... మహారాష్ట్ర ఎన్నికల తీర్పు స్పష్టంగానే ఉంది. కాకపోతే గెలిచిన బీజేపీ–శివసేన మధ్య ఒప్పందమే అస్పష్టం. ముఖ్యమంత్రి పదవిని సగం–సగం పంచుకుందామని చెప్పిన బీజేపీ... మాట మార్చిందన్నది శివసేన వాదన. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన శివసేన.. బీజేపీకి టాటా చెప్పి ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసింది. ఎన్సీపీ ఓకే. కాంగ్రెస్ మాత్రం సైద్ధాంతిక విభేదాలున్న సేనతో కలవడమెలా? అని కొన్నిరోజులు మల్లగుల్లాలు పడింది. అధికారం ముందు ఆ అభ్యంతరాలన్నీ చిన్నబోయాయి. చివరకు పచ్చజెండా ఊపింది. (ఫలించిన మోదీ, షా వ్యూహం!) ‘నైతిక’ ప్రశ్నలకు తావుందా? రాజకీయమంటే అధికారం కోసం!!. బీజేపీని వదిలేటపుడు శివసేన ఇచ్చిన సంకేతమిదే. ఎలాంటి సారూప్యతా లేని సేనతో కలవటానికి కాంగ్రెస్, ఎన్సీపీలు పచ్చజెండా ఊపినప్పుడు కనిపించిందీ ఇదే. ఈ సూత్రాన్ని తనకు తాను అన్వయించుకున్నాడు ఎన్సీపీ నేత అజిత్‌పవార్. వెంట వచ్చిన ఎమ్మెల్యేలతో బీజేపీని కలిశాడు. ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం.. నైతికత అనే ప్రశ్నల్ని లేవనెత్తే అర్హత ఏ పార్టీకీ లేదనే అనుకోవాలి. బహుశా... అందుకేనేమో!! శివసేనతో జట్టుపై కాంగ్రెస్ తేల్చనంతవరకూ బీజేపీ కూడా మౌనంగానే ఉంది. శుక్రవారం రాత్రి సేనతో దోస్తీకి కాంగ్రెస్ సై అనగానే... కాంగ్రెస్ సైద్ధాంతిక పాతివ్రత్యం దెబ్బతిన్నది కనక వేగంగా పావులు కదిపేసింది. కానీ తెల్లవారు జామునే రాష్ట్రపతి పాలన తొలగించి ఫడ్నవిస్ చేత ప్రమాణ స్వీకారం చేయించి న గవర్నరు పాత్ర ప్రశ్నార్హమే. తగినంత మద్దతుందని వచ్చారు కనక అవకాశమిచ్చాననేది ఆయన మాట. నిజానికి అర్హతలతో పనిలేకుండా తమకు నచ్చినవారిని గవర్నర్లుగా నియమించే సంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వాలన్నీ కొనసాగిస్తున్నాయి. కాబట్టి వారి ప్రవర్తన కేంద్రానికి అనుకూలంగా ఉండదని ఆశించటమే పొరపాటు. (బలపరీక్షపై ఉత్కంఠ..!) పవార్ – మోదీ భేటీలోనే...? అసలు శరద్‌పవార్– ప్రధాని నరేంద్రమోదీ ఈ మధ్య ఎందుకు భేటీ అయ్యారు? భేటీ వారిద్దరికే పరిమితం కనక బయటివారు దీన్ని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. తాను మొదటి నుంచీ కాంగ్రెస్‌తో ఉన్నాను కనక బీజేపీతో కలిస్తే ఇన్నాళ్లూ కష్టపడి సంపాదించుకున్న మరాఠా వీరుడు, పెద్దమనిషి అనే ట్యాగ్లు పోతాయని పవార్ భయపడి ఉండొచ్చు. కాకపోతే బీజేపీ పని జరిగేలా అజిత్‌పవార్ తిరుగుబాటు చేసే ఆలోచనకు అక్కడే బీజం పడి ఉండొచ్చన్న అనుమానాలూ ఉన్నాయి. ఇప్పుడు శరద్‌పవార్ తాను పోరాడతాననే చెబుతున్నారు. కానీ ఆ పోరాటం అజిత్‌ను బీజేపీకి దూరంగా ఉంచుతుందని, సేన–కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాత్రం ఆశించలేం. అందుకేనా ఆ ధీమా..? మహారాష్ట్ర అంటే ఇతర రాష్ట్రాల్లాంటిది కాదు. ముంబైతో సహా దేశాన్ని నడిపించే ఆర్థికాధికార కేంద్రాలన్నీ ఉన్నదిక్కడే. అలాంటి రాష్ట్రంలో.. ప్రజాతీర్పు అనుకూలంగా వచ్చినా అధికారం అందకపోతే బీజేపీ ఊరుకుంటుందా? గోవా, కర్ణాటక, హర్యానా లాంటిచోట్ల ప్రజాతీర్పును తమకు అనుకూలంగా మార్చుకున్న పార్టీ ఇక్కడెందుకు వెనకడుగేస్తుంది? అందుకే తొలి నుంచీ తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతుందని బీజేపీ పదేపదే చెబుతూ వస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అది చాలదని, మరో 20 మంది కావాలని దానికి తెలియనిదా? ఆ మిగిలిన 20 మందినీ ఎలాగైనా సంపాదిస్తామనే ధీమాను అందులో చూడాలా? మరి అజిత్ పవార్ ఫెయిలయి ఎమ్మెల్యేలంతా శరద్‌పవార్ వెంటే నిలబడితే ఏమవుతుంది? బీజేపీ ఆ అవమాన భారాన్ని భరించగలదా? చూడాల్సిందే!!. -
ఆ ఎమ్మెల్యేలపై శరద్ పవార్ మండిపాటు
న్యూఢిల్లీ/సాక్షి,ముంబై: అజిత్ పవార్‌తోపాటు అతని వెంట ఉన్న ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. ఎన్సీపీలో అంతర్గత పోరుతోనే అజిత్ బయటకు వెళ్లారన్నది అవాస్తవమన్నారు. బీజేపీ చీకటి రాజకీయాలు చేస్తోందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. కాగా, ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన ఫడ్నవీస్‌తో హడావుడిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం చట్ట విరుద్ధమంటూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని, తక్షణమే శాసనసభను రద్దు పరిచి, బల పరీక్ష జరిపించాలని కోరాయి. ఈ పిటిషన్ ఆదివారం ఉదయం 11.30 గంటలకు విచారణకు రానుంది. మా వాళ్లంతా తిరిగి వస్తారు: పవార్ ఆకస్మిక రాజకీయ పరిణామాలపై శనివారం ఉదయం ఆయన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘ ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణస్వీకార సమయంలో అక్కడున్న 10–11 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు మళ్లీ మా వద్దకు వచ్చారు. మిగతా వారూ వస్తారు’ అని శరద్ తెలిపారు. అజిత్ చర్య క్రమశిక్షణారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. ‘అజిత్‌తోపాటు వెంట ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోవడం ఖాయం. అజిత్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలను ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే ప్రజలే ఓడిస్తారు’అని అన్నారు. శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమికి అసెంబ్లీలో 170 మంది సభ్యుల బలముంది’ అని అన్నారు. బీజేపీవి చీకటి రాజకీయాలు: ఉద్ధవ్ తాజా పరిణామాలపై ఉద్ధవ్ స్పందించారు. ‘శివసేన ఏదైనా బాహాటంగానే చేస్తుంది. చీకటి రాజకీయాలు మేం చేయం. ఇదివరకు బీజేపీ ఈవీఎం వ్యవహారం నడిపించింది. ఇప్పుడు ఇదో కొత్త నాటకం. ఇకపై ఎన్నికలు కూడా అవసరమని నేను అనుకోను. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో మాదిరిగానే కేంద్ర కేబినెట్ ఉదయాన్నే తీసుకున్న ఈ నిర్ణయం నకిలీస్టైక్స్(ఫర్జికల్ స్టైక్స్). మహారాష్ట్ర ప్రజలు శిక్షించక తప్పదు’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇదో చీకటి అధ్యాయం: కాంగ్రెస్ మహారాష్ట్రలో అక్రమ మార్గంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని, భారతదేశ చరిత్రలో ఇదో చీకటి అధ్యాయమని కాంగ్రెస్ విమర్శించింది. ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కాంట్రాక్టు పుచ్చుకున్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. మహారాష్ట్రలో కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తం చేసింది. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్–శివసేన–ఎన్సీపీ కూటమి బీజేపీని ఓడిస్తుందని పేర్కొంది. ఉదయం సుప్రీం విచారణ ఫడ్నవీస్‌తో సీఎం ప్రమాణం చేయిస్తూ గవర్నర్ కోష్యారీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎమ్మెల్యే బేరసారాలకు మరింతగా అవకాశం ఇవ్వకుండా వెంటనే శాసనసభలో బల నిరూపణ చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. అజిత్ పవార్‌పై వేటు ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్‌ను ఆ పార్టీ తొలగించింది. ఎన్సీపీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీతో చేతులు కలిపినందున అతన్ని తొలగించినట్లు తెలిపింది. దీంతో విప్జారీచేసే అధికారం అజిత్ కోల్పోయారని తెలిపింది. శనివారం సాయంత్రం ముంబైలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త శాసనసభాపక్ష నేత ఎన్నికయ్యే వరకు ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ రాజ్యాంగపర హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఈ సమావేశానికి మొత్తం 54 మందికిగానూ 49 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి బలం నిరూపించుకునేందుకు ఈ నెల 30 వరకూ సమయం ఉందని, అందులో బీజేపీని ఓడించి శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ చెప్పారు. ఫడ్నవీస్, అజిత్ పవార్ల ప్రమాణ స్వీకారం సమయంలో రాజ్‌భవన్‌లో ఉన్న తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తుదకు శరద్ పవార్ వద్దకు చేరడం గమనార్హం. ఎప్పుడేం జరిగింది ? దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగాæ ప్రమాణం చేయడానికి ముందు రాత్రి నుంచి జరిగిన పరిణామాలివీ... నవంబర్ 22 8:00 (రాత్రి) ప్రభుత్వ ఏర్పాటు గురించి ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ నేతల భేటీ 8:45–9:00 భేటీ మధ్యలోనే వెళ్లిపోయిన అజిత్ పవార్ 10:00–10:30 ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా అన్ని పార్టీలు అంగీకరించాయని ప్రెస్మీట్లో వెల్లడించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ 11:30–11:50 బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న అజిత్ నవంబర్ 23 12:00 (అర్ధరాత్రి): తెల్లవారేసరికి ప్రమాణ స్వీకారం ముగుస్తుందని కీలక వ్యక్తులకు సమాచారమిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్ 12:15–12:40: ఢిల్లీ వెళ్లే పర్యటనను రద్దు చేసుకున్న మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ. ఉదయం ఆయన ప్రయాణం కావాల్సి ఉంది. 12:30: రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యదర్శిని కోరిన కోష్యారీ 2:30–2:45: రాష్ట్రపతి పాలన ఎత్తివేసే పత్రాలు తయారు చేయడానికి రెండు గంటలు పడుతుందని చెప్పిన గవర్నర్ కార్యదర్శి. ఉదయం ఏడున్నర గంటలకల్లా ప్రమాణ స్వీకారం చేయవచ్చని సూచన. 5:30: రాజ్‌భవన్ చేరుకున్న అజిత్, ఫడ్నవీస్ 5:47: రాష్ట్రపతి పాలన ఎత్తివేసినట్లు ప్రకటించిన గవర్నర్ 7:50: ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ కోష్యారీ. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ల ప్రమాణ స్వీకారం. 8:45: ఫడ్నవీస్, అజిత్ పవార్లను అభినందించిన ప్రధాని మోదీ. 8.50: ప్రమాణస్వీకారం బయటికి తెలియడంతో శరద్ పవార్ నివాసం ‘సిల్వర్ ఓక్’ వద్దకి చేరుకున్న ఎన్సీపీ నేతలు 9.00: ఉద్దవ్ ఠాక్రే నివాసస్థానం మాతోశ్రీ, శరద్ పవార్ నివాసస్థానం సిల్వర్ ఓక్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు. 10.10: బీజేపీ ఎమ్మెల్యేలందరూ ముంబైకి రావాలని ఆదేశాలు 10.30: శరద్‌తో భేటీ అయిన నవాబ్ మాలిక్ 11:00: హోటల్ మరీన్ ప్లాజాలో కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ 12.30: వైబీ చవాన్ సెంటర్లో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల మీడియా సమావేశం 1.50:తాను ఇప్పుడేమీ చెప్పలేనని సరైన సమయంలో అన్ని విషయాలు చెప్తానన్న అజిత్ 2.30: తమ ఎమ్మెల్యేలను సురక్షిత స్థలాలకు తరలించాలని కాంగ్రెస్ నిర్ణయం సాయంత్రం 5.15: సోదరుడు శ్రీనివాస్ పవార్ నివాసంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ భేటీ. పటిష్ట భద్రత ఏర్పాటు. 6.20: సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన. రాత్రి 8.00 అజిత్‌పై వేటు వేసిన ఎన్సీపీ నవంబర్ 24 ఉదయం 11.30: పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం -
చివరికి సాధించారు : అమృత ఫడ్నవీస్
ముంబై : తన భర్త, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్లను ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే అమృత ఫడ్నవీస్ అభినందించారు. ‘దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లకు అభినందనలు..మీరు సాధించార’ని అమృత ఫడ్నవీస్ శనివారం ట్వీట్ చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న క్రమంలో అనూహ్యంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ తోడ్పాటుతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఈనెల 30లోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి సమయం ఇచ్చారు. -
ఫలించిన మోదీ, షా వ్యూహం!
సాక్షి, ముంబై: మహారాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరూ ఊహించని విధంగా ఎన్సీపీ శాసనసభా పక్షనేత అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఎన్సీపీ చీఫ్ శదర్ పవార్‌కు తెలియకుండా పార్టీని నిలువునా చీల్చి సగం మంది ఎమ్మెల్యేలతో బీజేపీతో చేతులు కలిపారు. ఈ పరిణామం మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనుక ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను ప్రకటించడం, హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ సేనకు మద్దతు ప్రకటించడం అజిత్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలింస్తున్న బీజేపీ.. శివసేనకు చెక్ పెట్టేందుకు ఎన్సీపీ నేతలు తమ వైపుకు తిప్పుకోవాలని ప్రణాళికలు రచించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ కావడం ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనికి తోడు ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శరద్ పవార్‌ను చూసి సభ్యులు చాలా నేర్చుకోవాలి అని మోదీ ప్రశంసలు కురిపించడం కూడా దీనిలో భాగంగానే పలువురు వర్ణించారు. (ఎన్సీపీ కీలక నిర్ణయం.. అజిత్‌పై వేటు) మహారాష్ట్రలో బీజేపీకి ఎన్సీపీ మద్దతు ప్రకటిస్తే శరద్ పవార్‌కు రాష్ట్రపతి పదవిని కూడా కేంద్రం ఆఫర్ చేసిందనే పుకారు షికారు చేసింది. కానీ వీటన్నింటినీ పవార్ కొట్టిపారేశారు. తమ మధ్య రాజకీయంగా ఎలాంటి చర్చరాలేదని, కేవలం రైతుల ఆత్మహత్యలపైనే చర్చించామని చెప్పుకొచ్చారు. అయితే వారిద్దరి మధ్య భేటీ సమయంలో మోదీ, పవార్ తప్ప మూడో వ్యక్తి లేకపోవడంతో ఊహాగానాలు మరింత వ్యక్తమయ్యాయి. ఓవైపు శివసేన, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూనే బీజేపీకి దగ్గరయ్యేందుకు పవార్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం కూడా సాగింది. అయితే వాటిన్నింటికీ సమాధానంగా శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పవార్.. ఉద్ధవ్ ఠాక్రేనే సీఎం అభ్యర్థిని స్పష్టం చేశారు. దీనికి మూడు పార్టీలు అనుకూలంగా ఉన్నాయని, త్వరలోనే ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. శనివారం ఉదయం దాదాపు దేశంలోని అన్ని పత్రికలూ ఇదే వార్తను పతాక శీర్షికలుగా ముద్రించాయి. కానీ తెల్లారే సరికి రాజకీయాలు అనుహ్యంగా మారిపోయాయి. ఎన్సీపీని చీల్చిన అజిత్ బీజేపీకి మద్దతు తెలిపారు. (ఉత్కంఠగా బలపరీక్ష!) అయితే మోదీ, అమిత్ షా చతురత ఫలితంగానే అజిత్‌ను తమ వైపుకు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటక, గోవా అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న షా, మోదీ ద్వయం ఇక్కడ కూడా అలాంటి వ్యూహాలనే అమలు చేసింది. సీఎం పీఠంపై బీజేపీతో వైరాన్ని సృష్టించిన శివసేనకు గట్టి బదులివ్వాలనుకున్న షా.. ఆ ప్రయోగాన్ని అజిత్‌పై ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శివసేనకు వ్యతిరేకంగా అజిత్ గళం విప్పడంతో పాటు అయనపై ఉన్న ఈడీ కేసులను చూపి షా గాలం వేసినట్లు సమాచారం. కాగా తాజా పరిణామాలు ఎన్సీపీ, శివసేనకు ఎదురుదెబ్బగా ముంబై వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శతాబ్దాల వైరాన్నీ పక్కన పెట్టిన శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో కలవడం సేన సైనికులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో హిందూ ఓటర్లు సేనకు కొంతదూరమయ్యే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ, శివసేన ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. (బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం) -
బలపరీక్షపై ఉత్కంఠ..!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు ప్రకటించడంతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన, కాంగ్రెస్ నేతలతో పాటు శరద్ పవార్‌కు ఊహించిన షాక్ ఇచ్చిన అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఎన్సీపీలోని సగంమంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుని బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈనెల 30లోపు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుకోవాలని గవర్నర భగత్‌సింగ్ కోశ్యారీ బీజేపీ సూచించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్ష ఆసక్తికరంగా మారింది. ఫడ్నవిస్‌కు ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపకపోతే బలపరీక్షను ఎదుర్కొవడం సవాలే. దీంతో ప్రభుత్వాన్ని నెగ్గించుకునేందుకు బీజేపీ, ఫడ్నవిస్‌ను అడ్డకునేందుకు విపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. (బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం) మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్సీపీలో అజిత్ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ముంబై వర్గాల సమాచారం. కానీ ఎన్సీపీ శాసన సభ్యులంతా తమకు మద్దతు తెలుపుతున్నారని, ఆ పార్టీకి ఇక శరద్ పవార్ ఒక్కరే మిగిలి ఉన్నారని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం ఇదివరకే పావులు కదిపింది. వారి మద్దతుతో బల పరీక్షలో నెగ్గాలని ప్రణాళిలకు రచిస్తోంది. (పవార్‌కు షాక్.. ఎన్సీపీలో చీలిక!) బల పరీక్షకు వారానికి పైగా గడువు ఉండటంతో విపక్షంలోని రెబల్స్‌పై కూడా బీజేపీ దృష్టి పెట్టింది. అయితే బలపరీక్షలో సరిపడ ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎన్సీపీలో చీలిక తెచ్చి.. ఊహించని షాక్ ఇచ్చిన కాషాయ పార్టీ శివసేనను దెబ్బకొట్టేందుకు మరిన్ని ఎత్తుగడలు వేస్తోంది. ఇదిలావుండగా తాజా పరిణామాల నేపథ్యంలో శివసేన, కాంగ్రెస్ నేతలు అలర్టయ్యారు. బీజేపీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. శనివారం వారు గవర్నర్‌ను కూడా కలిసే అవకాశం ఉంది. -
పవార్‌కు షాక్.. ఎన్సీపీలో చీలిక!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలువు తిరిగింది. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో సీఎం పీఠం ఎక్కాలన్న శివసేన ఆశలకు బీజేపీ గండికొట్టింది. తెరవెనక రాజకీయాలు చేసి ఎన్సీపీని తన వైపుకు తిప్పుకుంది. కూటమి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనే ఉంటారని శుక్రవారం రాత్రే శరద్ పవార్ ప్రకటించారు. ఈలోపే దేవేంద్ర ఫడ్నవిస్ కేంద్ర పెద్దల సూచనలతో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో రహస్య మంతనాలు చేశారు. తమకు మద్దతు ఇస్తే డిప్యూటీ సీఎంతో పాటు ఉన్నత పదవులను ఇస్తామని ఆఫర్ చేశారు. అయితే తొలి నుంచి ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న అజిత్ పవార్ బీజేపీ నేతల చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అజిత్ చర్యతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు షాక్‌కి గురయ్యారు. అయితే ఈ వ్యవహారమంతా శరద్ పవార్‌కు తెలియకుండా అజిత్ పవార్ జాగ్రత్త పడ్డారు. ఈ నేపథ్యంలోనే 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ప్రకటించి, ఎన్సీపీలో చీలిక తెచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్సీపీలో అజిత్ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వంతంత్ర సభ్యుల మద్దతులో బలనిరూపణ చేస్తారని తెలుస్తోంది. -
అమ్మ పవార్.. రాష్ట్రపతి కోసమేనా ఇదంతా?
ఉద్దవ్ ఠాక్రేను మహారాష్ట్ర సీఎం అని ప్రకటించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు రాత్రికిరాత్రే ఏమైందో కానీ ప్లేట్ ఫిరాయించారు. బహిరంగ ప్రకటన ఇచ్చి కనీసం రోజు కూడా మారకముందే తన మనసు, మాట మార్చుకున్నారు. కాంగ్రెస్, శివసేనకు భారీ షాక్ ఇచ్చి అనూహ్యంగా బీజేపీకి మద్దతు ప్రకటించారు పవార్. దీంతో మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఉదయం నిద్ర లేచి టీవీలో వస్తున్న వార్తలు చూసి శివసేన, కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. పవార్‌కు ఏమైంది? ఎందుకు ఇలా ప్లేట్ ఫిరాయించారు? కాంగ్రెస్‌కు సోనియాకు నమ్మిన బంటైన శరద్ పవార్ ఉన్నట్టుండి ఇలా ఎందుకు చేశారు? అనేది మహారాష్ట్రతో పాటు దేశరాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. (బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం) మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి శివసేన ముఖ్య నేతలతో రోజు సమావేశం.. అంతేకాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మూడు సార్లు అధికారిక భేటీ.. అనధికారికంగా అనేకమార్లు. ఇవి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకై జరిపిన సమావేశాలు, చర్చలు. కానీ ఇవన్నీ ఒకే ఒక్క భేటీతో తుడిచిపెట్టుకపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీతో శరద్ పవార్ భేటీ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై చాలా మెత్తబడ్డారు. అనంతరం సోనియా అక్షింతలు వేయడంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ల కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహా సీఎంగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అంటూ సంయుక్తంగా ప్రకటించింది. అంతేకాకుండా సంకీర్ణ ప్రభుత్వానికి హెడ్ ఉద్దవ్ ఠాక్రే అంటూ స్పష్టం చేసింది. దీంతో శివ సేన సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా ఠాక్రే కుటుంబ సభ్యులు ఆనందంలో తేలియాడారు. తొలిసారి ఠాక్రే వంశస్థులు ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారని. అయితే వారికి తెలియదు కదా ముందున్న ఉపద్రవం గురించి. అయితే శరద్ పవార్‌పై అనుమానమో లేక వేరే కారణాలో తెలియవు కానీ ఆయన చేతనే మహా సీఎం ఉద్దవ్ ఠాక్రే అని ప్రకటింప చేసేలా చేశారు సోనియా గాంధీ. ఎందుకంటే మాట తప్పిన చరిత్ర పవార్‌పై రుద్దాలనే ఆలోచన కాంగ్రెస్ చీఫ్‌కు ఉన్నట్లుంది. ఇక అంతా అయిపోయింది మూడు పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది అనుకున్న తరుణంలో అనూహ్యంగా బీజేపీతో చేతులు కలిపింది ఎన్సీపీ. ఇప్పుడు అందరి మదిలోనూ కదులుతున్న ప్రశ్నలు అనేకం. అసలు రాత్రిరాత్రికి ఏమైంది? ఉద్దవ్ ఠాక్రే సీఎం అని ప్రకటించిన వెంటనే.. మోదీ, అమిత్ షాలు శరద్ పవార్‌తో మాట్లాడారా? మాట్లాడితే ఏం మాట్లాడారు? రాష్ట్రపతి పదవి ఆఫర్ చేశారా? లేక కేసులపై భయపెట్టారా? శివసేనపై పవార్‌కు నమ్మకం లేదా? వీటన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి. ఇక ఎన్సీపీ, శరద్ పవర్ అనూహ్య నిర్ణయంపై శివసేన, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. రాష్ట్రపతి పదవి కోసం పవార్ ఇలా కుటిల రాజకీయాలకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇక మాట తప్పిన నేతగా మరాఠా రాజకీయ చరిత్రలో నిలిచిపోతారని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. కిచిడీ పాలన వైపు కాకుండా సుస్థిర పాలన వైపు ఎన్సీపీ ఆసక్తి చూపడంతోనే తమకు మద్దతు ప్రకటించిందని బీజేపీ పేర్కొంది. (చదవండి: ‘మహా’ మలుపు.. రాత్రికి రాత్రి ఏం జరిగింది?) -
బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ వారిచే ప్రమాణం చేయించారు. అయితే శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శుక్రవారం రాత్రే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తెర వెనుక వ్యూహాలు రచించిన బీజేపీ అజిత్ పవార్‌తో రహస్య మంతనాలు చేసింది. ఈ నేపథ్యంలో తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ను కోరారు. రాత్రికి రాత్రే అనేక రాజకీయ పరిణామాలు చేసుకున్న నేపథ్యంలో ఎన్సీపీ మద్దతుతో ఫడ్నవిస్ సీఎం ప్రమాణం చేశారు. అనంతరం ఫడ్నవిస్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని అన్నారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న శివసేనకు ఎన్సీపీ ఊహించని షాక్ ఇచ్చింది. ఒకవైపు సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఎన్సీపీ బీజేపీకి మద్దతు ప్రకటించింది. కాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే ఎన్సీపీలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ వెంట 20కి పైగా ఎమ్మెల్యే మద్దతు ఉండటంతో బీజేపీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. కాగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవిస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశామని గవర్నర్ తెలిపారు. (చదవండి: ‘మహా’ మలుపు.. రాత్రికి రాత్రి ఏం జరిగింది?) -
శివసేనకు బంపర్ ఆఫర్: గవర్నర్ ఆహ్వానం
సాక్షి, ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. కొద్ది సమయం వ్యవధిలోనే అనేక కీలక పరిణామాలు చేటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా లేమని బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా శివసేనను గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం 7:30లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గడవు విధించారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. దీంతో వ్యూహాల రచనకు శివసేన మరింత పదునుపెట్టింది. ఇప్పటికే ఎమ్మెల్యేలతో సేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ నుంచి పిలుపు రావడంతో మహా రాజకీయం ఒక్కసారిగి వేడెక్కింది. మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో మంతనాలు చేసేందుకు శివసేన నేతలు రంగంలోకి దిగారు. దీని కొరకే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు రాత్రి అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ కీలక నేతలతో ఆయన భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరనున్నారు. అయితే శివసేన ఆహ్వానంపై స్పందించిన ఎన్సీపీ.. పలు షరతులు విధించింది. అసెంబ్లీ బలపరీక్షలో మద్దతు తెలపాలంటే శివసేన ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలని కండీషన్ పెట్టింది. అలాగే ప్రభుత్వం కేంద్రంలోని అన్ని పదవులకు సేన నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది సభ్యుల బలం ఉండాలి. దీంతో సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిస్తే.. సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ దిశగానే శివసేన ప్రణాళికలు రచిస్తోంది. అయితే దీనిపై ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల స్పందన ఏ విధంగా ఉంటుదనేది ఆసక్తికరంగా మారింది. -
మహారాష్ట్రలో బీజేపీ సంచలన నిర్ణయం
-
బీజేపీ సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ పంపిన ఆహ్వానంపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. సరైన సంఖ్యాబలం లేనందున ప్రభుత్వ ఏర్పాటుపై వెనుకంజ వేసింది. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్ష నేత, ఆపధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గవర్నర్‌ను కలిసి ఈ విషయం తెలియజేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. సోమవారంలోపు అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని గవర్నర్ గడవు విధించారు. దీనిపై ఆదివారం సాయంత్రం ఫడ్నవిస్ నివాసంలో భేటీ అయిన బీజేపీ కోర్ కమిటీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని నిర్ణయించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగినంత బలం లేదని.. సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని తెలిపింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీకి కనీసం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టలేమని భావించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని నిర్ణయించింది. సమావేశం అనంతరం ఫడ్నవిస్ శివసేనపై విమర్శల వర్షం కురిపించారు. ఠాక్రే నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దమ్ము శివసేనకు ఉందా అంటూ సవాలు విసిరారు. సరైన సంఖ్యాబలం ఉండే శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చాని అన్నారు. -
ప్రభుత్వ ఏర్పాటుకు మహారాష్ట్ర గవర్నర్ ఆహ్వానం
-
గవర్నర్ కీలక నిర్ణయం: బీజేపీకి ఆహ్వానం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. నవంబర్ 11 తేదీలోపు (సోమవారం) అసెంబ్లీలో బలన్ని నిరూపించుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. కాగా ఫలితాలు విడుదలై 15 రోజులకుపైగా గడుస్తున్నా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని విషయం తెలిసిందే. సీఎం పీఠం, పదవుల పంపకాలపై బీజేపీ-శివసేన కూటమి మధ్య ఏర్పడిన విభేదాలే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ పదవీకాలం ఈనెల 8న ముగియడంతో దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి తొలుత అవకాశం ఇవ్వాలి కాబట్టి గవర్నర్ వారిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీకి కనీసం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. అయితే తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలు తన సంప్రదింపుల్లోనే ఉన్నారని దేవేంద్ర ఫడ్నవిస్ భావిస్తున్నారు. దీంతో వీరితో పాటు మరో 24 మందిని ఎలాగైనా తమవైపు తిప్పుకుని అధికారం చేపట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు. గవర్నర్ కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో కీలక పరిణామాలు చేటుచేసుకునే అవకాశం ఉంది. -
ఫడ్నవీస్ రాజీనామా
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీకి శుక్రవారం రాజీనామా లేఖను సమర్పించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఫడ్నవీస్‌ను గవర్నర్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు పక్షం రోజులు గడచినా.. ప్రభుత్వ ఏర్పాటులో మెజారిటీ సాధించిన బీజేపీ, శివసేనల మధ్య అధికార పంపిణీ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ‘ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే కొత్త ప్రభుత్వం కొలువుతీరడం కావచ్చు లేదా రాష్ట్రపతి పాలన విధించడం కావచ్చు’ అని రాజీనామా అనంతరం ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యానికి శివసేన తీరే కారణమని విమర్శించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని సమంగా పంచుకోవాలని తన సమక్షంలో శివసేనతో ఎలాంటి అంగీకారం కుదరలేదని ఫడ్నవీస్ మరోసారి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా చెప్పారని వివరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కోరేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు పలుమార్లు ఫోన్ చేశానని, తన కాల్స్‌కు ఆయన జవాబివ్వలేదని ఫడ్నవీస్ చెప్పారు. ‘బీజేపీతో కాకుండా ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్న శివసేన పాలసీ సరైంది కాదు’ అని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి రామ్‌దాస్ అఠవాలే శుక్రవారం శరద్‌పవార్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఆ ఒప్పందమేమీ లేదు బీజేపీ, శివసేనల మధ్య ముఖ్యమంత్రి పదవి సహా అధికారాన్ని సమానంగా పంచుకోవాలనే ఒప్పందమేదీ కుదరలేదని బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ శుక్రవారం స్పష్టం చేశారు. ‘ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకే సీఎం పదవి దక్కాలని గతంలో దివంగత బాల్ ఠాక్రే కూడా చెప్పారు’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. మరోవైపు, సీఎం పదవిని సమానంగా పంచుకునేందుకు అంగీకరిస్తేనే శివసేన వద్దకు చర్చల నిమిత్తం బీజేపీ రావాలని సేన నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కాగా, నవంబర్ 15 వరకు సేన ఎమ్మెల్యేలంతా ఒక రిసార్ట్‌లో ఉండబోతున్నారని, అక్కడ వారికి భద్రత కల్పించాలని కోరుతూ ముంబై పోలీస్ కమిషనర్‌కు శివసేన నేత మిలింద్ నర్వేకర్ ఒక లేఖ రాశారు. బీజేపీ తనను అబద్ధాల కోరుగా చిత్రించేందుకు ప్రయత్నిస్తోందని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ‘సీఎం పదవి విషయంలో ఎలాంటి ఒప్పందం కుదరలేదంటూ నన్ను అసత్యాలు చెప్పేవాడిగా బీజేపీ ప్రచారం చేయడం బాధిస్తోంది. ఆ తీరును సహించబోం’ అని అన్నారు. -
ఫడ్నవిస్ రాజీనామా.. సీఎం పీఠంపై శివసేన!
సాక్షి, ముంబై: దేశమంతా ఆసక్తిగా పరిశీలిస్తున్న మహారాష్ట్ర రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నేడు (శుక్రవారం) అర్ధరాత్రితో ముగియనుండటంతో ఫడ్నవిస్ రాజీనామా చేయక తప్పలేదు. ఎన్నికల ఫలితాలు విడుదలై 15 రోజులు గడుస్తున్నా.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చినా.. సీఎం పీఠం, పదవుల పంపకాలు ఇరు పార్టీల మధ్య చిచ్చుపెట్టాయి. దీంతో బీజేపీ-శివసేన నేతల మధ్య ఘర్షణ వాతావరణ ఏర్పడి.. ప్రభుత్వ ఏర్పాటులో ఎటూ తేల్చుకోలేకపోయాయి. సీఎం పీఠంపై 50:50 ఫార్ములా అనుసరించాలని శివసేన చేసిన విజ్ఞప్తిని బీజేపీ నేతలు తొసిపుచ్చారు. ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతాని ఫడ్నవిస్ స్పష్టంచేశారు. ఈ పరిణాల నేపథ్యంలోనే అసెంబ్లీ గడవు ముగియడంతో సీఎం పదవిని ఫడ్నవిస్ రాజీనామా చేశారు. అయితే గవర్నర్ తదుపరిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర రాజకీయాల అడుగులు ఎటువైపు పడతాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం పీఠంపై శివసేన..! అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అవకాశం ఇస్తారా? లేక రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా? అనేది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొత్త చర్చ కూడా ముంబై రాజకీయ వర్గల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి సరైన మెజార్టీ లేకపోవడంతో శివసేన విజ్ఞప్తి మేరకు వారికి అవకాశం ఇస్తారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో తమకు సహకరించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇదివరకే ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కోరిన విషయం తెలిసిందే. ఎన్సీపీతో పాటు కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపితే సీఎం పీఠంపై శివసేన కూర్చోవాలని పావులు కదుపుతోంది. అయితే రౌత్ ప్రతిపాదనపై స్పందించిన పవార్.. వెంటనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వివరించారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం సానుకూల స్పందన రాలేదు. అంతేకాక ప్రజలిచ్చిన తీర్పు మేరకు ప్రతిపక్షంలోనే కూర్చుంటాని పవార్ తేల్చిచెప్పారు. అయినా వెనక్కి తగ్గని శివసేన.. బీజేపీకి చెక్‌పెట్టాలని ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నంలో బీజేపీపైకి ఎదురుదాడి ప్రారంభించింది. రాజీనామా సందర్భంగా ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఉద్దవ్ ఠాక్రే.. దానికి కౌంటర్‌గా గట్టి సమాధానమిచ్చారు. జమ్మూ కశ్మీర్లో బీజేపీ-పీడీపీ కలిసినప్పుడు, తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఎందుకు కలవకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం పీఠం కోసం ఠాక్రే గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. చదవండి: సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా కాషాయ వికాసం కష్టమే.. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ఫడ్నవిస్ ప్రకటించగా.. తమకు 170 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని, బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన గట్టిగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గవర్నర్‌కు సవాలుగా మారింది. శివసేనను తప్పించి అతిపెద్దపార్టీగా ఆవిర్భవించిన బీజేపీ తొలతు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావచ్చు. బీజేపీ వద్ద 105 మంది ఎమ్మెల్యేలుండగా మ్యాజిక్ ఫిగర్ కోసం 40 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. దీంతో అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. బీజేపీ విశ్వాస పరీక్షలో నెగ్గకుంటే రెండో పెద్ద పార్టీగా శివసేన అధికారం కోసం ముందుకువచ్చే అవకాశాలున్నాయి. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 ఎమ్మెల్యేలతోపాటు ఇతరుల సాయంతో అవసరానికి మించి 170 వరకు సంఖ్యాబలం చేరవచ్చు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది. కానీ, మూడు వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీలతో ముందుకెళ్లడం అసాధ్యంగా కనిపిస్తోంది. అధికారాన్ని వాడుకుని, ప్రలోభాలకు గురి చేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఫడ్నవీస్‌కు ప్రస్తుతం అదేమంత సులభం కాదని చెప్పవచ్చు. రాష్ట్రపతి పాలన విధించే అవకాశం అయితే తాజా పరిస్థితులపై విశ్లేషించిన పలువురు రాజకీయ ప్రముఖులు మాత్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ-శివసేన మధ్య సయోధ్య కుదిరే వరకు (కొంతకాలం)పాటు రాష్ట్రపతి పాలను కొనసాగించి ఆ తరువాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అప్పటికీ శివసేన పట్టువీడకపోతే గవర్నర్ విచక్షణాధికారం ప్రకారం శివసేనను ఆహ్వానించే అవకాశం ఉంది. సేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు తెలుపుతాయా లేదా అనేది వేచి చూడాలి. కానీ పలువురు బీజేపీ నేతలు ప్రకటించిన విధంగా రీ ఎలక్షన్ (మరోసారి ఎన్నికలు)కు వెళ్లకపోవచ్చ. రీ ఎలక్షన్ పెద్ద మొత్తంలో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అటు దిక్కుగా నిర్ణయం తీసుకోకపోచ్చని సమాచారం. మొత్తం మీద దేశ ఆర్థికి రాజధాని ముంబై రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. -
సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి శుక్రవారం కీలక మలుపుతిరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈరోజు అర్ధరాత్రికి అసెంబ్లీ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఫడ్నవిస్ రాజీనామా చేశారు. ఈ మేరకు మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలతో పాటు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారిని కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని విషయం తెలిసిందే. శివసేన-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించినా.. వారిద్దరి మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో 15 రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తదుపరి నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా అతవరించిన బీజేపీకి అవకాశం కల్పిస్తారా? లేక రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సానుకూలంగానే ఉన్నా.. శివసేన తమతో కలిసి రావడంలేదని అన్నారు. తమతో చర్చలకు స్పందించిన ఉద్దవ్ ఠాక్రే.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో రహస్య మంతనాలను జరుపుతున్నారని విమర్శించారు. సీఎం పదవిపై ఆశలతో శివసేన నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. తాము చర్చలకు సంప్రదిస్తే స్పందించకుండా తమను తీవ్రంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై వారి వ్యాఖ్యలు సరైనవి కావని హితవుపలికారు. తమ భవిష్యత్తు కార్యాచరణను కేంద్ర నాయకత్వంతో చర్చించిన అనంతరం ప్రకటిస్తామని ఫడ్నవిస్ తెలిపారు. -
వీడని ప్రతిష్టంభన: బీజేపీకి సేన సవాల్!
సాక్షి, ముంబై: ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ-శివసేన మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సీఎం పీఠంపై పట్టు వీడేదిలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇదివరకే ప్రకటించగా.. తాజాగా బీజేపీ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. దీంతో ముంబై రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. ఈనెల 8న అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో.. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో గురువారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న వార్తలను ఖండించారు. బీజేపీకి సరైన సభ్యుల బలం ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సవాలు విసిరారు. బీజేపీ ఎన్ని ఎత్తుగడలు వేసినా.. రాష్ట్రానికి తదుపరి సీఎం శివసేన నుంచే ఎన్నికవుతారని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. శివసేన నాయకుడు సీఎం అవ్వడానికి సరిపడ మద్దతు తమకు ఉందని రౌత్ మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజ్యాంగం కేవలం బీజేపీ నేతల కోసం కాదని, ప్రజల హక్కుల కోసమని చురకలంటించారు. అలాగే బీజేపీ నుంచి చర్చల ప్రతిపాదన ఏదీ తమ ముందుకు రాలేదని అన్నారు. బీజేపీలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా వద్ద అన్న అంశంపై పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తుది నిర్ణయం తీసుకుంటారని రౌత్ తెలిపారు. అలాగే బీజేపీతో తాడే పేడో చేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. తమ పార్టీ సిద్ధాంతం ప్రకారమే నడుచుకుంటున్నామని, ధర్మానికి తాము కట్టుబడి ఉన్నామని రౌత్ అన్నారు. బీజేపీని చర్చలకు ఒప్పించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో తాము ఎలాంటి ప్రతిపాదనలు జరపలేదని పేర్కొన్నారు. -
...అయిననూ అస్పష్టతే!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రోజంతా ఎవరికి వారు సమావేశాలు జరిపినా ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టతలేదు. అధికారాన్ని పంచుకోవడంలో బీజేపీ, శివసేన మధ్య రేగిన సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదు. శివసైనికులు మహారాష్ట్ర గవర్నర్‌ను కలిస్తే, ముఖ్యమంత్రి∙ఫడ్నవీస్ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ఈ అధికార పోరాటంలో అవసరమైతే శివసేనకు మద్దతునివ్వాలని భావించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాము ప్రజాతీర్పుకనుగుణంగా ప్రతిపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేశారు. సేనకు మద్దతునిచ్చే అంశంలో ఎవరూ తమను సంప్రదించలేదని, తమకు సంఖ్యా బలం లేదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బీజేపీ, శివసేన తమ తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గవర్నర్‌ని కలిసిన శివసైనికులు శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, ఇతర నేతలతో కలిసి సోమవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ కోష్యారీని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే తాము గవర్నర్‌ని కలిశామన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభనకు తాము కారణం కాదని గవర్నర్‌కు చెప్పామని సంజయ్ వెల్లడించారు. అమిత్ షాతో ఫడ్నవీస్ మంతనాలు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి తొందర లేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి మహారాష్ట్రలో ఏర్పడిన ప్రతిష్టంభనపై చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం లేదు. నేను కచ్చితంగా చెబుతున్నా. ప్రభుత్వమైతే ఏర్పాటవుతుంది’అని చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ను ఫడ్నవీస్ కలుసుకున్నారు. రౌత్ ఒక భేతాళుడు: మరాఠీ పత్రిక హేళన మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సంక్షోభానికి శివసేన నేత సంజయ్ రౌత్ కారణమనే ఉద్దేశంతో ఆయనను ఒక మరాఠీ పత్రిక భేతాళుడిగా చిత్రీకరించింది. ఆరెస్సెస్‌కు మద్దతుగా నిలిచే తరుణ్ భారత్‌లో రాసిన ఒక వ్యాసంలో విక్రమార్కుడి భుజంపై వేళ్లాడే భేతాళుడు సంజయ్ అని, బీజేపీ–శివసేన అధికారంలోకి రాకుండా ఆయన అడ్డుకుంటున్నారని తిట్టిపోసింది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో అత్యంత కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు ముందన్న నేపథ్యంలో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు జరగడం అత్యంత ముఖ్యమని పేర్కొంది. గడ్కరీ మధ్యవర్తిత్వం ? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రంగంలోకి దింపితే బీజేపీ, శివసేన మధ్య నెలకొన్న సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తారని శివసేన పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు సలహాదారుడైన కిషోర్ తివారీ సోమవారం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఒక లేఖ రాశారు. గడ్కరీని శివసేనతోచర్చలకు పంపాలని అన్నారు. -
మాకు 170 మంది మద్దతుంది
సాక్షి ముంబై/ఔరంగాబాద్: ముఖ్యమంత్రి పీఠంపై రాజీపడేది లేదని శివసేన మరోసారి స్పష్టం చేసింది. తమకు 170 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ఒప్పందం శివసేనతో జరగలేదంటూ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాటమార్చడం వల్లనే బీజేపీతో చర్చలను నిలిపి వేశామన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిని తాము వదిలేది లేదన్నారు. శివసేన అధికార పగ్గాలు చేపట్టేదీ లేనిదీ తొందరలోనే ప్రజలు తెలుసుకుంటారని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. అంతకు మించి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆదివారం ఆయన ఔరంగాబాద్‌లో మాట్లాడారు. నేడు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ‘మహా’డ్రామా కొలిక్కివస్తుందని అంచనావేస్తున్నారు. పవార్ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో, ఫడ్నవీస్ బీజేపీ చీఫ్ అమిత్‌షాతో భేటీకానున్నారు. దీంతో అందరి దృష్టీ దేశ రాజధానిపై ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న ఐదు ప్రత్యామ్నాయాలను సామ్నా పత్రికలో రౌత్ వివరించారు. ► శివసేనను తప్పించి అతిపెద్దపార్టీగా ఆవిర్భవించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావచ్చు. బీజేపీ వద్ద 105 మంది ఎమ్మెల్యేలుండగా మ్యాజిక్ ఫిగర్ కోసం 40 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. దీంతో బలనిరూపణ సమయంలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ► 2014 ఎన్నికల్లో మాదిరిగా బీజేపీకి ఎన్సీపీ మద్దతు ప్రకటించేందుకు అవకాశం ఉంది. ఇలా జరిగితే సుప్రియా సూలేకు కేంద్రంలో, అజిత్ పవార్‌కు రాష్ట్రంలో మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి. కాని, అలాంటి అవకాశమే లేదని స్వయంగా శరద్ పవార్ చెబుతున్నారు. ► బీజేపీ విశ్వాస పరీక్షలో నెగ్గకుంటే రెండో పెద్ద పార్టీగా శివసేన అధికారం కోసం ముందుకువచ్చే అవకాశాలున్నాయి. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 ఎమ్మెల్యేలతోపాటు ఇతరుల సాయంతో అవసరానికి మించి 170 వరకు సంఖ్యాబలం చేరవచ్చు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది. కానీ, మూడు వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీలతో ముందుకెళ్లడం అసాధ్యం. ► బీజేపీ, శివసేన పంతం మాని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యంగా శివసేన డిమాండ్లపై బీజేపీ ఆలోచించాల్సి ఉంది. సీఎం పదవిని విభజించాల్సి రావచ్చు. ఇది అత్యంత ఉత్తమ ప్రత్యామ్నాయం. ► అధికారాన్ని వాడుకుని, ప్రలోభాలకు గురి చేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అయితే, ఫడ్నవీస్‌కు ప్రస్తుతం అదేమంత సులభం కాదని చెప్పవచ్చు. -
5న మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్..
సాక్షి, న్యూఢిల్లీ : అధికార పంపంకంపై బీజేపీ-శివసేనల మధ్య ప్రతిష్టంభన ఓవైపు కొనసాగుతుండగానే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఈనెల 5న పదవీ స్వీకార ప్రమాణం చేస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో బీజేపీ సొంతగానే ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేపట్టిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫడ్నవీస్ మహారాష్ట్ర నూతన సీఎంగా ఈ నెల 5 లేదా 6న ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. కూటమి నుంచి శివసేన తప్పుకున్నా తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు ప్రసాద్ లద్, చంద్రకాంత్ పాటిల్‌లకు అప్పగించారు. మరోవైపు తాము ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాకు కట్టుబడి ఉన్నామని, సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలనే డిమాండ్‌ను శివసేన నేత సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా అంటే ఏంటి..? సీఎం పదవి దీని పరిధిలోకి రాదా అని ఆయన ప్రశ్నించారు. శివసేన కోరుకుంటే రాష్ట్రంలో సుస్ధిర ప్రభుత్వం అందించేందుకు అవసరమైన సంఖ్యా బలం తాము సాధిస్తామని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్ధానాల్లో గెలుపొంది ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56 స్ధానాల్లో గెలుపొందగా, విపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలు వరుసగా 44, 54 స్ధానాలు దక్కించుకున్నాయి. 288 స్ధానాలు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 146 స్ధానాలతో కూడిన మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి సొంతంగా లభించలేదు. -
50:50 ఫార్ములా?
ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన అధికారాన్ని చెరి సగం పంచుకుంటాయా? ఫడ్నవీస్ రెండున్నరేళ్లు పాలించిన తర్వాత శివసేన తరఫున సీఎం కుర్చీపై ఠాక్రే వారసుడు ఆదిత్య ఠాక్రే కూర్చుంటారా? ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఈ సారి ఎన్నికలకు ముందే బీజేపీ, శివసేన కూటమిగా ఏర్పడ్డాయి కానీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే బీజేపీ 20కి పైగా స్థానాలను కోల్పోయింది. ఇక శివసేన తన స్థానాలను ఇంచుమించుగా నిలబెట్టుకోవడంతో ఆ పార్టీ స్వరం పెంచింది. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ తాజా ఫలితాల్లో బీజేపీ 103 సీట్లలో, శివసేన 56 సీట్లలో విజయం సాధించాయి. సాధించిన సీట్లను బట్టి అవసరమైతే శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ భావించింది. కానీ సేన తన దారి మార్చుకొని ఏకంగా సీఎం పీఠంపైనే కన్నేసింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన అధికారాన్ని సగం సగం పంచుకోవాలని ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకున్నప్పుడే నిర్ణయించుకున్నాయని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పేర్కొనటం ఈ సందర్భంగా గమనార్హం. రొటేషన్ పద్ధతిలో సీఎం పీఠాన్ని పంచుకోవాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మధ్య అవగాహన ఉన్నట్లు సంజయ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా చెప్పారు. ‘కూటమి ఏర్పాటు సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మా ఇంటికి వచ్చారు. అప్పుడు జరిగిన చర్చల్లో అధికారం సమానంగా పంచుకోవాలనే 50– 50 ఫార్ములాకు ఆయన అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను’ అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ‘సీట్ల సర్దుబాటు సమయంలో బీజేపీ కన్నా తక్కువ సీట్లలో పోటీకి అంగీకరించాం. కానీ ప్రతీసారీ అలా బీజేపీకి అవకాశం ఇవ్వలేం. మా పార్టీ కూడా విస్తరించాలి కదా’ అన్నారు. అయితే ఫడ్నవీస్ మాత్రం దీనికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. 15 మంది రెబెల్స్ తమతో టచ్‌లో ఉన్నారని అందుకే తమ సంఖ్య తగ్గే అవకాశం లేదని అన్నారాయన. వీలుకాకుంటే కాంగ్రెస్‌తో దోస్తీ? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ 122 స్థానాలు గెలుచుకోవడంతో ఎన్నికల అనంతరం శివసేన మద్దతు ఇచ్చినప్పటికీ కమలదళమే పెద్దన్న పాత్రని పోషించింది. కానీ ఈ సారి ఆ పరిస్థితి లేదు. బీజేపీ కాదంటే కాంగ్రెస్ – ఎన్సీపీతో కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశం కూడా శివసేనకు ఉంది. అందుకే బీజేపీని అభ్యర్థిస్తున్నట్లు కాకుండా డిమాండ్ చేస్తున్నట్టుగా శివసేన నేతలు మాట్లాడుతున్నారు. -
‘మహా’నేత ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు (49) అసంతృప్తి లేనప్పటికీ... పూర్తి సంతృప్తిగా లేరని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 122 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో 102 స్థానాలకే పరిమితమైంది. కాకపోతే మిత్రపక్షం శివసేనతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం బీజేపీకి లభించింది. నాగపూర్ సౌత్‌వెస్టు స్థానం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ గెలుపొందారు. మహారాష్ట్రలో రెండోసారి గెలిచిన తొలి కాంగ్రెసేతేర ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సాధించారు. రాష్ట్రంలో పూర్తికాలం పదవిలో కొనసాగిన రెండో ముఖ్యమంత్రి కూడా ఆయనే!!. కలిసొచ్చిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో (ఆర్ఎస్ఎస్) సన్నిహిత సంబంధాలున్న కుటుంబంలో 1970 జూలై 22న జన్మించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ ఫడ్నవీస్ స్వస్థలం. ఆయన తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. దాంతో సహజంగానే దేవేంద్ర కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారు. నాగపూర్ యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చదివారు. 1990వ దశకంలో రాజకీయాల్లో ప్రవేశించారు. 1992, 1997లో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు. నాగపూర్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మేయర్‌గా రికార్డు సృష్టించారు. 1999, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ సౌత్‌వెస్టు స్థానం నుంచి నెగ్గారు. ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధాలు ఆయన రాజకీయ ఎదుగుదలకు తోడ్పడ్డాయి. 2014లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ఐదేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పదవిలో కొనసాగారు. అనేక సవాళ్లను చాకచక్యంగా ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ దేవేంద్ర ఫడ్నవీస్ సొంతం. ఫడ్నవీస్ భార్య అమృత బ్యాంకర్‌గా పనిచేస్తున్నారు. -
‘సీఎం పీఠంపై వివాదం లేదు’
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-శివసేన కూటమి అధికారంలోకి వస్తే తదుపరి ప్రభుత్వానికి శివసేన నేతే సారథ్యం వహిస్తారని శివసేన ప్రకటించిన క్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే దానిపై ఎలాంటి వివాదం లేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. సీఎం పదవి కోసం భాగస్వామ్య పక్షం శివసేన ఆకాంక్షలపై ఆయన వ్యాఖ్యానిస్తూ దీనిపై తాను కలత చెందడం లేదని, ప్రస్తుతం ఈ అంశంపై కూటమిలో ఎలాంటి వివాదం లేదని అన్నారు. కాగా మహారాష్ట్ర సీఎంగా శివసేన నేత పాలనా పగ్గాలు చేపడతారని సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సహా ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సైతం పదేపదే పేర్కొనడం గమనార్హం. మరోవైపు సీఎం రేసులో ఆదిత్య ఠాక్రే ఉంటారనే ప్రచారం సాగుతోంది. ఇక అక్టోబర్ 21న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 24న వెల్లడికానున్నాయి. -
47 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన సీఎం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సరికొత్త రికార్డు సృష్టించారు. గత 47 ఏళ్లలో ఐదేళ్ల పూర్తి కాలంపాటు పదవిలో కొనసాగిన ఏకైక సీఎంగా చరిత్రలో నిలిచారు. చివరిగా జరిగిన 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, మిత్రపక్షం శివసేనతో కూటమి ఏర్పాటు చేసి ఫడ్నవిస్ సీఎంగా తొలిసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఆ స్థానంలో కొనసాగుతున్నారు. దీంతో గడిచిన 47 ఏళ్ల తరువాత పూర్తి కాలంపాటు సీఎం పదవిలో కొనసాగిన తొలి వ్యక్తిగా ఫడ్నవిస్ నిలిచారు. కాగా ఈ ఘనత సాధించిన రెండవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిసే కావడం విశేషం. ఈయన కంటే ముందు వసంత రావునాయక్ మాత్రమే పూర్తి కాలం పాటు సీఎంగా రాష్టానికి సేవలు అందించారు. 1962లో మొదటిసారి ముఖ్యమంత్రిగాఎన్నికైన ఈయన 1967 నుంచి 1972 వరకు 11 ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. అయితే 1960లో బాంబే స్టేట్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ విడిపోయిన విషయం తెలిసిందే. ఈ 60 ఏళ్ల కాలంలో మహారాష్ట్రకు 26 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. వీరిలో నేషనల్ కాంగ్రెస్ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవర్ అత్యధికంగా నాలుగుసార్లు సీఎంగా పనిచేశారు. వసంతరావు నాయక్, వసంతదాదా మూడు సార్లు.. శంకర్రావు, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ రెండు సార్లు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2014 వరకు వరుసగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, నారాయణ్ రాణే, సుశిల్ కుమార్ షిండే, అశోక్ చవాన్, పృద్వీరాజ్ చౌహన్లు పదవీ బాధ్యతలు చేపట్టినా వీరిలో ఏ ఒక్కరూ పూర్తి కాలం పదవిలో లేరు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీకి తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే మరోసారి కూడా తానే సీఎంగా బాధ్యతలు స్పీకరిస్తానని ఫడ్నవిస్ ఇప్పటికే స్పష్టంచేశారు. -
21వ శతాబ్దపు నగరాలు నిర్మిద్దాం
ముంబై/ఔరంగాబాద్: 21వ శతాబ్దపు ప్రపంచానికి తగ్గట్లు మన నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని ప్రధాని మోదీ తెలిపారు. అదే సమయంలో భారతీయ నగరాల్లో భద్రత, అనుసంధానత, ఉత్పాదకత విషయంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేందుకు వీలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. దేశ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ఆయన ప్రకటించారు. లేదంటే రాబోయే ఐదేళ్లలో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం పగటి కలలాగే మిగిలిపోతుందని హెచ్చరించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం మహారాష్ట్రకు చేరుకున్న ప్రధాని మోదీ, ముంబైలో రూ.19,080 కోట్ల విలువైన మూడు మెట్రోలైన్ పనులతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సమగ్రాభివృద్ధిపై దృష్టి.. ‘గత ఐదేళ్లకాలంలో ముంబై నగరంలో మౌలిక ప్రాజెక్టులపై మేం రూ.1.5 లక్షల కోట్లను వెచ్చించాం. కేవలం ముంబైనే కాకుండా దేశంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం మనం సొంతంగా మెట్రో రైలు కోచ్‌లను రూపొందిస్తున్నాం. మౌలికవసతుల అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా భారీగా ఉపాధి కల్పన జరుగుతోంది. చిన్న పట్టణాల్లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టుల కారణంగా ఎక్కువమందికి జీవనోపాధి దొరుకుతోంది. గతంలో ఇంతవేగంగా ప్రాజెక్టు నిర్మాణం ఎన్నడూ జరగలేదు కాబట్టి ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదు’ అని మోదీ వెల్లడించారు. ముంబై మెట్రో కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు ఏటా 2.5 కోట్ల టన్నులమేర తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా ‘ఒకేదేశం–ఒకే కార్డు’ వ్యవస్థ కోసం ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ సంస్థ తయారుచేసిన 500 మెట్రో కోచ్‌లను ప్రధాని ఆవిష్కరించారు. గణేశ్ ఆలయంలో పూజలు అంతకుముందు ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా విలే పార్లేలోని గణేశ్ ఆలయానికి చేరుకున్న మోదీ, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం లోక్మాన్య సేవాసంఘ్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య తిలక్‌కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఔరంగాబాద్‌లో మహిళా స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ)ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీఇంటికి తాగునీరు అందించేందుకు ‘జల్ జీవన్ మిషన్’ కింద రాబోయే 5 సంవత్సరాల్లో రూ.3.5 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నాం. మహిళలకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్న రామ్మనోహర్ లోహియా కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. ముద్రా పథకం కింద ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.లక్ష చొప్పున రుణాలు ఇస్తున్నాం’’ అని మోదీ తెలిపారు. ముద్రా పథకం కింద ఇప్పటివరకూ 14 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ పట్టణం, 10,000 ఎకరాల్లో విస్తరించిన ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీని మోదీ ఆవిష్కరించారు. -
‘కాళేశ్వరం’ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
సాక్షి, కరీంనగర్ : దేశ సాగునీటి రంగ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో అనతి కాలంలోనే పూర్తయిన బృహత్తర బహుళార్ధక సాధక కాళేశ్వర ఎత్తిపోతల పథకం నేటి నుంచి జాతికి అంకితం కానుంది. భగీరథుడు గంగను దివి నుంచి భువికి దించితే... నేటి భగీరథ యత్నం తెలుగు గంగను నేల నుంచి నింగికి ఎత్తే సరికొత్త చరిత్రను సృష్టించనుంది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి నేడు సర్వం సిద్దమైంది. మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను ముగ్గురు సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకల్లా గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ జరిగే హోమంలో కేసీఆర్‌తోపాటు పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ముగ్గురు సీఎంలు, ఇద్దరు గవర్నర్ల రాకతో కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిసరప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.మీడియాకు సైతం అనుమతి లేదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని బ్యారేజీలు, పంప్‌హౌస్‌లను ఇతర మంత్రులు ప్రారంభించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీని మంత్రి నిరంజన్ రెడ్డి, అన్నారం పంప్‌హౌస్‌ను హోం మంత్రి మహ్మద్ అలీ, పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం గోలివాడ వద్ద సుందిళ్ల పంప్‌హౌస్‌ను మంత్రి మల్లారెడ్డి, కరీంనగర్ జిల్లా రామడగు మండలం లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌ను మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా సిరిసిల్లలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సంబరాలు జరుగనున్నాయి. -
సీఎల్పీ మాజీనేతకి మంత్రిపదవి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కాంగ్రెస్ మాజీ నేత విఖే రాథాకృష్ణ పాటిల్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. కాంగ్రెస్ శానససభా పక్ష నేతగా మొన్నటివరకూ వ్యవహరించిన విఖే పాటిల్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఫడ్నవిస్ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పాటిల్‌తో పాటు ఆశిష్ షెలార్ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 13 మంది మంత్రులకు ఫడ్నవిస్ అవకాశం కల్పించగా.. వారిలో 10 మంది బీజేపీ ఇద్దరు శివసేన ఒకరు ఆర్పీఐ నుంచి ప్రాతినిథ్యం పొందారు. పదిమంది బీజేపీ మంత్రుల్లో ఆరుగురికి కేబినెట్ హోదా, నలుగురికి సహాయ మంత్రుల హోదా ఇచ్చారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో కొత్త మంత్రులందరి చేత గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫడ్నవిస్ తన కేబినెట్‌ను విస్తరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ముందు జరుగనున్న ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలే ఆసారికి చివరి సమావేశాలు కానున్నాయి. -
మహా మంత్రివర్గంపై కీలక భేటీ
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో మంత్రివర్గం విస్తరణ ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన నేతలు పదవుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో శనివారం భేటీ అయ్యారు. ఠాక్రే నివాసమైన మాతాశ్రీలో సమావేశమైన ఇరువురు నేతలు మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే కేంద్ర మంత్రి మండలిలో కేవలం ఒకే కేబినేట్ పదవి దక్కడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న శివసేన.. రాష్ట్రంలో తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. కాగా మంత్రిమండలి తాజా విస్తరణలో భాగంగా శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై కూడా వారి మధ్య ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే శివసేనతో పాటు ఎన్డీయే మిత్రపక్షాలకు ఈసారి కేబినేట్లో బెర్తు దక్కే అవకాశం ఉంది. ఇటీవల ఫడ్నవిస్ మాట్లాడుతూ.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగే మంత్రివర్గ విస్తరణలో మిత్రపక్షాలన్నింటికీ అవకాశం కల్పిస్తామని తెలిపారు. దీంతో పదవులు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై ఫడ్నవిస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదిలావుండగా.. శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మంత్రివర్గంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తమకు సీఎం పదవి కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఇప్పటి వరకూ స్పందించలేదు. -
ఉత్కంఠ పోరు: మహబలి ఎవరు
యూపీ తర్వాత ఎక్కువ లోక్‌సభ సీట్లున్న కీలక రాష్ట్రం మహారాష్ట్ర. కాంగ్రెస్‌కు బలమైన పునాదులున్న ఈ రాష్ట్రంలో చాలా ఆలస్యంగా 1995లో శివసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి తిరిగి అధికారం చేజిక్కించుకుంది. పదిహేనేళ్ల ఈ కూటమి పాలన ముగిశాక 2014 అక్టోబర్‌లో కాషాయ కూటమి అధికారంలోకి వచ్చింది. 1996 పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి శివసేన–బీజేపీ కూటమి అత్యధిక సీట్లు (33) కైవసం చేసుకుంది. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రెండుసార్లు యూపీఏ, రెండు సార్లు ఎన్డీఏ మెజారిటీ సీట్లు గెలుచుకున్నాయి. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ–శివసేన, స్వాభిమాని పక్ష కూటమి 42 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి ఆరు సీట్లే దక్కించుకుంది. అదే ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో విభేదాల కారణంగా కాషాయపక్షాలు రెండూ విడివిడిగా పోటీచేశాయి. మెజారిటీ రాకున్నా అత్యధిక సీట్లు (122) సాధించిన బీజేపీ దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. 66 సీట్లతో రెండో స్థానం సంపాదించిన శివసేన రెండు నెలల తర్వాత ప్రభుత్వంలో చేరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న శివసేన గత నాలుగేళ్లుగా బీజేపీ, నరేంద్రమోదీ విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ చీకాకు పెడుతూనే ఉంది. చివరికి లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదలకు కొన్ని రోజుల ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చొరవతో శివసేనతో సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. మొత్తం 48 సీట్లలో బీజేపీ 25, శివసేన 23 సీట్లకు కలిసి పోటీచేస్తున్నాయి. యూపీఏ కూటమిలో కాంగ్రెస్ 26 సీట్లకు, ఎన్సీపీ 22 సీట్లకు పోటీచేయడానికి ఒప్పందం కుదిరింది. తమ కూటమిలోకి రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)ను కూడా చేర్చుకోవాలని కాంగ్రెస్‌పై ఎన్సీపీ నేత శరద్ పవార్ ఒత్తిడి తెచ్చారు. కాంగ్రెస్ అందుకు అంగీకరించలేదు. కాషాయ కూటమికే అత్యధిక సీట్లు? కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు, రాష్ట్రంలో ఫడణవీస్ నాయకత్వంలోని బీజేపీ–సేన సంకీర్ణ ప్రభుత్వం పనితీరుపై జనంలో వ్యతిరేకత పెరగకపోతే కాంగ్రెస్–ఎన్సీపీ కూటమికి లోక్‌సభలో ఎక్కువ సీట్లు దక్కే అవకాశాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు కాబట్టి ఇంకా తగ్గని మోదీ జనాకర్షణ శక్తి, పుల్వామా దాడి అనంతర పరిణామాల ప్రభావం వల్ల కాషాయ కూటమికే పాతిక సీట్లు దక్కే వీలుందని రాజకీయ పరిశీలకుల అంచనా. ఇటీవల అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చెందిన ప్రతిపక్షనేత రాధాకృష్ణ విఖే పాటిల్ కుమారుడు సుజయ్ విఖే పాటిల్ వంటి నేతలు బీజేపీలోకి ఫిరాయించడం కూడా కాంగ్రెస్ కూటమికి పెద్ద దెబ్బగా పరగణించవచ్చు. అహ్మద్‌నగర్‌లో బీజేపీ టికెట్‌పై పోటీచేసే తన కొడుకు సుజయ్‌కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేయబోనని కూడా రాధాకృష్ణ ప్రకటించారు. బీజేపీకి దూరమైన రాజూ షెట్టి పార్టీ కిందటి ఎన్నికల్లో కాషాయ కూటమితో కలిసి పోటీచేసి గెలిచిన షేట్కారీ స్వాభిమానీ సంఘటన్ నేత రాజూ షెట్టి ఎన్డీఏకు దూరమయ్యారు. రైతాంగంలో మంచి బలమున్న ఈ పార్టీ ఎన్డీఏలో ఉంటే బీజేపీకి ప్రయోజనం ఉండేది. ఒంటరిగా పోటీచేస్తున్న షెట్టికి హట్కంగ్లే స్థానంలో మద్దతు ఇస్తామని శరద్‌పవార్ ప్రకటించారు. బీజేపీ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికైన మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష నేత, మాజీ సీఎం నారాయణ్ రాణే కూడా తమకు సీట్లు కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. కేంద్రమంత్రి, ఆర్పీఐ నాయకుడు రాందాస్ అఠావలే కూడా తమను సీట్ల సర్దుబాటు చర్చలకు పిలవలేదని ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఎంఐఎంతో పొత్తు ఉన్న భారిప బహుజన్ మహాసంఘ్ నేత, బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌తో సీట్ల సర్దుబాటుకు కాంగ్రెస్ జరిపిన చర్చలు ముందుకు సాగలేదు. ఫలితంగా రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో చతుర్ముఖ పోటీ తప్పదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఫడ్నవిస్ కేబినెట్లోని పంకజా ముండే వంటి కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలతో పాటు వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం వంటి సమస్యలు పాలక కూటమిని ఎన్నికల్లో ఇబ్బంది పెట్టే అంశాలు. మహారాష్ట్ర నుంచి రాజధాని ముంబైకి ప్రదర్శనతో వచ్చిన వేలాది మంది కరువు ప్రాంత డిమాండ్లకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు తొలగిపోలేదు. కిందటేడాది భండారా–గోండియా లోక్‌సభ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి రైతుల ఆగ్రహానికి అద్దంపట్టింది. అంతేగాక ఈ ఉప ఎన్నికల్లో భాగస్వామ్యపక్షం శివసేనతో పొత్తు కుదరలేదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రెండు కాషాయపక్షాలూ పరస్పర సహకారంతో పనిచేస్తే తప్ప రాష్ట్రంలో అవి కిందటి ఎన్నికల్లో మాదిరిగా అత్యధిక సీట్లు గెలుచుకోవడం కష్టమే. దేవేంద్ర ఫడణవీస్: ఫరవాలేదా? 44 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయిన ఫడణవీస్ నాగపూర్‌కు చెందిన ఆరెసెస్ మూలాలున్న బీజేపీ నేత. నగర మేయర్‌గా, నాలుగుసార్లు నగర శాసనసభ్యునిగా పనిచేశారు. సాధారణంగా వ్యవసాయ సామాజికవర్గమైన మరాఠా నేతలకే రాష్ట్రంలో సీఎం పదవి ఎక్కువసార్లు కట్టబెట్టడం ఆనవాయితీ. ఈ సంప్రదాయనికి భిన్నంగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఫడణవీస్‌కు సీఎం పీఠం దక్కడం మోదీ–అమిత్ షా ద్వయం నిర్ణయంతోనే సాధ్యమైంది. సంఖ్యాబలం లేని సామాజికవర్గానికి చెందినప్పటికీ ఆరెసెస్ మద్దతు, పార్టీ కేంద్ర నాయకత్వం సహకారంతో రాష్ట్రంలో పరిపాలన ఫరవాలేదనిపించేలా ఆయన చేయగలిగారు. పార్లమెంటు ఎన్నికల్లో పాలక కూటమికి కనీసం సగం సీట్లయినా రాకపోతే ఆయన పదవికి ఇబ్బందే. పవార్: తెస్తారా పవర్? రాజకీయంగా, ఆర్థికంగా ఇంకా అన్ని విధాలా బలవంతుడైన మరాఠా నేతగా దేశ ప్రజలందరికీ సుపరిచితుడు శరద్ పవార్. 37 ఏళ్ల వయసులోనే ఆయన తన పార్టీని (కాంగ్రెస్–ఎస్) చీల్చి జనతా పార్టీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరి మరో రెండుసార్లు సీఎం అయ్యారు. 1991 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని పదవి కోసం ఆయన పీవీతో పోటీపడినా వెనక్కి తగ్గక తప్పలేదు. ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయమంత్రిగా పాలనా సామర్ధ్యం ఉన్న నేతగా నిరూపించుకున్నారు. 1999లో కాంగ్రెస్ నాయకురాలు సోనియా విదేశీ మూలాల సమస్య లేవనెత్తి ఎన్సీపీ స్థాపించారు. మరాఠాలు, సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్న పశ్చిమ మహారాష్ట్రలో పవార్ పలుకుబడి ఎక్కువ. రాష్ట్రంలో తన పార్టీని దాదాపు పది సీట్లలో గెలిపించే సామర్థ్యం పవార్‌కు ఉంది. నితిన్ గడ్కరీ: పనిచేసేనా పలుకుబడి? పరిపాలనాదక్షునిగా మంచి పేరు సంపాదించిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటనలు చేసే బీజేపీ నేతగా తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. బీజేపీకి రాబోయే ఎన్నికల్లో మెజారిటీ రాకుంటే అన్ని పక్షాలతో సత్సంబంధాలున్న గడ్కరీకే కేంద్రంలో సంకీర్ణ సర్కారును నడిపే అవకాశమిస్తారనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఫడ్నవిస్ మాదిరిగానే నాగపూర్‌కు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షునిగా మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉంది. విదర్భ ప్రాంతంలో బీజేపీ–సేన కూటమి విజయానికి గడ్కరీ పలుకుబడి కొంత వరకు ఉపయోగపడుతుంది. -
‘రాహుల్ గాంధీ పార్ట్ టైం లీడర్’
భోపాల్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్ట్ టైం లీడర్ అని, ఆయనకు ప్రజల సమస్యల పట్ల కనీస అవగహన కూడా లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లోని సియోనీ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే రాహుల్ బహిరంగ సభలు నిర్వహిస్తుంటారని, ఆయన స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ సమయం గడుపుతారని వ్యాఖ్యానించారు. స్వదేశానికి వచ్చినప్పుడల్లా రెండు, మూడు సభలు నిర్వహించిన పోతారని అన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల సమస్యలు రాహుల్‌కు తెలియవని, ఎన్నికల సమయంలోనే ఆయన ఈ ప్రాంతాలకు వస్తుంటారని విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్లు ప్రజా నేతలని అన్నారు. అధికారం కోసమే అమలుకు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిందని, చౌహాన్‌కు ప్రజల మద్దతు ఉన్నందును గత 15 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారని గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గరీభీ హఠావో నినాదం ఒక బూటకమని మండిపడ్డారు. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పేదరికాన్ని మరింత పెంచిందని విమర్శించారు. కాగా మధ్యప్రదేశ్‌లో తొలి విడత ఎన్నికల ఈనెల 28న జరుగునున్న విషయం తెలిసిందే. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో బీజేపీ జాతీయ నేతలతో సహా, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరుకు మధ్యప్రదేశ్ వేదికగా నిలిచింది. నేతల మాటల తూటలతో రాజకీయం మరింత వేడుక్కుతోంది. కాగా గత మూడు విడుతలుగా బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకుంటుండగా.. ఈ సారి విజయం కోసం హస్తం నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
ఉద్ధవ్‌తో అమిత్ షా భేటీ
ముంబై: బీజేపీ, శివసేన మధ్య వైరుధ్యాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో బుధవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో సమావేశమయ్యారు. ముంబైలోని ఉద్ధవ్ నివాసం మాతోశ్రీలో జరిగిన ఈ భేటీకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలే బీజేపీ ప్రారంభించిన ‘మద్దతు కోసం కలుసుకోవడం’ (సంపర్క్ సే సమర్థన్) కార్యక్రమంలో భాగంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన పార్టీ అధ్యక్షుడితో ఈ భేటీ జరిగింది. అమిత్ షా పర్యటన రోజే బీజేపీపై సామ్నా సంపాదకీయంలో శివసేన విమర్శల దాడి చేసింది. బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్ల తర్వాత ఎన్డీయే పక్షాలను బీజేపీ చీఫ్ కలవాలనుకోవడంలో ఆంతర్యమేంటని అందులో ప్రశ్నించింది. ‘ఇటీ వలి ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది. అందుకే మళ్లీ మిత్రపక్షాలను కలవాలని యత్నిస్తోంద’ని పేర్కొంది. సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ముంబై పర్యటనలో సీఎం ఫడ్నవిస్‌తో కలిసి.. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్‌లను జుహూలోని మాధురి నివాసంలో కలిశారు. ఫడ్నవిస్ వద్దు... ఉద్ధవ్: ‘మాతోశ్రీ’కి అమిత్ షా, ఫడ్నవిస్ వచ్చిన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ‘మాతోశ్రీ’లో షా, ఉద్ధవ్ చర్చలకు సిద్ధమవుతుండగా.. ఫడ్నవిస్‌ను ఈ భేటీకి దూరంగా ఉండాలని ఉద్ధవ్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రెండో అంతస్తులో ఇరు పార్టీల అధ్యక్షులు మాట్లాడుతుండగా.. ఫడ్నవిస్ ఒక్కరే మొదటి అంతస్తులో కూర్చున్నారు. అయితే, బుధవారం ఉదయమే అమిత్ షాకు ఉద్ధవ్ సందేశాన్ని పంపించారని.. షా ఒక్కరినే తను కలుస్తానని అందులో పేర్కొన్నారని శివ సేన వర్గాలు వెల్లడించాయి. మొన్నటి మార్చి లో సచివాలయంలో రెండుగంటలపాటు వేచిచూసినా ఫడ్నవిస్ కలవకపోవడం, ఇటీవలి పాల్ఘర్ ప్రచారంలో ఉద్ధవ్, ఫడ్నవిస్ వ్యక్తిగత విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
మహాపాదయాత్రతో కదం తొక్కిన అన్నదాతలు
-
ఎందుకు ‘మహా’ రైతులు కన్నెర్ర చేస్తున్నారు?
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రైతన్నలు రోడ్డెక్కారు. నాసిక్ నుంచి ముంబై వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 12న ముంబైలో అసెంబ్లీ ముట్టడికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నదాతల ఆక్రందనలకు కారణాలేంటి ? ఎందుకు రైతులు ఫడ్నవీస్ సర్కార్‌పై కన్నెర్ర చేస్తున్నారు ? ఏమిటీ మార్చ్ భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో 30 వేల మంది రైతులతో మార్చి 6న నాసిక్‌లో మహా పాదయాత్ర మొదలైంది. మొత్తం 180 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ఆదివారం ముంబై చేరుకుంటుంది. 12న జరగనున్న అసెంబ్లీ ముట్టడిలో 70 వేల మందివరకు రైతులు పాల్గొంటారని అంచనాలున్నాయి. ముంబై ఆగ్రా జాతీయరహదారి మీదుగా ఈ లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. వేలాది మంది రైతులు రోడ్లపైనే తింటున్నారు.. ఎక్కడ కాస్త జాగా కనిపిస్తే అక్కడే నిద్రపోతున్నారు. తమ డిమాండ్లు తీర్చాలంటూ నినదిస్తున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్ల పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. ఎందుకీ పాదయాత్ర ఈ ఏడాది అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచేశాయి. వడగండ్ల వానలు కడగండ్లను మిగిల్చాయి. పింక్ బాల్ వార్మ్ పత్తి రైతుల్ని పీల్చిపిప్పి చేసింది. ఫిబ్రవరిలో కురిసిన వడగళ్లవానలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం 19 జిల్లాల్లో రబీ పంట తుడిచిపెట్టుకుపోయింది. అమరావతి, మరఠ్వాడ, నాగపూర్, నాసిక్ ప్రాంతాల్లో రైతులు దారుణంగా నష్టపోయారు. ఇక మహారాష్ట్రలో గత ఏడాది 84 శాతం వ్యవసాయ భూముల్లో పత్తి పంట సాగు చేశారు. అయితే ఈ పంటకు సోకిన పింక్ బాల్ వార్మ్ కారణంగారైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పుల్లో కూరుకుపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది.. గత ఏడాది మహారాష్ట్ర సర్కార్ 34 వేల కోట్ల రైతు రుణాల మాఫీకి హామీ ఇచ్చింది. కానీ అమలు సరిగా జరగలేదు. దీంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సమస్యల తీరేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. రైతులు చేస్తున్న డిమాండ్లు ఏంటి ? ఫడ్నవీస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి. విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలి. స్వామినాథన్ కమిటీ సిఫారసులన్నీ అమలు చేయాలి కనీస మద్దతు ధరతో రైతులకు ఒదిగేదేమీ లేదు. చట్టబద్ధమైన ధరను కల్పించాలి. అకాల వర్షాలు, పింక్ బాల్ వార్మ్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలి. బుల్లెట్ రైళ్లు, సూపర్‌హైవేలు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పంటభూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలిపివేయాలి. ఆదివాసీలకు అటవీ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలి. నాసిక్, థానే, పాల్ఘడ్ ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదించిన నదుల అనుసంధానం ప్రాజెక్టు కారణంగా ఎన్నో ఆదివాసీ గ్రామాలు నష్టపోతాయి.. అందుకే ఆ రూట్ మ్యాప్‌ను మార్చాలి. ఆగని అన్నదాతల ఆత్మహత్యలు రైతు సమస్యల పరిష్కారానికి గత ఏడాది ప్రభుత్వం రుణ మాఫీని ప్రకటించినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. క్షేత్రస్థాయిలో దీని అమలు జరగలేదు. దీంతో అన్నదాతల ఆత్మహత్యలు ఆగలేదు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 1753 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ, మరఠ్వాడ, నాసిక్ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేసేదంతా చేస్తున్నాం: సర్కార్ మరోవైపు మహారాష్ట్ర సర్కార్ రైతులకు చేయాల్సినదంతా చేస్తున్నామని చెబుతోంది. 35 లక్షల 68 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు 13, 782 కోట్లు నిధులు విడుదల చేశామని చెబుతోంది. అంతేకాదు ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికే అత్యంత ప్రాధాన్యతనిస్తూ 15వేల కోట్ల రూపాయలను కేటాయించారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం నుంచి 2,400 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం కోరింది. . అయితే ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదు. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఫడ్నవిస్‌కు ‘ఓవర్ లోడింగ్’ అంతరాయం
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హెలికాప్టర్ ప్రయాణానికి మరోసారి అంతరాయం కలిగింది. నాసిక్ నుంచి శనివారం ఆయన ఔరంగాబాద్‌కు హెలికాప్టర్లో వెళ్తుండగా పరిమితికి మించి మనుషులు ఎక్కడంతో టేకాఫ్ తీసుకోగానే మళ్లీ కిందకు తీసుకొచ్చి ఒకరిని దింపేశారు. హెలికాప్టర్‌ను ఎందుకు కిందకు దింపారో పోలీసులు చెప్పనప్పటికీ...ఒక మనిషిని, కొంత సామగ్రిని దించేయడాన్ని బట్టి చూస్తుంటే పరిమితికి మించిన బరువు హెలికాప్టర్లో ఉన్నందునే ఇలా జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ‘హెలికాప్టర్ నిర్దేశిత ఎత్తుకు ఎగరలేకపోవడంతో కొంత లగేజిని దించేశాం. సీఎం పర్యటనకు ఇబ్బంది లేదు’ అని ఒక అధికారి చెప్పారు.∙మే నెలలో రెండుసార్లు, జూలైలో ఒకసారి ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లు వివిధ కారణాలతో స్వల్ప ప్రమాదాలకు గురైనా ఆయన క్షేమంగా బయటపడ్డారు . -
మృత్యుంజయ ముఖ్యమంత్రి
మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌కు తప్పిన ముప్పు ► ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ ► విద్యుత్ తీగలకు తగిలి గుడిసెపై కూలిపోయిన చాపర్ ► లాతూర్ జిల్లాలోని నీలాంగ పట్టణంలో ఘటన ► ఫడ్నవీస్ సహా ఆరుగురూ సురక్షితం సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. లాతూర్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి ఫడ్నవిస్‌లో పాటు హెలికాప్టర్లో ఉన్న ఆరుగురూ సురక్షితంగా బయటపడ్డారు. రైతుల కోసం బీజేపీ చేపట్టిన ‘శివార్ సంవాద్ సభ’ కార్యక్రమంలో భాగంగా ఫడ్నవిస్ గురువారం లాతూర్ జిల్లాలోని నీలాంగ పట్టణానికి వచ్చారు. కార్యక్రమం ముగించుకుని 11.45 గంటలకు ముంబైకి బయలుదేరేందుకు హెలికాప్టర్లో కూర్చున్నారు. 11.58 నిమిషాలకు హెలికా ప్టర్ టేకాఫ్ అయ్యింది. టేకాఫ్ అయిన 50 సెకన్లలోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు యత్నించా రు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న విద్యుత్ వైరుకు హెలికాప్టర్ బ్లేడ్లు తగిలి మంటలు లేచాయి. ఏం జరిగిందో తెలుసు కునేలోపే 50–60 అడుగుల ఎత్తు నుంచి దూసుకొచ్చిన చాపర్.. ఓ రేకుల గుడిసె, ఆ పక్కనే ఉన్న ట్రక్కుపై కూలింది. ఈ ఘటనలో గుడిసెలో ఉన్న ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. హెలికాప్టర్లో ఉన్నవారం తా క్షేమంగా బయటపడ్డారు. హెలికాప్టర్ ఎక్కువ ఎత్తులో లేకపోవడంతో పెను ప్రమా దం తప్పింది. ఈ ఘటనలో హెలికాప్టర్ దెబ్బతిందని డీజీసీఏ అధికారులు తెలిపారు. దీనిపై పౌరవిమాన యాన శాఖ అధీనంలోని విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఐబీ) విచారణ చేపట్టనుంది. దేశంలో జరిగే విమాన ప్రమాదాలు, తీవ్ర ఘటనలకు సంబంధించిన కేసులను ఏఐబీ దర్యాప్తు చేస్తుంది. ప్రమాదంపై ఫడ్నవిస్ ట్వీట్..: ‘‘మేము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాతూర్‌లో ప్రమాదానికి గురైంది. నేను.. మా బృందం సురక్షితంగా ఉన్నాం. ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని సీఎం ఫడ్నవిస్ ప్రమాదం అనంతరం ట్వీటర్లో పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి రోడ్డు మార్గంలో లాతూర్కు చేరుకున్న ఫడ్నవిస్ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. ప్రమాద సమయంలో విమానంలో ఫడ్నవిస్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ పర్దేశీ, వ్యక్తిగత సహాయకుడు అభిమన్యు పవార్, మీడియా సలహాదారు కేతన్ పాఠక్ ఉన్నారు. ‘‘11 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజల ఆశీస్సులతో నేను సురక్షితంగా బయట పడ్డా. ప్రజలు వదంతులు నమ్మొద్దు. ఎవరికీ ఏమీ కాలేదు. ఈ ఘటనపై పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తాం’’ అని ఫడ్నవిస్ విలేకరులకు చెప్పారు. ఇటీవలే విదర్భ ప్రాంతంలోని గచ్చిరోలి పర్యటన సందర్భం గా ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన రోడ్డు మార్గంలో నాగ్‌పూర్ చేరుకు న్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, చెన్నైలో ఉన్న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు,శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతోపాటు పలువురు ప్రముఖులు ఫడ్నవిస్‌కు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఫడ్నవిస్‌కు కేసీఆర్ పరామర్శ సాక్షి, హైదరాబాద్: ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఫడ్నవిస్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా రు. ఈ ఘటన గురించి తెలియగానే కలవరపాటుకు గురయ్యానని, అందరూ క్షేమంగా ఉండటం సంతోషకరమని కేసీఆర్ అన్నారు. -
సీఎం హెలికాప్టర్ క్రాష్