
వేసవి వినోదం...విజ్ఞానం
కంకిపాడు: వేసవిలో విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేలా గ్రంథాలయ సంస్థ చర్యలు చేపట్టింది. వినోదం, విజ్ఞానాన్ని పెంపొందించేలా వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 28న ప్రారంభం కానున్న శిక్షణ శిబిరాలు జూన్ 6వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 109 వరకూ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో జిల్లా గ్రంథాలయం 1, ప్రథమ శ్రేణి గ్రంథాలయాలు 7, ద్వితీయ శ్రేణి గ్రంథాలయాలు 18, తృతీయ శ్రేణి లైబ్రరీలు 83 ఉన్నాయి. ఆయా గ్రంథాలయాల్లో వివిధ రకాలైన పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్స్, సంస్కృతి, సంప్రదాయాలు, చర్రితలకు సంబంధించిన అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
విజ్ఞానాన్ని అందిస్తూ.. గ్రంథాలయాలను చేరువ చేస్తూ..
వేసవిలో స్నేహితులతో చక్కర్లు కొట్టడం, ఊర్లు తిరుగుతూ సందడిగా గడపటం చేస్తుంటారు. దీంతో పాఠశాలల పునఃప్రారంభం నాటికి చదువుపై పూర్తిగా అశ్రద్ధ, నిర్లక్ష్యం పెరుగుతున్నాయి. దీన్ని అధిగమిస్తూ, గ్రంథాలయ సంస్థ సేవలను విద్యార్థులకు చేరువ చేసే లక్ష్యంతో గ్రంథాలయ పరిషత్ వేసవి విజ్ఞాన శిబిరాలకు శ్రీకారం చుట్టింది. ఆట పాటలు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనను వెలికితీసేలా చిత్రలేఖనం, కథలు చెప్పటం, వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
లక్ష్యం ఘనం.. ఆచరణ భారం
లక్ష్యం ఘనంగా ఉన్నా ఆచరణలో శిబిరాల నిర్వహణ గ్రంథాలయ సిబ్బందికి పెనుభారంగా మారుతోంది. గ్రేడ్–1కి రూ.25 వేలు, గ్రేడ్–2కి రూ.15 వేలు, గ్రేడ్–3కి రూ.8 వేలుచొప్పున వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు సొమ్ము కేటాయించారు. సోమవారం నుంచి శిబిరాలు ప్రారంభించాల్సి ఉన్నా ఆ సొమ్ము సంబంధిత గ్రంథాలయాలకు చేరలేదు. దీంతో సిబ్బంది స్థానిక దాతలను సమన్వయం చేసుకుని శిబిరం నిర్వహణ చేయడంతో పాటు ఆఖరి రోజు ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించాల్సిన ఉంటుంది.
షెడ్యూల్ ఇదీ..
● ఉదయం 8.00 నుంచి 8.30 గంటల వరకూ కథలు వినడం
8.30 నుంచి 10 గంటల వరకూ పుస్తక పఠనం
● 10.00 నుంచి 10.10 వరకూ విరామం
● 10.10 నుంచి 10.30 వరకూ పుస్తక సమీక్ష
● 10.30 నుంచి 11.00 వరకూ కథలు చెప్పటం,
ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకూ స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్ చెస్, క్యారమ్స్, క్విజ్, జీకే తదితర అంశాలపై పోటీలు జరుగుతాయి.
గ్రంథాలయాల్లో నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలు జూన్ 6 వరకూ నిర్వహణ పఠనాశక్తి, విజ్ఞాన సముపార్జనే లక్ష్యం
అన్ని ఏర్పాట్లు పూర్తి
వేసవి శిబిరాలు ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 109 కేంద్రాలకు 103 కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉన్నారు. విద్యార్థుల్లో చదివే ఆసక్తి పెంచడం, నైపుణ్యాలను వృద్ధి చేయడం లక్ష్యంగా శిబిరాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. శిబిరాల నిర్వహణకు గ్రాంటు కూడా త్వరలోనే అందిస్తాం.
– రవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, మచిలీపట్నం