
కిరణ్ ’పార్టీ’ మీమాంస
అనుచరులతో కిరణ్ సమాలోచనలు
ఎంతమంది వెంట వస్తారా అని చర్చ
కొత్త పార్టీ పెట్టే దిశగానే అడుగులు?
నేతలతో సోమవారం సమావేశం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొత్త పార్టీ పెట్టాలా, వద్దా... పెడితే తనతో పాటు ఎంతమంది ఉంటారు... ప్రజలు ఆదరిస్తారా, లేదా అన్న మీమాంస మధ్య రెండు రోజులుగా తన సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సొంతింటికి వెళ్లిన కిరణ్‌ను కలిసేందుకు మొదటి రెండు రోజులూ ఎవరూ వెళ్లలేదు. శ నివారం ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, మాజీ మంత్రులు జేసీ దివాకర్‌రెడ్డి, పాలడుగు వెంకట్రారావు తదిరులు కలిశారు. మరికొందరు నేతలతో కిరణ్ ఫోన్లో మాట్లాడారు. ఏం చేయాలి, ఎలా ముందుకు పోదాం, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయముంది అంటూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. జిల్లాలవారీగా అనుచర నేతలకు ఫోన్లు చేస్తూ అంచనా వేస్తున్నట్టు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే కొంత కసరత్తు చేసిన కిరణ్, ఆదివారం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతో భేటీ నిర్వహిస్తున్నారు. సోమవారం ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఆయన మాటలు, చేతలు చూస్తుంటే కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని కలసిన నేతలు చెబుతున్నారు.
తాజాగా మాదాపూర్‌లో ఒక విశాలమైన భవనాన్ని కిరణ్ అద్దెకు తీసుకున్నారు. ఇకపై అందులోనే సమావేశాలు నిర్వహించనున్నారు. దాన్ని వ్యక్తిగత కార్యాలయంగా పెట్టినా మున్ముందు పార్టీ కార్యాలయంగా మార్చడానికి వీలుగానే ఏర్పాటు చేసుకున్నట్టు చెబుతున్నారు. రెండు రోజులుగా కిరణ్‌తో సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యవహార శైలి కూడా కొత్త పార్టీ ఏర్పాట్ల ప్రచారానికి ఊతమిస్తున్నాయి. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించిన లగడపాటి కిరణ్ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. ఆయన రాజకీయాల్లో కొనసాగాలంటూ అనుచరులు విజయవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు సీమాంధ్రలో కాలం చెల్లిందన్న అశోక్‌బాబు మాటలు కూడా కిరణ్ ‘పార్టీ’ వ్యూహంలో భాగమేనంటున్నారు. పాలడుగు, ఉండవల్లి కూడా పార్టీ ఏర్పాటుపై కిరణ్ సూచనలిచ్చారంటున్నారు. ఆదివారం ఎంపీల భేటీకి ఎందరు హాజరవుతారన్నది కూడా చర్చనీయాంశమైంది. ఎంపీ రాయపాటి సాంబశివరావు హాజరుఅనుమానంగానే ఉంది. రాయపాటి కాంగ్రెస్‌లోనే కొనసాగేలా మాట్లాడుతున్నామని, అధిష్టానంతో కూడా చర్చిస్తున్నామని ఆయన సన్నిహిత మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. మరో ఎంపీ హర్షకుమార్ హాజరుపైనా భిన్న వాదనలున్నాయి.
కిరణ్‌పై సన్నిహితుల్లోనే అపనమ్మకం
కిరణ్ సామర్థ్యంపై ఆయన సన్నిహిత నేతల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుతున్నానంటూనే విభజన ప్రక్రియలోని ప్రతి దశలోనూ ఆయన వ్యవహరించిన వైనం, చివరికి విభజన జరిగిపోయిన తీరు, రాజీనామాపైనా రోజుకోమాట వంటివన్నీ కిరణ్‌పై ప్రజల్లో విశ్వాసం లేకుండా చేశాయని వారంటున్నారు. పైగా సీమాంధ్ర సమస్యలు కూడా చెప్పుకోనీయకుండా తమ గొంతు నొక్కారంటూ కేబినెట్ సహచరులు మండిపడుతున్నారు. రాజీనామా సమయంలో కిరణ్ వెంట 8 మంది మంత్రులు, 14 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు కన్పించినా, ఆ రోజు సాయంత్రానికే అత్యధికులు ముఖం చాటేశారు. రాజీనామా అనంతరం పితాని సత్యనారాయణ మినహా ఎవరూ ఆయన్ను కలవడానికి వెళ్లలేదు. కేబినెట్ సహచరులే కిరణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా ఖండించడం దేవుడెరుగు, కనీసం ఆయనకు మద్దతు పలికే నాథుడే లేకుండా పోయాడు. ఈ తరుణంలో కొత్త పార్టీ పెట్టినా కిరణ్ వెంట ఉండేవారి సంఖ్య అత్యల్పమేనంటున్నారు.
జాప్యం చేయడమే.. కిరణ్ పార్టీ పెట్టరు: డొక్కా
చివరి బంతి వరకూ ఆడతానని, బ్రహ్మాస్త్రం ఉందంటూ ఉద్యోగులను, ఎంపీలు, ఎమ్మెల్యేలను మభ్యపెట్టిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఇప్పుడు వారు ఆగ్రహంతో తిరుగుబాటు చేస్తారనే భయంతోనే ఈనెల 23న విసృ్తతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. సమావేశం పెట్టి అందరూ రాలేదని చెప్పి మరింత జాప్యం చేస్తారే తప్ప కిరణ్ పార్టీ పెట్టరని ఆయన అన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయం వద్ద డొక్కా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం కిరణ్‌ను నమ్మి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే ఆయన పార్టీనే మింగాలని చూశారన్నారు. రాయపాటి సాంబశివరావును మళ్లీ కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని తాను అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. కిరణ్ మాటలకు మోసపోయి రాయపాటి లోక్‌సభలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో 12 గంటలకు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశానని.. అక్కడే తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అంతకు ముందు మాణిక్యవరప్రసాద్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు భేటీ అనంతరం వెనుదిరిగి వెళ్లిపోయారు.