నల్లారి కిరణం..‘తూర్పు’న తెల్లబోనుంది..!
పోరులో వైరిపక్షం గెలిచాక.. కత్తికి పదును పెడుతున్నట్టుంది మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరు. రాష్ట్రం ముక్కలు కాకుండా చక్రం అడ్డువేస్తానన్న ఆయన వీరాలాపాలు ఉత్తర కుమార ప్రగల్భాలేనని విభజన బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదముద్ర వేశాక మాత్రమే పదవిని వీడినప్పుడే తేలిపోయింది. ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ప్రయోజనాల పరిరక్షణకు పార్టీ పెడతానన్న ఆయన పలుకులకు చిల్లిగవ్వ విలువ లేదని నిన్నటి వరకూ ఆయనను అంటి పెట్టుకుని ఉన్న నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 12న రాజమండ్రిలోనే పార్టీకి ‘పురుడు’ పోస్తానని ఆయన చెపుతున్నా.. ఈ జిల్లాలోనే ఆయన‘రాజకీయ మానస పుత్రిక’ను ముద్దు చేసే వారు కరువయ్యే పరిస్థితి నెలకొంది.
సాక్షి, కాకినాడ : రాష్ర్ట విభజన తంతు పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి పదవిని పట్టుకొని వేలాడిన నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ఎట్టకేలకు కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 12న రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తానని, అదేరోజు పార్టీ జెండా, అజెండాలను వెల్లడిస్తానని గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు వెంట నడిచిన నేతలంతా నేడు ఆయన పార్టీలో చేరేందుకు ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్ సీపీ, టీడీపీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా మిగిలిన వారిలోనూ అత్యధికులు తాము కాంగ్రెస్‌లోనైనా ఉంటాము తప్ప కిరణ్ పార్టీలో చేరబోమంటూ తేల్చిచెబుతున్నారు.ఉవ్వెత్తున సాగిన సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడమే కాక విభజనలో తెరవెనుక కాంగ్రెస్ అధిష్టానానికి అన్ని విధాలా సహకరించిన కిరణ్ అంతా అయిపోయాకే పదవికి రాజీనామా చేశారు.
తానే అసలు, సిసలు సమైక్యవాదినని ప్రగల్భాలు పలుకుతూ తెలుగుప్రజలనే కాదు తననే నమ్ముకున్న పార్టీ నేతలనూ నిలువునా ముంచారు. విభజన బిల్లు ఉభయసభల ఆమోదం పొందాక రాజీనామా చేసిన ఆయన పక్షం రోజుల పాటు మీడియాకు ముఖం చాటేశారు. కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరిగినా ఇన్నాళ్లూ దాని గురించి పెదవి విప్పలేదు. కిరణ్‌ను నమ్ముకొని లోక్‌సభలో సమైక్య నాటకం రక్తికట్టించిన రాజమండ్రి, అమలాపురం ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్ష కుమార్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇక సమైక్యాంధ్ర పేరుతో తమను నట్టేట ముంచిన కిరణ్ వెంట నడవలేమని మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరి దారి వారు చూసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ అడుగులకు మడుగులొత్తిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు కిరణ్ పేరు చెబితేనే ముఖం చిట్లిస్తున్నారు.
‘మున్సిపల్ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల షెడ్యూలూ విడుదలైంది. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం వలన ఎలాంటి ప్రయోజనం లే’దని నిన్నమొన్నటి వరకు కిరణ్ వెంట నడిచిన నేతలే చెబుతున్నారు. వైఎస్సార్ సీపీలో చోటు దక్కని వారిలో పలువురు ఇప్పటికే టీడీపీలో చేరగా, మరికొంత మంది ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కిరణ్ కొత్తపార్టీ జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపదని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే కాదు.. ముఖ్యనేతలెవరూ కిరణ్‌తో వెళ్లే అవకాశం లేదని మాజీ మంత్రి తోట నరసింహం బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం లేదని తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. తన ఉనికిని చాటుకునేందుకే కిరణ్ ఈ కొత్త పార్టీ ఎత్తుగడ వేశారని చెప్పుకొచ్చారు.
పుట్టి మునిగాక పార్టీ పెట్టి లాభమేంటి..?
ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ దాదాపు ఖాళీ అయి పోయిందని, అలాంటప్పుడు ఈయన పార్టీ పెట్టడం వలన ప్రయోజనమేమిటని మరికొంతమంది నేతలు ప్రశ్నిస్తున్నారు. కిరణ్ పార్టీ పెడితే చేరతానంటూ బాహాటంగానే ప్రకటించిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా అదేబాటలో మరో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పయనిస్తున్నట్టు సమాచారం. కాకినాడ రూరల్, పిఠాపురం ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, వంగా గీత కూడా టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. నిన్నకాక మొన్న ఇక రానున్న ఎన్నికల్లో పోటీ చేయనన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డితో పాటు ఏ పార్టీలోనూ అవకాశం లేని పాముల రాజేశ్వరీదేవి, పంతం గాంధీమోహన్‌లు మాత్రం కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరేదీ త్వరలో ప్రకటిస్తామంటూనే రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కిరణ్ పార్టీ ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పుకొచ్చారు.
విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టి ఉంటే ప్రయోజనం ఉండేదని, విభజనకు పరోక్షంగా అన్ని విధాలా సహకరించిన కిరణ్ మాటలు విశ్వసించేవారెవరూ నేడు లేరని పలువురు అంటున్నారు. కిరణ్ పార్టీ ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై కానీ, ఆ తర్వాత జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కానీ ఏమాత్రం ఉండదని రాజకీయ విశ్లేషకులే అంటున్నారు. ఇక ‘నేను ఎన్నికల్లో పోటీ చేయను.. పోటీ చేసినా గెలవను.. ఏ పార్టీలోనూ చేరను’ అంటూ కబుర్లు చెప్పిన ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు మరో ఎంపీ జీవీ హర్షకుమార్ కిరణ్ పార్టీ వెనుక మంత్రాంగం జరపడం హాస్యాస్పదంగా ఉందని సామాన్యులే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద నల్లారి వారి ‘కిరణం’ తూర్పున తెల్లబోక తప్పదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది.