Ind Vs WI, 2nd Test: Gaikwad Debut, Rahane May Dropped? Possible Playing XI - Sakshi
Sakshi News home page

Ind Vs WI 2nd Test: టీమిండియా కొత్త కెప్టెన్‌ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడిపై కూడా..

Published Mon, Jul 17 2023 4:09 PM | Last Updated on Mon, Jul 17 2023 4:42 PM

Ind Vs WI 2nd Test: Gaikwad Debut Rahane May Dropped Possible Playing XI - Sakshi

India tour of West Indies, 2023 - Ind Vs WI 2nd Test: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది టీమిండియా. వెస్టిండీస్‌పై ఏకంగా ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. విండీస్‌తో తొలి టెస్టుతో అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్‌ ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు.

ఓపెనర్‌గా హిట్‌
మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే 171 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు సరైన ఓపెనింగ్‌ జోడీ అనిపించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.

విఫలమైన గిల్‌, రహానే
అదే సమయంలో.. వన్‌డౌన్‌లో ఆడాలన్న ‘రెగ్యులర్‌ ఓపెనర్‌’ శుబ్‌మన్‌ కల నెరవేరినా.. సింగిల్‌ డిజిట్‌ స్కోరు(6)కే పరిమితం కావడంతో ఈ ప్రయోగం బెడిసికొట్టినట్లయింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అదరగొట్టిన అజింక్య రహానే విండీస్‌తో మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. 

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన అతడు.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 11 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో యశస్వితో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శతకం(103), విరాట్‌ కోహ్లి 76, రవీంద్ర జడేజా 37(నాటౌట్‌) పరుగులతో రాణించగా.. గిల్‌, రహానే ఈ మేరకు విఫలం కావడం గమనార్హం.

రుతురాజ్‌ గైక్వాడ్‌ అరంగేట్రం ఫిక్స్‌
ఇక విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో రోహిత్‌తో పాటు ఏకంగా ముగ్గురు ఓపెనింగ్‌ బ్యాటర్లకు స్థానం దక్కిన విషయం తెలిసిందే. శుబ్‌మన్‌, యశస్వితో పాటు మహారాష్ట్ర బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు అవకాశమిచ్చారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌ సందర్భంగా అతడు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

యశస్వి ఓపెనర్‌గా తనను తాను నిరూపించుకోవడంతో.. మేనేజ్మెంట్‌ రుతును మిడిలార్డర్‌లో ఆడించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రోహిత్‌కు జోడీగా గిల్‌, యశస్వి రూపంలో ఆప్షన్లు ఉండటంతో రుతును మిడిలార్డర్‌లో ఆడించి.. ఒకవేళ అతడు సక్సెస్‌ అయితే.. అక్కడే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట.

రహానేపై వేటు తప్పదా?
విండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా ఈ ప్రయోగం చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అదే నిజమై.. ఒకవేళ రుతురాజ్‌ అరంగేట్రం చేస్తే శుబ్‌మన్‌ గిల్‌ లేదంటే అజింక్య రహానేలలో ఎవరో ఒకరిపై వేటు తప్పదు. దీంతో యువ బ్యాటర్‌ గిల్‌ను తప్పిస్తారా లేదంటే ఏకంగా వైస్‌ కెప్టెన్‌నే డ్రాప్‌ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. పేస్‌ విభాగంలో జయదేవ్‌ ఉనాద్కట్‌ స్థానంలో ముకేశ్‌ కుమార్‌ అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. తొలి టెస్టులో అతడికి పెద్దగా బౌలింగ్‌ చేసే అవకాశమివ్వలేదు కెప్టెన్‌ రోహిత్‌. ఇదిలా ఉంటే.. విండీస్‌తో రెండో టెస్టులో మూడో స్పిన్నర్‌ను ఆడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలకు తోడుగా అక్షర్‌ పటేల్‌ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. దీంతో శార్దూల్‌కు మొండిచేయి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆసియా క్రీడలు-2023 ఈవెంట్లో పాల్గొనున్న భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

వెస్టిండీస్‌తో రెండో టెస్టు- భారత తుది జట్టు (అంచనా)
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), యశస్వి జైశ్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే/రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌.

చదవండి: ‘సెహ్వాగ్‌ నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’
అల్‌కరాజ్‌ గెలుపు కాదు.. ఫెదరర్‌ ప్రతీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న జకోవిచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement