ఫడ్నవిస్‌తో శరద్‌ పవార్‌ భేటీ..! | Sharad Pawar Meets Devendra Fadnavis | Sakshi
Sakshi News home page

ఫడ్నవిస్‌తో శరద్‌ పవార్‌ భేటీ..!

Published Tue, Dec 22 2020 5:43 PM | Last Updated on Tue, Dec 22 2020 5:50 PM

Sharad Pawar Meets Devendra Fadnavis - Sakshi

ఫడ్నవిస్‌-పవార్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, ముంబై : భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో పలువురు నాయకులు బీజేపీలో చేరుతారని అన్నారు. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరడానికి దాదాపు 10 మంది వరకు బీజేపీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని ఎన్సీపీ చీఫ్‌ జయంత్‌పాటిల్‌ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఫడ్నవిస్‌ ఈ కౌంటర్‌ ఇవ్వడం గమనార్హం. జయంత్‌ వ్యాఖ్యలపై ఫడ్నవిస్‌ స్పందిస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి నుంచి అసంతృప్త ఎమ్మెల్యేలు బయటికి వెళ్లకుండా ఉండటానికే ఇటువంటి వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు.

మహా వికాస్‌ ఆఘాడీ ఒక్కటిగా పోటీచేసి బీజేపీకి ఎక్కువ సామర్థ్యాన్ని ఇస్తుందని, ఇది బీజేపీ రాజకీయ క్షేత్రం ఏర్పరుచుకునేలా చేస్తుందని తెలిపారు. బీజేపీ కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో విస్తరించి ప్రభుత్వాలను ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు. మహారాష్ట్రలో మన సొంత బలం మీద ఎదగడానికి అధికార పార్టీలు  తమకు అవకాశం కల్పించాయని, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీని సృష్టిస్తామని ఫడ్నవీస్‌ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ‘చెక్కు చెదరకుండా‘ ఉన్నారని, తన పార్టీలో చేరిన నాయకులు పరిణతి చెందినవారు, రాజకీయాలను అర్థం చేసుకున్నారని, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ దేశ భవిష్యత్తు కాదని ఫడ్నవిస్‌ చురకలంటించారు. ఈ దేశం భవిష్యత్తు ప్రధాని నరేంద్రమోదీ అని ప్రజలకు ఒక ఆలోచన ఉందని మాజీ సీఎం వ్యాఖ్యానించారు. (అమిత్‌ షా ఎత్తుగడ.. మమతకు మద్దతు! )

ఫడ్నవిస్‌తో పవార్‌ భేటీ..
కంజూర్‌ మార్గ్‌లో మెట్రోకార్‌ షెడ్‌ నిర్మాణం విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడం కోసం ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీనికోసం పవార్‌ ప్రతిపక్ష పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయినట్లు సమాచారం. కంజూర్‌ మార్గ్‌ స్థలం తమదంటే తమదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాదించుకంటూ ఉండటంతో హైకోర్టు కార్‌షెడ్‌ పనులపై స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో స్థలం విషయం చర్చల ద్వారా పరిష్కరించుకుందామని సీఎం ఉద్ధవ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే నేరుగా పవార్‌ రంగంలోకి దిగినట్లు తెలిసిందే. కంజూర్‌ స్థలం విషయంలో ఫడ్నవిస్, ఉద్ధవ్‌లతో వేరువేరుగా భేటీ అయి చర్చించినట్లు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement