Amarinder Singh: కెప్టెన్‌ ప్రభావమెంత? | Captain Amarinder Singh to launch new party in punjab | Sakshi
Sakshi News home page

Amarinder Singh: కెప్టెన్‌ ప్రభావమెంత?

Published Thu, Oct 21 2021 5:09 AM | Last Updated on Thu, Oct 21 2021 11:37 AM

Captain Amarinder Singh to launch new party in punjab - Sakshi

కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌

పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి నెల రోజుల క్రితం అవమానకర రీతిలో తప్పుకున్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ (79) కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికారం నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ, గద్దెనెక్కడానికి శిరోమణి అకాలీదళ్, ఆమ్‌ ఆద్మీ, తదితర పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి.  

అమరీందర్‌ పార్టీ రాష్ట్ర రాజకీయాలను ఏమేరకు ప్రభావితం చేస్తుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. అమరీందర్‌ పార్టీ బీజేపీతో, శిరోమణి అకాలీదళ్‌లోని చీలిక వర్గాలతో పొత్తు పెట్టుకొనే అవకాశం ఉన్నట్లు సంకేతాలిస్తోంది. పంజాబ్‌లో కొత్త పార్టీతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్న చర్చ మొదలయ్యింది. అమరీందర్‌ ఎత్తుగడలను బీజేపీ స్వాగతిస్తుండగా, అధికార కాంగ్రెస్‌ ఆయన కొత్తగా పార్టీ పెట్టి, సాధించేది ఏమీ ఉండదంటూ తేలిగ్గా కొట్టిపారేస్తోంది. ప్రధాని మోదీ సూచనల మేరకే అమరీందర్‌ కొత్త కుంపటి పెడుతున్నారని ఆప్‌ ఆరోపించింది. 


కెప్టెన్‌ వెంట కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు! 
అమరీందర్‌ గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూతో విభేదాలు, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ మంత్రాంగం వల్ల ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే, ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బలమైన అనుచర వర్గాన్ని తయారు చేసుకున్నారు. వ్యక్తిగతంగా కూడా అమరీందర్‌కు పంజాబ్‌ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మొత్తం 117 స్థానాలున్న శాసనసభలో కాంగ్రెస్‌కు 77 మంది సభ్యుల బలముంది. ఇందులో 12 మందికిపైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికీ అమరీందర్‌ సింగ్‌ మద్దతుదారులుగానే కొనసాగుతున్నారని, కొత్త పార్టీ స్థాపించగానే వారంతా వచ్చి, ఎన్నికల ముందు అందులో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఎంతమంది ఎమ్మెల్యేలు కెప్టెన్‌ వెంట నడుస్తారన్నది ఇప్పుడే తేలకపోయినా కాంగ్రెస్‌కు మాత్రం ఎంతోకొంత నష్టం తప్పదని చెప్పొచ్చు.

అంటే అమరీందర్‌ కొత్త పార్టీతో మొదట నష్టపోయేది కాంగ్రెస్సే. మరోవైపు సిద్ధూతో కాంగ్రెస్‌ అధిష్టానానికి నిత్యం ఏదో ఒక తలనొప్పి ఎదురవుతూనే ఉంది. తన అనుచరుడే అయినప్పటికీ కొత్త దళిత సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీతో సైతం సిద్ధూకు పొసగడం లేదు. ఈ అంతర్గత కుమ్ములాటలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూలంగా పరిణమించే అవకాశాలున్నాయి. విసిగివేసారిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించినా.. ఆఖరి నిమిషంలో అమరీందర్‌ పార్టీలోకి జంప్‌ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ విషయం కాంగ్రెస్‌ నాయకులకు తెలిసినప్పటికీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

చతుర్ముఖ పోరు..
సర్దార్ల రాష్ట్రం పంజాబ్‌లో అధికారం ఎప్పుడూ శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌ కూటముల మధ్యే చేతులు మారుతోంది. మరో కూటమికి అవకాశం దక్కడం లేదు. గత ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) శక్తిమేర పోరాడి 23.7 శాతం ఓట్లు, 20 సీట్లతో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పంజాబ్‌లో తమకు అవకాశాలుంటాయని భావిస్తున్న ఆప్‌ చాలాకాలంగా ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టి పనిచేస్తోంది. మరోవైపు పంజాబ్‌ జనాభాలో ఏకంగా 32 శాతం మంది దళితులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శిరోమణి అకాలీదళ్‌... బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. 20 సీట్లను బీఎస్పీకి వదిలి... 97 స్థానాల్లో పోటీచేయనుంది. ఇప్పటికే సింహభాగం స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది కూడా. ఈసారి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బీజేపీతోపాటు శిరోమణి అకాలీదళ్‌లోని చీలిక వర్గాలైన రంజిత్‌ సింగ్‌ బ్రహ్మపురా, సుఖ్‌దేవ్‌ ధిండ్సాతో చేతులు కలిపితే.. రాష్ట్రంలో మొత్తం నాలుగు రాజకీయ కూటములు తెరపైకి వస్తాయి. అప్పుడు ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. 

గతంలో సొంత కూటమి ఫెయిల్‌ 
అమరీందర్‌ కొత్త రాజకీయ కూటమి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆయన 1984లో కాంగ్రెస్‌ను వీడి శిరోమణి అకాలీదళ్‌లో చేరారు. 1992లో అకాలీదళ్‌ నుంచి బయటకు వచ్చారు. శిరోమణి అకాలీదళ్‌(పాంథిక్‌) పేరిట సొంతంగా ఒక పొలిటికల్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 1997లో తన కూటమిని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగారు. రాష్ట్రంలో రెండు సార్లు (2002–07, 2017–22) కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడం వెనుక కీలక పాత్ర పోషించారు. తనను అవమానించిన కాంగ్రెస్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారం తీర్చుకోవాలని అమరీందర్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన రాజకీయం జీవితం ముగింపునకొచ్చినట్లేనని, ఇదే చివరి అవకాశమని పరిశీలకులు చెబుతున్నారు. 

కొత్త పొత్తు పొడిచేనా! 
అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ పట్ల సానుకూల ధోరణి కనబర్చారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను గట్టిగా సమర్థించారు. పాకిస్తాన్‌ భూభాగంలో నిర్వహించిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌తోపాటు సరిహద్దుల్లో ఇటీవల బీఎస్‌ఎఫ్‌ పరిధిని పెంచడం మంచి పరిణామం అని కితాబిచ్చారు. అందుకే బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారన్న వార్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. బీజేపీతో కలిసి కూటమి కట్టడానికి అమరీందర్‌కు ఉన్న ఏకైక అభ్యంతరం మూడు నూతన వ్యవసాయ చట్టాలు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఈ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది.

రైతు సంఘాలతో చర్చలు జరపాలని, సాగు చట్టాల విషయంలో రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అమరీందర్‌ సింగ్‌ కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్ర సర్కారు కొంత దిగివచ్చినా తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. మితవాది అనే పేరు, సైనిక నేపథ్యం ఉండడం అమరీందర్‌కు బీజేపీతో జట్టు కట్టడానికి కలిసి వస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, ఇతర పక్షాలను కలుపుకొని భారీ రాజకీయ కూటమిని ఏర్పాటు చేయాలన్నది అమరీందర్‌ ఆలోచనగా చెబుతున్నారు. నిజానికి ఎన్డీయేలోనే భాగస్వామ్య పక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్‌ గత ఏడాది నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది.    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement