Explosive materials
-
‘ప్రదీప్ శర్మకు నా భర్త కలెక్షన్ ఏజెంట్’
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద కలకలం సృష్టించిన పేలుడు పదార్థాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మహిళ ఎన్ఐఏ అధికారుల వద్దకు వచ్చి తన భర్త ప్రదీప్ శర్మకు కలెక్షన్ ఏజెంట్‌గా పని చేసేవాడని తెలిపింది. గుంజన్ సింగ్(30) అనే మహిళ తన భర్త అనీల్ సింగ్ ప్రదీప్ శర్మకు సంబంధించిన అసాంఘిక కార్యకలపాల్లో పాలు పంచుకునేవాడని.. అతడికి కలెక్షన్ ఏజెంట్‌గా పని చేసేవాడని ఆరోపించింది. ఈ సందర్భంగా గుంజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘పెళ్లైన నాటి నుంచి నా భర్త తనకు పోలీసులతో మంచి సంబంధాలున్నాయని చెప్పి నన్ను పలుమార్లు బెదిరించాడు. పరంవీర్ సింగ్ కోసం పని చేసిన ప్రదీప్ శర్మ, బచ్చి సింగ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయనేవాడు. అంతేకాక వారికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీలను నా భర్త చూసుకునేవాడు. ఓసారి ఏకంగా నా తలకు తుపాకీ గురి పెట్టి నన్ను బెదిరించాడు. పోలీసులతో అతడికి ఉన్న సంబంధాల వల్లే నా భర్త ఇంతకు తెగించి ఉంటాడని నేను భావిస్తున్నాను’’ అని తెలిపింది. ఇప్పటికే గుజన్ తన భర్త మీద ఓ సారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం ప్రదీప్ శర్మను అదుపులోకి తీసుకుని ఆరు గంటలపాటు విచారించింది. సచిన్ వాజేకు చెందిన ఆధారాలను నాశనం చేసేందుకు ప్రదీప్ ఆయనకు తోడ్పడినట్లు అధికారులు చెబుతున్నారు. కారుబాంబు వ్యవహారానికి ముందు జరిగిన ప్రణాళికా సమావేశంలో ప్రదీప్ కూడా పాల్గొన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంబానీ ఇంటి ఎదుట బాంబు దొరికిన రెండు రోజుల తర్వాత విచారణలో భాగంగా ఎన్ఐఏ ప్రదీప్ శర్మను కూడా ప్రశ్నించింది. 1983 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ శర్మ దాదాపు 100 మంది నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు చదవండి: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు -
రూం నంబర్ 1964 వేదికగా సచిన్ వజే అక్రమాలు
ముంబై: ఆసియా కుబేరుడు ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు కలిగిన వాహనం కలకలం సృష్టించిన కేసులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వజేని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో వజే అక్రమాలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలోని ఓ ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్ గది వేదికగా చేసుకుని వజే తన దోపిడి కార్యకలపాలను కొనసాగిస్తున్నాడని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. పైగా దీని బిల్లును మరో వ్యాపారవేత్త చేత కట్టించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘సచిన్ వజే ముంబైలోని నారిమాన్ పాయింట్ ఫైవ్ స్టార్ హోటల్లో రూం నంబర్ 1964 వేదికగా తన కార్యకలపాలు కొనసాగిస్తున్నాడు. సుశాంత్ సదాశివ్ ఖమ్కర్ పేరు మీదుగా నకిలీ ఆధార్ కార్డుతో హోటల్లోకి చెక్ ఇన్ అవుతున్నట్లు తెలిసింది. ఈ రూమ్ కూడా ఓ వ్యాపారవేత్త పేరు మీద బుక్ అయ్యింది. దాదాపు 12 లక్షల రూపాయలు చెల్లించి 100 రోజుల కోసం సదరు వ్యాపారవేత్త ఈ గదిని బుక్ చేసుకున్నాడు. దీన్ని సచిన్ వజే వినియోగిస్తున్నాడు. సదరు బిజినెస్ మ్యాన్‌కు సచిన్ వజే గతంలో ఓ వివాదంలో సాయం చేశాడు. అందుకు ప్రతిఫలంగా అతడు ఈ గదిని బుక్ చేశాడు’’ అని తెలిపారు. ‘‘వజే చివరగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఇన్నోవాలో వచ్చి హోటల్లో చెక్ ఇన్ అయ్యాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న ల్యాండ్ క్రూయిజర్‌లో వెళ్లాడు. ప్రస్తుతం ఈ రెండు వాహనాలను కూడా సీజ్ చేశాం. వజే కార్యకలాపాల గురించి డిపార్ట్మెంట్లో అందరికి తెలుసు. దీనికి సంబంధించి మా దగ్గర ఆధారులున్నాయి. ప్రస్తుతం డిప్యూటి కమిషనర్ హోదా వరకు ఓ 35 మందిని ప్రశ్నించాము. కొందరి స్టేట్మెంట్స్ రికార్డు చేశాం.. కొందరివి మౌఖికంగా విన్నాం. త్వరలోనే సచిన్ వజే సహచరులను కొందరిని అరెస్ట్ చేస్తాం’’ అని ఎన్ఐఏ అధికారి తెలిపారు. ప్రారంభంలో అంబాని ఇంటి వద్ద బాంబు-బెదిరింపు కేసును విచారించిన సచిన్ వజే ఇప్పుడు హిరాన్ కేసులో ప్రధాన నిందితుడు. ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తులో భాగంగా దక్షిణ ముంబైలోని మరో హోటల్, ఒక క్లబ్, పొరుగున ఉన్న థానేలోని ఒక ఫ్లాట్‌లో గురువారం సోదాలు చేసింది. ఎన్ఐఏ అధికారులు వజే మహిళా సహచరుడిని విమానాశ్రయం నుంచి అదుపులోకి తీసుకుంది. ఈ రెండు కేసులకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ హోదా వరకు 35 మంది అధికారులను ఎన్ఐఏ విచారించింది. చదవండి: ఆ పేలుడు పదార్దాలు తెచ్చింది వాజేనే! -
అంబానీ ఇంటి వద్ద కలకలం: ‘అందుకే తనని బదిలీ చేశాం’
ముంబై: గత కొద్దిరోజులుగా నగరంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా పోలీసులు తీవ్రమైన తప్పిదాలు చేశారని ప్రాథమిక నిర్ధరణకు వచ్చి.. వారిని బాధ్యులను బదిలీ చేశామని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. అంతేకాకుండా ఎన్ఐఏ కేసులో సచిన్ వజేపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్ధేశంతో పలువురిపై బదిలీ వేటు వేశామని స్పష్టం చేశారు. దక్షిణముంబైలోని ముకేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు లభించడం, వ్యాపారవేత్త హిరానీ మరణించడం, పోలీస్ అధికారి సచిన్ వజే అరెస్టు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముంబై వార్తల్లో నిలిచింది. అయితే పోలీసు సహచరుల తప్పిదాలకు కమిషనర్ పరం వీర్‌సింగ్‌ను బాధ్యుడిగా చేస్తూ బుధవారం హోంమంత్రి బదిలీ ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా ముంబై కమిషనర్‌గా హేమంత్ నాగ్రలే నియమితులయ్యారు. దీంతో హోం మంత్రి బదిలీపై ఓ ఛానెల్‌తో మాట్లాడారు. ఆయా కేసులపై ఏటీఎస్, ఎన్ఐఏ దర్యాప్తు నిష్పక్షపాతం గా జరుపుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే ఏటీఎస్, ఎన్ఐఏ విచారణలో కొన్ని విషయాలు బయటపడటమూ బదిలీలకు కారణమని హోం మంత్రి స్పష్టంచేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. చదవండి: ముంబై పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు -
సాక్ష్యాలు నాశనం చేసేందుకు యత్నించిన వాజే
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియోని నిలిపి కలకలం సృష్టించిన ఘటనలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తొలత ఈ కేసును ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజే దర్యాప్తు చేశాడు. రోజులు గడుస్తున్న కొద్ది.. ఈ కేసుతో వాజేకు ఉన్న సంబంధాలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసుకు సంబంధించి వాజే మీద కేసు బుక్ చేసింది. అలానే మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా వాజేను దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. వాజే ఈ కేసు దర్యాప్తులో సమయంలో సేకరించిన సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వాజే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో సేకరించిన ఆధారాలను రికార్డులో పేర్కొనలేదని తెలిసింది. అలానే సచిన్ వాజే తన సొంత రెసిడెన్షియల్ సొసైటీకి చెందిన సీసీటీవీ ఫుటేజ్, డీవీఆర్ మెషన్ డాటాతో పాటు తాను సేకరించిన ఇతర సమాచారాన్ని నాశనం చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ప్రసుత్తం అధికారులు డిలీట్ అయిన డాటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొదటి స్కార్పియో వాహనం యజమానిగా భావించిన మన్సుఖ్ హిరెన్‌ను ప్రశ్నించిన పోలీసులు ఆ వాహనం దొంగలించబడిందని గుర్తించారు. ఆ తర్వాత హిరెన్ హత్యకు గురికావడంతో కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక హిరెన్ భార్య ఆ స్కార్పియో వాహనాన్ని ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే నాలుగు నెలల పాటు వాడుకున్నాడని చెప్పడంతో కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. స్కార్పియో వాహనాన్ని ఉపయోగించిన సచిన్ వాజేనే ఆ తర్వాత.. ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా వ్యవహంచడంతో అతనిని బదిలీ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఎన్ఐఏ అధికారులు. చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం అంబానీ ఇంటి వద్ద కలకలం : సచిన్‌పై బదిలీ వేటు -
అంబానీ ఇంటి వద్ద కలకలం: వెలుగులోకి ఐఎం ఉగ్రవాది
ముంబై: ఆసియా కుబేరుడు, పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుండగా.. ఈ కేసు మూలం తీహార్ జైలులో బయటపడింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపింది తామే అంటూ ఓ ఉగ్రవాద సంస్థ గతంలో ప్రకటించుకుంది. జైషే ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ టెలిగ్రాం వేదికగా ఈ ప్రకటన చేసింది. కాగా, ఈ టెలిగ్రాం మెసేజ్‌ను సీరియస్‌గా తీసుకున్న అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా.. ఈ కేసు మూలం తీహార్ జైలులో బయటపడింది. ఇక్కడ శిక్ష అనుభవిస్తోన్న ఉగ్రవాదులు కొందరు ఈ టెలిగ్రామ్ గ్రూప్‌ను క్రియేట్ చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గురువారం తీహార్ జైలు అధికారులను కలిశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా డిప్యూటి కమిషనర్ ప్రమోద్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘టెలిగ్రాం మెసేజ్ ఆధారంగా ముంబై పోలీసులు ఓ ప్రైవేట్ సైబర్ ఏజెన్సీ సాయంతో లోకేషన్‌ని ట్రేస్ చేయగా.. తీహార్ జైలు వెలుగులోకి వచ్చింది. దాంతో ఢిల్లీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్పెషల్ సెల్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తీహార్ జైలు అధికారులు సోదాలు నిర్వహించగా.. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తెహిసీన్ అఖ్తర్ సహా అల్‌ఖైదాతో సంబంధాలున్నవారు, అండర్‌వరల్డ్ డాన్లు ఉంటున్న బ్యారక్‌లో మొబైల్ ఫోన్ ఉన్నట్లు తెలిసింది. దీన్ని ఉగ్రవాది అఖ్తర్ నుంచి స్వాధీనం చేసుకోవడంతో ప్రస్తుతం అతడినే అనుమానిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ క్రమంలో తీహార్ జైలులో కనీసం 11 మంది జైలు ఖైదీలను ప్రశ్నించినట్టు జైలు వర్గాలు పేర్కొన్నాయి. ఈ మొబైల్ నంబరు వినియోగదారు టెలిగ్రామ్ ఖాతాను సృష్టించడానికి వర్చువల్ నంబర్లను వినియోగించాడు.. అంతేకాకుండా, అనుమానితుడు నెట్లో ఐపీ అడ్రస్‌ను గుర్తించకుండా ఉండేందుకు టీఓఆర్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముంబై పోలీసులు నియమించిన సైబర్ నిపుణులు టెలిగ్రామ్ ఛానల్ గురించి సమాచారం పొందడానికి ట్రోజన్లను ఉపయోగించారు. ఇది ఫిబ్రవరి 26 మధ్యాహ్నం ఈ టెలిగ్రాం గ్రూప్‌ను క్రియేట్ చేసినట్టు కనుగొన్నారు. అంబానీ నివాసం వెలుపల వాహనాన్ని నిలిపి ఉంచిన ఘటనకు బాధ్యత వహిస్తూ ఈ ఉగ్రవాద గ్రూపు ఫిబ్రవరి 27న టెలిగ్రామ్‌లో మెసేజ్ పోస్ట్ చేసింది. కానీ ముంబై పోలీసులు దీన్ని ఫేక్ అంటూ కొట్టి పారేశారు. ఇక తెహిసీన్ అఖ్తర్ 2014, నరేంద్ర మోదీ ర్యాలీ సందర్భంగా పాట్నాలో సీరియల్ బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసినందుకు గాను ఇతడిని అరెస్ట్ చేశారు. అఖ్తర్‌కు గతంలో హైదరాబాద్, బోధ్‌గయాలో జరిగిన పేలుళ్లతో కూడా సంబంధం ఉంది. చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం: ‘అతడిని శిక్షించండి’ జైలు నుంచే ‘ఉగ్ర నెట్వర్క్’ -
అంబానీ ఇంటి వద్ద కలకలం: ‘అతడిని శిక్షించండి’
ముంబై: పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు కొనసాగతుండగానే.. సదరు వాహనం డ్రైవర్ మరణించాడు. ఇలా కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీని దర్యాప్తును యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు అప్పగించింది. తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ విషయంపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ని శిక్షించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఫడ్నవీస్ అసెంబ్లీలో చనిపోయిన స్కార్పియో డ్రైవర్ హిరెన్ మన్సుఖ్ భార్య ఇచ్చిన ఎఫ్ఐఆర్ని చదివారు. దీనిలో సదరు డ్రైవర్ మరణించడానికి ముందు జరగిన సంఘటనలు వరుసగా ఉన్నాయి. అనంతరం ఫడ్నవీస్ "అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ని శిక్షించాలి. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి మీరు అతనికి అవకాశం ఇస్తున్నారు. అతను (వాజ్) ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి అతడిని రక్షిస్తున్నారు. అసలు అతడిని ఎలా ఫోర్స్‌లోకి తీసుకున్నారు.. తొలుత అతడిని సస్పెండ్ చేయండి’’ అంటూ ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. అంబానీ ఇంటి ముందు కలకలం రేపిన స్కార్పియో డ్రైవర్ హిరెన్ మన్సుఖ్ (45) మృతదేహాన్ని గత శుక్రవారం ముంబై సమీపంలోని ఒక కాలువ దగ్గర గుర్తించినట్లు థానే పోలీసు అధికారి తెలిపారు. గురువారం రాత్రి నుంచి అతను తప్పిపోయాడని మన్సుఖ్ కుటుంబం తెలిపింది. దాంతో ఈ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు బదిలీ చేశారు. చనిపోవడానికి ముందు మన్సుఖ్ తనను పోలీసు అధికారులు, జర్నలిస్టులు వేధిస్తున్నారని ఆరోపించారని ఫడ్నవీస్ తెలిపారు. ఇక ఫడ్నవీస్ వ్యాఖ్యలను మహారాష్ట్ర హోంమంత్రి దేశ్ ముఖ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మన్సుఖ్ భార్య చేసిన ప్రకటన ఇప్పుడు మీడియాలో ప్రతిచోటా ఉంది. ప్రస్తుతం ఈ కేసును ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ప్రతిపక్షం దగ్గర మరిన్ని రుజువులు, ఆధారాలు ఉంటే, వారు దానిని ఏటీఎస్‌కు అందివ్వా లి. అంతేకాకా హోం మినిస్టర్‌గా నేను మీకు హామీ ఇస్తున్నాను.. ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకోలేరు’’ అన్నారు అని దేశ్ ముఖ్. చదవండి: అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు అంబానీ ఇంటివద్ద కలకలం : మరో కీలక పరిణామం -
అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం రేపిన కలకలం మరింత ముదురుతోంది. ముంబైలోని అంబానీ ఇంటిముందు అనుమానాస్పందంగా కనిపించిన స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరెన్ (45) శవమై తేలడం వివాదాన్ని మరింత రాజేస్తోంది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా మహారాష్ట్ర మాజీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో చోటుచేసుకున్న అనేక సంఘటనలు అనుమానాలకు తావిస్తోందనీ, దీనిపై ఉన్నత స్థాయి దర్యప్తు జరపాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్' మహారాష్ట్ర పోలీసు అధికారి సచిన్ వాజ్ పాత్రపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. (అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్ మృతి) రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై రాష్ట్ర శాసనసభలో శుక్రవారం మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబానీ బెదిరింపు కేసులో అనుమానాలకు దారితీసే అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మన్సుఖ్‌ని, వాజ్ టెలిఫోన్ సంభాషణ జరిగిందని ఆరోపించారు. అంతేకాదు పోలీసు కమిషనరేట్‌కు సమీపంలో ఉన్న దక్షిణ ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో మన్సుఖ్‌ని వాజ్ కలిశారని చెప్పుకొచ్చారు. అలాగే కొంతమంది పోలీసులు అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మన్సుఖ్ తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. ఇన్ని అనుమానాల నేపథ్యంలోఈ కేసు దర్యాప్తు తప్పనిసరిగా ఎన్ఐఏకు అప్పగించాలన్నారు. (అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు) మరోవైపు మన్సుఖ్ను కలిసారాన్న ఆరోపణలను సచిన్ వాజ్ ఖండించారు. మన్సుఖ్ థానేకు చెందినవాడు కాబట్టి తనకు తెలుసు అంతేకానీ, ఇటీవలి కాలంలో అతడిని కలవలేదన్నారు. అలాగే తనను వేధిస్తున్నట్టుగా మన్సుఖ్ ఫిర్యాదు చేశాడని ధృవీకరించారు. అలాగే ఈ కేసులోఅంబానీ నివాసానికి చేరుకున్న మొదటి వ్యక్తిని తాను కాదన, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గామ్దేవి అని, ఈ తరువాత క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు స్పాట్ చేరుకున్నానని వివరణ ఇచ్చారు. అలాగే క్రాఫోర్డ్ మార్కెట్లో మన్సుఖ్ను కలిశాననే ఆరోపణలు అబద్ధమని కొట్టి పారేశారు. కాగా ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ మన్సుఖ్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వాహన విడిభాగాల వ్యాపారం చేసే మన్సుఖ్, తన ఎస్‌యూవీని ఎవరో దొంగిలించారంటూ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే గురువారం రాత్రి కనిపించకుండా పోయిన మన్సుఖ్ శుక్రవారం అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. -
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు
సాక్షి, ముంబై: ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో నిండిన స్కార్పియో వాహనం రేపిన దుమారం అంతా ఇంతా కాదు. తాజాగా ఇదే అంశంపై మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచింది తామేనని 'జైష్ ఉల్ హింద్' సంస్థ ప్రకటించిందన్నవార్త ఫేక్‌న్యూస్ అంటూ జైష్-ఉల్-హింద్ చేసిన తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. (అంబానీ ఇంటికి బెదిరింపుల కేసులో ట్విస్ట్) టెలిగ్రామ్ యాప్‌లో మెసేజ్ ద్వారా తామే దీనికి బాధ్యత వహిస్తున్నట్లు వచ్చిన నివేదికలను ఖండించింది. ఈ మేరకు జైష్-ఉల్-హింద్ ఒక ప్రకటన విడుదల చేసిందని బిజినెస్ టుడే నివేదించింది. టెలిగ్రామ్ ఖాతాలో, జైష్-ఉల్-హింద్ పేరిట విడుదల చేసిన పోస్టర్‌తో తమకు సంబంధంలేదని, తప్పుడు వార్తలని పేర్కొంది. 'జైష్-ఉల్-హింద్ నుండి అంబానీకి ముప్పు లేదు' అనే పేరుతో వెల్లడించిన వివరణలో ‘‘తమ పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ ఫాసిజానికి వ్యతిరేకంగా మాత్రమే. హిందూ అమాయక ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. మా పోరాటం షరియా కోసం, డబ్బు కోసం కాదు. లౌకిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం గానీ అంబానీకి వ్యతిరేకంగా కాదు’’ అని తెలిపింది. అలాగే తాము అవిశ్వాసులనుంచి డబ్బులు తీసుకోమని, భారతీయ వ్యాపార దిగ్గజాలతో తమకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. మార్ఫింగ్ ఫోటోలతో భారత నిఘా సంస్థ నకిలీ పోస్టర్లు తయారు చేస్తోందంటూ మండిపడింది. (అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ) కాగా ఫిబ్రవరి 25న ముఖేశ్ అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాలతో ఒక వాహనం నిలిపి ఉంచడం కలకలం రేపింది. ఇది ట్రైలర్ మాత్రమే..అని హెచ్చరించడంతోపాటు బిట్‌కాయిన్ ద్వారా డబ్బు డిమాండ్ చేసినట్లు వార్తలు హల్చల్ చేశాయి. అంతేకాదు "మీకు వీలైతే మమ్మల్ని ఆపండి" అని దర్యాప్తు సంస్థలకు జైష్-ఉల్-హింద్ సవాల్ విసిరిందన్న వార్త మరింత ఆందోళన రేపింది. దీంతో ముంబై పోలీసులు అంబానీ ఇంటిముందు భారీ భద్రతను విధించారు. ఈ కేసును 10 పోలీసు బృందాలు, ఎన్ఐఏ సంయుక్తంగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. -
తినేవస్తువు అనుకుని.. నాటుబాంబుని కొరికి
సాక్షి, చెన్నై : తినే వస్తువు అనుకుని నాటుబాంబు కొరికి చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. తిరుచి జిల్లా తొట్టియమ్ సమీపంలోని అలగరై గ్రామానికి చెందిన గంగాధరన్ (31), తమిళ్ ఆరసన్ (28), మోహన్ రాజ్ (16) గురువారం పాపం పట్టి ప్రాంతంలో ఉన్న సెల్వకుమార్ (44) వద్ద మూడు నాటు బాంబులను కొనుగోలు చేశారు. వాటిని మణమేడు ప్రాంతంలో ఉన్న కావేరి నదిలో చేపలు పట్టేందుకు ఉపయోగించారు. పట్టిన చేపలను అలాగరైల్లో ఉన్న సహోదరుడు భూ పతి ఇంటికి తీసుకుని వెళ్లారు. మిగిలిన ఓ నాటుబాంబుని అక్కడున్న మంచంపైన పెట్టి, ఇంటి వెనుక భాగంలో ఉన్న స్థలంలో చేపలను శుభ్రం చేయడానికి వెళ్లారు. అక్కడికి వచ్చిన భూపతి కుమారుడు విష్ణుదేవ్ (6) మంచంపై ఉన్న నాటుబాంబుని తినే పదార్థం అనుకొని కొరికినట్టు తెలిసింది. ఆ నాటుబాంబు పేలడంతో విష్ణుదేవ్ తల చెల్లాచెదురైంది. బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం తెలపకుండా మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం పోలీసులు కేసు నమోదుచేసి గంగాధరన్, మోహన్‌జ్, సెల్వకుమార్‌ని అరెస్టు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. చదవండి: కరోనా కల్లోలంలో హైదరాబాద్ బిర్యానీ! -
పార్సిల్స్ మాటున బాంబులు
లండన్: పార్సిల్స్ ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలు బయటపడటం లండన్‌లో కలకలం సృష్టించింది. మూడు వేర్వేరు ప్రదేశాల్లో మంగళవారం వెలుగుచూసిన ఈ ఘటనల్లో ఒకదానితో మరొకదానికి సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో ఒకటి హీత్రూ విమానాశ్రయం సమీపంలోని గదిలో బయటపడింది. దాన్ని తెరిచిన తరువాత స్వల్పంగా మంటలు వెలువడ్డాయి. ముందస్తు చర్యగా ఆ గదిని ఖాళీచేయించారు. విమాన సర్వీసులకు ఎలాంటి ఆటంకం కలగలేదు. మరొక పేలుడు పదార్థాన్ని వేరే విమానాశ్రయంలో, మూడో దాన్ని వాటర్లూ అనే రైల్వే స్టేషన్లో గుర్తించారు. మెయిలింగ్ బ్యాగుల్లో బాంబులు బయటపడటంపై ఉగ్ర వ్యతిరేక పోలీసు సిబ్బంది విచారణ జరుపుతున్నారు. పేలుడు పదార్థాలు కలిగిన పార్సిల్స్‌పై ఐర్లాండ్ స్టాంపులు ఉన్నట్టు గుర్తించారు. వీటిని ఎవరు పంపారు, ఎక్కడి నుంచి పంపించారనే దానిపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరికి ఐర్లాండ్ పోలీసులు సహకారం అందిస్తున్నారు. -
మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తూ..
చర్ల: మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తోన్న ఇద్దరు సానుభూతిపరులను ఖమ్మం జిల్లా చర్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. చర్ల -పూసుగుప్ప మార్గంలోని లెనిన్ కాలనీ శివారులో పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో అదే మార్గంలో ఈ ఇద్దరూ వస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా వారి వద్ద పేలుడు పదార్థాలు లభించాయి. అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మావోయిస్టులకు సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. -
తమిళనాడు: రామేశ్వరం జిల్లాలో కలకలం
-
తవ్వకాల్లో భారీగా బాంబులు, బుల్లెట్లు
సాక్షి, చెన్నై: భారీ ఆయుధాల డంప్ బయటపడటంతో తమిళనాడులో ఒక్కసారిగా కలకలం రేగింది. రామాంతపురం జిల్లా రామేశ్వరం సముద్ర తీరంలో ఓ నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా.. భారీ ఎత్తున్న ఆయుధాలు బయటపడ్డాయి. ఏకే-47 తుపాకులు, బుల్లెట్లు, బాంబులు, మందు గుండు సామాగ్రిని భారీ ఎత్తున్న పెట్టెల్లో లభించాయి. ఈ ఆయుధ బాంఢాగారం నిషేధిత ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ)కు చెందినదిగా అధికారులు భావిస్తున్నారు. తీరంలోని ఓ మత్స్యకారుడి ఇంటి వద్ద ఉన్న కొబ్బరి తోటలో చెత్తను పూడ్చేందుకు ఓ గొయ్యిని తవ్వారు. అయితే ఐదడుగులు తవ్వేసరికి పెట్టెలు బయటపడ్డాయి. అనుమానంతో తెరిచి చూడగా ఆయుధాలు కంటపడ్డాయి. దీంతో కంగారుపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాత్రంత శ్రమించిన పోలీసులు వాటిని వెలికి తీశారు. సుమారు 5000 వేల బుల్లెట్లతోపాటు వందల కేజీల మందు గుండు సామాగ్రి బయటపడింది. ఇవన్నీ తుప్పు పట్టిన స్థితిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 1983-90 మధ్య కాలంలో ఎల్టీటీఈ.. ఉగ్ర శిక్షణా కేంద్రంగా ఈ ప్రాంతాన్ని వాడుకుని ఉంటుందని జిల్లా ఎస్పీ ఓంప్రకాశ్ మీనా అభిప్రాయపడుతున్నారు. -
పేలుడు సామాగ్రి పట్టివేత
సాక్షి, కొత్తగూడెం : జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో భారీగా పేలుడు సామాగ్రి పట్టుబడింది. కొత్తగూడెం నుంచి చర్ల వైపు వెళ్లున్న లారీలో పేలుడు సామాగ్రి ఉన్నట్లు జిల్లా ఎస్పీకి సమాచారం అందింది. స్పందించిన వెంటనే ఆయన పట్టణ ఎస్సైని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై మహేశ్ సారపాక వద్ద లారీని తనిఖీ చేయగా 1000 డిటోనేటర్లు, 75 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. వీటిని స్వాధీనం చేసుకుని, 8 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
శ్రీవారిమెట్టు వద్ద కలకలం
-
తిరుపతిలో పేలుడు పరికరాల స్వాధీనం
చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ అధికారులకు సోమవారం రాత్రి పేలుడు పరికరాలు లభ్యమవ్వడం కలకలం సృష్టించింది. అధికారుల కథనం మేరకు.. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా తిరుపతి శ్రీవారి మెట్టు వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక బ్యాగును గుర్తించారు. బ్యాగులో పేలుడుకు ఉపయోగించే సర్క్యుట్ బోర్డులు, సెల్‌ఫోను, వాక్‌మెన్, రెసిస్టర్లు, కెపాసిటర్లు, కండెన్సర్లు ఇతర పరికరాలను అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆర్ఎస్సై వాసు ఐజీ కాంతారావుకు సమాచారం అందించారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పేలుడుకు ఉపయోగించే పరికరాలుగా నిర్ధారించారు. అనంతరం కాంతారావు బాంబు స్య్వాడ్‌కు సమాచారం అందించారు. వారూ ఘటనా స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు మీడియాతో మాట్లాడుతూ, ఇవి పేలుళ్లు సృష్టించడానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. అడవిలో ఎవరూ లేనిచోటుకు గుర్తుతెలియని వ్యక్తులు తీసుకొచ్చి వాటిని సిద్ధంచేసినట్లు తెలుస్తోందన్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులతో పాటు ఇతర వీఐపీలు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు వెళ్తుంటారని, అయితే.. ఎవరిని టార్గెట్ చేసి వీటిని తయారుచేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందని దర్యాప్తులో తేలుతుందని కాంతారావు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సంచీపై తమిళనాడు తిరుచ్చికి చెందిన చిరునామా ఉందని.. లభ్యమైన ఆధారాలకు అనుగుణంగా కేసును దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్ధాలను తిరుమల టూటౌన్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేస్తామన్నారు. అనంతరం కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
పేలుడు పదార్థాలు తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
కోదాడ: అనుమతి లేకుండా పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన షేక్ సైదా, ఖమ్మం రూరల్ మండలం తెల్ధార్‌పల్లికి చెందిన వాడపట్ల సుదర్శన్‌రావులు బుధవారం యాక్టివ స్కూటర్‌పై వెళుతుండగా పోలీసులు కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద తనిఖీ చేశారు. వారివద్ద రెండు బాక్సుల్లో 200 డిటోనేటర్ పిన్నులు, 189 జిలెటిన్ స్టిక్స్, 15 కట్టల బత్తి, 10 కేజీల అమ్మెనియం లభిం చాయి. వీటిని అనుమతి లేకుండా రవాణా చేస్తుండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోదాడ కోర్టులో హాజరుపరిచినట్టు పోలీసులు తెలిపారు. -
ఫలించిన ఎస్పీ స్కెచ్ !
విజయనగరం: బొబ్బిలిలో నడుస్తున్న ప్రమాదకరమైన పేలుడు పదార్థాల విక్రయ రాకెట్‌ను పట్టుకోవడం వెనుక అద్భుతమైన వ్యూహాలు దాగి ఉన్నాయి. పేలుడు పదార్థాల విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నా బొబ్బిలి పోలీసులు పట్టించుకోకపోవడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ రచించిన పథకం ప్రకారం అక్రమార్కులను పట్టుకునేందుకు వారంరోజులు కసరత్తు చేశారు. పక్కా సమాచారం సేకరించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందులో ఓ పోలీస్ అధికారి ఫుడ్ ఇన్స్పెక్టర్గా అవతారమెత్తడం విశేషం. ఇదీ అసలు కథ... బొబ్బిలిలోని దేవాంగుల వీధిలో జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లను కొన్నేళ్లుగా గెంబలి శ్రీనివాసరావు, గెంబలి తవిటయ్య, గెంబలి లక్ష్మీనారాయణ అనే ముగ్గురు సోదరులు అనధికారికంగా విక్రయిస్తున్నారు. వీరి నిర్వాకంపై అగ్నిమాపక శాఖాధికారులు ఒక నివేదిక కూడా ఇచ్చారు. కానీ, స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. పలు పర్యాయాలు ఉన్నతాధికారులు ఆరాతీసినా దొరకడం లేదని సమాధానం చెబుతూ వస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గెంబలి బ్రదర్స్ విక్రయాల ఆగడాలు ఎక్కువయ్యాయని స్థానికుల నుంచి ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ దృష్టికి వచ్చింది. ఆయన తొలుత స్థానిక పోలీసుల తీరును తెలుసుకున్నారు. వారి వల్లకాదని, తన కార్యాలయంలోనే పక్కా పథకం రచించారు. స్పెషల్ బ్రాంచ్ విభాగం ద్వారా ఆ పథకాన్ని అమలు చేశారు. తొలుత స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అక్కడికెళ్లి పరిశీలించారు. స్థానిక పోలీసులకు తెలియకుండా నిఘా పెట్టారు. గెంబలి బ్రదర్స్‌కు చెందిన మూడు షాపుల గదుల్లో ఉన్న బేకరీని తనిఖీ చేస్తే మొత్తం గుట్టంతా బయటికి వస్తుందని అంచనా వేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారమెత్తిన పోలీసు అధికారి బేకరీని తనిఖీ చేయాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఒక్కరికే అవకాశం ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. వెంటనే ఒక పోలీస్ అధికారి ఫుడ్ ఇన్స్పెక్టర్గా అవతారమెత్తారు. ఆ బేకరీకి వెళ్లి తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా బేకరీ వెనుక ఉన్న కొన్ని సంచులను పరిశీలించారు. గెంబలి బ్రదర్స్‌పై చర్యలు తీసుకోవాలంటే పక్కాగా పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఫుడ్ ఇన్స్పెక్టర్గా వెళ్లిన పోలీసు అధికారి వెనక్కి వచ్చి విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పక్కా వ్యూహంతో ఒక కొనుగోలుదారుడిని అక్కడికి పంపించి, పేలుడు పదార్థాలను కొనుగోలు చేయించారు. రెడ్‌హ్యాండెడ్‌గా తొలుత గెంబలి శ్రీనివాసరావును పట్టుకున్నారు. ఆ తర్వాత దశల వారీగా తనిఖీలు నిర్వహించి అతని సోదరులు తవిటయ్య, లక్ష్మీనారాయణలను పట్టుకోవడంతోపాటు వివిధచోట్ల దాచి ఉంచిన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను కనుగొన్నారు. దీంతో గెంబలి బ్రదర్స్ పక్కా ఆధారాలతో పట్టుబడ్డారు. ఇప్పుడా బ్రదర్స్‌కు పేలుడు పదార్థాలను సరపరా చేస్తున్న వ్యక్తులపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందర్ని అనుమానించారు. జిల్లాలో విక్రయాలు జరుగుతున్నట్టుగా పలు అనుమానిత ప్రాంతాలను గుర్తించినట్టు తెలిసింది. గెంబలి బ్రదర్స్ చెప్పిన నానితోపాటు మరికొందరిపై నిఘా పెట్టారు. ఏ క్షణంలోనైనా పేలుడు పదార్థాల విక్రయ రాకెట్ అంతటినీ పట్టుకునే అవకాశం ఉంది. నిశిత పరిశీలనతోనే.. ‘బొబ్బిలిలో మేం పెట్టిన నిఘా, నిశిత పరిశీలనతోనే పేలుడు పదార్థాలను పెద్ద ఎత్తున పట్టుకోగలిగాం. ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలున్నాయా.. లేవా.. అనేదానిపై దృష్టి పెట్టాం. మాకు ఇంకెవరూ సమాచారం అందించలేదు.’ - టి.త్రినాథ్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ -
పోలీసుల తనీఖీల్లో దొరికిన పేలుడు సామాగ్రి
-
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం పలుగుల గ్రామం వద్ద పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనాస్థలంలో 158 డిటోనేటర్లు, 25 జిలెటిన్ స్టిక్స్, 51 బండిళ్ల వైరును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బజ్పే విమానాశ్రయంలో పేలుడు పదార్థాల కలకలం
సాక్షి, బెంగళూరు : మంగళూరులోని బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. దుబాయ్‌కు వెళుతున్న ఓ వ్యక్తి లగేజీలో అనుమానిత ద్రావకాన్ని భద్రతా సిబ్బంది గుర్తించింది. వివరాల్లోకి వెళితే... పేలుడు పదార్థాలతో దుబాయ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకుంది. వివరాల్లోకి వెళితే... అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి దుబాయ్‌కు వెళ్లేందుకని శనివారం రాత్రి 11.30 గంటలకు మంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతని లగేజీలో రసాయనిక ద్రావణం, బ్యాటరీ, వైర్లు ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మంగళూరు పోలీస్ కమిషనర్ హితేంద్ర, డీసీపీ జగదీష్ విమానాశ్రయాన్ని చేరుకుని నిందితుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాస్‌పోర్టులోని వివరాల ప్రకారం అతనిది కేరళ అని నిర్ధారించారు. మంగళూరు నుంచి దుబాయ్‌కు అక్కడి నుంచి సిరియా వెళ్లడానికి అబ్దుల్ ఖాదర్ ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. కేసు విచారణకు గాను బెంగళూరు నుంచి ప్రత్యేక బృందం మంగళూరుకు చేరుకుంది. దుబాయ్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్న తాను ఇటీవల స్వగ్రామానికి వచ్చినట్లు విచారణ అధికారుల ఎదుట అబ్దుల్ ఖాదర్ అంగీకరించాడు. శనివారం దుబాయ్‌కు బయలుదేరానని, ఆ సమయంలో తన ఇంటి పక్కనే ఉన్న వారు ఓ గిఫ్ట్ ప్యాక్‌ను దుబాయ్‌లోని తమ సంబంధీకులకు ఇవ్వాలని కోరుతూ ఇచ్చారని వివరించాడు. గిఫ్ట్ ప్యాక్‌ను అధికారులు పరిశీలించారు. అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫెయిల్యూర్ అయిన బ్యాటరీ ఉన్నట్లు నిర్ధారణకు వచ్చి అబ్దుల్ ఖాదర్‌ను విడిచి పెట్టారు.