చెన్నై,పెరంబూరు: నటుడు రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాట పట్టారు. ఆయన రాజకీయ రంగప్రవేశంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ ఈ ఐదక్షరాల పేరు సినీ, రాజకీయ వర్గాల్లో జపమంత్రంగా మారింది. రజనీ సినిమాలను వదలరా? అన్న చర్చ ఒకటైతే, ఆయన రాజకీయాల్లోకి వస్తారా?అన్న ప్రశ్న మరొకటి. గత 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో వస్తానంటూ అభిమానులను ఊరిస్తూ వస్తున్న రజనీ.. ఎట్టకేలకు ఇటీవల రాజకీయరంగ ప్రవేశం త్వరలో ఉంటుందని గత ఏడాది డిసెంబరులో బహిరంగంగా వెల్ల డించారు. అదీ జయలలిత మరణంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఏర్పడిందని, దాన్ని తాను భర్తీ చేస్తానని కాస్త గట్టిగానే చెప్పారు. తాను ఎంజీఆర్ తరహా పాలను తీసుకొస్తానని, ఆయన అభిమానుల్ని అకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సారి రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం ఖాయం అనుకున్న కొందరు రాజకీయ నాయకులు ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక ఆయన అభిమానుల్లో కొందరు రజనీకాంత్ సినిమాలకు దూరం అవుతారనే బాధను వ్యక్తం చేశారు. మెజారిటీ అభిమానులు రజనీకాంత్ రాజకీయ ప్రకటనలో సంబరాలు చేసుకున్నారు. ఆయన్ని నమ్ముకున్న రాజకీయవాదులు, అభిమానులు ఇప్పుడు అయోమయంలో పడే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నది వాస్తవం. కారణం రజనీ రాజకీయరంగ ప్రవేశం ప్రకటన చేసి సుమారు రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటి వరకూ ఆయన నుంచి ఆ దిశగా ఒక స్థిరమైన నిర్ణయం రాలేదు. రజనీ ప్రజా సంఘాలు, నిర్వాహకుల నియమితం వంటి కార్యక్రమాలతో అభిమానులను ములగ చెట్టు ఎక్కించినంత పని చేసి.. తరువాత సైలెంట్ అయ్యిపోయారు. తను మాత్రం వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు.
సక్సెస్‌లే కారణమా?
రజనీకాంత్ ఇటీవల నటించిన కబాలి, పేట వంటి చిత్రాల విజయాలు ఆయనలో నూతనోత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. ఇక 2.ఓ చిత్రం ఆశించిన రీతిలో విజయాన్ని అందుకోలేకపోయినా, సాంకేతిక పరంగా అదో బ్రాహ్మాండ చిత్రంగా నిలిచింది. రజనీకాంత్‌కు నటనకు దూరం కావడం ఇష్టం లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేద్దామని భిమానులతో గట్టిగా చెప్పిన రజనీకాంత్ ఇప్పటి వరకూ ఆ దిశగా దృష్టి సారించిన దాఖలాలు లేవు. పైగా చిత్రాలను వదులుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో దర్భార్ చిత్రంలో నటించి పూర్తి చేశారు. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రం 2020లో సంక్రాంతికి తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇందులో ఆయన పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా నటించారు. అవినీతి, అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నం లాంటి పాత్రలో రజనీకాంత్ నటించారని, త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న ఆయన రాజకీయ జీవితానికి దర్భార్ గట్టి పునాదిగా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం తరువాత రజనీ రాజకీయాలపై దృష్టి సారిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన సైలెంట్‌గా మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించనున్నారు.
హిమాలయాల బాట
రజనీ నటిస్తున్న చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన తరువాత హిమాలయాలకు వెళ్లడం రజనీకాంత్‌కు ఆనవాయితీగా మారింది. హిమాలయాల్లో కనీసం 10 రోజులకు తగ్గకుండా ఆయన గడిపి తిరిగొస్తారు. తరువాత కొత్త చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే ఆనవాయితీని తాజాగా మరోసారి కొనసాగించారు. అవును దర్భార్ చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో రజనీకాంత్ ఆదివారం ఉదయం చెన్నై విమానాశ్రయం నుంచి హిమాలయాలకు బయలు దేరారు. ఆయన విమానం ద్వారా ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు చేరుకుని, అక్కడ నుంచి కారులో పయనించి పలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారని తెలిసింది. కేధార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్య స్టలాలను దర్శించుకుంటారు. అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్లాతారని సమాచారం. హిమాలయాల్లో ఆయన దైవంగా భావించే బాబా గృహలో ధ్యానం చేసి, ఆక్కడ పలు ప్రాంతాలను సందర్శించి చెన్నైకి తిరిగొస్తారు. తరువాత దర్భార్ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది. రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం మరింత జాప్యం జరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరో విషయం ఏమిటంటే రజనీకాంత్‌కు అత్యంత సన్నిహితుడు, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావద్దంటూ హితవు పలికారు. తాను తెలుగు నటుడు చిరంజీవికి ఇదే సూచన చేశానని, ఇప్పుడు రజనీకి కూడా ఇదే చెబుతున్నానని అన్నారు. మరో పక్క బీజేపీ రజనీకాంత్‌ను తమ పార్టీలోకి లాగడానికి గాలం వేస్తోంది. ఇవన్నీ రజనీకాంత్‌పై ముప్పేట దాడి చేసి ఎటూ తేల్చుకోలేని పరిస్థితికి నెట్టేసే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా రజనీ రాజకీయం పెద్ద చర్చనీయాంశంగా మారిందన్న నిజం.
Comments
Please login to add a commentAdd a comment