new political party
-
Actor Vijay: ‘ఎదుగుదలకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు’
చెన్నై: ‘తమిళగ వెట్రి కళగం’పార్టీని ప్రకటించిన సినీనటుడు విజయ్ దళపతి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు, బృందాలను రంగంలోకి దించబోతున్నారని సమాచారం. తాజాగా విజయ్ ఒక లేఖను విడుదల చేశారు. ‘నా ఎదుగుదలకు సహకరించిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు. సినీరంగ ప్రముఖులు, వివిధ రాజకీయపార్టీ నేతలు, అభిమానులు, అండగా నిలిచిన మీడియా అందరికీ కృతజ్ఞతలు. గుండెల్లో నింపుకున్న అభిమానులు అందిరికీ థ్యాంక్యూ. తమిళ ప్రజలు సంక్షేమం కోసం రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నా.. విజయం సాధిస్తా..’ అని విజయ్ లేఖలో పేర్కొన్నారు. -
Tamil Nadu politics: రాజకీయాల్లోకి ‘దళపతి’ విజయ్
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయ ముఖచిత్రంపై మరో అగ్రతార మెరిసింది. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు తమిళ అభిమానుల ‘దళపతి’, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదలచేశారు. ‘‘తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నాం. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేశాం. 2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేయడమే మా లక్ష్యం. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వబోం. అవినీతి, అధ్వాన్న పరిపాలన, విభజన రాజకీయాలతో పాలిటిక్స్‌ను భ్రషు్టపట్టించారు. నిస్వార్థంగా, పారదర్శకంగా, మార్గదర్శకంగా, అద్భుతమైన పరిపాలనకు బాటలు పరిచే రాజకీయ ఉద్యమం కోసం తమిళ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కుల, మత విభేదాలకు అతీతంగా పాలించే అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ’’ అని విజయ్ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు విజయ్, సీనియర్ నేతలు గత నెల 25వ తేదీన పార్టీ సర్వసభ్య మండలి, కార్యనిర్వాహణ మండలి సమావేశంలో పాల్గొని పార్టీ నియమావళి, నిబంధనలకు ఆమోద ముద్ర వేశారని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నాళ్లనుంచో సేవ చేద్దామనుకుంటున్నా ‘‘రాజకీయాల్లో మార్పులు తేగల సత్తా ప్రజా ఉద్యమానికే ఉంది. అది మాత్రమే తమిళనాడు పౌరుల హక్కులను కాపాడగలదు. కన్న తల్లిదండ్రులతోపాటు నాకు పేరు ప్రతిష్టలు తెచి్చన రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నా. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి, విజయం సాధించి ప్రజలు కలలుగన్న రాజకీయ మార్పుకు బాటలు వేయడమే మా లక్ష్యం. ఈసీ నుంచి అనుమతులు వచ్చాక పార్టీ కార్యక్రమాలు మొదలుపెడతాం. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ కార్యకర్తలను సంఘటితం చేసి పార్టీ విధానాలు, పార్టీ జెండా, పార్టీ గుర్తు, ఇతర కార్యాచరణకు తుదిరూపునిస్తాం’’ అని విజయ్ స్పష్టంచేశారు. ‘‘ రాజకీయాలంటే సినిమా ప్రపంచం నుంచి నాకు ఒక విరామం కాదు. తపనతో రాజకీయాల్లోకి వస్తున్నా. రాజనీతి అంటే ప్రజలకు గొప్పగా సేవ చేయడం. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసి రాజకీయాలకు అంకితమవుతా’’ అని అన్నారు. -
రాజకీయాల్లోకి తమిళ నటుడు విజయ్?
చెన్నై: తమిళ నటుడు దళపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకుగాను త్వరలోనే కొత్తగా రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. చెన్నైలో గురువారం జరిగిన విజయ్ అభిమానుల సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’సర్వసభ్య సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. విజయ్ అధ్యక్షతన ఏర్పాటయ్యే పార్టీకి నియమ నిబంధనలను ఖరారు చేసే అధికారం కూడా ఈ సమావేశం విజయ్‌కే వదిలేసింది. నెలలోగా పార్టీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారని సమాచారం. తమిళనాడుతోపాటు కేరళలోనూ విజయ్‌కు భారీగా అభిమానులున్నారు. ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ విజయ్ అభిమానుల సంఘం పోటీ చేసింది. 2026 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తానంటూ గతంలోనే ఆయన ప్రకటించారు. -
కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన ప్రజా గాయకుడు గద్దర్
-
కొత్త పార్టీ ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి.. 2023లో అక్కడి నుంచే పోటీ!
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీని స్థాపించారు. కొద్ది రోజుల క్రితం తుమకూరు నగరంలో ఉన్న సిద్ధగంగా మఠాన్ని సందర్శించిన సందర్భంగా సొంత పార్టీపై సూత్రప్రాయంగా వెల్లడించిన గాలి జనార్దన్ రెడ్డి.. ముందుగా చెప్పినట్లుగానే డిసెంబర్ 25న కొత్త పార్టీ ప్రకటన చేశారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బీజేపీలో కొనసాగిన ఆయన.. నాయకత్వం బుజ్జగించినప్పటికీ కొత్త పార్టీవేపై మొగ్గు చూపారు. బీజేపీతో రెండు దశాబ్దాల బందానికి తెరదించారు. మరోవైపు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పల్ జిల్లాలోని గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ‘నేను ఆ పార్టీ సభ్యుడిని కానని దానితో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన వాడినేనని ప్రజలు విశ్వసించారు. ఆ నమ్మకం అబద్ధమని తేలింది. నా సొంత ఆలోచనతో ఈ రోజు కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని ప్రకటిస్తున్నాను. మతం, కులం పేరుతో చేసే విభజన రాజకీయాలకు ఈ పార్టీ దూరంగా ఉంటుంది. నా జీవితంలో మొదలు పెట్టిన ఏ విషయంలోనూ విఫలం కాలేదు. నా చిన్నతనంలో గోళీలు ఆడుకునేప్పటి నుంచి ఇప్పటి వరకు పరాజయాన్ని ఆమోదించని వ్యక్తిని. ప్రజల ఆశిస్సులు ఉంటాయనే విశ్వాసం ఉంది. భవిష్యత్తులో కర్ణాటక కల్యాణ రాజ్యంగా(సంక్షేమ రాష్ట్రంగా) అవతరిస్తుంది.’ - గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు 9 మందిపై 2009లో సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబర్‌లో జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నాలుగేళ్ల తర్వాత 2015లో కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురంకు వెళ్లరాదని స్పష్టం చేసింది. అయితే, 2020లో మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లగా ఆయా జిల్లాల ఎస్పీలకు తెలియజేసిన తర్వాత వెళ్లేందుకు వీలు కల్పించింది. ఇదీ చదవండి: పొలిటికల్ పార్టీపై మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి క్లారిటీ.. 'ఆ రోజే అన్ని చెబుతా' -
డిసెంబర్ కల్లా నేషనల్ హైవేపై కేసీఆర్ జాతీయ పార్టీ
సాక్షి, హైదరాబాద్: కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రకటన ముహూర్తాన్ని వాయిదా వేసే యోచనలో ఉన్నారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు పూర్తిగా కొలిక్కి రాకపోవడం, జాతీయ స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా.. ముందు భావించినట్టు దసరాకు కాకుండా కొంత వెనక్కి జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పార్టీ ఏర్పాటు కసరత్తు కొలిక్కి వచ్చే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. జెండా, ఎజెండాపై లోతుగా చర్చ ప్రస్తుతం జాతీయ పార్టీ జెండా, ఎజెండా, పేరు సంబంధిత అంశాలపై, టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చడంలో ఎదురయ్యే సాంకేతిక అవరోధాలపై లోతుగా చర్చిస్తున్నారు. తెలంగాణ మోడల్‌ను జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన నిధులు, అనుసరించాల్సిన ప్రణాళిక తదితరాలపైనా ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మంతనాలు కొనసాగుతున్నాయి. కొత్త జాతీయ పార్టీ ఎజెండాలో చేర్చే ప్రతి అంశాన్నీ ఆచరణ సాధ్యం చేసేందుకు తమ వద్ద ఉన్న ప్రణాళికలను కూడా వివరించాలని కేసీఆర్ నిర్ణయించారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి న్యాయ నిపుణులు, గతంలో ఎన్నికల సంఘంలో పనిచేసిన కొందరు కీలక అధికారులతో కూడిన బృందం సలహాలు కూడా తీసుకుంటున్నారు. విపక్షాలు, ప్రాంతీయ పార్టీల వైఖరి పరిగణనలోకి తీసుకుని లెక్కలు మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా హరియాణాలో ఈ నెల 25న జరిగిన సమ్మాన్ దివస్‌కు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరితో పాటు పలువురు విపక్ష నేతలు పాల్గొన్నారు. కాగా నితీష్‌తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు మొగ్గు చూపుతుండటంతో సీఎం కేసీఆర్ సమ్మాన్ దివస్‌కు దూరంగా ఉన్నట్లు తెలిసింది. బిహార్‌లో బీజేపీతో నితీష్ తెగతెంపులు, సోనియాతో భేటీ, మహారాష్ట్ర శివసేనలో చీలిక వంటి పరిణామాలను పార్టీ అధినేత నిశితంగా పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో సయోధ్యతో పనిచేస్తూనే కొత్త జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై కేసీఆర్ విభిన్న కోణాల్లో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రాంతీయ పార్టీల్లో చాలావరకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంపైనే ఆసక్తి చూపుతుండటాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసింది. డిసెంబర్‌లోగానే ముహూర్తం..! కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్న పార్టీలు, నేతలతో వేదిక పంచుకుంటే ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే హరియాణా భేటీకి కేసీఆర్ దూరంగా ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలుసార్లు ప్రకటనలు చేసిన నేపథ్యంలో.. ఆ దిశగా అడుగులు ముందుకు పడకపోతే ప్రతికూల ప్రచారం జరిగే అవకాశముందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది డిసెంబర్‌లోగా పార్టీ ముహూర్తాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అప్పటివరకు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన వారితో జాతీయ అంశాలపై భేటీలు, మంతనాలు కొనసాగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రతి రాష్ట్రం నుంచి ఒకరిద్దరు పార్టీలో చేరేలా.. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటించే నాటికే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకరిద్దరు బలమైన నేతలు కొత్త పార్టీలో చేరేలా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘేలా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమ్‌చంద్రన్ ఇటీవల భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ను ఆహ్వానించడంతో పాటు తాము కూడా కొత్త పార్టీలో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తూనే, చిన్నా చితకా పార్టీల విలీనం, వారి నుంచే వచ్చే డిమాండ్లను తట్టుకోవడం తదితరాలపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దసరా నాటికి కొత్త జాతీయ పార్టీకి తుది రూపునివ్వడం కష్టమనే అభిప్రాయంతో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ఇదే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ మాజీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీని స్థాపిస్తానని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరును ఆయన సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉర్దూ, సంస్కృతంలో దాదాపు 1500 పేర్లు పరిశీలించామని చెప్పారు. హిందూ, ఉర్దూ రెండూ కలిపితే హిందూస్థానీ అన్నారు. ప్రజాస్వామ్యం, శాంతి, స్వాత్రంత్ర్యాన్ని ప్రతిబించేలా పార్టీ పేరు ఉండాలనుకున్నామని ఆజాద్ చెప్పారు. అందుకే చివరగా 'డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ' పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ పార్టీ జెండా నిలువుగా మూడు రంగుల్లో ఉంది. నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికలో తీర్చిదిద్దారు. కశ్మీర్ ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ఎజెండా అని ఆజాద్ అన్నారు. ప్రస్తుతం తన పార్టీ జమ్ముకశ్మీర్‌కే పరిమితం అవుతుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించే విషయంపై ఆలోచిస్తానని ఆజాద్ ఇప్పటికే చెప్పారు. కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధానికి తెగదెంపులు చేసుకొని గత నెలలోనే పార్టీకి రాజీనామా చేశారు ఆజాద్. హస్తం పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2017లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక పార్టీలో సంప్రదింపుల ఆనవాయితీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు వైద్యుడు చికిత్స అందిచాల్సింది పోయి కాంపౌడర్లు చికిత్స చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చదవండి: రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ సమీక్ష.. హుటాహుటిన ఢిల్లీకి వేణుగోపాల్ -
త్వరలో మరో కొత్త రాజకీయ పార్టీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి దివంగత పి.శివశంకర్ తనయుడు, కాంగ్రెస్ నేత డాక్టర్ వినయ్ కుమార్ నేతృత్వంలో ఈ పార్టీ ఏర్పాటు కాబోతుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వినయ్ కుమార్ వెల్లడించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఆయన తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ పార్టీల్లో కరువయ్యాయని అన్నారు. ప్రజలకు ఉచితంగా అందాల్సిన విద్య, వైద్యాన్ని వ్యాపారం చేశారని, ఆత్మాభిమానం గల రైతును రుణమాఫీ, ఇతర స్కీంల పేరుతో చేతులు చాచే స్థితికి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. నవంబర్‌లో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తామని పార్టీ వ్యవస్థాపక సభ్యులు నరహరి, విఠల్ తదితరులు తెలిపారు. -
Amarinder Singh: కెప్టెన్ ప్రభావమెంత?
పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి నెల రోజుల క్రితం అవమానకర రీతిలో తప్పుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ (79) కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికారం నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కడానికి శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ, తదితర పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. అమరీందర్ పార్టీ రాష్ట్ర రాజకీయాలను ఏమేరకు ప్రభావితం చేస్తుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. అమరీందర్ పార్టీ బీజేపీతో, శిరోమణి అకాలీదళ్‌లోని చీలిక వర్గాలతో పొత్తు పెట్టుకొనే అవకాశం ఉన్నట్లు సంకేతాలిస్తోంది. పంజాబ్‌లో కొత్త పార్టీతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్న చర్చ మొదలయ్యింది. అమరీందర్ ఎత్తుగడలను బీజేపీ స్వాగతిస్తుండగా, అధికార కాంగ్రెస్ ఆయన కొత్తగా పార్టీ పెట్టి, సాధించేది ఏమీ ఉండదంటూ తేలిగ్గా కొట్టిపారేస్తోంది. ప్రధాని మోదీ సూచనల మేరకే అమరీందర్ కొత్త కుంపటి పెడుతున్నారని ఆప్ ఆరోపించింది. కెప్టెన్ వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు! అమరీందర్ గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూతో విభేదాలు, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మంత్రాంగం వల్ల ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే, ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బలమైన అనుచర వర్గాన్ని తయారు చేసుకున్నారు. వ్యక్తిగతంగా కూడా అమరీందర్‌కు పంజాబ్ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మొత్తం 117 స్థానాలున్న శాసనసభలో కాంగ్రెస్‌కు 77 మంది సభ్యుల బలముంది. ఇందులో 12 మందికిపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ అమరీందర్ సింగ్ మద్దతుదారులుగానే కొనసాగుతున్నారని, కొత్త పార్టీ స్థాపించగానే వారంతా వచ్చి, ఎన్నికల ముందు అందులో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఎంతమంది ఎమ్మెల్యేలు కెప్టెన్ వెంట నడుస్తారన్నది ఇప్పుడే తేలకపోయినా కాంగ్రెస్‌కు మాత్రం ఎంతోకొంత నష్టం తప్పదని చెప్పొచ్చు. అంటే అమరీందర్ కొత్త పార్టీతో మొదట నష్టపోయేది కాంగ్రెస్సే. మరోవైపు సిద్ధూతో కాంగ్రెస్ అధిష్టానానికి నిత్యం ఏదో ఒక తలనొప్పి ఎదురవుతూనే ఉంది. తన అనుచరుడే అయినప్పటికీ కొత్త దళిత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో సైతం సిద్ధూకు పొసగడం లేదు. ఈ అంతర్గత కుమ్ములాటలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూలంగా పరిణమించే అవకాశాలున్నాయి. విసిగివేసారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించినా.. ఆఖరి నిమిషంలో అమరీందర్ పార్టీలోకి జంప్ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు తెలిసినప్పటికీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చతుర్ముఖ పోరు... సర్దార్ల రాష్ట్రం పంజాబ్‌లో అధికారం ఎప్పుడూ శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ కూటముల మధ్యే చేతులు మారుతోంది. మరో కూటమికి అవకాశం దక్కడం లేదు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శక్తిమేర పోరాడి 23.7 శాతం ఓట్లు, 20 సీట్లతో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పంజాబ్‌లో తమకు అవకాశాలుంటాయని భావిస్తున్న ఆప్ చాలాకాలంగా ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టి పనిచేస్తోంది. మరోవైపు పంజాబ్ జనాభాలో ఏకంగా 32 శాతం మంది దళితులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శిరోమణి అకాలీదళ్... బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. 20 సీట్లను బీఎస్పీకి వదిలి... 97 స్థానాల్లో పోటీచేయనుంది. ఇప్పటికే సింహభాగం స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది కూడా. ఈసారి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతోపాటు శిరోమణి అకాలీదళ్‌లోని చీలిక వర్గాలైన రంజిత్ సింగ్ బ్రహ్మపురా, సుఖ్‌దేవ్ ధిండ్సాతో చేతులు కలిపితే.. రాష్ట్రంలో మొత్తం నాలుగు రాజకీయ కూటములు తెరపైకి వస్తాయి. అప్పుడు ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. గతంలో సొంత కూటమి ఫెయిల్ అమరీందర్ కొత్త రాజకీయ కూటమి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆయన 1984లో కాంగ్రెస్‌ను వీడి శిరోమణి అకాలీదళ్‌లో చేరారు. 1992లో అకాలీదళ్ నుంచి బయటకు వచ్చారు. శిరోమణి అకాలీదళ్(పాంథిక్) పేరిట సొంతంగా ఒక పొలిటికల్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 1997లో తన కూటమిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగారు. రాష్ట్రంలో రెండు సార్లు (2002–07, 2017–22) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం వెనుక కీలక పాత్ర పోషించారు. తనను అవమానించిన కాంగ్రెస్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారం తీర్చుకోవాలని అమరీందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన రాజకీయం జీవితం ముగింపునకొచ్చినట్లేనని, ఇదే చివరి అవకాశమని పరిశీలకులు చెబుతున్నారు. కొత్త పొత్తు పొడిచేనా! అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ పట్ల సానుకూల ధోరణి కనబర్చారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను గట్టిగా సమర్థించారు. పాకిస్తాన్ భూభాగంలో నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్‌తోపాటు సరిహద్దుల్లో ఇటీవల బీఎస్ఎఫ్ పరిధిని పెంచడం మంచి పరిణామం అని కితాబిచ్చారు. అందుకే బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారన్న వార్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. బీజేపీతో కలిసి కూటమి కట్టడానికి అమరీందర్‌కు ఉన్న ఏకైక అభ్యంతరం మూడు నూతన వ్యవసాయ చట్టాలు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఈ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. రైతు సంఘాలతో చర్చలు జరపాలని, సాగు చట్టాల విషయంలో రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అమరీందర్ సింగ్ కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్ర సర్కారు కొంత దిగివచ్చినా తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. మితవాది అనే పేరు, సైనిక నేపథ్యం ఉండడం అమరీందర్‌కు బీజేపీతో జట్టు కట్టడానికి కలిసి వస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, ఇతర పక్షాలను కలుపుకొని భారీ రాజకీయ కూటమిని ఏర్పాటు చేయాలన్నది అమరీందర్ ఆలోచనగా చెబుతున్నారు. నిజానికి ఎన్డీయేలోనే భాగస్వామ్య పక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్ గత ఏడాది నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీఆర్ఎస్ వ్యతిరేకులతో త్వరలో కొత్త పార్టీ
సాక్షి, తాండూరు టౌన్: టీఆర్ఎస్ వ్యతిరేకులతో కలిసి రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతానని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేకులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తాండూరుకు వచ్చిన కొండా పలువురు స్థానిక నేతలను కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా దోచుకుంటోందని ఆరోపించారు. తాను టీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచినప్పటికీ పార్టీ తీరు నచ్చక కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. అయితే కాంగ్రెస్ పోరాడే తత్వాన్ని మరిచిపోయిందని, అందుకే ఆ పార్టీని వీడానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమయ్యానని, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. వీరందరూ కలిసొస్తే కొత్త పార్టీకి రెడీ అని, తానొక్కడిని మాత్రం పార్టీ పెట్టేది లేదని వెల్లడించారు. టీఆర్ఎస్ వ్యతిరేకులంతా ఏకం కాని పక్షంలో బీజేపీలో చేరుతానని తెలిపారు. ఇప్పటికే తాను కోదండరాం, తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకర్, మహబూబ్‌ఖాన్, దాసోజు శ్రావణ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులను కలిశానని, త్వరలోనే రేవంత్‌రెడ్డిని కలుస్తానని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. ఒకప్పటి కాంగ్రెస్ నేతలు సబితారెడ్డి, సుధీర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి వలె అమ్ముడుపోయే నేతలను కలుపుకొనిపోయే పరిస్థితి ఉండదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో అనేకమంది కోవర్టులు ఉన్నారని కొండా ఆరోపించారు. ఆయనతో పాటు టీజేఎస్ తాండూరు నేత సోమశేఖర్, కాంగ్రెస్ నేత రఘునందన్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
రాయలసీమ వేదికగా మరో రాజకీయ పార్టీ!
సాక్షి, కడప: రాయలసీమ వేదికగా మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రొద్దుటూరు జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ఇంజా సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ సమతా పార్టీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా పార్టీ జెండా, లోగోను వ్యవస్థాపక అధ్యక్షుడైన ఇంజా సోమశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. విద్య, వైద్యం, సంక్షేమం ప్రధాన ఎజెండాగా పార్టీని స్థాపిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు, అభివృద్ధి కోసం ప్రత్యక్ష రాజకీయాల ద్వారా కృషి చేస్తామని చెప్పారు. -
కొత్త పార్టీని స్థాపించిన సివిల్స్ టాపర్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, 2010 సివిల్స్ టాపర్ షా ఫైజల్ ఆదివారం జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూమెంట్ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రాజ్‌బాగ్ పట్టణంలోని గిండున్ గ్రౌండ్లో పార్టీని ఆవిష్కరించనున్నట్టు ఫైజల్ తెలిపారు. కశ్మీరీలపై నిరాటంకంగా కొనసాగుతున్న ఆకృత్యాలు, అణచివేతను నిరసిస్తూ యూపీఎస్సీ 2010 బ్యాచ్ టాపర్ అయిన ఫైజల్.. ఐఏఎస్ పదవికి ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేంద్రం కీలక ప్రభుత్వ సంస్థలను నాశనం చేసేలా వ్యవహరిస్తున్నదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహార తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లిం, దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫైజల్ ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతిరహిత, పారదర్శక రాజకీయాల కోసం తనకు మద్దతుగా నిలువాలని కొంతకాలంగా యువతతోపాటు వివిధ వర్గాలను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. కశ్మీర్లో శాంతిని కోరుకుంటున్న పలువురు యువనాయకులు ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఆయన ఎలాంటి ప్రకటన చేయ్యలేదు. -
మరో కొత్త రాజకీయపార్టీ
సాక్షి, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): స్త్రీ అభివృద్ధే సమాజాభివృద్ధి నినాదంతో ‘నారీశక్తి’ పేరుతో నూతన జాతీయ రాజకీయపార్టీ ఆవిర్భవించింది. విజయవాడలోని జింఖానా మైదానం వద్ద ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో నూతన రాజకీయపార్టీ ఆవిర్భావ సభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకురాలు కావూరి లావణ్య, ప్రవాసాంధ్రురాలు నారీశక్తి ఆవిర్భావం, లక్ష్యాలను వివరించారు. లావణ్య తల్లిదండ్రులు కావూరి కృష్ణమూర్తి, కారుణ్య దంపతులు నారీశక్తి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమన్నారు. స్త్రీలకు భవిత కోసం పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. న్యాయవాది లంకా పద్మజ మాట్లాడుతూ.. స్త్రీలపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, మహిళా ఐపీఎస్‌లకే భద్రతలేని పరిస్థితి నెలకొందని, నిర్భయ వంటి చట్టం వచ్చినా దాడులు ఆగడం లేదన్నారు. మాజీ మేయర్ మల్లికా బేగం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే వాటిల్లో 15 మంది మహిళలు కూడా లేరన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు చంద్రికా నాయుడు, సుంకర నాగలక్ష్మీ, షబ్బీర్ అహ్మద్, ఎం.కొండయ్య, నారాయణరావు పాల్గొన్నారు. -
కొత్త పార్టీని ప్రారంభించిన కార్తీక్
పెరంబూరు(చెన్నై): సీనియర్ నటుడు కార్తీక్ కొత్త పార్టీని ప్రారంభించారు. ఇంతకుముందు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ తరువాత నాడాళుమ్ మక్కళ్ కట్చి పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు. ఆ తరువాత కార్తీక్ కొన్ని సమస్యల కారణంగా రాజకీయాలకు దూరం అయ్యారు. ఇటీవలే మళ్లీ నటించడం మొదలుపెట్టిన కార్తీక్ మనిద ఉరిమై కాక్కుం కట్చి పేరుతో మరో రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయనే శనివారం నెల్లైలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరువాత తాను సొంతంగా ప్రారంభించిన నాడాళుం మక్కళ్ కట్చిలోని సభ్యులే తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని రద్దు చేసినట్లు చెప్పారు. -
యూపీపీ.. ఉపేంద్ర కొత్త పార్టీ
సాక్షి బెంగళూరు: విలక్షణ నటుడు ఉపేంద్ర కొత్త పార్టీని ప్రారంభించారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)తో సరికొత్తగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల క్రితం కర్ణాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ (కేపీజేపీ)కి గుడ్ బై చెప్పి కొత్త పార్టీ ఏర్పాటుపై ఉపేంద్ర దృష్టి సారించారు. పాలనలో జవాబుదారీతనం, ఆర్థిక పారదర్శకత ఉండాలనే లక్ష్యంతో ఉత్తమ ప్రజాకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రియల్‌స్టార్ ఉపేంద్ర మంగళవారం తన 51వ పుట్టిన రోజు సందర్భంగా ఇక్కడ తన నివాసంలో పార్టీని, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కులం, డబ్బు, వర్గం, ఆయుధాలను విడిచి జావాబుదారితనంతో కూడిన పాలన అందించడమే తమ పార్టీ ఆశయమని ఉపేంద్ర చెప్పారు. పల్లె, గ్రామం, నగరం తదితర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలను మొబైల్‌తో చిత్రీకరించి పార్టీ వెబ్‌సైట్‌కు పంపించాలని సూచించారు. తాము ఆ వీడియో చూసి మేధావులతో చర్చించ పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో చేరేవారికి పరీక్ష దూరదృష్టి కలిగి, ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతామని తెలిపారు. పార్టీలో చేరేవారికి తొలుత లిఖిత పరీక్ష నిర్వహిస్తామని ఉప్పి చెప్పారు. త్వరలోనే యాప్ విడుదల చేస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఆలోచించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఒకే రోజు ముగ్గురి పుట్టినరోజు.. మంగళవారం కన్నడ చిత్రసీమలో ఒకేరోజు ముగ్గురు నటుల పుట్టినరోజు. దివంగత విష్ణువర్ధన్, రియల్‌స్టార్ ఉపేంద్ర, నటి శృతి పుట్టినరోజులు జరిగాయి. బెంగళూరులో విష్ణువర్ధన్ సమాధి వద్ద అభిమానులు పెద్దెత్తున పుష్పాంజలి ఘటించారు. రక్తదానం, అన్నదానం నిర్వహించారు. -
మరో కొత్తపార్టీ!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ కుటుంబం నుంచి మరో కొత్త పార్టీ శనివారం ఆవిర్భవించింది. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం పేరిట పార్టీని టీటీవీ భాస్కరన్ ఏర్పాటు చేశారు. నీలంకరైలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరును, జెండాను భాస్కరన్ ప్రకటించారు. తమ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడి కేంద్రంగా చిన్నమ్మ శశికళ కుటుంబం ఒకప్పుడు సాగించిన రాజకీయదందా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ జయలలిత, నెచ్చెలి శశికళను అడ్డం పెట్టుకుని ఈ కుటుంబం మన్నార్‌కుడి మాఫియాగా ఎదిగిందని చెప్పవచ్చు. అయితే, జయలలిత మరణం తదుపరి పరిణామాలు, చిన్నమ్మ జైలు జీవితం వెరసి ఈ కుటుంబాన్ని కష్టాలపాలు చేశాయి. చిన్నమ్మ గుప్పెట్లో ఉన్న అన్నాడీఎంకే చేజారడం పెద్ద షాక్. ఆ తదుపరి పరిణామాలు చిన్నమ్మ ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఐటీ దాడులు ఓ వైపు, పాత కేసుల విచారణలు మరోవైపు ఈ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అదే సమయంలో రాజకీయ ఉనికి చాటుకునే రీతిలో చిన్నమ్మ ప్రతినిధిగా, ఆమె అక్క వనితామణి కుమారుడు దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే కేడర్‌ను చీల్చడంలో సఫలీకృతుడైన దినకరన్, తన బలాన్ని చాటుకునేందుకు రంకెలు వేస్తున్నారు. ఈ పార్టీ రూపంలో చిన్నమ్మ సోదరుడు, మేనమామ దివాకరన్‌తో ఏర్పడ్డ విభేదాలు దినకరన్‌కు కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టాయి. చిన్నమ్మ కుటుంబం నుంచి మరో పార్టీ దివాకరన్ నేతృత్వంలో పుట్టుకు వచ్చింది. తన వారసుడు జై ఆనంద్‌ను రాజకీయంగా ఉన్న స్థానంలో కూర్చొబెట్టడం లక్ష్యంగా అన్నాద్రావిడర్ కళగంను దివాకరన్ ప్రకటించుకున్నారు. ఈయన సైతం తన బలాన్ని చాటే దిశగా కుస్తీలు పట్టే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో అన్నయ్య దినకరన్, మేనమామ దివాకరన్లనుఢీకొట్టే రీతిలో చిన్నమ్మ కుటుంబం నుంచి మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఈ పార్టీని దినకరన్ సోదరుడు, నటుడు టీటీవీ భాస్కరన్ ప్రకటించారు. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం: కుటుంబ విభేదాల నేపథ్యంలో అన్నయ్య దినకరన్, మేనమామ దివాకరన్ బాటలో కొత్త పార్టీ ప్రకటనకు గత నెల భాస్కరన్ సిద్ధమయ్యారు. అయితే, భాస్కరన్ మహానాడును తలపించే రీతిలో తిరుత్తణి వేదికగా పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, అధికార పక్షం భాస్కరన్‌కు చెక్ పెట్టే రీతిలో వ్యవహరించింది. హంగామాతో సత్తా చాటుకోవాలనుకున్న భాస్కరన్ మహానాడుకు అనుమతి నిరాకరించారు. దీంతో వెనక్కు తగ్గిన భాస్కరన్, హంగు ఆర్భాటాలు లేకుండా, నిరాడంబరంగా శనివారం నీలాంకరై వేదికగా తన కొత్త పార్టీని ప్రకటించుకున్నారు. ఉదయం తన నివాసంలో దురైరాజ్ – ఝాన్సీ దంపతులకు వివాహాన్ని తన చేతుల మీదుగా భాస్కరన్ జరిపించారు. అనంతరం కొత్త పార్టీని మద్దతుదారులు, అభిమానుల సమక్షంలో ప్రకటించారు. అన్నా జయంతిని పురస్కరించుకుని పార్టీని ప్రకటించాలన్న లక్ష్యంతో ఈ ప్రకటన చేస్తున్నట్టు వివరించారు. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగంగా పార్టీ పేరును ప్రకటించారు. పై భాగంలో ఆరంజ్ (కమలా పండు) రంగు, మధ్య భాగంలో పచ్చ, కింది భాగంలో నలుపు వర్ణంతో కూడి మధ్య భాగంలో ఎంజీఆర్ ముఖ చిత్రంతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ భారీ ఎత్తున పార్టీని ప్రకటించాలని తాను సంకల్పించినా, అందుకు తగ్గ అనుమతుల్ని ఈ పాలకులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తన పార్టీని చూసి పాలకులకే గుబులు పట్టుకుందంటే, ఇక, మిగిలిన పార్టీలకు తనను చూస్తే ముచ్చెమటలేనని ధీమా వ్యక్తం చేశారు. అన్నా జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం నిరాడంబర ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. త్వరలో పార్టీ కార్యవర్గం ప్రకటించనున్నట్టు తెలిపారు. తమ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముందుకు సాగుతుందని ప్రకటించారు. మోదీని మళ్లీ పీఎం చేయడం లక్ష్యంగా శ్రమిస్తామన్నారు. అవినీతి రహిత పాలన లక్ష్యంగా ముందుకు సాగే వాళ్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాని తెలిపారు. అన్నా, ఎంజీఆర్ మద్దతుదారులు, అభిమానుల్ని కలుపుకుని బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కాగా, అన్నయ్య మద్దతుదారుల్ని ఇరకాటంలో పెట్టే రీతిలో తమ్ముడు పార్టీ పేరును ప్రకటించడం గమనార్హం. అన్నయ్య దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను ప్రకటించుకున్నారు. ఇక అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం (ఏఎంఎంకే)ను తమ్ముడు ప్రకటించడం గమనార్హం. -
త్వరలో కొత్త పార్టీ పెడతాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎన్.చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు బీసీలపట్ల అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ త్వరలో రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ బహిరంగ సభ పెట్టినా బీసీలంతా మన కోసం పార్టీ పెట్టన్నా..’అని అడుగుతున్నారని చెప్పా రు. పార్టీ ఏర్పాటుపై చర్చలు సాగుతున్నాయన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న గుంటూరు, నిన్న విజయవాడ, అంతకుముందు వరంగల్‌లో పెట్టిన సభల్లో చాలామంది ‘ఈ అగ్రకుల పార్టీల నేతలు మనకు సరైన ప్రాధాన్యతను ఇవ్వట్లేదు, ఎంతసేపు మనల్ని అడుక్కుతినే వాళ్లల్లానే చేస్తున్నారు, సీట్ల విషయంలో మొండిచెయ్యి చూపుతున్నారు, కాబట్టి నువ్వు పార్టీ పెట్టాల్సిందే’అని అంటున్నారని చెప్పారు. పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఏపీలోనే పెడతాననిç Ü్పష్టం చేశారు. ఏపీలోనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతోందన్నారు. ఈసారి ఎక్కడ నుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కార్యకర్తలతో చర్చించి వారంలోగా వెల్లడిస్తానన్నారు. రద్దు చేసి సీఎంగా కొనసాగడమా? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. అసెంబ్లీని రద్దు చేసి 125 మంది ఎమ్మెల్యేలను రోడ్డున పడేసి, ఆయన మాత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పీఠంలో కొనసాగడమేమిటని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బీసీలకు 65 సీట్లు ఇవ్వాలని, లేదంటే బీసీలందరం కలసి ఓడిస్తామని వ్యాఖ్యానించారు. -
‘యువ తెలంగాణ’ ఆవిర్భావం
హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉంటారని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. సామాజిక స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనుకున్న వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. బుధవారం హోటల్ టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించిన జిట్టా.. పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తోందన్నారు. మంత్రి వర్గంలో వారికి చోటు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. 1999లో యువజన సంఘాల సమితిని ఏర్పాటు చేసి యువజనుల ఉన్నతికి కృషి చేసినట్లు చెప్పారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువ తెలంగాణ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఆవిర్భవించినట్లు ప్రకటించారు. పార్టీ బలోపేతానికి అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ జయ శంకర్‌ను విస్మరించి హరికృష్ణకు స్మారక ఘాట్‌ను నిర్మిస్తామని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో ట్యాంక్‌బండ్‌పై జయశంకర్ విగ్రహం పెట్టి స్మారక ఘాట్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఇంటికో ఇటుకతో తామే విగ్రహాన్ని నిర్మించుకుంటామన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. పార్టీ రాష్ట్ర కమిటీని అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాణి రుద్రమ, యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రెసిడెంట్‌గా వేణుగోపాల్ కృష్ణ, 12 మంది సభ్యులను ప్రకటించారు. -
తొగాడియా కొత్త హిందూ పార్టీ
న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) బహిష్కృత నేత ప్రవీణ్ తొగాడియా అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ (ఏహెచ్‌పీ) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. వీహెచ్‌పీ నుంచి బహిష్కరణకు గురైన తొగాడియా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ‘హిందూ ప్రత్యామ్నాయం’గా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ‘2014 ఎన్నికల్లో బీజేపీ వెన్నంటి ఉండి గెలిపించిన హిందువులను మోదీ ప్రభుత్వం వంచించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం లేదు. యువతకు మాట ఇచ్చినట్లు 10 కోట్ల ఉద్యోగాలు రాలేదు. రైతులు రోజూ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు’ అంటూ బీజేపీ, మోదీపై విరుచుకుపడ్డారు. -
ఆగస్టులో నూతన రాజకీయ పార్టీ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్) : బీసీ ఉద్యమనేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బీసీలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ నౌడు వెంకటరమణ తెలిపారు. త్వరలో ఆర్. కృష్ణయ్య పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారన్నారు. పార్టీ పతాకం, విధివిధానాలు ప్రకటిస్తారన్నారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు బీసీలకు 100 సీట్లు కేటాయిస్తామని హామీలు ఇస్తున్నాయే తప్ప అమలు చేయడం లేదన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చినపుడే అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారిని చైతన్య పరిచేందుకు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పర్యటిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో 13జిల్లాలకు జేఏసీ అధ్యక్షులను నియమిస్తామన్నారు. రాష్ట్రంలోని ముఖ్యపట్టణాల్లో బీసీల రాజకీయపార్టీ ఆవిర్భావంపై మేధోమథన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులు, ప్రముఖుల సూచనలు , సలహాలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళతామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పాలేటి రామారావు, సంఘం ఉపాధ్యక్షుడు అరవ వెంకటసత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మారేష్, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ నూకాలమ్మ, ఉపాధ్యక్షురాలు సీతారత్నం, పరిటాల రాము, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
శశికళ సోదరుడి సొంత పార్టీ.. ‘ఏడీకే’
మన్నార్గుడి: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వి.కె.శశికళ కుటుంబం నుంచి మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. శశికళ సోదరుడు వి.దివాకరన్ ఆదివారం కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే శశికళ కుటుంబానికి చెందిన ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీని స్థాపించారు. దినకరన్‌పై తీవ్ర విమర్శలు చేసిన దివాకరన్‌కు గత నెలలో శశికళ లీగల్ నోటీసులిచ్చారు. బహిరంగ సభల్లో తన పేరు వాడుకోరాదని అందులో హెచ్చరించారు. శశికళను ప్రస్తావించాల్సినప్పుడు సోదరిగా చెప్పుకోబోననీ, ‘తన మాజీ సోదరి’అని మాత్రమే అంటానని దివాకరన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ‘అన్న ద్రవిడార్ కళగం (ఏడీకే)’పార్టీని ఏర్పాటు చేశారు. ‘అన్నా’అని అందరూ పిలుచుకునే ద్రవిడ నేత సీఎన్ అన్నాదురై పేరుతో ఈ పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు. -
2019 ఎన్నికల నాటికి కొత్త పార్టీ: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీలకు రాజ్యాధికారం కోసం 2019 శాసనసభ ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. శుక్రవారం వినాయక నగర్లో నిర్వహించిన గ్రేటర్ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలను విస్మరిస్తే అన్ని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలవుతాయని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 50 శాతం సీట్ల కేటాయింపుతోపాటు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ నాయకులు నరేశ్‌బాబు, భూపేష్ సాగర్, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త పార్టీ
సాక్షి, విజయవాడ: బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా కొత్త పార్టీని ప్రకటిస్తామని ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సంఘాలతో చర్చించి త్వరలోనే పార్టీ, విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. దేశంలో బీసీలను హీనంగా చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో పార్టీలు ఉన్నా కేవలం ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్నారన్నారు. అగ్రవర్ణాలకు ఓట్లు వేసి వారిని బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏపీలో బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయం చేయలేదని విమర్శించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా ఆత్మగౌరవ పోరాటం చేస్తామని కృష్ణయ్య పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలసికట్టుగా పోరాడాలన్నారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారంపై ఇంకా సమాచారం తెలుసుకోవాల్సి ఉందని, బీసీలకు అన్యాయం చేస్తే ఒప్పుకోమన్నారు. -
కొత్త రాజకీయ పార్టీ.. ‘బాప్’!
న్యూఢిల్లీ : రాజకీయాలంటేనే బురద..అందులోకి దిగడం అంటే ఊబిలోకి దిగినట్టే అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేవారు చాలా మందే ఉంటారు. కానీ మేము ఆ కోవకు చెందిన వాళ్లం కాదంటున్నారు ఐఐటీ పూర్వ విద్యార్థులు. తాము కేవలం మాటలకు పరిమితం కాదని.. లక్షల జీతాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధం అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల హక్కులను కాపాడటమే ధ్యేయంగా పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘బహుజన్ ఆజాద్ పార్టీ’ పేరిట ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించామని బృంద నాయకుడు నవీన్ కుమార్ తెలిపాడు. 50 మందితో మా ప్రయాణం మొదలు.. ఐఐటీ పూర్వ పూర్వ విద్యార్థులైన 50 మంది బృందంగా ఏర్పడి రాజకీయ పార్టీ స్థాపించాలనే నిర్ణయానికి వచ్చామని నవీన్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ పార్టీ రాజకీయ ప్రస్థానం మొదలుపెడతామని భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయుల ఫొటోలతో కూడిన పోస్టర్ రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. తమ పార్టీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, సిద్దాంతపరంగా కూడా తమకు ఎవరితో విభేదాలు ఉండబోవని తెలిపారు. కాగా ఈ బృందంలో అత్యధిక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. -
టెక్నోక్రాట్ల రాజకీయ పార్టీ !
రాజకీయాల్లో మార్పు కోసం, అణగారిన వర్గాల హక్కుల్ని కాపాడడం కోసం ఒక కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. ఇదేదో ఒక వ్యక్తి కనుసన్నుల్లో నడిచే పార్టీ కాదు. మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా కొంత మంది ఐఐటీ నిపుణులు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఢిల్లీ, ఖరగపూర్కు చెందిన 50 మంది ఐఐటీ నిపుణులు బహుజన్ ఆజాద్ పార్టీ (బీఏపీ) పేరుతో ఒక కొత్త పార్టీ స్థాపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2015 సంవత్సరంలో ఢిల్లీ ఐఐటీలో పట్టా పొందిన నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ పార్టీ నడవబోతోంది. ’ పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 50 మంది నిపుణులు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కొత్త పార్టీ విధివిధానాలపై భారీగా కసరత్తు చేస్తున్నారు. మాకు కొందరు సివిల్ సర్వీసు అధికారులు కూడా బయట నుంచి మద్దతు ఇస్తారు‘ అని నవీన్‌కుమార్ తెలిపారు. పార్టీకి సేవలందించేవారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారేనని, అందుకే వాళ్ల స్థితిగతులపై తమకు చాలా అవగాహన ఉందని నవీన్‌కుమార్ వెల్లడించారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్రం ఎన్నికల సంఘాన్ని కూడా సంప్రదించారు. 2020 బిహార్ ఎన్నికల్లో పోటీ అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలో ఆప్ రాజకీయాల్లో ఒక సంచలనాన్ని సృష్టించినట్టే బహుజన్ ఆజాద్ పార్టీ (బాప్) ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మేధోమథనం జరుగుతోంది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత పోటీ చేసి, ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యా, న్యాయ రంగాల్లో అణగారిన వర్గాల పాత్ర చాలా పరిమితంగా ఉండడంతో వారి హక్కుల్ని కాపాడడంపైనే కొత్త పార్టీ ప్రధానంగా దృష్టి సారించనుంది. స్వాగతిస్తున్న వివిధ వర్గాలు రాజకీయాల్లో కుళ్లును కడిగేసే విధంగా ఒక ఉప్పెనలా కొత్త తరం రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దళితులు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్న తరుణంలో వారి గళాన్ని వినిపించడం కోసం నవయువకులైన కొందరు ఐఐటీ నిపుణులు ముందుకు రావడంపై దళిత సంఘాలు, రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘. కొంతమంది ఐఐటీ నిపుణులు ప్రధాన రాజకీయాల్లోకి రావడం అభినందించాల్సిన విషయం. రాజకీయాల్లో దిగ్గజాలైన కాంగ్రెస్, బీజేపీతో పోరాటం కోసం కాకుండా, బహుజనుల అభ్యున్నతి కోసం పోరాటం సాగిస్తే ఆ రాజకీయ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని‘ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. -
కోదండరాం పార్టీ పేరు ఇదే!
-
ఇట్స్ క్లియర్: కోదండరాం పార్టీ పేరు ఇదే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) చైర్మన్‌గా ఇన్నాళ్లు ప్రజల మధ్య ఉంటూ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు నిర్వహించిన కోదండరాం ఎట్టకేలకు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తన స్థాపించబోయే పార్టీ పేరును వెల్లడించారు. తెలంగాణ జనసమితి పేరిట పార్టీని ఏర్పాటుచేస్తున్నట్టు సోమవారం అధికారికంగా తెలిపారు. ఈ నెల 29న హైదరాబాద్‌లో తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభ ఉంటుందని తెలిపారు. టీజేఏసీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే క్రమంలో గత కొన్నాళ్లుగా కీలక అడుగులు పడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీని ఏర్పాటుచేయాలనే చర్చ టీజేఏసీలో కొన్నాళ్లుగా కొనసాగుతూ వచ్చింది. ఇటీవలే పార్టీ ఏర్పాటుకు లాంఛనంగా సమ్మతి తెలిపిన కోదండరాం.. ఆ దిశగా కొన్నిరోజులుగా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తామని ఆయన గతంలో చెప్పారు. పార్టీ పేరును ప్రకటించడంతోపాటు.. పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్‌లో ఉంటుందని తాజాగా వెల్లడించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివిధ పార్టీలు, ప్రజాసంఘాలతో ఏర్పాటుచేసిన జేఏసీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జేఏసీ చైర్మన్‌గా కోదండరాం ఉద్యమంలో విశేషమైన పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గత ఎన్నికల్లో జేఏసీ ఒకరకంగా తటస్థమైన పాత్రనే పోషించింది. ఆ తర్వాత క్రమంగా జేఏసీ టీఆర్ఎస్కు దూరం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా కేసీఆర్ పరిపాలన విధానంపై జేఏసీ చైర్మన్ కోదండరాం గతకొంతకాలంగా పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శల ధాటి పెంచారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కోదండరాం రాజకీయ పార్టీని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది. -
హిమాలయాలకు రజనీకాంత్
సాక్షి, చెన్నై: సినీ నటుడు రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాటపట్టారు. శనివారం చెన్నై నుంచి విమానంలో సిమ్లాకు బయలుదేరారు. ఆధ్యాత్మిక పర్యటనకు రజనీకాంత్ శ్రీకారం చుట్టడంతో తమిళ సంవత్సరాదిన కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. తాను ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా హిమాలయాలకు వెళ్లి బాబా ఆశీస్సులు పొందే రజనీ ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో హిమాలయ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. పర్యటనలో భాగంగా సిమ్లాకు, తర్వాత ధర్మశాల, రిషికేశ్‌లకు వెళ్లనున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటులో భాగంగా బాబా ఆశీస్సుల కోసం వెళ్తున్నారా అని చెన్నైలో మీడియా ప్రశ్నించగా, ‘ఇప్పుడెందుకు ఆ ప్రశ్న’ అని దాట వేశారు. -
కోదండరాంతో రేవంత్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. తమ బంధువు ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆహ్వానించేందుకంటూ బుధవారం రేవంత్‌రెడ్డి, కోదండరాం ఇంటికి వెళ్లడం, ఇద్దరూ ఏకాంతంగా భేటీ అయి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురు నేతలు అధికార టీఆర్ఎస్ వ్యవహారశైలితో పాటు ప్రతిపక్షాలుగా తాము వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ఏం చేయాలనే దానిపై చర్చ జరిగిందని వారి సన్నిహితులు చెపుతున్నారు. అయితే, కోదండరాం పార్టీ ప్రకటనకు కొద్ది రోజుల ముందే రేవంత్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి ఏకాంతంగా చర్చించడం ఎందుకనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది. కోదండరాంతో దోస్తీ కోసం రేవంత్ కాంగ్రెస్ దూతగా కలిశారా లేక వ్యక్తిగత పనిమీదనే వెళ్లి పనిలో పనిగా రాజకీయాలు చర్చించారా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. -
కోదండ పార్టీ టీజేఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ తెరపైకి కొత్త పార్టీ వస్తోంది! టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం నేతృత్వంలో ఈ నూతన పార్టీ ఆవిర్భవించనుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జనవరి నెలా ఖరులో పార్టీ రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు జరుగు తాయని తెలుస్తోంది. జేఏసీ ముఖ్యులు అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నెలాఖరుకల్లా తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్రలు పూర్తి కానున్నాయి. అనంతరం పార్టీ ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు. జనవరి 1 నుంచి పార్టీ నిర్మాణం తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేయనున్న పార్టీకి ఏ పేరు పెట్టాలన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఎక్కువ మంది ‘తెలంగాణ జన సమితి’(టీజేఎస్) పేరు వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దాంతోపాటు ‘తెలంగాణ సకల జన సమితి’వంటి మరో రెండు, మూడు పేర్లపైనా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పేరుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. జనవరి 1 నుంచి 7 దాకా అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్‌గా గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను ఈ వారం రోజుల్లో పూర్తి చేస్తారు. అనంతరం టీజేఏసీ కోర్ సభ్యులు సమావేశమై.. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, రాజకీయ పార్టీగా అవతరించాల్సిన అవశ్యకత, పార్టీ పేరు, లక్ష్యం, విధి విధానాలు, నిర్మాణం వంటి వాటిపై చర్చిస్తారు. అనంతరం స్టీరింగ్ కమిటీ, జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తారు. ఈ సందర్భంగా వచ్చిన అభిప్రాయాలను క్రోఢీకరించిన తర్వాత ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. 2009లో ఆవిర్భవించిన టీజేఏసీ.. ఉద్యమకాలంలో తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచింది. మిలియన్ మార్చ్, సాగరహారం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో ఉద్యమానికి మార్గనిర్దేశం చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా పోరాట మార్గంలోనే పయనిస్తోంది. ఉద్యమ ఆకాంక్షలే నినాదాలుగా.. తెలంగాణ ఉద్యమ నినాదాలు, ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా రాజకీయంగా పనిచేయాలని జేఏసీ నేతలు నిర్ణయించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాలుగా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం రాజకీయంగా పోరాడేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, వివిధ వృత్తులు వంటి మౌలిక రంగాల అభివృద్ధికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను రాజకీయంగా చర్చకు పెట్టనున్నారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో స్ఫూర్తి యాత్రలు చేస్తోంది. నల్లగొండ జిల్లాలో ఇంకా జరుగుతోంది. ఇది పూర్తయితే ఈ యాత్ర దాదాపుగా పూర్తి అవుతుంది. భూనిర్వాసితుల హక్కుల కోసం కూడా జేఏసీ ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టింది. డిసెంబర్ మొదటివారంలో తెలంగాణ నిరుద్యోగ గర్జన నిర్వహించింది. ప్రభుత్వం అనుమతించకపోయినా కోర్టు ద్వారా అనుమతి సాధించి ‘కొలువుల కొట్లాట’సభ నిర్వహించింది. -
శరద్ యాదవ్ నేతృత్వంలో కొత్త పార్టీ
న్యూఢిల్లీ: జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) తిరుగుబాటు నేత శరద్ యాదవ్ నేతృత్వంలో త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ‘భారతీయ ట్రైబల్ పార్టీ’(బీటీపీ)ని ప్రారంభిస్తామని జేడీయూ శరద్ వర్గం ప్రధాన కార్యదర్శి అరుణ్ మీడియాకు తెలిపారు. బీటీపీ గుర్తుగా ‘ఆటో రిక్షా’ను ఎంపిక చేసుకుంటామన్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన రాజశేఖరన్‌ను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. -
భయపడను..కొత్త పార్టీ పెట్టే తీరుతా..
సాక్షి, చెన్నై: రాజకీయ ప్రవేశంపై గట్టి సంకేతాలు పంపుతున్నసినీ నటుడు కమల్ హాసన్ ఈ నెలాఖరున కొత్త పార్టీని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. నవంబర్‌లో జరిగే స్ధానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టిన కమల్ 4000 మంది అభ్యర్ధులను ఈ ఎన్నికల్లో బరిలో దింపాలని యోచిస్తున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై మరికొన్ని రోజుల్లో కమల్ ప్రకటన చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఏఐఏడీఎంకేలో చీలిక నేపథ్యంలో తన రాజకీయ అరంగేట్రానికి ఇదే సరైన సమయమని కమల్ భావిస్తున్నట్టు సమాచారం. అభిమానులతో మంతనాలు, పలు వర్గాలతో సంప్రదింపులతో పాటు పార్టీ ముసాయిదాకు తుదిరూపు ఇవ్వడంలో ఆయన బిజీగా ఉన్నారని చెబుతున్నారు. ఇతర కూటముల్లో చేరకుండా సొంత పార్టీ ఏర్పాటుకు కమల్ పూనుకోవడం డీఎంకేకు ఇబ్బందికరమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘నన్ను హతమారుస్తామనే హెచ్చరికలతో బెదిరింపులు వస్తున్నాయి, వాటికి బెదిరిపోయే పరిస్థితే లేదు కొత్త పార్టీ పెట్టే తీరుతాను, మరే ఇతర ఏ పార్టీలో చేరబోను’ అని స్పష్టం చేశారు. దేశంలో మార్పు అవసరం, ఆ మార్పు నాతోనే, తమిళనాడు నుంచే రావాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. ముంబై నుంచి వెలువడే ఓ వెబ్‌సైట్‌కు కమల్ ఇచ్చిన ఇంటర్వ్యూ తమిళ సాయంకాల దినపత్రికల్లో (మాలైమురసు, మాలైమలర్) గురువారం ప్రచురితమైంది. కమల్ ఏమన్నారంటే... ‘‘ప్రత్యేకంగా పార్టీ పెడుతున్నారా అని కొందరు అడుగుతున్నారు. పార్టీ పెట్టాలనే ఆలోచనే ఉంది. ప్రతి పార్టీకీ ఒక సిద్దాంతం అంటూ ఉంటుంది. అలాగే నా ఆలోచనలను అమలు చేసేందుకు వేరుగా ఏర్పాటు చేసే పార్టీ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. నా జీవితంలో ఎందరో రాజకీయ పార్టీల నేతలను కలుసుకున్నా, ఫొటోలు దిగాను. అయితే ఏ పార్టీ సిద్దాంతాలకు నేను లోబడలేదు. నా ఆశయాలు, ఆలోచనలకు అనువుగా మరేపార్టీ ఉన్నట్లుగా తోచడం లేదు. శశికళను తొలగించడం అన్నాడీఎంకేలో మంచితో కూడుకున్న ముందడుగు. ఈ చర్య కొంత ఆశాభావం రేకెత్తించినా రాష్ట్రంలో మార్పు అవశ్యం. ఆ మార్పును నేనే తీసుకురావాలని, ముందుండి నడిపించాలని ఆశిస్తున్నాను. మార్పు తీసుకురావడంలో నా వల్ల ఎంత జాప్యం జరుగుతుందో ముఖ్యం కాదు. ఎన్నికల్లో నిలబడి గెలిస్తే ఓటర్లు నా పనితీరును లెక్కగట్టాలి. అసలు దేశంలోనే రాజకీయ వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఐదేళ్లకు ఒకసారి ఓటు వేయడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వెంటనే ఆ ప్రజాప్రతినిధిని బాధ్యతల నుంచి తప్పించగలగాలి. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటే ఇదే ఏకైక మార్గం. అవినీతి రహిత సమాజం ఏర్పడాలి. అవినీతి ఉన్నచోట నేను ఉండను, నేను ఉన్న చోట అవినీతి ఉండకూడదు.. అదే నా ఆశ ఆశయం. దేశాన్ని బాగుచేయాలని అనుకునే ముందు రాష్ట్రాన్ని బాగుచేసుకోవాలి. రాజకీయాల్లోకి రావడానికి నాకు ఇదే సరైన సమయం. రాష్ట్రంలో అన్నీ అవకతవకలుగా తయారైనాయి. రాత్రికి రాత్రే మార్పు రావాలని కోరుకోవడం లేదు. అయితే ఈమార్పు తమిళనాడు నుండే ప్రారంభం కావాలి. అందుకు అవసరమైన పనులను ప్రారంభించాను. ప్రజలకు ఒక మంచి ప్రభుత్వం అవసరం. అయితే ఈ జీవితకాలంలో నేను ఆశించిన మార్పు జరగకపోవచ్చు. రాజకీయాలను శుభ్రం చేసే పనులను భావితరం వారు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నన్ను అంతం చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఒకటి నేను పోవాలి లేదా దేశంలో అవినీతి అంతరించిపోవాలి. రెంటినీ ఒకటిగా చూడటం కుదరదు.’’ అని అన్నారు. -
డిసెంబర్ 12న రజనీకాంత్ కొత్తపార్టీ?
చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధమైందా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలిచ్చిన ఆయన తన పుట్టినరోజు డిసెంబర్ 12న కొత్తపార్టీ ప్రకటించనున్నట్లు సమాచారం. రజనీకాంత్ ఇప్పటికే తన అభిమానులతో సుదీర్ఘంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో కూడా అభిమానులు..రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ విజ్ఞప్తి కూడా చేశారు. అయితే దేవుడు ఆదేశిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని ఆయన కూడా చెప్పారు. కొద్ది రోజులుగా రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం గురించి తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పవచ్చు. నిజానికి రజనీ రాజకీయ రచ్చ ఇప్పడిది కాదు.1995లోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి రజనీకాంత్ క్రియా రాజకీయాల్లోకి రావాలనే ఓత్తిడి పెరుగుతూనే ఉంది. ఆయన కూడా కర్ర విరగ కూడదు పాము చావకూడదు అన్న చందాన ఆ దేవుడు ఆదేశిస్తే ఈ రజనీకాంత్ పాటిస్తాడు అంటూ వస్తున్నారు. ఇటీవల రజనీకాంత్ తన అభిమానులను కలుసుకున్న తరువాత ఆయన రాజకీయం సెగ మరింత పెరిగింది. అభిమానుల భేటీ అనంతరం రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతారంటూ ఆయన సోదరుడు కూడా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రజనీ పార్టీ పేరు, జెండా, ఎజెండాపై కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి? పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై రజనీకాంత్... బెంగళూరుకు చెందిన ఓ ఏజెన్సీ సేవలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని ఓటింగ్ సరళిని అధ్యయనం చేయడం, ఓటర్లను ఆకట్టుకోవడానికి అవసరమైన అజెండాను రూపొందించుకోవడంలో ఈ ఏజెన్సీ సేవలందిస్తోంది. మరోవైపు రజనీకాంత్, ఆయన సలహాదారులు పార్టీలోకి ప్రముఖ నేతల వలసలపై దృష్టి పెట్టారు. ఇతర పార్టీల్లోని పేరొందిన సీనియర్ రాజకీయ నాయకులను తన పార్టీలోకి తీసుకోవడం ద్వారా పార్టీని పటిష్టపరచాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా రజనీ పార్టీలోకి జంప్ చేయబోతున్న ప్రముఖ నాయకుల్లో అన్నాడీఎంకేకు చెందిన పాండ్యరాజన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
ములాయం కొత్త పార్టీ!!
-
ములాయం కొత్త పార్టీ!!
కన్న కొడుకుతో విభేదాలు.. తమ్ముడికి అందలం.. చివరకు పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగింపు.. ఇంతటి ఘోర అవమానాలను చూసిన రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్.. పాతికేళ్ల తర్వాత మళ్లీ కొత్త పార్టీ పెడుతున్నారు. అన్నయ్య ములాయం సింగ్ నేతృత్వంలో 'సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా' అనే ఈ పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన తమ్ముడు, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్ శుక్రవారం ప్రకటించారు. నేతాజీకి ఆయన గౌరవం తిరిగి ఇప్పించడానికి, సమాజ్‌వాదీ పార్టీకి చెందినవాళ్లందరినీ మళ్లీ ఒక్కతాటి మీదకు తెచ్చేందుకే ఈ పార్టీని స్థాపిస్తున్నామని శివపాల్ యాదవ్ చెప్పారు. సుమారు పాతికేళ్ల క్రితం సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం సింగ్ యాదవ్.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుటుంబంలో విభేదాలతో ఒక విధంగా రోడ్డున పడ్డారు. తాను స్థాపించిన పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు తండ్రీకొడుకుల మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపించినా.. ప్రచారపర్వంలో మళ్లీ ఆ విభేదాలు స్పష్టంగా కనిపించాయి. కేవలం తన తమ్ముడు పోటీ చేసిన నియోజకవర్గంతో పాటు చిన్నకోడలు పోటీ చేసిన లక్నో కంటోన్మెంటు స్థానంలో మాత్రమే ములాయం ప్రచారం చేశారు. అందులో చిన్నకోడలు అపర్ణాయాదవ్ ఓడిపోయారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు అధికారం లేక, అటు పార్టీ మీద కూడా పట్టులేకుండా ఎందుకని అనుకున్నారో ఏమో.. చివరకు సొంత పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీని పెట్టినప్పుడు తనకు తోడుగా ఉన్న తమ్ముడు శివపాల్ యాదవ్‌ను కూడా తీసుకెళ్తున్నారు. అయితే సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నవారిలో ఎంతమంది ములాయం వెంట వస్తారో చూడాల్సి ఉంది. ఈ వయసులో మళ్లీ ఆయన రాష్ట్రమంతా తిరిగి కొత్త పార్టీకి ప్రచారం చేసి, దాన్ని జనంలోకి తీసుకెళ్లడం కూడా ఎంవతరకు సాధ్యమో తెలియాల్సి ఉంది. -
కొత్త పార్టీ పెట్టనున్న సినీ దర్శకుడు
చెన్నై : సినీ దర్శకుడు తంగర్‌బచ్చన్ కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పనున్నారు. కథా రచయిత, చాయాగ్రాహకుడు, నటుడు, దర్శకుడు ఇలా చిత్ర పరిశ్రమకు చెందిన పలు శాఖల్లో తంగర్‌బచ్చన్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అళగి, సొల్ల మరంద కథై, ఒంబదు రూపాయ్ నోటు చిత్రాలను తంగర్‌బచ్చన్ తెరకెక్కించారు. ప్రభుదేవా హీరోగా దర్శకత్వం వహించిన కలవాడియ పొళుదుగళ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తై చాలా కాలం అయినా విడుదలకు నోచుకోలేదు. పలు సామాజిక స్పృహ ఉన్న చిత్రాలను రూపొందించిన తంగర్‌బచ్చన్ తాజాగా రాజకీయ పార్టీని ప్రారంభిచడానికి సిద్ధమయ్యారు. ప్రజల శ్రేయస్సు కోసం ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అవసరం అని భావించి తాను కొత్తగా పార్టీని నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు. -
ఇరోం షర్మిల కొత్త పార్టీ షురూ
మణిపూర్: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల మంగళవారం కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. పార్టీకి పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్గా పేరు పెట్టారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, తాను మణిపూర్ సీఎం ఓక్రం ఇబోబీసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తౌబల్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కురాయి నుంచి బరిలోకి దిగుతానని వెల్లడించారు. సాయుధదళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దుకు తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో ఆమె ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమై రాజకీయాల గురించి చర్చించారు. అలాగే ప్రధాని మోదీ నుంచి రాజకీయ సలహాలు తీసుకుంటానని ఆమె చెప్పారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా షర్మిల 16ఏళ్లు నిరశన చేయడం తెలిసిందే. -
మరో కొత్తపార్టీ వచ్చింది..
రాయపూర్: చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ నేత అజిత్ జోగి కొత్త పార్టీని ప్రకటించారు. దీనికి ‘చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్’గా నామకరణం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన అజిత్ జోగి కొత్త పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీకి పేరు పెట్టడానికి అజిత్ జోగి మద్దతుదారుల నుంచి పలు పేర్లు ప్రతిపాదనకు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ పేరును ఖరారు చేశారు. అజిత్ జోగి భార్య రేణు, ఆయన కొడుకు అమిత్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరితో పాటు మరో ఎమ్మెల్యే, మరికొందరు కాంగ్రెస్ నేతలు అజిత్ జోగికి మద్దతుగా నిలిచారు. -
'బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ'
హైదరాబాద్: వెనుకబడిన తరగతి (బీసీ)కి చెందిన కులాలను రాజకీయ పార్టీలన్నీ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, అవసరాల కోసం ఉపయోగించుకుని, ఆ తరువాత మొండి చేయి చూపిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్ బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు బీసీల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొత్త పార్టీ ఆవశ్యకత ఉంది: సబ్బం హరి
విశాఖపట్నం: సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాడిన నేతలతో రాష్ట్రంలో కొత్త పార్టీ నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని చెప్పారు. మరో 8 మాసాలు చూసి కొత్త పార్టీ కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనకు సహకరించిన స్వార్థపరులంతా ఇప్పుడు ముసుగు వేసుకుని కొత్త పార్టీల పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని విమర్శించారు. మళ్లీ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్న అలాంటి నేతలను అడ్డుకోవాలన్నారు. -
నల్లారి కిరణం..‘తూర్పు’న తెల్లబోనుంది..!
పోరులో వైరిపక్షం గెలిచాక.. కత్తికి పదును పెడుతున్నట్టుంది మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరు. రాష్ట్రం ముక్కలు కాకుండా చక్రం అడ్డువేస్తానన్న ఆయన వీరాలాపాలు ఉత్తర కుమార ప్రగల్భాలేనని విభజన బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదముద్ర వేశాక మాత్రమే పదవిని వీడినప్పుడే తేలిపోయింది. ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ప్రయోజనాల పరిరక్షణకు పార్టీ పెడతానన్న ఆయన పలుకులకు చిల్లిగవ్వ విలువ లేదని నిన్నటి వరకూ ఆయనను అంటి పెట్టుకుని ఉన్న నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 12న రాజమండ్రిలోనే పార్టీకి ‘పురుడు’ పోస్తానని ఆయన చెపుతున్నా.. ఈ జిల్లాలోనే ఆయన‘రాజకీయ మానస పుత్రిక’ను ముద్దు చేసే వారు కరువయ్యే పరిస్థితి నెలకొంది. సాక్షి, కాకినాడ : రాష్ర్ట విభజన తంతు పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి పదవిని పట్టుకొని వేలాడిన నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ఎట్టకేలకు కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 12న రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తానని, అదేరోజు పార్టీ జెండా, అజెండాలను వెల్లడిస్తానని గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు వెంట నడిచిన నేతలంతా నేడు ఆయన పార్టీలో చేరేందుకు ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్ సీపీ, టీడీపీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా మిగిలిన వారిలోనూ అత్యధికులు తాము కాంగ్రెస్‌లోనైనా ఉంటాము తప్ప కిరణ్ పార్టీలో చేరబోమంటూ తేల్చిచెబుతున్నారు.ఉవ్వెత్తున సాగిన సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడమే కాక విభజనలో తెరవెనుక కాంగ్రెస్ అధిష్టానానికి అన్ని విధాలా సహకరించిన కిరణ్ అంతా అయిపోయాకే పదవికి రాజీనామా చేశారు. తానే అసలు, సిసలు సమైక్యవాదినని ప్రగల్భాలు పలుకుతూ తెలుగుప్రజలనే కాదు తననే నమ్ముకున్న పార్టీ నేతలనూ నిలువునా ముంచారు. విభజన బిల్లు ఉభయసభల ఆమోదం పొందాక రాజీనామా చేసిన ఆయన పక్షం రోజుల పాటు మీడియాకు ముఖం చాటేశారు. కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరిగినా ఇన్నాళ్లూ దాని గురించి పెదవి విప్పలేదు. కిరణ్‌ను నమ్ముకొని లోక్‌సభలో సమైక్య నాటకం రక్తికట్టించిన రాజమండ్రి, అమలాపురం ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్ష కుమార్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇక సమైక్యాంధ్ర పేరుతో తమను నట్టేట ముంచిన కిరణ్ వెంట నడవలేమని మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరి దారి వారు చూసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ అడుగులకు మడుగులొత్తిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు కిరణ్ పేరు చెబితేనే ముఖం చిట్లిస్తున్నారు. ‘మున్సిపల్ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల షెడ్యూలూ విడుదలైంది. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం వలన ఎలాంటి ప్రయోజనం లే’దని నిన్నమొన్నటి వరకు కిరణ్ వెంట నడిచిన నేతలే చెబుతున్నారు. వైఎస్సార్ సీపీలో చోటు దక్కని వారిలో పలువురు ఇప్పటికే టీడీపీలో చేరగా, మరికొంత మంది ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కిరణ్ కొత్తపార్టీ జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపదని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే కాదు.. ముఖ్యనేతలెవరూ కిరణ్‌తో వెళ్లే అవకాశం లేదని మాజీ మంత్రి తోట నరసింహం బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం లేదని తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. తన ఉనికిని చాటుకునేందుకే కిరణ్ ఈ కొత్త పార్టీ ఎత్తుగడ వేశారని చెప్పుకొచ్చారు. పుట్టి మునిగాక పార్టీ పెట్టి లాభమేంటి..? ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ దాదాపు ఖాళీ అయి పోయిందని, అలాంటప్పుడు ఈయన పార్టీ పెట్టడం వలన ప్రయోజనమేమిటని మరికొంతమంది నేతలు ప్రశ్నిస్తున్నారు. కిరణ్ పార్టీ పెడితే చేరతానంటూ బాహాటంగానే ప్రకటించిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా అదేబాటలో మరో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పయనిస్తున్నట్టు సమాచారం. కాకినాడ రూరల్, పిఠాపురం ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, వంగా గీత కూడా టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. నిన్నకాక మొన్న ఇక రానున్న ఎన్నికల్లో పోటీ చేయనన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డితో పాటు ఏ పార్టీలోనూ అవకాశం లేని పాముల రాజేశ్వరీదేవి, పంతం గాంధీమోహన్లు మాత్రం కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరేదీ త్వరలో ప్రకటిస్తామంటూనే రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కిరణ్ పార్టీ ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పుకొచ్చారు. విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టి ఉంటే ప్రయోజనం ఉండేదని, విభజనకు పరోక్షంగా అన్ని విధాలా సహకరించిన కిరణ్ మాటలు విశ్వసించేవారెవరూ నేడు లేరని పలువురు అంటున్నారు. కిరణ్ పార్టీ ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై కానీ, ఆ తర్వాత జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కానీ ఏమాత్రం ఉండదని రాజకీయ విశ్లేషకులే అంటున్నారు. ఇక ‘నేను ఎన్నికల్లో పోటీ చేయను.. పోటీ చేసినా గెలవను.. ఏ పార్టీలోనూ చేరను’ అంటూ కబుర్లు చెప్పిన ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు మరో ఎంపీ జీవీ హర్షకుమార్ కిరణ్ పార్టీ వెనుక మంత్రాంగం జరపడం హాస్యాస్పదంగా ఉందని సామాన్యులే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద నల్లారి వారి ‘కిరణం’ తూర్పున తెల్లబోక తప్పదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. -
కిరణ్‌కు షాక్
పార్టీ పెడుతున్నా.. వస్తారా అంటూ వాకబు పెట్టొద్దన్న కొందరు, మాట్లాడి చెప్తామన్న మరికొందరు ‘కొత్త సీఎం’ తేలేదాకా వాయిదా.. నేడు, రేపూ చర్చలు సాక్షి, హైదరాబాద్: కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమైన కిరణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ నేతల నుంచే ఆశించిన సహకారం లభించడం లేదు. వెంటే ఉంటామని నిన్నటిదాకా చెప్పిన ప్రజాప్రతినిధులు సైతం ఆయనకు ముఖం చాటేస్తున్నారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నేతలతో సోమవారం కిరణ్ నిర్వహించిన సమావేశానికి అతి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు! మంత్రుల్లో పితాని సత్యనారాయణ, శైలజానాథ్ మాత్రమే వచ్చారు. ఎమ్మెల్యేలు గాదె వెంకట్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, శిల్పామోహన్‌రెడ్డి, వంగా గీత, రౌతు సూర్యప్రకాశ్‌రావు, పంతం గాంధీమోహన్, రామాంజనేయులు, కొర్ల భారతి; నలుగురు ఎమ్మెల్సీలు పాలడుగు వెంకట్రావు, రెడ్డపరెడ్డి, ఇందిర, ల క్ష్మీ శివకుమారి సహా మరో నలుగురు ఇతర నేతలు వచ్చారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రావాలని సమాచారం పంపినా ఇలా అతి కొద్దిమంది మాత్రమే రావడం కిరణ్ సన్నిహితులను విస్మయానికి గురి చేసింది. వచ్చిన నేతలు కూడా కొత్త పార్టీ యోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దాంతో కొత్త సీఎం ఎవరో తేలేదాకా పార్టీ ప్రయత్నాలను వాయిదా వేసుకోవాలన్న భావనకు వచ్చినట్టు చెబుతున్నారు. పార్టీ పెట్టాలనుకుంటున్నా ఒక్కొక్క నేతతో కిరణ్ ముఖాముఖి సమావేశమై కొత్త పార్టీపై అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ‘‘కొత్త పార్టీ పెట్టాలని భావిస్తున్నా. నా ఒక్కడి కోసమే కాదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు విభజన విషయంలో హైకమాండ్‌ను వ్యతిరేకించి బయటికొచ్చారు. వారికిప్పుడు ఒక రాజకీయ వేదిక అవసరం. హైకమాండ్ పెద్దలు ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌లోకి తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నారు. మీరేమంటారో, ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి’’ అని కోరారు. కిరణ్ చెప్పిందంతా విన్నాక నేతలు భిన్న స్వరాలు విన్పించారు. విభజన నిర్ణయం జరిగిపోయినందున ఇక కొత్త పార్టీ అనవసరమని జేసీ, పాలడుగు వంటి నేతలు అభిప్రాయపడ్డారు. పాలడుగైతే, ‘కాంగ్రెస్‌ను బతికించుకోవాల్సి ఉంది. అందుకు అందరం కృషి చేద్దాం’ అని సూచించినట్టు సమాచారం. మరీ తక్కువ సమయమున్నందున పార్టీ పెట్టినా ఆశించిన ఫలితాలు రావని వంగా గీత, పంతం గాంధీ, రామాంజనేయులు తదితరులన్నారు. ‘విభజనకు ముందే మీరు కొత్త పార్టీ పెట్టాల్సింది. ఇప్పుడేం లాభం. ఇంత తక్కువ సమయంలో 175 మంది ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు గట్టి అభ్యర్థులు కావాలి. పార్టీని పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లే క్యాడర్ కావాలి. సాధ్యమా?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. తొందరేమీ లేదని, ఆలోచించుకుని చెప్పాలని కిరణ్ సూచించారని, కార్యకర్తలతో మాట్లాడి చెబుతామంటూ నేతలు వెనుదిరిగారని సమాచారం. రౌతు మాత్రం తాను ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్తోనే ఉంటానని, ఆయన ఎటు వైపుంటే అటే వెళ్తానని స్పష్టం చేశారు. పితాని, శైలజానాథ్.. ఆచితూచి మంత్రులు శైలజానాథ్, పితాని కూడా కొత్త పార్టీ విషయంలో ఆచితూచి స్పందించారని, అందరి అభిప్రాయాలు విన్నాకే నిర్ణయం తీసుకోవాలని సూచించారని సమాచారం. భేటీలో వచ్చిన అభిప్రాయాలపై బహిష్కృత కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి, సబ్బంహరి, సాయిప్రతాప్, హర్షకుమార్‌లతో కూడా కిరణ్ చర్చించారు. కొత్త పార్టీపై తొందర పడాల్సిన పని లేదని, మంగళ, బుధవారాల్లో ఉద్యోగ, యువజన, ప్రజా సంఘాలు, ద్వితీయ శ్రేణి నేతలతోనూ సమావేశం కావాలని యోచిస్తున్నారు. నన్ను విముక్తుణ్ణి చేయండి గవర్నర్ నరసింహన్‌కు కిరణ్ లేఖ? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తనను విముక్తం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాసినట్లు సీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. సీమాంధ్ర నుంచి కొత్త సీఎం రాబోతున్నట్లు కిరణ్‌కు సమాచారం అందడం... ఈ పరిస్థితుల్లో తానింకా ముఖ్యమంత్రిగా కొనసాగితే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా ఆయన ఈ లేఖ రాసినట్లు తెలిసింది. మరోవైపు తిరుపతి లేదా రాజమండ్రిలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి కొత్తపార్టీ నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
'కిరణ్ ఫోన్ చేసినందునే... భేటీకి'
హైదరాబాద్ : కొత్త పార్టీ ఏర్పాటుపై ఇప్పుడే చెప్పలేమని... మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ సబ్బం హరి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ పెట్టాలా, వద్దా అనే అంశంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనట్లు తెలుస్తోంది. ఈ భేటీకి ముందు అనంతరం సబ్బం హరి మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినందునే సమాశానికి హాజరు అవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ పార్టీల ప్రభావతం తగ్గినట్లు కనిపిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, మూడో ప్రాంతీయ పార్టీగా వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమన్నారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలను పూర్తిగా అంచనా వేస్తామన్నారు. ఈ భేటీకి సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్, పార్థసారధి తదితరులు హాజరు అయ్యారు. మరోవైపు కిరణ్‌కుమార్‌రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొత్త పార్టీ పెట్టాలా, వద్దా... పెడితే తనతో పాటు ఎంతమంది ఉంటారు... ప్రజలు ఆదరిస్తారా, లేదా అన్న మీమాంస మధ్య గత రెండు రోజులుగా ఆయన తన సన్నిహితులతో ముమ్మరంగా మంతనాలు జరుపుతున్నారు. -
కిరణ్ ’పార్టీ’ మీమాంస
అనుచరులతో కిరణ్ సమాలోచనలు ఎంతమంది వెంట వస్తారా అని చర్చ కొత్త పార్టీ పెట్టే దిశగానే అడుగులు? నేతలతో సోమవారం సమావేశం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొత్త పార్టీ పెట్టాలా, వద్దా... పెడితే తనతో పాటు ఎంతమంది ఉంటారు... ప్రజలు ఆదరిస్తారా, లేదా అన్న మీమాంస మధ్య రెండు రోజులుగా తన సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సొంతింటికి వెళ్లిన కిరణ్‌ను కలిసేందుకు మొదటి రెండు రోజులూ ఎవరూ వెళ్లలేదు. శ నివారం ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, మాజీ మంత్రులు జేసీ దివాకర్‌రెడ్డి, పాలడుగు వెంకట్రారావు తదిరులు కలిశారు. మరికొందరు నేతలతో కిరణ్ ఫోన్లో మాట్లాడారు. ఏం చేయాలి, ఎలా ముందుకు పోదాం, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయముంది అంటూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. జిల్లాలవారీగా అనుచర నేతలకు ఫోన్లు చేస్తూ అంచనా వేస్తున్నట్టు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే కొంత కసరత్తు చేసిన కిరణ్, ఆదివారం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతో భేటీ నిర్వహిస్తున్నారు. సోమవారం ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఆయన మాటలు, చేతలు చూస్తుంటే కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని కలసిన నేతలు చెబుతున్నారు. తాజాగా మాదాపూర్‌లో ఒక విశాలమైన భవనాన్ని కిరణ్ అద్దెకు తీసుకున్నారు. ఇకపై అందులోనే సమావేశాలు నిర్వహించనున్నారు. దాన్ని వ్యక్తిగత కార్యాలయంగా పెట్టినా మున్ముందు పార్టీ కార్యాలయంగా మార్చడానికి వీలుగానే ఏర్పాటు చేసుకున్నట్టు చెబుతున్నారు. రెండు రోజులుగా కిరణ్‌తో సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యవహార శైలి కూడా కొత్త పార్టీ ఏర్పాట్ల ప్రచారానికి ఊతమిస్తున్నాయి. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించిన లగడపాటి కిరణ్ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. ఆయన రాజకీయాల్లో కొనసాగాలంటూ అనుచరులు విజయవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు సీమాంధ్రలో కాలం చెల్లిందన్న అశోక్‌బాబు మాటలు కూడా కిరణ్ ‘పార్టీ’ వ్యూహంలో భాగమేనంటున్నారు. పాలడుగు, ఉండవల్లి కూడా పార్టీ ఏర్పాటుపై కిరణ్ సూచనలిచ్చారంటున్నారు. ఆదివారం ఎంపీల భేటీకి ఎందరు హాజరవుతారన్నది కూడా చర్చనీయాంశమైంది. ఎంపీ రాయపాటి సాంబశివరావు హాజరుఅనుమానంగానే ఉంది. రాయపాటి కాంగ్రెస్‌లోనే కొనసాగేలా మాట్లాడుతున్నామని, అధిష్టానంతో కూడా చర్చిస్తున్నామని ఆయన సన్నిహిత మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. మరో ఎంపీ హర్షకుమార్ హాజరుపైనా భిన్న వాదనలున్నాయి. కిరణ్‌పై సన్నిహితుల్లోనే అపనమ్మకం కిరణ్ సామర్థ్యంపై ఆయన సన్నిహిత నేతల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుతున్నానంటూనే విభజన ప్రక్రియలోని ప్రతి దశలోనూ ఆయన వ్యవహరించిన వైనం, చివరికి విభజన జరిగిపోయిన తీరు, రాజీనామాపైనా రోజుకోమాట వంటివన్నీ కిరణ్‌పై ప్రజల్లో విశ్వాసం లేకుండా చేశాయని వారంటున్నారు. పైగా సీమాంధ్ర సమస్యలు కూడా చెప్పుకోనీయకుండా తమ గొంతు నొక్కారంటూ కేబినెట్ సహచరులు మండిపడుతున్నారు. రాజీనామా సమయంలో కిరణ్ వెంట 8 మంది మంత్రులు, 14 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు కన్పించినా, ఆ రోజు సాయంత్రానికే అత్యధికులు ముఖం చాటేశారు. రాజీనామా అనంతరం పితాని సత్యనారాయణ మినహా ఎవరూ ఆయన్ను కలవడానికి వెళ్లలేదు. కేబినెట్ సహచరులే కిరణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా ఖండించడం దేవుడెరుగు, కనీసం ఆయనకు మద్దతు పలికే నాథుడే లేకుండా పోయాడు. ఈ తరుణంలో కొత్త పార్టీ పెట్టినా కిరణ్ వెంట ఉండేవారి సంఖ్య అత్యల్పమేనంటున్నారు. జాప్యం చేయడమే.. కిరణ్ పార్టీ పెట్టరు: డొక్కా చివరి బంతి వరకూ ఆడతానని, బ్రహ్మాస్త్రం ఉందంటూ ఉద్యోగులను, ఎంపీలు, ఎమ్మెల్యేలను మభ్యపెట్టిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఇప్పుడు వారు ఆగ్రహంతో తిరుగుబాటు చేస్తారనే భయంతోనే ఈనెల 23న విసృ్తతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. సమావేశం పెట్టి అందరూ రాలేదని చెప్పి మరింత జాప్యం చేస్తారే తప్ప కిరణ్ పార్టీ పెట్టరని ఆయన అన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయం వద్ద డొక్కా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం కిరణ్‌ను నమ్మి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే ఆయన పార్టీనే మింగాలని చూశారన్నారు. రాయపాటి సాంబశివరావును మళ్లీ కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని తాను అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. కిరణ్ మాటలకు మోసపోయి రాయపాటి లోక్‌సభలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో 12 గంటలకు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశానని.. అక్కడే తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అంతకు ముందు మాణిక్యవరప్రసాద్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు భేటీ అనంతరం వెనుదిరిగి వెళ్లిపోయారు. -
కొత్త పార్టీ పెట్టట్లేదని కిరణ్ చెప్పారు: రఘువీరారెడ్డి
రాష్ట్రం సమైక్యంగా ఉన్నా విడిపోయినా తాను మాత్రం కాంగ్రెస్‌లో ఉంటానని స్పష్టం చేశారు. ఆయన గురువారం 'సాక్షి' టీవీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, మంత్రులకు మధ్య విభేదాలు లేవని, తామందరిదీ సమైక్యవాదమేనని రఘువీరారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడతారని తాను అనుకోవట్లేదని, ఆయనకు ఆ అవసరం లేదని తెలిపారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని ఆయన తనతో చెప్పారన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఏ పనీ చేయబోరని తెలిపారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ చర్చల్లో అన్ని పార్టీలు పాల్గొనాలని మంత్రి రఘువీరారెడ్డి కోరారు. అసెంబ్లీ పూర్తిగా ఆరు రోజులపాటు జరిగితే రాష్ట్రపతిని అదనపు సమయం అడగాల్సిన అవసరం లేదని చెప్పారు. విభజనకు 2009 డిసెంబర్లోనే బీజం పడిందని, అయినా రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఉన్నందున తాను రాలేనని ఏఐసీసీకి లేఖ రాశాని, ఏఐసీసీ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్తారో లేదో తనకు తెలియదని ఆయన చెప్పారు. -
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ
హైదరాబాద్: చట్టసభల్లో తమ వాణి వినిపించేందుకు కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఆర్పిఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి)అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. జనవరి 4న హైదరాబాద్‌లో పార్టీ పేరు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పార్టీలలో సామాజిక న్యాయం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలపై పోరాడుతున్నా పరిష్కారం దొరకడంలేదని చెప్పారు. అసెంబ్లీలో తమ వాణి వినిపించేందుకే పార్టీని పెడుతున్నట్లు తెలిపారు. -
ఆవేశంలో కొత్తపార్టీ పెడతామన్నా!
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కొత్త పార్టీ పెడతాబంటూ అంటూ తెగ హడావుడి చేసిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చల్లబడ్డారు. అలాంటిదేం లేదంటూ వ్యాఖ్యానించారు. ఆవేశంలో అన్నామే తప్పా కొత్త పార్టీ ఊసే లేదని అసలు విషయం చెప్పారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని పాత పాటే పాడారు. సమైక్యాంధ్ర చాంపియన్ కావాలనుకుంటున్న సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడతారని, అందులో తాను కూడా చేరే అవకాశముందని పలు సందర్భాల్లో రాయపాటి సూచనప్రాయంగా వెల్లడించారు. ఇప్పుడేమో తుస్సుమనిపించారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే కొత్తపార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు గతంలో చెప్పిన మాటను వెనక్కు తీసుకున్నారు. కొత్త పార్టీపై డిసెంబర్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఇంతకుముందు ఆయన ప్రకటించారు. కొత్త పార్టీని తాను పెట్టినా, కిరణ్ పెట్టినా ఒకటేనని కూడా సెలవిచ్చారు. ఇప్పుడేమో అమాంతంగా మాట మార్చేశారు. ఆవేశంలో అన్న మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని సలహాయిచ్చారు. హడావుడి చేయడం, తర్వాత చల్లబడడం రాయపాటికి పరిపాటి. గతంలో ఆయన అనేకసార్లు ఈ విన్యాసం ప్రదర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గంలో తనకు బెర్త్ దక్కనప్పుడల్లా ఆయన అలకపాన్పు ఎక్కేవారు. కాంగ్రెస్ పార్టీని వీడతానంటూ బిల్డప్ ఇచ్చేవారు. కొద్ది రోజులు గడిచాక కథ మామూలే. కాంగ్రెస్‌లోనే కొనసాగుతునంటూ ముక్తాంపులు ఇచ్చేవారు. గత కొన్నేళ్లుగా ఆయనీ విద్య ప్రదర్శిస్తూనే ఉన్నారు. జనం చూస్తూనే ఉన్నారు. రాష్ట విభజన నేపథ్యంలో మరోసారి రాయపాటి తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశించిన కేబినెట్ నోట్‌ను కేంద్రం ఆమోదించడంతో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన ఈ గుంటూరు నాయకుడు తర్వాత చంద్రబాబుకు చెంతకు చేరారు. ఢిల్లీలో దీక్ష చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఆ పార్టీలో చేరుతున్నట్టుగా సంకేతాలిచ్చారు. అయితే తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని రాయపాటి తనశైలిలో స్సందించారు. మున్మందు రాయపాటి మరెన్ని సిత్రాలు చేస్తారో చూడాలి! -
డిసెంబర్లో కిరణ్ కొత్త పార్టీ?
రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సొంతపార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లో కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించినట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వార్త ప్రచురించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం కట్టుబడితే కాంగ్రెస్‌ను వీడాలని కిరణ్ భావిస్తున్నారు(ట). అయితే రాష్ట్ర విభజనను అడ్డుకునే శక్తి తనకింకా ఉందని సీఎం నమ్ముతున్నారు. సీమాంధ్రకు మద్దతుగా డిసెంబర్లో కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. నూతన పార్టీ స్థాపనకు మద్దతు కూడకట్టేందుకు ఇప్పటికే ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు. శాసనసభలో తెలంగాణ తీర్మానం ఓడించి, రాష్ట్రపతిని కలిసిన తర్వాత సొంతకుంపటి ప్రారంభించేందుకు సీఎం సన్నద్ధమవుతున్నారని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను వదిలిపెట్టాలనుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలను తన పార్టీ కోసమే అసెంబ్లీ తీర్మానం పేరుతో కిరణ్ కట్టడి చేశారన్న వాదన విన్పిస్తోంది. సమైక్యాంధ్ర ఎజెండాతో పార్టీ పెట్టి సీమాంధ్రలో మద్దతు కూడగట్టాలన్నది కిరణ్ వ్యూహంగా కనబడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న కొందరు ఉద్యోగ సంఘాల నాయకులను కిరణ్ తనవైపు తిప్పుకున్నట్టు తెలుస్తోంది. సమైక్య ఉద్యమ వేడి తగ్గకుండా చూసేందుకు కిరణ్‌తో అంగీకారానికి వచ్చారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగుల సమ్మె విరమించినా ఉద్యమం సెగ చల్లారకుండా చూడాలని వీరు భావిస్తున్నారు(ట). రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల రాజకీయ జీవితం ప్రమాదంలో పరిస్థితి తలెత్తింది. కనీసం 50 మంది ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరు కొత్త పార్టీవైపు చూస్తున్నారు. ఇలాంటి నాయకులు కిరణ్ పెట్టబోయే పార్టీలోకి వస్తారని అంచనా వేస్తున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. పథకం ప్రకారమే కొత్త పార్టీ దిశగా కిరణ్ అడుగులు వేస్తున్నారని వెల్లడించారు. -
సమైక్యాంధ్ర పేరుతో కిరణ్ కొత్త పార్టీ: పెద్దిరెడ్డి
చిత్తూరు: సమైక్యాంధ్ర పేరుతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే వ్యూహంలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కొత్త పార్టీ తరపున సీఎం కిరణ్ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని ఆయన ఎద్దేవా చేశారు. కిరణ్‌కు డిపాజిట్లు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. రాజకీయ ప్రయోజనం కోసమే కిరణ్ సమైక్య రాగం అందుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడు కిరణ్, బొత్స సత్యనారాయణ ఏంచేశారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉద్యమం చేస్తోందని చెప్పారు. దీంతో సీఎం కిరణ్, చంద్రబాబు ముచ్చెటమలు పడుతున్నాయని అన్నారు. వచ్చే నెల 2న సమైక్యాంధ్రకు మద్దతుగా తమ పార్టీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టనున్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.