
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సరికొత్త రికార్డు సృష్టించారు. గత 47 ఏళ్లలో ఐదేళ్ల పూర్తి కాలంపాటు పదవిలో కొనసాగిన ఏకైక సీఎంగా చరిత్రలో నిలిచారు. చివరిగా జరిగిన 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, మిత్రపక్షం శివసేనతో కూటమి ఏర్పాటు చేసి ఫడ్నవిస్ సీఎంగా తొలిసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఆ స్థానంలో కొనసాగుతున్నారు. దీంతో గడిచిన 47 ఏళ్ల తరువాత పూర్తి కాలంపాటు సీఎం పదవిలో కొనసాగిన తొలి వ్యక్తిగా ఫడ్నవిస్ నిలిచారు.
కాగా ఈ ఘనత సాధించిన రెండవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిసే కావడం విశేషం. ఈయన కంటే ముందు వసంత రావునాయక్ మాత్రమే పూర్తి కాలం పాటు సీఎంగా రాష్టానికి సేవలు అందించారు. 1962లో మొదటిసారి ముఖ్యమంత్రిగాఎన్నికైన ఈయన 1967 నుంచి 1972 వరకు 11 ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. అయితే 1960లో బాంబే స్టేట్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ విడిపోయిన విషయం తెలిసిందే. ఈ 60 ఏళ్ల కాలంలో మహారాష్ట్రకు 26 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. వీరిలో నేషనల్ కాంగ్రెస్ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవర్ అత్యధికంగా నాలుగుసార్లు సీఎంగా పనిచేశారు.
వసంతరావు నాయక్, వసంతదాదా మూడు సార్లు.. శంకర్‌రావు, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ రెండు సార్లు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2014 వరకు వరుసగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, నారాయణ్ రాణే, సుశిల్ కుమార్ షిండే, అశోక్ చవాన్, పృద్వీరాజ్ చౌహన్‌లు పదవీ బాధ్యతలు చేపట్టినా వీరిలో ఏ ఒక్కరూ పూర్తి కాలం పదవిలో లేరు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీకి తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే మరోసారి కూడా తానే సీఎంగా బాధ్యతలు స్పీకరిస్తానని ఫడ్నవిస్ ఇప్పటికే స్పష్టంచేశారు.