
దినేశ్ కార్తిక్
India tour of West Indies, 2023- Ajinkya Rahane Failure: అజింక్య రహానేకు ఇది అత్యంత సాదాసీదా సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్లో మెరుగైన ప్రదర్శన తర్వాత ఏకంగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడికి ఇలాంటి అవకాశం ఎలా వచ్చిందని అందరూ ఆశ్చర్యపోవడం సహజం. అయితే, అజింక్య రహానేకు ఎవరు ఏమనుకుంటున్నారన్న అంశంతో పనిలేదు.
అతడికి రెండు టెస్టుల్లోనూ ఆడే అవకాశం వచ్చింది. కానీ రెండుసార్లు విఫలమయ్యాడు. కొన్నిసార్లు కఠినమైన పిచ్‌ల కారణంగా బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. మరికొంత మందికి ఇలా కొన్ని సిరీస్‌లు చేదు అనుభవాన్నిస్తాయి. అయితే, అజింక్య రహానే విషయంలో మాత్రం నిలకడలేని ఆట ప్రభావం చూపుతోంది. అందుకే గతంలో అతడు జట్టులో చోటు కోల్పోయాడు.
అంతర్మథనం మొదలయ్యే ఉంటుంది
ఈ విషయం అతడికి కూడా తెలిసే ఉంటుంది. అయితే, సౌతాఫ్రికా టూర్‌లో ఇలాంటి ఆటగాడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అతడిలో అంతర్మథనం మొదలవడం ఖాయం’’ అని టీమిండియా వెటరన్ బ్యాటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు.
విండీస్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైన భారత జట్టు ఉప నాయకుడు అజింక్య రహానేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని వైస్ కెప్టెన్‌గా ఎలా నియమించారో చాలా మందికి అర్థం కాలేదన్న డీకే.. వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడని పెదవి విరిచాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో అదుర్స్
కాగా ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో రహానే ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమైన వేళ అజ్జూ రాణించాడు. ఈ మెగా ఫైట్‌లో 135 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో విండీస్ టూర్‌లో భాగంగా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ అయ్యాడు.
రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు
కానీ ఆడిన రెండు టెస్టుల్లో పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తంగా కేవలం 11(3, 8) పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ డీకే.. రహానేను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో 209 పరుగుల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. తాజా సైకిల్‌లో తొలి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
చదవండి: ఆసీస్ ఆల్‌రౌండర్ మాక్సీ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్! ఆ విషాదం తర్వాత..