బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీని స్థాపించారు. కొద్ది రోజుల క్రితం తుమకూరు నగరంలో ఉన్న సిద్ధగంగా మఠాన్ని సందర్శించిన సందర్భంగా సొంత పార్టీపై సూత్రప్రాయంగా వెల్లడించిన గాలి జనార్దన్ రెడ్డి.. ముందుగా చెప్పినట్లుగానే డిసెంబర్ 25న కొత్త పార్టీ ప్రకటన చేశారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బీజేపీలో కొనసాగిన ఆయన.. నాయకత్వం బుజ్జగించినప్పటికీ కొత్త పార్టీవేపై మొగ్గు చూపారు. బీజేపీతో రెండు దశాబ్దాల బందానికి తెరదించారు. మరోవైపు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పల్ జిల్లాలోని గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
‘నేను ఆ పార్టీ సభ్యుడిని కానని దానితో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన వాడినేనని ప్రజలు విశ్వసించారు. ఆ నమ్మకం అబద్ధమని తేలింది. నా సొంత ఆలోచనతో ఈ రోజు కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని ప్రకటిస్తున్నాను. మతం, కులం పేరుతో చేసే విభజన రాజకీయాలకు ఈ పార్టీ దూరంగా ఉంటుంది. నా జీవితంలో మొదలు పెట్టిన ఏ విషయంలోనూ విఫలం కాలేదు. నా చిన్నతనంలో గోళీలు ఆడుకునేప్పటి నుంచి ఇప్పటి వరకు పరాజయాన్ని ఆమోదించని వ్యక్తిని. ప్రజల ఆశిస్సులు ఉంటాయనే విశ్వాసం ఉంది. భవిష్యత్తులో కర్ణాటక కల్యాణ రాజ్యంగా(సంక్షేమ రాష్ట్రంగా) అవతరిస్తుంది.’
- గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి
గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు 9 మందిపై 2009లో సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబర్‌లో జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నాలుగేళ్ల తర్వాత 2015లో కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురంకు వెళ్లరాదని స్పష్టం చేసింది. అయితే, 2020లో మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లగా ఆయా జిల్లాల ఎస్పీలకు తెలియజేసిన తర్వాత వెళ్లేందుకు వీలు కల్పించింది.
ఇదీ చదవండి: పొలిటికల్ పార్టీపై మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి క్లారిటీ.. 'ఆ రోజే అన్ని చెబుతా'
Comments
Please login to add a commentAdd a comment