సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ కుటుంబం నుంచి మరో కొత్త పార్టీ శనివారం ఆవిర్భవించింది. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం పేరిట పార్టీని టీటీవీ భాస్కరన్ ఏర్పాటు చేశారు. నీలంకరైలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరును, జెండాను భాస్కరన్ ప్రకటించారు. తమ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు.
తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడి కేంద్రంగా చిన్నమ్మ శశికళ కుటుంబం ఒకప్పుడు సాగించిన రాజకీయదందా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ జయలలిత, నెచ్చెలి శశికళను అడ్డం పెట్టుకుని ఈ కుటుంబం మన్నార్‌కుడి మాఫియాగా ఎదిగిందని చెప్పవచ్చు.
అయితే, జయలలిత మరణం తదుపరి పరిణామాలు, చిన్నమ్మ జైలు జీవితం వెరసి ఈ కుటుంబాన్ని కష్టాలపాలు చేశాయి. చిన్నమ్మ గుప్పెట్లో ఉన్న అన్నాడీఎంకే చేజారడం పెద్ద షాక్. ఆ తదుపరి పరిణామాలు చిన్నమ్మ ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఐటీ దాడులు ఓ వైపు, పాత కేసుల విచారణలు మరోవైపు ఈ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అదే సమయంలో రాజకీయ ఉనికి చాటుకునే రీతిలో చిన్నమ్మ ప్రతినిధిగా, ఆమె అక్క వనితామణి కుమారుడు దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే కేడర్‌ను చీల్చడంలో సఫలీకృతుడైన దినకరన్, తన బలాన్ని చాటుకునేందుకు రంకెలు వేస్తున్నారు.
ఈ పార్టీ రూపంలో చిన్నమ్మ సోదరుడు, మేనమామ దివాకరన్‌తో ఏర్పడ్డ విభేదాలు దినకరన్‌కు కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టాయి. చిన్నమ్మ కుటుంబం నుంచి మరో పార్టీ దివాకరన్ నేతృత్వంలో పుట్టుకు వచ్చింది. తన వారసుడు జై ఆనంద్‌ను రాజకీయంగా ఉన్న స్థానంలో కూర్చొబెట్టడం లక్ష్యంగా అన్నాద్రావిడర్ కళగంను దివాకరన్ ప్రకటించుకున్నారు. ఈయన సైతం తన బలాన్ని చాటే దిశగా కుస్తీలు పట్టే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో అన్నయ్య దినకరన్, మేనమామ దివాకరన్‌లనుఢీకొట్టే రీతిలో చిన్నమ్మ కుటుంబం నుంచి మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఈ పార్టీని దినకరన్ సోదరుడు, నటుడు టీటీవీ భాస్కరన్ ప్రకటించారు.
అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం: కుటుంబ విభేదాల నేపథ్యంలో అన్నయ్య దినకరన్, మేనమామ దివాకరన్ బాటలో కొత్త పార్టీ ప్రకటనకు గత నెల భాస్కరన్ సిద్ధమయ్యారు. అయితే, భాస్కరన్ మహానాడును తలపించే రీతిలో తిరుత్తణి వేదికగా పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, అధికార పక్షం భాస్కరన్‌కు చెక్ పెట్టే రీతిలో వ్యవహరించింది. హంగామాతో సత్తా చాటుకోవాలనుకున్న భాస్కరన్ మహానాడుకు అనుమతి నిరాకరించారు. దీంతో వెనక్కు తగ్గిన భాస్కరన్, హంగు ఆర్భాటాలు లేకుండా, నిరాడంబరంగా శనివారం నీలాంకరై వేదికగా తన కొత్త పార్టీని ప్రకటించుకున్నారు.
ఉదయం తన నివాసంలో దురైరాజ్ – ఝాన్సీ దంపతులకు వివాహాన్ని తన చేతుల మీదుగా భాస్కరన్ జరిపించారు. అనంతరం కొత్త పార్టీని మద్దతుదారులు, అభిమానుల సమక్షంలో ప్రకటించారు. అన్నా జయంతిని పురస్కరించుకుని పార్టీని ప్రకటించాలన్న లక్ష్యంతో ఈ ప్రకటన చేస్తున్నట్టు వివరించారు. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగంగా పార్టీ పేరును ప్రకటించారు. పై భాగంలో ఆరంజ్ (కమలా పండు) రంగు, మధ్య భాగంలో పచ్చ, కింది భాగంలో నలుపు వర్ణంతో కూడి మధ్య భాగంలో ఎంజీఆర్ ముఖ చిత్రంతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ భారీ ఎత్తున పార్టీని ప్రకటించాలని తాను సంకల్పించినా, అందుకు తగ్గ అనుమతుల్ని ఈ పాలకులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
తన పార్టీని చూసి పాలకులకే గుబులు పట్టుకుందంటే, ఇక, మిగిలిన పార్టీలకు తనను చూస్తే ముచ్చెమటలేనని ధీమా వ్యక్తం చేశారు. అన్నా జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం నిరాడంబర ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. త్వరలో పార్టీ కార్యవర్గం ప్రకటించనున్నట్టు తెలిపారు. తమ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముందుకు సాగుతుందని ప్రకటించారు. మోదీని మళ్లీ పీఎం చేయడం లక్ష్యంగా శ్రమిస్తామన్నారు.
అవినీతి రహిత పాలన లక్ష్యంగా ముందుకు సాగే వాళ్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాని తెలిపారు. అన్నా, ఎంజీఆర్ మద్దతుదారులు, అభిమానుల్ని కలుపుకుని బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కాగా, అన్నయ్య మద్దతుదారుల్ని ఇరకాటంలో పెట్టే రీతిలో తమ్ముడు పార్టీ పేరును ప్రకటించడం గమనార్హం. అన్నయ్య దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను ప్రకటించుకున్నారు. ఇక అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం (ఏఎంఎంకే)ను తమ్ముడు ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment