అంబానీ ఇంటి వద్ద కలకలం: వెలుగులోకి ఐఎం ఉగ్రవాది | Mukesh Ambani Security Scare Phone Traced To Tihar Cell Of IM Terrorist | Sakshi
Sakshi News home page

వెలుగులోకి ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది

Published Fri, Mar 12 2021 2:56 PM | Last Updated on Fri, Mar 12 2021 3:50 PM

Mukesh Ambani Security Scare Phone Traced To Tihar Cell Of IM Terrorist - Sakshi

ఐఎం ఉగ్రవాది తెహిసీన్‌ అఖ్తర్‌ (ఫైల్‌ ఫోటో) ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ

ముంబై: ఆసియా కుబేరుడు, పారిశ్రామికవేత్త ముకేష్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూస్తుండగా.. ఈ కేసు మూలం తీహార్‌ జైలులో బయటపడింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపింది తామే అంటూ ఓ ఉగ్రవాద సంస్థ  గతంలో ప్రకటించుకుంది. జైషే ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థ టెలిగ్రాం వేదికగా ఈ ప్రకటన చేసింది.

కాగా, ఈ టెలిగ్రాం మెసేజ్‌ను సీరియస్‌గా తీసుకున్న అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా.. ఈ కేసు మూలం తీహార్‌ జైలులో బయటపడింది. ఇక్కడ శిక్ష అనుభవిస్తోన్న ఉగ్రవాదులు కొందరు ఈ టెలిగ్రామ్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ గురువారం తీహార్‌ జైలు అధికారులను కలిశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ సందర్భంగా డిప్యూటి కమిషనర్‌ ప్రమోద్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘టెలిగ్రాం మెసేజ్‌ ఆధారంగా ముంబై పోలీసులు ఓ ప్రైవేట్‌ సైబర్‌ ఏజెన్సీ సాయంతో లోకేషన్‌ని ట్రేస్‌‌ చేయగా.. తీహార్‌ జైలు వెలుగులోకి వచ్చింది. దాంతో ఢిల్లీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్పెషల్‌ సెల్‌ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తీహార్‌ జైలు అధికారులు సోదాలు నిర్వహించగా.. ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాదులు తెహిసీన్ అఖ్తర్ సహా అల్‌ఖైదాతో సంబంధాలున్నవారు, అండర్‌వరల్డ్ డాన్‌లు ఉంటున్న బ్యారక్‌లో మొబైల్ ఫోన్‌ ఉన్నట్లు తెలిసింది. దీన్ని ఉగ్రవాది అఖ్తర్ నుంచి స్వాధీనం చేసుకోవడంతో ప్రస్తుతం అతడినే అనుమానిస్తున్నాం’’ అని తెలిపారు.

ఈ క్రమంలో తీహార్‌ జైలులో కనీసం 11 మంది జైలు ఖైదీలను ప్రశ్నించినట్టు జైలు వర్గాలు పేర్కొన్నాయి. ఈ మొబైల్‌ నంబరు వినియోగదారు టెలిగ్రామ్ ఖాతాను సృష్టించడానికి వర్చువల్ నంబర్లను వినియోగించాడు.. అంతేకాకుండా, అనుమానితుడు నెట్‌లో ఐపీ అడ్రస్‌ను గుర్తించకుండా ఉండేందుకు టీఓఆర్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

ముంబై పోలీసులు నియమించిన సైబర్ నిపుణులు టెలిగ్రామ్ ఛానల్ గురించి సమాచారం పొందడానికి ట్రోజన్లను ఉపయోగించారు. ఇది ఫిబ్రవరి 26 మధ్యాహ్నం ఈ టెలిగ్రాం గ్రూప్‌ను క్రియేట్ చేసినట్టు కనుగొన్నారు. అంబానీ నివాసం వెలుపల వాహనాన్ని నిలిపి ఉంచిన ఘటనకు బాధ్యత వహిస్తూ ఈ ఉగ్రవాద గ్రూపు ఫిబ్రవరి 27న టెలిగ్రామ్‌లో మెసేజ్‌ పోస్ట్ చేసింది. కానీ ముంబై పోలీసులు దీన్ని ఫేక్‌ అంటూ కొట్టి పారేశారు. ఇక తెహిసీన్‌ అఖ్తర్‌ 2014, నరేంద్ర మోదీ ర్యాలీ సందర్భంగా పాట్నాలో సీరియల్‌ బ్లాస్ట్‌లకు ప్లాన్‌ చేసినందుకు గాను ఇతడిని అరెస్ట్‌ చేశారు. అఖ్తర్‌కు గతంలో హైదరాబాద్‌, బోధ్‌గయాలో జరిగిన పేలుళ్లతో కూడా సంబంధం ఉంది. 

చదవండి:
అంబానీ ఇంటి వద్ద కలకలం: ‘అతడిని శిక్షించండి’

జైలు నుంచే ‘ఉగ్ర నెట్‌వర్క్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement