సాక్షి, న్యూఢిల్లీ : అధికార పంపంకంపై బీజేపీ-శివసేనల మధ్య ప్రతిష్టంభన ఓవైపు కొనసాగుతుండగానే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఈనెల 5న పదవీ స్వీకార ప్రమాణం చేస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో బీజేపీ సొంతగానే ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేపట్టిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫడ్నవీస్ మహారాష్ట్ర నూతన సీఎంగా ఈ నెల 5 లేదా 6న ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. కూటమి నుంచి శివసేన తప్పుకున్నా తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు ప్రసాద్ లద్, చంద్రకాంత్ పాటిల్‌లకు అప్పగించారు. మరోవైపు తాము ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాకు కట్టుబడి ఉన్నామని, సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలనే డిమాండ్‌ను శివసేన నేత సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా అంటే ఏంటి..? సీఎం పదవి దీని పరిధిలోకి రాదా అని ఆయన ప్రశ్నించారు. శివసేన కోరుకుంటే రాష్ట్రంలో సుస్ధిర ప్రభుత్వం అందించేందుకు అవసరమైన సంఖ్యా బలం తాము సాధిస్తామని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్ధానాల్లో గెలుపొంది ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56 స్ధానాల్లో గెలుపొందగా, విపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలు వరుసగా 44, 54 స్ధానాలు దక్కించుకున్నాయి. 288 స్ధానాలు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 146 స్ధానాలతో కూడిన మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి సొంతంగా లభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment