బడీ చప్పుడూ లేదు
గుంటూరు ఎడ్యుకేషన్: దానాల్లో కెల్లా విద్యాదానం గొప్పదంటారు. చిన్నారులతో అక్షరాలు దిద్ధించి పాఠశాలలకు పంపడం కంటే గొప్పకార్యం మరొకటి లేదని మహా నీయులు మార్గదర్శనం చేశారు. అన్నీ తెలిసీ జిల్లా అధికార యంత్రాంగం విద్యాసంవత్సర ప్రారంభానికి సూచి కగా నిర్వహించాల్సిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి ఈ ఏడాది మంగళం పాడేసింది. అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమంపై ప్రభుత్వం అసలు ఎటువంటి కార్యాచరణ ప్రకటించలేదు. జిల్లాలో ఏటా ఐదేళ్ల వయసు నిండిన 50 వేల మంది చిన్నారులు పాఠశాలల్లో చేరుతున్నారు. వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడమే విద్యాపక్షోత్సవాల లక్ష్యం. అసలు ఈ కార్యమాన్ని నిర్వహించే ఆలోచనే ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది.రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన తొలి విద్యా సంవత్సరంలో చడీచప్పుడూ లేకుండా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రైవేటు, కార్పొరేట్ రంగం నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రభుత్వ ఏటా విద్యా పక్షోత్సవాలు పేరుతో ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది.
ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం ఉచితంగా పంపిణీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సదుపాయాలపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. అదే విధంగా ఐదేళ్ల వయసు నిండిన చిన్నారులతో జిల్లా స్థాయిలో సామూహిక అక్షరాభ్యాసాన్ని జిల్లా అధికారులు ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యా పక్షోత్సవాల్లో భాగంగా నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదులు, వసతి గృహాలు, కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలను ప్రజా ప్రతినిధులచే ప్రారంభింపజేసి ప్రభుత్వ విద్యావ్యవస్థపై తల్లిదండ్రులను చైతన్య పరుస్తున్నారు.
నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైన జూన్ నెల 12న ప్రైవేటు పాఠశాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపపల్, సాంఘిక సంక్షేమశాఖ, గురుకుల, ఎయిడెడ్ పాఠశాలలు ఎటువంటి ఆర్భాటం లేకుండా మొదలయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు సాధిస్తున్న ఫలితాలు, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులపై తల్లిదండ్రులను చైతన్య పర్చేందుకు ఎటువంటి కార్యక్రమాలు లేని కారణంగా ఇప్పటికీ తగినంత సంఖ్యలో ప్రవేశాలే కరువై సర్కారు బడులు నిస్తేజంగా కొనసాగుతున్నాయి. పలు ఎయిడెడ్ పాఠశాలలు ఇటీవల సొంత ఖర్చుతో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించి, చిన్నారులతో అక్షరాలు దిద్దించారు
ప్రభుత్వం నుంచి షెడ్యూల్ జారీ కాలేదు..
విద్యా పక్షోత్సవాలు, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు తెలిపారు. అధికారికంగా షెడ్యూల్ జారీ చేయనప్పటికీ విద్యాశాఖ పరంగా ప్రభుత్వ పాఠశాలలపై క్షేత్రస్థాయిలో ఎంఈవోలు, ఉపాధ్యాయులతోప్రచారం చేయిస్తూ, ప్రవేశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.