రాష్ట్రంలో కాంగ్రెస్ దుకాణం మూతే: రాయపాటి
రాష్ట్ర విభజన అనే తేనె తుట్టెను కదిలించిన కాంగ్రెస్ పార్టీ ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ ప్రాంతాల్లో దుకాణం మూసుకునే స్థితికి చేరువైందని ఆ పార్టీకి చెందిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. విభజన అనివార్యమైతే పార్టీకి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమని చెప్పారు.
గుంటూరులో శుక్రవారం జరిగిన సమైక్యాంధ్ర విద్యార్థి సదస్సుకు హాజరైన రాయపాటి విలేకర్లతో మాట్లాడుతూ వేర్పాటు వాదుల మాటలు నమ్మి రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చారిత్రాత్మక తప్పిదం చేసిందని తెలిపారు. సీమాంధ్రలో పార్టీ పరిస్థితి బాగానే ఉందని, తెలంగాణ ఇవ్వడం ద్వారా టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాలని భావించి చేసిన విభజన ప్రకటనతో సీమాంధ్రలో ప్రజా ఉద్యమాన్ని చవి చూడాల్సి వచ్చిందని చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శనివారం హైదరాబాద్‌లో జరిగే సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీల సమావేశంలో పదవులకు రాజీనామా చేయాలని సహచర ఎంపీల మీద ఒత్తిడి తెస్తానని తెలిపారు. విభజన నిర్ణయంతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనన్నారు. విభజన వద్దని వారించిన తనవంటి సీనియర్ల మాటలను లక్ష్యపెట్టని ఫలితమే ఇదని చెప్పారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం లేదా దేశానికి రెండో రాజధానిగా చేయడమే మేలని ఆయన పేర్కొన్నారు.