
సాక్షి, చెన్నై: సినీ నటుడు రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాటపట్టారు. శనివారం చెన్నై నుంచి విమానంలో సిమ్లాకు బయలుదేరారు. ఆధ్యాత్మిక పర్యటనకు రజనీకాంత్ శ్రీకారం చుట్టడంతో తమిళ సంవత్సరాదిన కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. తాను ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా హిమాలయాలకు వెళ్లి బాబా ఆశీస్సులు పొందే రజనీ ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో హిమాలయ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. పర్యటనలో భాగంగా సిమ్లాకు, తర్వాత ధర్మశాల, రిషికేశ్‌లకు వెళ్లనున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటులో భాగంగా బాబా ఆశీస్సుల కోసం వెళ్తున్నారా అని చెన్నైలో మీడియా ప్రశ్నించగా, ‘ఇప్పుడెందుకు ఆ ప్రశ్న’ అని దాట వేశారు.