ఆవేశంలో కొత్తపార్టీ పెడతామన్నా!
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కొత్త పార్టీ పెడతాబంటూ అంటూ తెగ హడావుడి చేసిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చల్లబడ్డారు. అలాంటిదేం లేదంటూ వ్యాఖ్యానించారు. ఆవేశంలో అన్నామే తప్పా కొత్త పార్టీ ఊసే లేదని అసలు విషయం చెప్పారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని పాత పాటే పాడారు. సమైక్యాంధ్ర చాంపియన్ కావాలనుకుంటున్న సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడతారని, అందులో తాను కూడా చేరే అవకాశముందని పలు సందర్భాల్లో రాయపాటి సూచనప్రాయంగా వెల్లడించారు. ఇప్పుడేమో తుస్సుమనిపించారు.
రాష్ట్ర విభజన అనివార్యమైతే కొత్తపార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు గతంలో చెప్పిన మాటను వెనక్కు తీసుకున్నారు. కొత్త పార్టీపై డిసెంబర్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఇంతకుముందు ఆయన ప్రకటించారు. కొత్త పార్టీని తాను పెట్టినా, కిరణ్ పెట్టినా ఒకటేనని కూడా సెలవిచ్చారు. ఇప్పుడేమో అమాంతంగా మాట మార్చేశారు. ఆవేశంలో అన్న మాటలను సీరియస్గా తీసుకోవద్దని సలహాయిచ్చారు. హడావుడి చేయడం, తర్వాత చల్లబడడం రాయపాటికి పరిపాటి. గతంలో ఆయన అనేకసార్లు ఈ విన్యాసం ప్రదర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గంలో తనకు బెర్త్ దక్కనప్పుడల్లా ఆయన అలకపాన్పు ఎక్కేవారు. కాంగ్రెస్ పార్టీని వీడతానంటూ బిల్డప్ ఇచ్చేవారు. కొద్ది రోజులు గడిచాక కథ మామూలే. కాంగ్రెస్లోనే కొనసాగుతునంటూ ముక్తాంపులు ఇచ్చేవారు. గత కొన్నేళ్లుగా ఆయనీ విద్య ప్రదర్శిస్తూనే ఉన్నారు. జనం చూస్తూనే ఉన్నారు.
రాష్ట విభజన నేపథ్యంలో మరోసారి రాయపాటి తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశించిన కేబినెట్ నోట్ను కేంద్రం ఆమోదించడంతో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన ఈ గుంటూరు నాయకుడు తర్వాత చంద్రబాబుకు చెంతకు చేరారు. ఢిల్లీలో దీక్ష చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఆ పార్టీలో చేరుతున్నట్టుగా సంకేతాలిచ్చారు. అయితే తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని రాయపాటి తనశైలిలో స్సందించారు. మున్మందు రాయపాటి మరెన్ని సిత్రాలు చేస్తారో చూడాలి!