
కొత్త పార్టీ పెట్టట్లేదని కిరణ్ చెప్పారు: రఘువీరారెడ్డి
రాష్ట్రం సమైక్యంగా ఉన్నా విడిపోయినా తాను మాత్రం కాంగ్రెస్‌లో ఉంటానని స్పష్టం చేశారు. ఆయన గురువారం 'సాక్షి' టీవీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, మంత్రులకు మధ్య విభేదాలు లేవని, తామందరిదీ సమైక్యవాదమేనని రఘువీరారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడతారని తాను అనుకోవట్లేదని, ఆయనకు ఆ అవసరం లేదని తెలిపారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని ఆయన తనతో చెప్పారన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఏ పనీ చేయబోరని తెలిపారు.
రేపటి నుంచి జరిగే అసెంబ్లీ చర్చల్లో అన్ని పార్టీలు పాల్గొనాలని మంత్రి రఘువీరారెడ్డి కోరారు. అసెంబ్లీ పూర్తిగా ఆరు రోజులపాటు జరిగితే రాష్ట్రపతిని అదనపు సమయం అడగాల్సిన అవసరం లేదని చెప్పారు. విభజనకు 2009 డిసెంబర్‌లోనే బీజం పడిందని, అయినా రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఉన్నందున తాను రాలేనని ఏఐసీసీకి లేఖ రాశాని, ఏఐసీసీ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్తారో లేదో తనకు తెలియదని ఆయన చెప్పారు.