చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ అధికారులకు సోమవారం రాత్రి పేలుడు పరికరాలు లభ్యమవ్వడం కలకలం సృష్టించింది. అధికారుల కథనం మేరకు.. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా తిరుపతి శ్రీవారి మెట్టు వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక బ్యాగును గుర్తించారు. బ్యాగులో పేలుడుకు ఉపయోగించే సర్క్యుట్ బోర్డులు, సెల్‌ఫోను, వాక్‌మెన్, రెసిస్టర్లు, కెపాసిటర్లు, కండెన్సర్లు ఇతర పరికరాలను అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆర్‌ఎస్సై వాసు ఐజీ కాంతారావుకు సమాచారం అందించారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పేలుడుకు ఉపయోగించే పరికరాలుగా నిర్ధారించారు.
అనంతరం కాంతారావు బాంబు స్య్వాడ్‌కు సమాచారం అందించారు. వారూ ఘటనా స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు మీడియాతో మాట్లాడుతూ, ఇవి పేలుళ్లు సృష్టించడానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. అడవిలో ఎవరూ లేనిచోటుకు గుర్తుతెలియని వ్యక్తులు తీసుకొచ్చి వాటిని సిద్ధంచేసినట్లు తెలుస్తోందన్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులతో పాటు ఇతర వీఐపీలు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు వెళ్తుంటారని, అయితే.. ఎవరిని టార్గెట్ చేసి వీటిని తయారుచేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందని దర్యాప్తులో తేలుతుందని కాంతారావు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సంచీపై తమిళనాడు తిరుచ్చికి చెందిన చిరునామా ఉందని.. లభ్యమైన ఆధారాలకు అనుగుణంగా కేసును దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్ధాలను తిరుమల టూటౌన్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేస్తామన్నారు. అనంతరం కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు.
తిరుపతిలో పేలుడు పరికరాల స్వాధీనం
Published Tue, Jan 30 2018 4:11 AM | Last Updated on Tue, Jan 30 2018 7:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment