ఇట్స్‌ క్లియర్‌: కోదండరాం పార్టీ పేరు ఇదే! | Kodanda Ram anounces New Political Party | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 2 2018 1:03 PM | Last Updated on Mon, Apr 2 2018 8:45 PM

Kodanda Ram anounces New Political Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజేఏసీ) చైర్మన్‌గా ఇన్నాళ్లు ప్రజల మధ్య ఉంటూ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు నిర్వహించిన కోదండరాం ఎట్టకేలకు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తన స్థాపించబోయే పార్టీ పేరును వెల్లడించారు. తెలంగాణ జనసమితి పేరిట పార్టీని ఏర్పాటుచేస్తున్నట్టు సోమవారం అధికారికంగా తెలిపారు. ఈ నెల 29న హైదరాబాద్‌లో తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభ ఉంటుందని తెలిపారు.

టీజేఏసీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే క్రమంలో గత కొన్నాళ్లుగా కీలక అడుగులు పడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీని ఏర్పాటుచేయాలనే చర్చ టీజేఏసీలో కొన్నాళ్లుగా కొనసాగుతూ వచ్చింది. ఇటీవలే పార్టీ ఏర్పాటుకు లాంఛనంగా సమ్మతి తెలిపిన కోదండరాం.. ఆ దిశగా కొన్నిరోజులుగా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తామని ఆయన గతంలో చెప్పారు. పార్టీ పేరును ప్రకటించడంతోపాటు.. పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్‌లో ఉంటుందని తాజాగా వెల్లడించారు.

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వివిధ పార్టీలు, ప్రజాసంఘాలతో ఏర్పాటుచేసిన జేఏసీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జేఏసీ చైర్మన్‌గా కోదండరాం ఉద్యమంలో విశేషమైన పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గత ఎన్నికల్లో జేఏసీ ఒకరకంగా తటస్థమైన పాత్రనే పోషించింది. ఆ తర్వాత క్రమంగా జేఏసీ టీఆర్‌ఎస్‌కు దూరం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా కేసీఆర్‌ పరిపాలన విధానంపై జేఏసీ చైర్మన్‌ కోదండరాం గతకొంతకాలంగా పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శల ధాటి పెంచారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కోదండరాం రాజకీయ పార్టీని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement