అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్‌ సంచలన వ్యాఖ్యలు | Ambani house scare Fadnavis demands  NIA probe  | Sakshi
Sakshi News home page

అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్‌ సంచలన వ్యాఖ్యలు

Published Sat, Mar 6 2021 10:46 AM | Last Updated on Sat, Mar 6 2021 12:24 PM

Ambani house scare Fadnavis demands  NIA probe  - Sakshi

సాక్షి,ముంబై: పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్‌ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం రేపిన కలకలం మరింత ముదురుతోంది. ముంబైలోని అంబానీ ఇంటిముందు అనుమానాస్పందంగా కనిపించిన స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరెన్ (45) శవమై తేలడం వివాదాన్ని మరింత రాజేస్తోంది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా మహారాష్ట్ర మాజీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు సంచలనం  రేపుతున్నాయి. ఈ కేసులో చోటుచేసుకున్న అనేక సంఘటనలు అనుమానాలకు తావిస్తోందనీ, దీనిపై ఉన్నత స్థాయి దర్యప్తు జరపాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఈ సందర్భంగా ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్' మహారాష్ట్ర పోలీసు అధికారి సచిన్ వాజ్  పాత్రపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. (అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్‌ మృతి)

రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై రాష్ట్ర శాసనసభలో  శుక్రవారం మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబానీ బెదిరింపు కేసులో అనుమానాలకు దారితీసే అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మన్సుఖ్‌ని,  వాజ్‌  టెలిఫోన్‌ సంభాషణ జరిగిందని ఆరోపించారు. అంతేకాదు పోలీసు కమిషనరేట్‌కు సమీపంలో ఉన్న దక్షిణ ముంబైలోని  క్రాఫోర్డ్ మార్కెట్‌లో మన్సుఖ్‌ని వాజ్‌  కలిశారని చెప్పుకొచ్చారు.  అలాగే కొంతమంది పోలీసులు అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మన్సుఖ్ తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని  ఫడ్నవీస్ ప్రశ్నించారు. ఇ‍న్ని అనుమానాల నేపథ్యంలోఈ కేసు దర్యాప్తు తప్పనిసరిగా ఎన్‌ఐఏకు అప్పగించాలన్నారు. (అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు)

మరోవైపు మన్సుఖ్‌ను కలిసారాన్న ఆరోపణలను సచిన్ వాజ్ ఖండించారు. మన్సుఖ్ థానేకు చెందినవాడు కాబట్టి తనకు తెలుసు అంతేకానీ, ఇటీవలి కాలంలో అతడిని కలవలేదన్నారు. అలాగే తనను వేధిస్తు‍న్నట్టుగా మన్సుఖ్ ఫిర్యాదు చేశాడని ధృవీకరించారు.  అలాగే ఈ కేసులోఅంబానీ  నివాసానికి చేరుకున్న మొదటి వ్యక్తిని తాను కాదన, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గామ్దేవి అని,  ఈ తరువాత  క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు స్పాట్ చేరుకున్నానని వివరణ ఇచ్చారు. అలాగే క్రాఫోర్డ్ మార్కెట్‌లో మన్సుఖ్‌ను కలిశాననే ఆరోపణలు అబద్ధమని కొట్టి పారేశారు.

కాగా ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ మన్సుఖ్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వాహన విడిభాగాల వ్యాపారం చేసే మన్సుఖ్, తన ఎస్‌యూవీని ఎవరో దొంగిలించారంటూ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు  పోలీసులు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే గురువారం రాత్రి  కనిపించకుండా పోయిన మన్సుఖ్‌ శుక్రవారం అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement