20 ఎంపీ సీట్లు గెలిపిస్తాం: రాయపాటి
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మార్చుకుంటుందన్న నమ్మకాన్ని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యక్తం చేశారు. తమను రాజీనామా చేయొద్దని చెప్పి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారో తెలియదని ఆయన అన్నారు. సీనియర్లను కాదని పార్టీ నిర్ణయం తీసుకోవడం తగదని హితవు పలికారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే 20 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తామన్నారు. తెలంగాణ ఇచ్చినా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుకురావడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడినవన్నీ వాస్తవాలేనని అన్నారు. పైరవీతోనే కిరణ్‌కు సీఎం పోస్టు వచ్చిందనడం పొరబాటన్నారు. ఢిల్లీకి ఆలస్యంగా రావడం వల్లే నిన్న లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కలవలేకపోయానని రాయపాటి వెల్లడించారు. తమ రాజీనామాలను ఆమోదించాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నిన్న స్పీకర్ను కలిశారు. వీరితో రాయపాటి వెళ్లలేదు. దీంతో రాయపాటి వివరణ ఇచ్చారు.