కిరణ్ వెన్నుపోటుతోనే కాంగ్రెస్ కు ఓటమి: రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెన్నుపోటుతోనే కాంగ్రెస్ ఓటమి పాలైందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఓ కారణమని దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ముగిసిన సమీక్షాసమావేశమనంతరం రఘువీరా మీడియాతో అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను పోటీకి దింపకపోవడంతో కాంగ్రెస్‌వాదులు ఓటేయలేదని, పోటీలో ఉన్నట్టే గుర్తించలేదని ఆయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణమని ప్రచారం చేశారని, అందుకే ఆంధ్రప్రదేశ్ లోకాంగ్రెస్ ఓటమి పాలయిందని రఘువీరా అన్నారు.
త్వరలో ఎపీలో కాంగ్రెస్ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, ఎపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నాయని రఘువీరా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. రుణమాఫీపై టీడీపీ మీనమేషాలు లెక్కిస్తోందని రఘువీరా విమర్శించారు.