
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి దివంగత పి.శివశంకర్ తనయుడు, కాంగ్రెస్ నేత డాక్టర్ వినయ్ కుమార్ నేతృత్వంలో ఈ పార్టీ ఏర్పాటు కాబోతుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వినయ్ కుమార్ వెల్లడించారు.
బుధవారం బంజారాహిల్స్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆయన తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ పార్టీల్లో కరువయ్యాయని అన్నారు.
ప్రజలకు ఉచితంగా అందాల్సిన విద్య, వైద్యాన్ని వ్యాపారం చేశారని, ఆత్మాభిమానం గల రైతును రుణమాఫీ, ఇతర స్కీంల పేరుతో చేతులు చాచే స్థితికి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. నవంబర్‌లో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తామని పార్టీ వ్యవస్థాపక సభ్యులు నరహరి, విఠల్ తదితరులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment