
అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి.. సభలో కూటమి నేతల తీరు ఏమాత్రం సహించడం లేదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ.. తమ అనుచరుల్ని సభలోకి తోలుకురావడంపై టీడీపీ ఎమ్మెల్యేలపైనే అసహనం వ్యక్తం చేసింది తెలిసిందే. అయితే..
ఇవాళ నాలుగో రోజు సెషన్‌లో మంత్రులపైనే ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. ఉదయం 9.గంకు సభ ప్రారంభం కాగా.. మంత్రుల్లో కొందరు సభకు ఆలస్యంగా వచ్చారు. ఇది గమనించిన స్పీకర్.. కాసేపు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో కార్మిక శాఖకు సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. సదరు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ టైంకి సభలో లేరు.
అనంతరం వచ్చిన మంత్రితో స్పీకర్ అయ్యన్న.. క్వశ్చన్ అవర్ ని మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని, మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా? అని, సమయం పాటించాలని హితవు పలికినట్లు సమాచారం. ఆలస్యానికి మంత్రి సుభాష్ క్షమాపణ చెప్పి.. మరోసారి ఇలా జరగదంటూ తన సీట్‌లో కూర్చున్నారు.
ఇక సమావేశాల ప్రారంభ రోజు.. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్‌లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత ఎమ్మెల్యేలతో స్పీకర్ అయ్యన్న చెప్పారు.