
ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. తమ బంధువు ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆహ్వానించేందుకంటూ బుధవారం రేవంత్‌రెడ్డి, కోదండరాం ఇంటికి వెళ్లడం, ఇద్దరూ ఏకాంతంగా భేటీ అయి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురు నేతలు అధికార టీఆర్‌ఎస్ వ్యవహారశైలితో పాటు ప్రతిపక్షాలుగా తాము వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్టు సమాచారం.
ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఏం చేయాలనే దానిపై చర్చ జరిగిందని వారి సన్నిహితులు చెపుతున్నారు. అయితే, కోదండరాం పార్టీ ప్రకటనకు కొద్ది రోజుల ముందే రేవంత్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి ఏకాంతంగా చర్చించడం ఎందుకనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది. కోదండరాంతో దోస్తీ కోసం రేవంత్ కాంగ్రెస్ దూతగా కలిశారా లేక వ్యక్తిగత పనిమీదనే వెళ్లి పనిలో పనిగా రాజకీయాలు చర్చించారా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది.