ముంబై: ఆసియా కుబేరుడు ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు కలిగిన వాహనం కలకలం సృష్టించిన కేసులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వజేని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో వజే అక్రమాలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలోని ఓ ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్ గది వేదికగా చేసుకుని వజే తన దోపిడి కార్యకలపాలను కొనసాగిస్తున్నాడని ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. పైగా దీని బిల్లును మరో వ్యాపారవేత్త చేత కట్టించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్‌ఐఏ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘సచిన్ వజే ముంబైలోని నారిమాన్ పాయింట్ ఫైవ్ స్టార్ హోటల్‌లో రూం నంబర్ 1964 వేదికగా తన కార్యకలపాలు కొనసాగిస్తున్నాడు. సుశాంత్ సదాశివ్ ఖమ్కర్ పేరు మీదుగా నకిలీ ఆధార్ కార్డుతో హోటల్‌లోకి చెక్ ఇన్ అవుతున్నట్లు తెలిసింది. ఈ రూమ్ కూడా ఓ వ్యాపారవేత్త పేరు మీద బుక్ అయ్యింది. దాదాపు 12 లక్షల రూపాయలు చెల్లించి 100 రోజుల కోసం సదరు వ్యాపారవేత్త ఈ గదిని బుక్ చేసుకున్నాడు. దీన్ని సచిన్ వజే వినియోగిస్తున్నాడు. సదరు బిజినెస్ మ్యాన్‌కు సచిన్ వజే గతంలో ఓ వివాదంలో సాయం చేశాడు. అందుకు ప్రతిఫలంగా అతడు ఈ గదిని బుక్ చేశాడు’’ అని తెలిపారు.
‘‘వజే చివరగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఇన్నోవాలో వచ్చి హోటల్‌లో చెక్ ఇన్ అయ్యాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న ల్యాండ్ క్రూయిజర్‌లో వెళ్లాడు. ప్రస్తుతం ఈ రెండు వాహనాలను కూడా సీజ్ చేశాం. వజే కార్యకలాపాల గురించి డిపార్ట్‌మెంట్‌లో అందరికి తెలుసు. దీనికి సంబంధించి మా దగ్గర ఆధారులున్నాయి. ప్రస్తుతం డిప్యూటి కమిషనర్ హోదా వరకు ఓ 35 మందిని ప్రశ్నించాము. కొందరి స్టేట్‌మెంట్స్ రికార్డు చేశాం.. కొందరివి మౌఖికంగా విన్నాం. త్వరలోనే సచిన్ వజే సహచరులను కొందరిని అరెస్ట్ చేస్తాం’’ అని ఎన్‌ఐఏ అధికారి తెలిపారు.
ప్రారంభంలో అంబాని ఇంటి వద్ద బాంబు-బెదిరింపు కేసును విచారించిన సచిన్ వజే ఇప్పుడు హిరాన్ కేసులో ప్రధాన నిందితుడు. ఎన్‌ఐఏ ఈ కేసు దర్యాప్తులో భాగంగా దక్షిణ ముంబైలోని మరో హోటల్, ఒక క్లబ్, పొరుగున ఉన్న థానేలోని ఒక ఫ్లాట్‌లో గురువారం సోదాలు చేసింది. ఎన్‌ఐఏ అధికారులు వజే మహిళా సహచరుడిని విమానాశ్రయం నుంచి అదుపులోకి తీసుకుంది. ఈ రెండు కేసులకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ హోదా వరకు 35 మంది అధికారులను ఎన్‌ఐఏ విచారించింది.
Comments
Please login to add a commentAdd a comment