సాక్షి, కరీంనగర్ : దేశ సాగునీటి రంగ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో అనతి కాలంలోనే పూర్తయిన బృహత్తర బహుళార్ధక సాధక కాళేశ్వర ఎత్తిపోతల పథకం నేటి నుంచి జాతికి అంకితం కానుంది. భగీరథుడు గంగను దివి నుంచి భువికి దించితే... నేటి భగీరథ యత్నం తెలుగు గంగను నేల నుంచి నింగికి ఎత్తే సరికొత్త చరిత్రను సృష్టించనుంది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి నేడు సర్వం సిద్దమైంది. మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను ముగ్గురు సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకల్లా గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ జరిగే హోమంలో కేసీఆర్‌తోపాటు పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.
ముగ్గురు సీఎంలు, ఇద్దరు గవర్నర్‌ల రాకతో కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిసరప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.మీడియాకు సైతం అనుమతి లేదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని బ్యారేజీలు, పంప్‌హౌస్‌లను ఇతర మంత్రులు ప్రారంభించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీని మంత్రి నిరంజన్ రెడ్డి, అన్నారం పంప్‌హౌస్‌ను హోం మంత్రి మహ్మద్ అలీ, పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం గోలివాడ వద్ద సుందిళ్ల పంప్‌హౌస్‌ను మంత్రి మల్లారెడ్డి, కరీంనగర్ జిల్లా రామడగు మండలం లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌ను మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా సిరిసిల్లలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సంబరాలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment