చెన్నైలో ఎంజీఆర్ ఎడ్యుకేషనల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో అభిమానులకు అభివాదం చేస్తున్న రజనీకాంత్
సాక్షి, చెన్నై: పార్టీ పేరు ప్రకటించి, పూర్తిస్థాయి రాజకీయ ఆరంగేట్రం చేయకముందే.. సూపర్ స్టార్ రజనీకాంత్ తన భవిష్యత్ రాజకీయ మార్గమెలా ఉండబోతోందో స్పష్టం చేశారు. జీవన విధానంలో ఆధ్యాత్మికతను నింపుకున్న రజనీ.. తన రాజకీయ మార్గం కూడా అదే దిశలో ఉండబోతోందని తేల్చి చెప్పారు. కుల, వర్గ వివక్ష లేని ఆధ్మాత్మిక పాలన అందిస్తానని స్పష్టం చేశారు.
అదేసమయంలో సుపరిపాలన అందించేందుకు సాంకేతికత, సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటానన్నారు.అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్ స్థాయి తనది కాదని, తనే కాదు.. మరో వెయ్యేళ్లయినా ఆ స్థాయి నేత ఉద్భవించబోడన్న రజనీ.. ఎంజీఆర్ తరహాలో అద్భుత పాలన మాత్రం అందించగలనన్నారు. జయలలిత మరణం, కరుణానిధి అనారోగ్యంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఆవరించిందని, దాన్ని తొలగించేందుకే తాను రాజకీయ రంగప్రవేశం చేస్తున్నానని వివరించారు.
రాజకీయాలు మాట్లాడక తప్పడంలేదు!
ఆధ్యాత్మిక పాలన అంటే ఏంటోనంటూ కొందరు హేళన చేస్తున్నారనీ, అలాంటి వారికి దాని సత్తా ఏంటో చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. చెన్నై పూందమల్లిలోని ఎంజీఆర్ విద్య, పరిశోధన కేంద్రం 30వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన రజనీ.. అక్కడ ఎంజీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ‘ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ మాట్లాడక తప్పడం లేదు’ అంటూ రజనీ తన ప్రసంగం ప్రారంభించారు.
ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలను అన్నాడీఎంకే ప్రభుత్వం వాడవాడల్లో ఘనంగా జరిపిందనీ, అయితే ఆయన చిత్ర రంగానికి చెందిన వాడయినప్పటికీ సినిమా వాళ్లతో కలసి వేడుకలు నిర్వహించనే లేదని రజనీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు రాజకీయాలు కొత్తేమీ కాదనీ, ఎంజీఆర్, కరుణానిధి, మూపనార్, చో రామస్వామి వంటి వారిని చూసి రాజకీయాలు నేర్చుకున్నాననీ, ఆ విద్యను ఎప్పుడు ఎలా ప్రయోగించాలో బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.
సత్తా ఏమిటో చూపుతా..
‘రాజకీయాల్లోకి సినిమా వాళ్లు ఎందుకని కొందరు ప్రశ్నించారు. రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించినప్పటినుంచి నాపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు, హేళనలు చేస్తున్నారు. నా వయస్సు 67 ఏళ్లు. ఈ వయసులోనూ నటుడిగా నా పని నేను చేసుకుంటుంటే కొందరు నేతలు మాత్రం వారి పని వారు సక్రమంగా చేయడం లేదు. అందుకే నేను ప్రజాక్షేత్రంలోకి రావాల్సి వస్తోంది’ అని రజనీ తన ప్రసంగంలో చెప్పారు. రాజకీయమంటే ముళ్లు, పాములు, రాళ్లు రప్పలతో నిండినదని తనకు తెలుసునన్నారు.
‘నేను రాజకీయాల్లోకి వస్తానంటే అడ్డుకునేందుకు మీరెవ్వరు? తిట్ల రాజకీయాలు ఆపేస్తే మంచిది’ అని ఆయన కొందరిని పరోక్షంగా హెచ్చరించారు. ఆధ్యాత్మికతలో పరమాత్మ ఉందనీ, కుల, మత, జాతుల పరమైన పక్షపాతం లేకుండా నిజాయితీతో సేవ చేయాలన్న తపనే తన రాజకీయం అని రజనీ చెప్పారు. జయలలిత బతికున్నప్పుడు ఎందుకు రాజకీయ ప్రవేశం చేయలేదని ప్రశ్నిస్తున్నారనీ, అప్పట్లోనూ నేతలకు ముచ్చెమటలు పట్టించే సంకేతాలను తాను ఇచ్చిన విషయాన్ని వారు మరచిపోయినట్టు ఉన్నారని రజినీ అన్నారు.
ఎంజీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాక అభిమానులతో మాట్లాడుతున్న రజనీ
Comments
Please login to add a commentAdd a comment