ఫలించిన ఎస్పీ స్కెచ్ ! | SP fruitful the sketch! | Sakshi
Sakshi News home page

ఫలించిన ఎస్పీ స్కెచ్ !

Published Thu, Feb 4 2016 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

ఫలించిన ఎస్పీ స్కెచ్ !

ఫలించిన ఎస్పీ స్కెచ్ !

 విజయనగరం: బొబ్బిలిలో నడుస్తున్న ప్రమాదకరమైన పేలుడు పదార్థాల విక్రయ రాకెట్‌ను పట్టుకోవడం వెనుక అద్భుతమైన వ్యూహాలు దాగి ఉన్నాయి. పేలుడు పదార్థాల విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నా బొబ్బిలి పోలీసులు పట్టించుకోకపోవడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ రచించిన పథకం ప్రకారం అక్రమార్కులను పట్టుకునేందుకు వారంరోజులు కసరత్తు చేశారు. పక్కా సమాచారం సేకరించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందులో ఓ పోలీస్ అధికారి ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా అవతారమెత్తడం విశేషం.

 
 ఇదీ అసలు కథ... బొబ్బిలిలోని దేవాంగుల వీధిలో జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లను కొన్నేళ్లుగా గెంబలి శ్రీనివాసరావు, గెంబలి తవిటయ్య, గెంబలి లక్ష్మీనారాయణ అనే ముగ్గురు సోదరులు అనధికారికంగా విక్రయిస్తున్నారు. వీరి నిర్వాకంపై అగ్నిమాపక శాఖాధికారులు ఒక నివేదిక కూడా ఇచ్చారు. కానీ, స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. పలు పర్యాయాలు ఉన్నతాధికారులు ఆరాతీసినా దొరకడం లేదని సమాధానం చెబుతూ వస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గెంబలి బ్రదర్స్ విక్రయాల ఆగడాలు ఎక్కువయ్యాయని స్థానికుల నుంచి ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ దృష్టికి వచ్చింది. ఆయన తొలుత స్థానిక పోలీసుల తీరును తెలుసుకున్నారు. వారి వల్లకాదని, తన కార్యాలయంలోనే పక్కా పథకం రచించారు.

స్పెషల్ బ్రాంచ్ విభాగం ద్వారా ఆ పథకాన్ని అమలు చేశారు. తొలుత స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అక్కడికెళ్లి పరిశీలించారు. స్థానిక  పోలీసులకు తెలియకుండా నిఘా పెట్టారు. గెంబలి బ్రదర్స్‌కు చెందిన మూడు షాపుల గదుల్లో ఉన్న బేకరీని తనిఖీ చేస్తే మొత్తం గుట్టంతా బయటికి వస్తుందని అంచనా వేశారు.  
 
 ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అవతారమెత్తిన పోలీసు అధికారి బేకరీని తనిఖీ చేయాలంటే ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఒక్కరికే అవకాశం ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.  వెంటనే ఒక పోలీస్ అధికారి ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా అవతారమెత్తారు. ఆ బేకరీకి వెళ్లి తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా బేకరీ వెనుక ఉన్న కొన్ని సంచులను పరిశీలించారు. గెంబలి బ్రదర్స్‌పై చర్యలు తీసుకోవాలంటే పక్కాగా పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా వెళ్లిన పోలీసు అధికారి వెనక్కి వచ్చి విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పక్కా వ్యూహంతో ఒక కొనుగోలుదారుడిని అక్కడికి పంపించి, పేలుడు పదార్థాలను కొనుగోలు చేయించారు. రెడ్‌హ్యాండెడ్‌గా తొలుత గెంబలి శ్రీనివాసరావును పట్టుకున్నారు.

ఆ తర్వాత దశల వారీగా తనిఖీలు నిర్వహించి అతని సోదరులు తవిటయ్య, లక్ష్మీనారాయణలను పట్టుకోవడంతోపాటు వివిధచోట్ల దాచి ఉంచిన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను కనుగొన్నారు. దీంతో గెంబలి బ్రదర్స్ పక్కా ఆధారాలతో పట్టుబడ్డారు. ఇప్పుడా బ్రదర్స్‌కు పేలుడు పదార్థాలను సరపరా చేస్తున్న వ్యక్తులపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందర్ని అనుమానించారు. జిల్లాలో విక్రయాలు జరుగుతున్నట్టుగా పలు అనుమానిత ప్రాంతాలను గుర్తించినట్టు తెలిసింది. గెంబలి బ్రదర్స్ చెప్పిన నానితోపాటు మరికొందరిపై నిఘా పెట్టారు. ఏ క్షణంలోనైనా పేలుడు పదార్థాల విక్రయ రాకెట్ అంతటినీ పట్టుకునే అవకాశం ఉంది.


 నిశిత పరిశీలనతోనే.. ‘బొబ్బిలిలో మేం పెట్టిన నిఘా, నిశిత పరిశీలనతోనే పేలుడు పదార్థాలను పెద్ద ఎత్తున పట్టుకోగలిగాం. ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలున్నాయా.. లేవా.. అనేదానిపై దృష్టి పెట్టాం. మాకు ఇంకెవరూ సమాచారం అందించలేదు.’
 - టి.త్రినాథ్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement