సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి శుక్రవారం కీలక మలుపుతిరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈరోజు అర్ధరాత్రికి అసెంబ్లీ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఫడ్నవిస్ రాజీనామా చేశారు. ఈ మేరకు మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలతో పాటు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారిని కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని విషయం తెలిసిందే. శివసేన-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించినా.. వారిద్దరి మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో 15 రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తదుపరి నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా అతవరించిన బీజేపీకి అవకాశం కల్పిస్తారా? లేక రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సానుకూలంగానే ఉన్నా.. శివసేన తమతో కలిసి రావడంలేదని అన్నారు. తమతో చర్చలకు స్పందించిన ఉద్దవ్ ఠాక్రే.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో రహస్య మంతనాలను జరుపుతున్నారని విమర్శించారు. సీఎం పదవిపై ఆశలతో శివసేన నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. తాము చర్చలకు సంప్రదిస్తే స్పందించకుండా తమను తీవ్రంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై వారి వ్యాఖ్యలు సరైనవి కావని హితవుపలికారు. తమ భవిష్యత్తు కార్యాచరణను కేంద్ర నాయకత్వంతో చర్చించిన అనంతరం ప్రకటిస్తామని ఫడ్నవిస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment