
ఆత్మహత్యకు పాల్పడిన టెన్త్ విద్యార్థి
శ్రీకాకుళం బలగ హడ్కో కాలనీలో విషాద ఘటన
శ్రీకాకుళం క్రైమ్ : అరవై శాతానికి పైగా వచ్చిన మార్కులు ఆ విద్యార్థికి అవమానంగా తోచాయి. తోటి పిల్లలతో పోల్చి చూసుకునే తత్వం ప్రాణాల మీదకు తెచ్చింది. గౌరవప్రదమైన మార్కులే అయి నా ‘పోటీ’ ప్రపంచానికి వాటిని చెప్పలేక ఓ బాలుడు ఊపిరి వదిలేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. బుధవారం ఉదయం జిల్లాకేంద్రంలోని బలగ హడ్కో కాలనీకి చెందిన పదోతరగతి విద్యార్థి గూరుగుబిల్లి వేణుగోపాలరావు(15) ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సంతోష్‌కుమార్, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..
జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని ఎయిడ్స్ కంట్రోల్‌బోర్డు సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న గూరుగుబిల్లి అమ్మినాయుడు తన భార్య, కుమార్తె, కుమారునితో కలసి బలగ హడ్కో కాలనీలో నివాసముంటున్నారు. కుమార్తె బీటెక్ ఇంజినీరింగ్ చదువుతుండగా కుమారుడైన వేణుగోపాలరావు స్థానిక ప్రైవేటు స్కూల్‌లో పదో తర గతి చదువుతున్నాడు.
393 మార్కులే రావడంతో..
బుధవారం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో వేణుగోపాల్ ఇంటి వద్దనే తల్లి మొబైల్‌లో ఫలితం చూసుకున్నాడు. అప్పటి నుంచి మౌనంగానే వేరే గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. అప్పటికే తనయుని ప్రవర్తనపై తల్లికి అనుమానం వచ్చింది. తలుపు కొట్టినా ఎంతకీ తీయకపోవడంతో ఆందోళన చెందిన తల్లి బయటకు వెళ్లి వేరేవారి మొబైల్ తీసుకుని భర్తకు కాల్ చేసింది. విధుల్లో ఉన్న వేణుగోపాల్ తండ్రి హుటాహుటిన ఇంటికొచ్చి తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. ఫ్యానుకు చీరతో ఉరేసుకున్న కుమారున్ని చూసి హతాశులయ్యారు. కొన ఊపిరైనా ఉంటుందేమోనని అంబులెన్సును పిలిపించి రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌కు చేరేసరికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించడంతో భోరున విలపించారు. అనంతరం వేణు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.