సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో మంత్రివర్గం విస్తరణ ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన నేతలు పదవుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో శనివారం భేటీ అయ్యారు. ఠాక్రే నివాసమైన మాతాశ్రీలో సమావేశమైన ఇరువురు నేతలు మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే కేంద్ర మంత్రి మండలిలో కేవలం ఒకే కేబినేట్ పదవి దక్కడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న శివసేన.. రాష్ట్రంలో తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
కాగా మంత్రిమండలి తాజా విస్తరణలో భాగంగా శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై కూడా వారి మధ్య ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే శివసేనతో పాటు ఎన్డీయే మిత్రపక్షాలకు ఈసారి కేబినేట్‌లో బెర్తు దక్కే అవకాశం ఉంది. ఇటీవల ఫడ్నవిస్ మాట్లాడుతూ.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగే మంత్రివర్గ విస్తరణలో మిత్రపక్షాలన్నింటికీ అవకాశం కల్పిస్తామని తెలిపారు.
దీంతో పదవులు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై ఫడ్నవిస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదిలావుండగా.. శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మంత్రివర్గంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తమకు సీఎం పదవి కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఇప్పటి వరకూ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment