tanduru
-
ప్రమాదానికి గురైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
-
తల్లిదండ్రులను ఆదరించని కొడుకుల భరతం పడతాం
తాండూరు వికారాబాద్ : తల్లిదండ్రులను నిరాధారణకు గురిచేస్తున్న కొడుకుల భరతం పడతామని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ హెచ్చరించారు. సొమవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆయన సమావేశంలో మాట్లాడారు. తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులను తమ కొడుకులు పట్టించుకోవడం లేదని అర్జీ అందిందని తెలిపారు. తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోని కొడుకులపై 2007 చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తల్లిదండ్రులను ఆదరించనివారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఏదైనా కార్యక్రమం నిర్వహించిన సమయంలో జాతీయగీతాలాపన తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశా రు. ధరణి వెబ్సైట్లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1.78 లక్షల పట్టా పాసుబుక్కులు జారీ చేయాల్సి ఉండగా 1.58లక్షల పుస్తకాలను ఇప్పటికే పంపిణీ చేసినట్లు వివరించారు. రైతులకు అందించిన పాసుబుక్కుల్లో దాదాపు 8వేల తప్పులు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 3127 పట్టా పాసుబుక్కుల్లో తప్పిదాలను త్వరలో సరి చేస్తామన్నారు. ఆయా గ్రామాల్లో కోటి 50 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం 90 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉన్న మొక్కలను నాటేందుకు ప్రభుత్వశాఖల అధికారులకు లక్ష్యం నిర్దేశించినట్లు తెలియజేశారు. ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఉన్న 1.48 లక్షల మహిళా సంఘాల ద్వారా మొక్కలను నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 92 అటవీ ప్రాంతాలు ఉండగా అందులో 49 ప్రాంతాల్లో అటవీసంపద కనుమరుగైందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. గనుల శాఖ ద్వారా డీఎంఎఫ్‌టీకి సమకూరుతున్న నిధులతో అక్రమ రవాణానుఅడ్డుకునేందుకు రూ.30 లక్షలతో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యాన్ని నియంత్రించేందుకు గనులు ఉన్న గ్రామాలకు రోడ్లతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని వివరించారు. తాండూరు మండలంలో రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అందులో రూ.30 కోట్లు రూర్బన్ నిధులు ఉన్నాయని చెప్పారు. సోలార్ దీపాలు, భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జాన్సన్, ఆర్డీఓ వేణుమాధవరావు, తాండూరు తహసీల్దార్ రాములు ఉన్నారు. -
వేటు పడింది..
తాండూరు వికారాబాద్ : తాండూరు రూరల్ సీఐ చింతల సైదిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఐజీ స్టీఫెన్ రవీంద్ర సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అదే రోజు రాత్రి సీఐ స్టేషన్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మూడేళ్ల క్రితం చేవెళ్ల సీఐగా పనిచేసిన ఈయన బదిలీపై తాండూరుకు వచ్చారు. 5 నెలల క్రితం తాండూరు రూరల్ సర్కిల్ పరిధిలోని పెన్నా సిమెంట్స్ టౌన్షిప్లో భారీ చోరీ జరిగి రూ.కోటికి పైగా నగదు, బంగారం అపహరణకు గురైంది. సీఐ ఇంతవరకూ ఈ కేసును ఛేదించలేకపోయారు. అధికార పార్టీ అండ ఉందనే అతి విశ్వాసంతో ఇతర పార్టీ నాయకులను బెదిరింపులకు గురి చేశారని, పలు కేసుల్లో అమాయకులను వేధించారని ఈయనపై ఆరోలున్నాయి. రూరల్ పరిధిలో కాగ్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు అండగా నిలిచారనే అభియోగాలున్నాయి. అంతే కాకుండా యంగ్ లీడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పైలెట్ రోహిత్‌రెడ్డితో పాటు ఆ సంస్థ వ్యవస్థాపకులు, సభ్యులపై అక్రమ కేసులు బనాయించారని విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలపై అకారణంగా కేసులు పెడుతూ పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారంటూ టీజేఎస్ జిల్లా ఇన్చార్జ్ పంజుగుల శ్రీశైల్‌రెడ్డి ఈయనపై ఇటీవలే డీజీపీ, ఐజీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సాక్షి కథనంతో స్పందించిన అధికారులుపోలీస్ వర్సెస్ ఇంటెలిజెన్స్ శీర్షికతో గత నెల 23న సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. యాలాల మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తావద్ద ఇటీవల పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారుల మధ్య జరిగిన గొడవపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వివరాలు సేకరించారు. గత నెల 19న పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది వాస్తవమేనని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.రూరల్ సీఐ సైదిరెడ్డి ఎదుట గొడవ జరిగినా.. ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదని, గొడవ విషయాన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయకపోవడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
జిల్లా ఆస్పత్రిలో వైద్యుల నియామకం
తాండూరు వికారాబాద్ : తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏడుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు గురువారం విధుల్లో చేరారు. ఈ నెల 14న సాక్షి దిన పత్రికలో ‘రోగులు ఫుల్.. సేవలు నిల్’ రోగం కుదిరేదెప్పుడో అనే శీర్షికలతో ప్రచురితమైన కథనానికి వైద్యశాఖలో చలనం వచ్చింది. వైద్య విధాన పరిషత్ రెండు రోజుల క్రితం వైద్య అభ్యర్థుల నుంచి ఉద్యోగాల కోసం దరకాస్తు చేసుకున్న వారికి సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా నియమిస్తూ ఆన్లైన్ ద్వారా అభ్యర్థులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి నియమితులైన ఏడుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు గురువారం విధుల్లో చేరారు. ఈనెల 23వ తేదీ వరకు విధుల్లో చేరాలని గడువు విధించడంతో మరో 20 మంది వరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రానున్నట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అందులో కొందరు తాండూరులో ఉన్న జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వహించేందుకు సుముఖత చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. సోమవారంలోగా ఆస్పత్రిలో ఎంతమంది వైద్యులు విధుల్లో చేరుతారనేది స్పష్టత వస్తుంది. -
మరుగుదొడ్డి లేదని ‘రేషన్’ కట్
తాండూరు రూరల్ : స్వచ్ఛభారత్ కింద మంజూరైన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోలేదని అధికారులు రేషన్ సరుకులు నిలిపివేశారు. కనీసం తాత్కలికంగా రేషన్ సరుకులు నిలిపివేస్తే కొందరైన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటారని అధికారులు ఈ విధంగా చేసినట్లు సమాచారం. మండలంలోని మిట్టబాసుపల్లి గ్రామంలో రెండు రోజుల నుంచి గ్రామంలోని లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన మాల శ్రీను, బంటు మొగులప్ప డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ రాములును కలిసేందుకు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని రేషన్ డీలర్ లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదన్నారు. డీలర్ అశప్పను అడగ్గా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరుకులు ఇవ్వడం లేదని చెబుతున్నారని చెప్పారు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకుంటేనే రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. బియ్యం లేకపోతే ఎలా బతకాలి అని గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో గ్రామంలో ఇదే విషయమై జోరుగా చర్చ సాగుతోంది. ఈ విషయమై తహసీల్దార్ రాములును ఫోన్లో సంప్రదిస్తే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకపోవడం వల్ల ఎంపీడీఓ డీలర్‌కు చెప్పి రేషన్ సరుకులు ఇవ్వొదని చెప్పారని తహసీల్దార్ బదులిచ్చారు. ఎంపీడీఓ జగన్మోహన్రావుకు ఫోన్ చేస్తే స్పందించలేదు. పంపిణీ చేస్తాం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో రేషన్ సరుకులు నిలిపివేశాం. అంతేకాకుండా డీలర్ ఆశప్ప అనార్యోగం కారణంగా కూడా సరుకులు ఆలస్యమయ్యాయి . మంగళవారం నుంచి ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అందజేస్తాం. – ఇస్మాయిల్, సర్పంచ్ -
ఒకే రోజు 100 కేసులు నమోదు
తాండూరు : వారం రోజులుగా పోలీసుశాఖ వాహనదారులపై కొరడా జులిపించింది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ కేసుల (ఆన్లైన్) నమోదును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని రెండు సర్కిళ్లలో ఉన్న పోలీస్స్టేషన్లలో పోలీసు అధికారులు మంగళవారం ఒకే రోజు 100 ఈ కేసులు నమోదు చేశారు. బుధవారం రోజు తాండూరు మున్సిపల్ కోర్టులో ఈ కేసులు నమోదైన వారికి న్యాయమూర్తి ట్రాఫిక్ రూల్స్ సంబంధించిన చట్టం ప్రకారం వాహనదారులకు జరిమానాలు విధించారు. తాండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 500లకు పైగా ఈ కేసులు నమోదు చేసి రాష్ట్రంలో మొదటి పోలీస్‌స్టేషన్‌గా రికార్డు సాధించింది. కేసుల నమోదులోపోటీ పడుతున్న సీఐలు తాండూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న రెండు సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న సీఐల మధ్య ఈ పెట్టి కేసుల పోటీ కొనసాగుతోంది. ఒకరికి మించి ఒకరు తమ సత్తా చాటుకునేందుకు వాహనదారులపై కొరడా జులిపిస్తున్నారు. పట్టణ సీఐ ప్రతా పలింగం, రూరల్ సీఐ సైదిరెడ్డిల మధ్య ఇప్పటికే ఉద్యోగరీత్యా విభేదాలున్నాయి. అధికారుల మధ్య సాగుతున్న అంతర్గత యుద్ధంలో ఈ పెట్టి కేసు నమోదులతో రికార్డు సాధించిన స్థానికంగా అధికారులు వాహనదారులపై అడ్డగోలుగా కేసు లు నమోదు చేయడంతో విమర్శలు వస్తున్నాయి. -
నిరుపేదలకు సద్దిమూట
తాండూరు : మున్సిపల్ శాఖ ఆధ్వర్యాన తాండూరు, వికారాబాద్‌లో నిరుపేదలు, అభాగ్యులకు కేవలం రూ.5కే భోజనం అందించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. సింగిల్ చాయి ఖరీదు రూ.7 నుంచి రూ.10 ఉన్న ఈ సమయంలో పేదవాళ్ల ఆకలిబాధ తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎంత చిన్న హోటల్లో భోజనం చేయాలన్నా రూ.50 నుంచి రూ.70 వరకు ఖర్చు చేయాల్సిన తరుణంలో రూ.5కే భోజనం అందించేందుకు కార్యచరణ సిద్ధమవుతోంది. మున్సిపల్ శాఖ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో రూ.5కే నాణ్యమైన భోజనం త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల ప్రకటించారు. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీల్లో ఈ సేవలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే కౌన్సిల్ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో ఈ పథకం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామీణ జిల్లా కావడంతో దీనికి పేదల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఫుల్ భోజనమే... మున్సిపల్ శాఖ ద్వారా మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్న రూ.5 భోజనంలో అన్నం, కూరగాయలతో చేసిన కర్రీ, పప్పు, పచ్చడి, సాంబారు, మజ్జిగ, నీళ్ల ప్యాకెట్ అందిస్తారు. ప్రస్తుతం హోటల్, మెస్‌లలో ప్లేట్ భోజనం రూ.50 నుంచి రూ.80 పలుకుతోంది. మున్సిపల్ శాఖ ద్వారా అందించనున్న భోజనంతో వందలాది మంది కార్మికులు, రైతులు, పేద, మధ్య తరగతి ప్రజల కడుపు నిండనుంది. ‘సంపూర్ణ’ భోజనం.. రూ.15 తాండూరు పట్టణంలో సంపూర్ణ సంస్థ ఆధ్వర్యం లో 6 నెలలుగా రూ.15లకే భోజనం అందిస్తున్నారు. సంపూర్ణ సంస్థ తాండూరు పట్టణంలోని బస్టేషన్ ప్రాంగణంలో, వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఇందిరాచౌక్‌ల వద్ద ఏర్పాటు చేసిన భోజన కేంద్రాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతీ రోజు 500 మందికి పైగా తాండూరు నియోజకవర్గంలోని ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సంపూర్ణ సంస్థ అందిస్తున్న భోజనం కన్నా 100 శాతం నాణ్యతతో మున్సిపల్ శాఖ రూ.5కే భోజనం అందించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా పథకం అమలుతో మున్సిపాలిటీలకు అదనపు భారం తప్పదని అధికారులు చెబుతున్నారు. కౌన్సిల్ సభ్యులతో సమావేశం మున్సిపల్ శాఖ ద్వారా ప్రారంభించాలనుకుంటు న్న రూ.5 భోజనంపై.. త్వరలోనే మున్సిపల్ కౌ న్సిల్ సభ్యులతో సమావే శం నిర్వహిస్తాం. భోజనం నిర్వహణపై ఉన్న తాధికారుల నుంచి ఇంకా విధి విధానాలు అందలేదు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకం కావడంతో త్వరలోనే రూ.5 భోజనం అందించేలా ప్రణాళిక తయారు చేస్తున్నాం. – భోగీశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, తాండూరు -
ప్రాణాలతో చెలగాటం
తాండూరు వికారాబాద్ : తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 గంటలకు పైగా కరెంటు లేకపోవడంతో దవాఖానలో చికిత్స పొందుతున్న 200 మంది ఇన్‌పేషెంట్లతో పాటు, నవజాత శిశువులు అవస్థల పాలయ్యారు. పిల్లలకు ఊపిరి ఆగిపోతోంది.. ఎలాగైనా బతికించండి.. అంటూ చిన్నారుల కుటుంబ సభ్యులు వైద్యుల కాళ్లావేళ్లా పడ్డారు. పరిస్థితి విషమిస్తుండటం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే వైద్యులు మాత్రం.. కరెంటు పోయింది.. వస్తుందిలే అంటూ.. 12 గంటల పాటు కాలయాపన చేశారు. పరిస్థితి చేజారడంతో చిన్నారులను ఇతర ఆస్పత్రులకు తరలించాలని చెతులెత్తేశారు. దీంతో తమ బిడ్డలను తీసుకుని ఒక్కొక్కరుగా జిల్లా ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేశారు. అసలే పేద, మధ్య తరగతి కుటుంబాలు కావడంతో చికిత్స కోసం ఎటు తీసుకెళ్లాలో తెలియని దీనావస్థలో మానసిక క్షోభకు గురయ్యారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రోగులకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా రూ.లక్షలు వెచ్చించి జనరేటర్లు అందుబాటులో ఉంచారు. అయితే కరెంటు, జనరేటర్ కనెక్షన్లను ఒకే జంక్షన్ బాక్స్‌కు ఇచ్చారు. ఇది కాలిపోవడంతో కరెంటు సరఫరాక కాక.. జనరేటర్ నడవక సమస్య తలెత్తింది. రాత్రి 10 గంటలకు కరెంటు వచ్చింది. డబ్బులు లేక పుట్టిన బిడ్డతో.. కర్ణాటక సరిహద్దు గ్రామం కల్లూర్‌కు చెందిన నాగమ్మకు గుజరాత్‌కు చెందిన ఉత్తతో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. జిల్లా ఆస్పత్రిలో రెండో కాన్పు చేయించుకుంది. అయితే పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉందని నవజాత శిశుకేంద్రంలో ఉంచాలని చెప్పడంతో.. చిన్నారిని నాలుగు రోజులుగా ఐసీయూలో ఉంచారు. ఆదివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేక పోవడంతో వైద్యం నిలిచి పోయింది. సాయంత్రం 5గంటల వరకు కరెంటు రాకపోవడంతో ఇతర ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు. భర్త అందుబాటులో లేకపోవడం, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో బిడ్డతో బిక్కుబిక్కుమంటూ ఆస్పత్రిలోనే ఉండిపోయింది. తాండూరుకు చెందిన శాయదాబేగం బిడ్డ పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో హైదరాబాద్ తీసుకెళ్లారు. పసిపిల్లలకు అందని వైద్యం.. ఆస్పత్రిలో కొనసాగుతున్న నవజాత శిశుచికిత్స కేంద్రం(ఎన్ఐసీయూ)లో దాదాపు 10 మంది రెండు, మూడు రోజుల క్రితం జన్మించిన పసిపిల్లలు, బరువు తక్కువగా ఉన్నవరు, పచ్చకామెర్లు, ఇన్ఫెక్షన్ సోకిన చిన్నారులకు వైద్యం అందిస్తున్నారు. ఎన్ఐసీయూ యూనిట్‌కు నిరంతరం విద్యుత్ సరఫరా అందించేలా వైద్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలి. కానీ అదేది లేకుండా ఆస్పత్రి మొత్తానికి ఒకే కనెక్షన్ ఉండటంతో ఆదివారం జంక్షన్ బాక్స్ కాలిపోయింది. దీంతో పసిపిల్లలు చికిత్స పొందుతున్న నవజాత శిశుసంజీవిని కేంద్రానికి కరెంటు సరఫరా ఆగిపోయింది. విద్యుత్ సరఫరా లేక పోవడంతో ఆక్సిజన్, వెంటిలేషన్ ద్వారా చికిత్స పొందుతున్న చిన్నారులు శ్వాస అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి నియోజకవర్గం, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న ఈ దుస్థితి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రత్యామ్నాయం ఏదీ... నవజాత శిశు చికిత్స కేంద్రంలో చికిత్స పొందుతున్న పసిపిల్లల జీవితాలు ప్రమాదంలో పడ్డా.. ఆస్పత్రి వైద్యులు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో పసిపిల్లల కుటుంబ సభ్యులు వారిని ఎత్తుకొని ఉద్వేగానికి గురయ్యారు. అయినా కడా డ్యూటీలో ఉన్న వైద్యులు పట్టించుకోలేదు. 8 గంటలు గడిచిన తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి ఇప్పట్లో కరెంటు వచ్చేలా లేదని తాపీగా చెప్పారు. దీంతో కొంత మంది తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రులకు మరికొంత మంది హైదరాబాద్‌కు తరలించారు. డయాలసిస్ కేంద్రానికి తాళం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా లేక పోవడంతో రక్తశుద్ధి (డయాలసిస్) కేంద్రంలో వైద్య సేవలు నిలిచి పోయాయి. అదే అదనుగా భావించిన సిబ్బంది సేవలను నిలిపి వేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఇంటికి పంపించారు. అనంతరం కేంద్రానికి తాళం వేసి వెళ్లిపోయారు. -
వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు
తాండూరు : గ్రామ పంచాయతీ ఎన్నికలు జూలై నెలాఖరు లోపు పూర్తవుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. తాండూరులోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నియోజకవర్గంలోని 60 గిరిజనతండాలు, అనుబంధ గ్రామాలను కొత్త జీపీలుగా ఏర్పాటు చేశామన్నారు. 200 మంది ఓటర్లున్న తండాలు, 300 నుంచి 500 మంది ఓటర్లున్న అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా గుర్తించామని స్పష్టంచేశారు. వీటన్నింటికీ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తుందని చెప్పారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పించామని తెలిపారు. గ్రామాల అభివద్ధిపై సీఎం కేసీఆర్ దష్టిసారించారన్నారు. వచ్చే నెలలో ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు. ఈనెల 26న పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారవుతాయని చెప్పారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది అన్నదాతలకు రైతుబీమా పథకం కింద రూ.12 వేల కోట్లు అందజేశామని చెప్పారు. జిల్లాలో మరో రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నవాబ్‌పేట, యాలాల మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాండూరు మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా మార్చేందుకు మంత్రి కేటీఆర్ రూ.50 కోట్లు ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు. ఇందులో రూ.25 కోట్లతో అభివద్ధి పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని త్వరలో తాండూరు మున్సిపాలిటీలో అభివద్ధి పనులు జరుగుతాయన్నారు. తాండూరు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు రానున్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, టీఆర్ఎస్ పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
గుర్తుతెలియని బాలికను చేరదీసిన పోలీసులు
తాండూర్(బెల్లంపల్లి) : ఎక్కడి నుంచో తప్పిపోయి వచ్చిన బాలిక (7)ను శుక్రవారం తాండూర్ పోలీసులు చేరదీశారు. తాండూర్ మండలం బోయపల్లి శివారులోని మామిడి తోటల సమీపంలో రోడ్డు పక్కన చెట్టు కింద బాలిక కూర్చోని ఉండగా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్సై కె.రవి ఆ బాలికను గమనించి ఆమె వివరాలు అడిగితెలుసుకునే ప్రయత్నం చేశారు. తనది కెరమెరి గ్రామమని ఓసారి, జోడేఘాట్ అని ఓ సారి బాలిక చెప్పడంతో బాలిక వివరాలు తెలియరాలేదు. తప్పిపోయిన బాలిక సంబంధికులు ఎవరైనా ఉంటే తాండూర్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై రవి సూచించారు. -
దూసుకొచ్చిన మృత్యువు
తాండూరు టౌన్ : బతుకుదెరువు కోసం తెల్లవారుజామునే నిద్రలేచి పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తిని మృత్యువులా దూసుకొచ్చిన లారీ బలిగొన్నది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ ప్రతాప్‌లింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం షావుకార్‌పేట్‌కు చెందిన శ్రీశైలం (40) నాపరాతి పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. జీవనాధారం కోసం ప్రతినిత్యం తెల్లవారుజామున తాండూరు బస్టాండు సమీపంలో పాల ప్యాకెట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం కూడా యధావిధిగా అక్కడ పాలు విక్రయిస్తున్నాడు. కాగా నెల్లూరు నుంచి చెట్టినాడ్ సిమెంటు కర్మాగారానికి బొగ్గు లోడ్‌తో కొడంగల్ రోడ్డు నుంచి ఇందిరాచౌక్ వైపునకు లారీ వస్తున్నది. ముందు వెళ్తున్న మరో లారీని ఎడమ వైపు నుంచి లారీ డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోగా పక్కనే ఉన్న లారీకి తగిలింది. దీంతో అదుపుతప్పిన లారీ రోడ్డుకు ఓ మూలన పాల ప్యాకెట్లు విక్రయిస్తున్న శ్రీశైలంను ఢీకొట్టింది. అనంతరం బాలాజీ లాడ్జి ముందు పార్కింగ్ చేసి ఉన్న పవర్‌ప్లాంట్‌కు చెందిన ఓ వ్యక్తికి చెందిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగం, నిర్లక్ష్యంతో లారీ నడిపి వ్యక్తి మృతికి కారకుడైన డ్రైవర్ విజయ్‌నాథ్‌తో పాటు క్లీనర్ కాళేశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి లారీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
తాండూరులో చోరీల పరంపర..
తాండూరు: జిల్లాలో ప్రధాన వ్యాపార కేంద్రమైన తాండూరు పట్టణంలో చోరీలు పెరుగుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో రెండు నగల దుకాణాల్లో దొంగతనాలు జరగడంతో వ్యాపారులతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ చోరీలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. రాత్రి పూట పకడ్బందీగా గస్తీ నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నా మరోవైపు చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల ముఖ్యంగా తాండూరులోని నగల దుకాణాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతోపాటు నగదును అపహరించుకుపోయారు. దీంతో వ్యాపార వర్గాలు భయాందోళనకు గురవుతున్నాయి. నిత్యం రాత్రిపూట 6-7 బీట్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, దానిని ఓ ఎస్ఐ పర్యవేక్షణ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. సంఖ్యాపరంగా బీట్లు బాగున్నా పెట్రోలింగ్ మాత్రం నామమాత్రంగా మారిందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. గత నెల 16న రాత్రి పట్టణంలోని గాంధీనగర్‌లోని శ్రీరంజన్ జ్యువెలరీ దుకాణంలో, ఈనెల 1న రాత్రి బాలాజీ బ్రదర్స్ నగల దుకాణంలో చోరీలు జరిగాయి. గుర్తుతెలియని దుండగులు రెండు వారాల వ్యవధిలో రెండు నగల దుకాణాల్లో సుమారు రూ.6 లక్షల సొత్తు అపహరించుకుపోయారు. ఈ రెండు ఘటనల్లో దుండగులు దుకాణాల పైకప్పులు తొలగించి షాపుల్లోకి చొరబడ్డారు. చోరీల తీరు దాదాపు ఒకేవిధంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. కర్ణాటక ముఠాకు చెందిన దుండగలు ఈ చోరీలు చేశారా?, స్థానికుల హస్తం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయిపూర్లోని ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో ఇటీవల దుండగులు చోరీకి పాల్పడి రూ.లక్ష వరకు నగదు అపహరించుకుపోయారు. కాగా ఈ విషయం వెలుగులోకి రాలేదు. పెట్రోలింగ్ కేవలం రాత్రివేళల్లో నడిచే హోటళ్లను మూయించడానికే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాండూరు రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో గస్తీ వంతుగా మారిందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. అర్థరాత్రి దాటిన తరువాత రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద అనుమానితులపై పోలీసుల నిఘా పూర్తిగా కొరవడింది. తాండూరు పట్టణం కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడం, రైలు సౌకర్యం ఉండటంతో ఆ రాష్ర్ట ముఠాలు ఇక్కడ చోరీలకు పాల్పడుతూ సులువుగా ఇక్కడి నుంచి పారిపోతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు పటిష్టంగా గస్తీలు నిర్వహించి చోరీల పరంపరకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముమ్మరంగా దర్యాప్తు.. చోరీ కేసులను ఛేదించేందుకు ముమ్మరంగా దర్యా ప్తు చేస్తున్నట్లు తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ తెలిపారు. ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాత్రివేళల్లో పటిష్టంగా గస్తీలు నిర్వహిస్తున్నట్లు డీస్పీ పేర్కొన్నారు. -
అధికారులను కదిలించిన ‘బరితెగింపు’ కథనం
తాండూరు/ యాలాల: ఇసుక అక్రమ రవాణాను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. తాండూరు, యాలాల పరిధిలోని కాగ్నా, కాక్రవేణి వాగుల నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న విషయంపై ఈనెల 8వ తేదీన ‘సాక్షి’ పత్రికలో ‘బరి తెగింపు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై సబ్ కలెక్టర్ హరినారాయణ్ స్పందించారు. ఎస్పీ రాజకుమారి, సబ్‌కలెక్టర్ నేతృత్వంలో మంగళవారం అర్ధరాత్రి విజిలెన్స్ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. యాలాల మండలంలోని కోకట్, విశ్వనాథ్‌పూర్, యాలాల, లక్ష్మీనారాయణపూర్ తదితర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు రెండు వాహనాల్లో వచ్చారు. అర్ధరాత్రి ఆయా గ్రామాలతోపాటు వాగుల్లో తనిఖీలు నిర్వహించారు. తాండూరుకు చెందిన సాజిద్, జాకీర్లు రెండు లారీల్లో అక్రమంగా కర్ణాటకకు ఇసుకను తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. రెండు లారీలు పట్టుపడడంతో ఇసుక మాఫియాకు చెందిన మరో ఆరు లారీలు ఇసుకను నింపుకోకుండానే తప్పించుకుపోయాయి. దాడులతో ఇసుక మాఫియా హడలిపోయింది. అధికారులకు చిక్కకుండా వాహనాలను రహస్య ప్రాంతాలకు తరలించి తప్పించుకున్నారు. బుధవారం ఉదయమే సబ్‌కలెక్టర్ హరినారాయణ్ యాలాలకు వచ్చారు. కాగ్నా, కాక్రవేణి వాగుల్లో తనిఖీలు నిర్వహించారు. కోకట్ నుంచి కాగ్నా వాగు నుంచి ఓ కిలోమీటర వరకు సబ్ కలెక్టర్ నడుచుకుంటూ వెళ్లి తనిఖీలు చేశారు. సంగమేశ్వర దేవాలయం వరకు వాగులో సబ్‌కలెక్టర్ ఇసుక తవ్వకాల తీరును పరిశీలించారు. తరువాత విశ్వనాథ్‌పూర్ గ్రామానికి వెళ్లగా అక్కడ పెద్దఎత్తున ఇసుక డంపు కనిపించగా సబ్‌కలెక్టర్ ఆశ్చర్యపోయారు. డంప్‌ను సీజ్ చేయించారు. అనంతరం ఆయన యాలాలకు వెళుతుండగా బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో పెద్ద ఇసుక డంప్ చూసి సబ్‌కలెక్టర్ ఆగ్రహించారు. వెంట ఉన్న యాలాల తహసీల్దార్ వెంకట్‌రెడ్డిపై మండిపడ్డారు. ‘రోడ్డు పక్కన ఇంత పెద్ద ఇసుక డంపు ఉంటే మీరు ఏం చేస్తున్నారు.. అసలు డ్యూటీ చేస్తున్నారా? నిద్రపోతున్నారా? ఇసుక డంపులు సీజ్ చేయడానికి వికారాబాద్ నుంచి నేనే రావాలా? అంటూ ఆగ్రహించారు. అక్కడ కూడా డంపు సీజ్ చేయించారు. డంపులు ఉంటే మీరేం చేస్తున్నారంటూ యాలాల వీఆర్ఓ అంజిలయ్యపైనా మండిపడ్డారు. వీఆర్ఓకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సబ్‌కలెక్టర్ తనిఖీల్లో కోకట్, విశ్వనాథ్‌పూర్, యాలాల గ్రామాల్లో సుమారు 90 ట్రాక్టర్ల ఇసుక డంపులు బయటపడ్డాయి. వాటిని సీజ్ చేయించారు. ఆర్అండ్బీ చేపట్టే అభివృద్ధి పనులకు సీజ్ చేసిన ఇసుకను వినియోగించేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అర్దరాత్రి విజిలెన్స్ దాడులతోపాటు ఉదయం సబ్‌కలెక్టర్ తనిఖీలతో ఇసుక మాఫియాకు ముచ్చెమటలు పట్టాయి. విజిలెన్స్ దాడులతో రాత్రే ఇసుక మాఫియా తోకముడవగా.. ఉదయం సబ్‌కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలకు రావడంతో ఇసుకాసురులు బెంబేలెత్తిపోయారు. దాదాపు మూడున్నర గంటలపాటు సబ్‌కలెక్టర్ తనిఖీలు నిర్వహించడంతో ఇసుక మాఫియా వణికిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అరికడతాం: సబ్‌కలెక్టర్ దాడుల అనంతరం సబ్‌కలెక్టర్ హరినారాయణ్ యాలాల తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్పీతో మాట్లాడి క్రితం రోజు రాత్రి విజిలెన్స్ అధికారులతో తనిఖీలు చేయించినట్టు ఆయన వెల్లడించారు. ఈ తనిఖీల్లో రెండు లారీల్లో కాగ్నా వాగు నుంచి కర్ణాటకలోని గుల్బర్గాకు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా బండమీదిపల్లి సమీపంలో విజిలెన్స్ అధికారులు పట్టుకొని సీజ్ చేశారన్నారు. ఈ లారీలను రాత్రే పరిగి పోలీసుస్టేషన్‌కు తరలించామని చెప్పారు. ఇసుక డంప్‌లు లభించిన ప్రాంతాలు ఎవరివో గుర్తించి వారిని బైండోవర్ చేస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఇసుక అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో దృష్టిసారించలేదన్నారు. వచ్చే నెల రోజుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీలు, ట్రాక్టర్ల యజమానుల పేర్లు సేకరించామన్నారు. గుర్తించిన వాహనాల యజమానులను బైండోవర్ చేస్తామన్నారు. ఇందుకు రూ.లక్ష పూచీకత్తు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయినా మళ్లీ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అధికారుల పాత్ర ఉన్నట్టు తేలితే వారిపైనా చర్యలు ఉంటాయన్నారు. రాత్రి సీజ్ చేసిన రెండు లారీలు తాండూరుకు చెందిన సాజిద్, జాకీర్లవిగా గుర్తించామని యాలాల ఎస్ఐ రవికుమార్ చెప్పారు. విజిలెన్స్ అధికారులు రాత్రి తమకు రెండు లారీలతోపాటు డ్రైవర్లు వసీం, మహబూబ్‌లను తమ కస్టడీకి ఇచ్చారని పరిగి సీఐ ప్రసాద్ చెప్పారు. -
అర్ధరాత్రి తాండూరులో లారీ బీభత్సం
తాండూరు: లారీ అదుపు తప్పి రోడ్డు మీద అడ్డదిడ్డంగా ప్రయాణించి కాసేపు కలకలం సృష్టించింది. ఆ మార్గంలో వాహనచోదకులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చివరకు ఓ ఆటోను ఢీకొట్టిన లారీ అదే వేగంతో వెళ్లి పాఠశాల గేటును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఆటోలోని నలుగురు గాయపడ్డారు. తాండూరు అర్భన్ ఎస్ఐ నాగార్జున కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ(కెఏ.39-5278) హైదరాబాద్ నుంచి తాండూరుకు సిమెంట్ లోడింగ్‌తో బుధవారం బయలుదేరింది. రాత్రి సుమారు 11గంటల సమయంలో తాండూరు పట్టణానికి ఈ లారీ చేరుకుంది. అయితే తాగిన మత్తులో డ్రైవర్ రవీందర్ లారీని అతి వేగంగా అజాగ్రత్తగా నడిపాడు. దీంతో లారీ రోడ్డు మీద అటూఇటూ తిరుగుతూ విలియంమూన్ చౌరస్తా నుంచి పోలీసుస్టేషన్ సమీపం వరకు వచ్చింది. ఈక్రమంలో లారీని చూసిన వాహనదారులు ముందు జాగ్రత్త పడి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. చివరకు పోలీసుస్టేషన్ సమీపానికి రాగానే ముందుగా వెళుతున్న ఆటో ట్రాలీని లారీ ఢీకొట్టింది. అనంతరం అదే వేగంతో సమీపంలోని శివం గ్రామర్ స్కూల్ గేటును ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదానికి గురైన ఆటోలో సెల్ టవర్లకు బ్యాటరీలు ఏర్పాటు చేసి రిలయన్స్ టెక్నికల్ సిబ్బంది ఉన్నారు. వారిలో తాండూరులోని గాంధీనగర్‌కు చెందిన అనిల్‌కుమార్(19), హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన అనారాజ్(26)లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్వన్నకట్టకు చెందిన అరవింద్‌కుమార్, ఆటో డ్రైవర్ శివారెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ నాగార్జున సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై సంఘటన రాత్రి సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే చాలా మంది ప్రాణాలు పోయేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ శివారెడ్డి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ రవీందర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మహాత్మా.. మన్నించు!
తాండూరు: గాంధీ జయంతి రోజే బాపూజీకి అవమానం జరిగింది. పట్టణంలోని గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగలు పాక్షికంగా ధ్వంసం చేశారు. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు.. పట్టణంలోని గాంధీ చౌక్ లో బాపూజీ విగ్రహం ఉంది. గాంధీ జయంతి నేపథ్యంలో బుధవారం మున్సిపల్ సిబ్బంది విగ్రహాన్ని శుభ్రం చేశారు. మహాత్ముడి ముఖ భాగాన్ని దుండగులు ధ్వంసం చేశారని గురువారం తెల్లవారుజామున పాలవ్యాపారులు, స్థానికులు గమనించారు. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు, వ్యాపారులు అక్కడికి చేరుకున్నారు. ఆర్యవైశ్య సంఘం, ఆ ర్య వైశ్య యువజన సంఘం సభ్యులు గాంధీచౌక్‌లో నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ నాగార్జునలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం అధికారులు గాంధీ విగ్రహానికి మరమ్మతు చేయించారు. బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దుండగుల దుశ్చర్య పై నల్లబ్యాడ్జీలు ధరించి గాంధీ చౌక్ నుంచి ఠాణా వరకు ర్యాలీ నిర్వహించారు. దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని ఠాణాలోకి వెళ్లకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. అనంతరం తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్యకు మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. జిల్లా ఎస్పీ రాజకుమారి కూడా విగ్రహ ధ్వంసంపై ఆరా తీశారు. కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్లు సునీత, సుమిత్‌కుమార్‌గౌడ్, రజాక్‌తో పాటు కౌన్సిలర్లు సలింగదళ్లి రవికుమార్, శ్రీని వాస్, వాలీ శాంత్‌కుమార్, మాజీ కౌన్సిలర్లు నరేందర్‌గౌడ్, సోమశేఖర్, కో- ఆప్షన్ సభ్యురాలు అనసూయ, నాయకులు కోట్రిక వెంకటయ్య, గాజుల శాంత్‌కుమార్, బంట్వారం భద్రేశ్వర్, కోర్వార్ నగేష్ తదితరులు ఉన్నారు. -
బకాయిదారులకు ‘రెడ్‌నోటీస్’
తాండూరు: పేరుకుపోయిన ఆస్తి(ఇంటి) పన్ను వసూలుకు తాండూరు మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు. మూడేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించని భవన యజమానులకు నేటి నుంచి ‘రెడ్ నోటీసు’ జారీ చేయాలని నిర్ణయించారు. బకాయిల జాబితాలో పలు ప్రభుత్వ కార్యాలయాలూ ఉన్నాయి. ఆస్తి పన్ను వసూలుపై ఆయా శాఖలకు మున్సిపల్ అధికారులు లేఖలు పంపించనున్నారు. భవన యజమానులు రెడ్ నోటీసు అందుకున్న మూడు రోజుల్లో బకాయి మొత్తం చెల్లించని పక్షంలో పురపాలక చట్టం 1965 అండర్ సెక్షన్-90, 91 షెడ్యూల్-2 రూల్(30) ప్రకారం స్థిరాస్తులు జప్తు చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. తాండూరు పురపాలక సంఘం పరిధిలో సుమారు 7,500 అసెస్మెంట్ గృహాలు, వ్యాపార సముదాయులు, సినిమా హాళ్లు ఉన్నాయి. రూ.50.56 లక్షల పాత బకాయితోపాటు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.96.50 లక్షల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఆగస్టు వరకు పాత బకాయిలో రూ.5.69 లక్షలు, సాధారణ వసూళ్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ.25.83 లక్షలు కలుపుకుని మొత్తం రూ.31.52లక్షలు మాత్రమే ఆస్తిపన్ను వసూలైంది. ఇంకా సుమారు రూ.కోటీ 14 లక్షల 48 వేల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. మొత్తం బకాయిల్లో సాగునీటి పారుదల శాఖ, ఆర్అండ్బీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ, అటవీ శాఖ నుంచి సుమారు రూ.35లక్షల వరకు రావాలి. మూడేళ్లుగా మొండి బకాయి రూ.30లక్షల వరకు ఉందని అంచనా. ఇందులో పట్టణంలోని మూడు సినిమా హాళ్లు సుమారు రూ.9 లక్షల వరకు, నేషనల్ గార్డెన్ నుంచి రూ.లక్ష బకాయి ఉందని అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ఆస్తిపన్ను బకాయిదారులందరికీ శుక్రవారం నుంచి రెడ్‌నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నోటీసులు అందుకున్న మూడు రోజుల్లో బకాయిలు చెల్లించకపోతే పురపాలక చట్టం ప్రకారం టీవీ, ప్రిజ్ తదితర తరలించే వీలున్న వస్తువులను జప్తు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. తాండూరులోని 8 రెవెన్యూ బ్లాక్‌ల పరిధిలో సుమారు రెండు వేల మందికి రెడ్ నోటీసులను సిద్ధం చేసినట్ట్టు అధికార వర్గాల సమాచారం. నేటి నుంచి బిల్ కలెక్టర్లు బకాయిదారులకు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. మూడు రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే సదరు బకాయిదారుడి ఇంటికి నల్లా కనెక్షన్ కట్ చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. -
తవ్వేయ్.. తరలించేయ్
తాండూరు: యాలాల కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా ‘మూడు డంప్‌లు-ఆరు ట్రాక్టర్లు ’అన్న చందంగా యథేచ్ఛగా సాగుతోంది. రెవెన్యూ,పోలీసు అధికారుల పూర్తి స్థాయి నిఘా లేకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో అక్రమార్కులు ఈ దందాను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇసుక అక్రమరవాణాకు పాల్పడే వారిపట్ల చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పినా సంబంధిత అధికారుల్లో కదలిక లేకపోవడం గమనార్హం. చోటామోటా నాయకులు ట్రాక్టర్ల ద్వారా కాగ్నా నుంచి ఇసుకను తరలించి రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రిపూట లారీల్లో తాండూరు సరిహద్దులోని మహబూబ్‌నగర్ జిల్లాకు రవాణా చేస్తూ డబ్బు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే రెవెన్యూ,పోలీసు అధికారులు కేసులు,జరిమానాలు వేస్తున్నా పూర్తి స్థాయి చర్యలకు ఉపక్రమించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. కాగ్నా నది నుంచి ఇసుకను తీసుకువచ్చి కోకట్, లక్ష్మీనారాయణపూర్, యాలాల తదితర గ్రామాల సమీపంలోని రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. ఇటీవల స్థానికుల సమాచారం తో అధికారులు పెద్ద ఎత్తున ఇసుక డం ప్ను సీజ్ చేయడమే ఇందుకు ఉదాహరణ. నిరంతరం తనిఖీలు చేస్తే ఇలాంటి డంప్‌లు మొత్తం బయటపడతాయని సా ్థనికులు అంటున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇసుక దందాలో భాగస్వామ్యం కావడం గమనార్హం. ఇసుక డంప్‌లపై రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు,మూడు డంప్‌లను సీజ్ చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో యాలాల చుట్టుపక్కల, తాండూరు పట్టణ శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తే ఇసుక డంప్‌లు బయటపడతాయని స్థానికులు చెబుతున్నారు. కొందరు అధికారులు నెలవారీ ముడుపుల మత్తులో మునిగిపోవడంతో డంప్‌ల జోలికి వెళ్లడం లేదని సమాచారం. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన తనిఖీ బృందాలు ఎక్కడ ఉన్నాయో...అసలు పని చేస్తున్నాయో లేదో తెలియని పరిస్థితి. పట్టణంలోని పాతతాండూరు మీదుగా ఇసుక రవాణా సాగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ తరలింపుతో తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం వెనుక భాగంలో కాగ్నా నది ధ్వంసమైంది. నంబర్లు లేని ట్రాక్టర్లను అక్రమార్కులు ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ట్రాక్టర్లపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోకపోవడం కూడా ఇసుక అక్రమ రవాణాకు ఊతమిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రోజుకు సుమారు 150-200ల ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని తెలుస్తోంది. జిల్లా అధికారులు చొరవ తీసుకుంటే తప్ప ఇసుక దందాకు బ్రేక్ పడే పరిస్థితి కనబడటం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
నేనూ ‘గ్రామీణ’ విద్యార్థినే..
తాండూరు రూరల్: గ్రామీణ ప్రాంతంలో చదివానని, ప్రభుత్వ పాఠశాలల సమస్యలు తనకు తెలుసని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ అన్నారు. తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్వీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘విద్యాహక్కు చట్టం అమలు - ఎస్ఎంసీ చైర్మన్ పాత్రపై’ నిర్వహించిన సదస్సులో ఆయన మట్లాడుతూ కర్నాకట సరిహద్దు ప్రాంతంలో ఉన్న తాండూరు, బషీరాబాద్, బంట్వారం మండలాల పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారిస్తానని చెప్పారు. ఇక్కడి పాఠశాలలో వసతులు లేవని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానన్నారు. జిల్లాలో 334 పాఠశాల్లో ఒకే ఉపాధ్యాయుడితో పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతి రోజు పాఠశాలలకు పంపించాలన్నారు. ఎస్ఎంసీ చైర్మన్లు పాఠశాల్లో ప్రతి రెండు నెలలకోసారి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. మధ్యహ్న భోజనం తనిఖీ చేయాల్సిన బాధ్యత ఎస్ఎంసీలపైనే ఉందన్నారు. పిల్లల భవిష్యత్‌ను మీరే తీర్చిదీద్దాలన్నారు. పాఠశాలలు అభివృద్ధి కావాలంటే గ్రామాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను వారానికి రెండుసార్లు ఎస్ఎంసీ చైర్మన్లు తనిఖీ చే సి, పరిస్థితులను స్థానిక ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం ఉన్నత పాఠశాల విద్యార్ధికి ఒక రోజు రూ.6 ఖర్చు చేస్తోందని, ప్రాథమిక పాఠశాల విద్యార్ధికి రూ.4 ఖర్చు చేస్తోందని చెప్పారు. త్వరలో ఆర్వీఎం నుంచి నిధులు.. జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు త్వరలో ఆర్వీఎం నుంచి నిధులు విడుదలవుతాయని డీఈఓ రమేష్ చెప్పారు. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లో నిధులు లేవని చెప్పారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కింద ఉన్నత పాఠశాల్లో రూ.50 వేలు మౌలిక సదుపాయాల కోసం ఉన్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల పాఠశాలలను అభివృద్ధి చేస్తానన్నారు. ఉపాధ్యాయుల్లో మార్పు వచ్చింది.. జిల్లాలో ప్రస్తుతం ఉపాధ్యాయుల తీరు మారిందని డీఈఓ చెప్పారు. ఉపాధ్యాయుల స్వభావం మరాలన్నారు. 70 శాతం ఉపాధ్యాయుల్లో మార్పు వస్తోందన్నారు. మిగతా 30 శాతం మంది విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, వారిని మొదట సముదాయిస్తామని, ఆ తర్వాత నోటీసులు ఇస్తామని, వినకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఈఓకు సమస్యలు విన్నవించిన ఎస్ఎంసీ చైర్మన్లు.. విద్యాహక్కు చట్టం అమలు కార్యక్రమానికి వచ్చిన డీఈఓ రమేష్‌కు తాండూరు, బషీరాబాద్ మండలాల నుంచి వచ్చిన ఎస్ఎంసీ చైర్మన్లు పలు సమస్యలు విన్నవించారు. బషీరాబాద్ మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయుల తీరులో మార్పు తేవాలన్నారు. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, అదనపు తరగ తి గదుల కొరత ఉందని విన్నవించారు. టాయిలెట్స్ లేకపోవడంతో విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంవీఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, బాలల హక్కుల పరిరక్షణ జిల్లా కన్వీనర్ సుదర్శన్, రిటైర్డ్ టీచర్స్ ఫోరం కన్వీననర్ జానార్దన్, ఎంఈఓ శివకుమార్‌తోపాటు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘విజయ’ పతాక!
తాండూరు: పాతతాండూరుకు చెందిన జి.విజయనిర్మల జాతీయ ఉత్తమ మహిళా రైతు పురస్కారాన్ని అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇక్రిశాట్లో ‘జాతీయ మహిళా రైతు’ దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ స్థాయిలో వ్యవసాయంలో అత్యంత ప్రతిభను కనబరిచిన దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 250 మంది మహిళా రైతులు జాతీయ ఉత్తమ రైతు అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు మహిళా రైతులు ఎంపిక కాగా.. వీరిలో తాండూరుకు చెందిన జి.విజయనిర్మల ఒకరు. ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ విలియం డి.డార్ చేతుల మీదుగా విజయనిర్మలతోపాటు మిగతా ఉత్తమ రైతు అవార్డు గ్రహీతలకు సన్మానం, స్వర్ణపతకాలను అందజేశారు. ఇక్రిశాట్ తయారు చేసిన కంది, జొన్న, వేరుశనగ, సజ్జ, పప్పు శనగ పంటల్లోని వంగడాలు ఆధునిక సాగు పద్ధతులు ఆచరించి ఆయా పంటల్లో అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలిచిన మహిళా రైతులను ఇక్రిశాట్ జాతీయ ఉత్తమ రైతు అవార్డుకు ఎంపిక చేసింది. కార్యక్రమంలో ఇక్రిశాట్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డా.సీఎల్ఎల్.గౌడ, స్ట్రాటెజిక్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ డెరైక్టర్ డా.జోవాన్న కేన్, పొటాక్, ఇక్రిశాట్ డెవలప్మెంట్ సెంటర్ డెరైక్టర్ డా.సుహా స్ పి.వాణి, వివిధ రాష్ట్రాల వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇదీ.. విజయ ప్రతిభ ఇక్రిశాట్ కంది పరిశోధనా విభాగం అధిపతి, సీనియ ర్ శాస్త్రవేత్త డా.సి.సమీర్‌కుమార్, తాం డూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తల సహకారంతో కంది పంట లో నూతన రకాలను సాగుచేస్తూ, ఆధునిక పద్ధతులను ఆచరిస్తూ విజయనిర్మ ల అధిక దిగుబడులు సాధిస్తున్నారు. 2012-13 సంవత్సరంలో మొదటిసారిగా ఇక్రిశాట్ రూపొందించిన ఐసీపీహెచ్-2740 కందిరకం సాగుచేసి అధిక దిగుబడులు సాధించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా నాటే పద్ధతిలో కంది పంటను డ్రిప్పు కింద సాగు చేయడమే కాకుండా అంత ర్ పంటగా బెండ పంటను విత్తారు. రసాయనిక ఎరువులు, పురుగు మందు ల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువు ల వాడకంపై ఆమె కనబర్చిన ఆసక్తి ఇక్రిశాట్ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించిం ది. విజయనిర్మలను జాతీయస్థాయి ఉత్తమ రైతు అవార్డు వరించింది. ఈ అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని విజయనిర్మల పేర్కొన్నారు. తాండూరుకు చెందిన మహిళకు జాతీయ స్థాయి అవార్డు రావడం పై తాండూరు పరిశోధనా కేంద్రం హెడ్ శాస్త్రవేత్త డా.సి.సుధారాణి, సీనియర్ శాస్త్రవేత్త డా.సి.సుధాకర్‌లు విజయనిర్మలకు అభినందనలు తెలిపారు. -
‘కాగ్నా’కు జలకళ
తాండూరు: తాండూరు శివారులోని కాగ్నా నది పరవళ్లు తొక్కుతుంది. సోమ, మంగళవారాలతోపాటు బుధ, గురువారాల్లో ఏకధాటిగా కురిసిన వర్షంతో కాగ్నాకు జలకళ వచ్చింది. కాగ్నాతోపాటు డివిజన్ పరిధిలోని చిన్న వాగులు, వంకలు వరదనీరుతో పొంగిపొర్లాయి. దాంతో నదీపరీవాహక ప్రాంతంలోని బోర్లు, బావుల్లోని నీటిమట్టాలు పెరిగాయి. తాండూరు పట్టణానికి తాగునీటిని అందించే పంప్‌హౌస్‌తోపాటు, మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్, యాలాల మండలంలోని పలు గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే మరో పంప్‌హౌస్‌లో నీటి మట్టం పెరిగింది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 232.7 మిల్లీమీటర్లకుగానూ ఇప్పటివరకు 122 మిల్లీమీటర్లు(12.2సెంటీమీటర్లు) వర్షపాతం నమోదైందని స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా.సి.సుధాకర్ పేర్కొన్నారు. తాజాగా కురిసిన వర్షాలతో భూమి బాగా తడవడం వల్ల రబీ పంటల సాగుకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. పెరిగిన నీటి మట్టం కాగ్నా నది సమీపంలోని పంప్‌హౌస్‌లో సుమారు నాలుగు అడుగుల నుంచి 12అడుగులకు, పాతతాండూరులోని మరో పంప్‌హౌస్ వద్ద మూడు అడుగుల నుంచి 10 అడుగులకు, కోడంగల్ తాగునీటి పథకానికి సంబంధించిన పంప్‌హౌస్‌లో నాలుగు అడుగుల నుంచి ఎనిమిది అడుగులకు నీటిమట్టం పెరిగింది. కాగ్నా నదిలోని ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లోకి వరద చేరడం పంప్‌హౌస్‌లో నీటి మట్టం పెరగడానికి కారణమని పంప్‌హౌస్ సిబ్బంది పేర్కొన్నారు. ఇన్‌ఫిల్టరేషన్ బావులు వరదనీటిలో మునిగిపోయాయి. పంప్‌హౌస్‌ల్లో నీటి మట్టం పెరగడం వల్ల వచ్చే వేసవి వరకు కూడా తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదని మున్సిపల్ ఏఈ శ్రీను చెబుతున్నారు. ఈ భారీ వర్షం కారణంగా తాండూరు డివిజన్లోని సంగంకలాన్, కోకట్, అగ్గనూర్, బెన్నూర్, తదితర గ్రామాలకు చెందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థులకు ‘ఇన్స్పిరేషన్’
తాండూరు: తాండూరులో మూడు రోజులపాటు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన బుధవారంనాటితో ముగిసిం ది. వికారాబాద్ డివిజన్ పరిధిలోని వివి ధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెంది న విద్యార్థినీ, విద్యార్థుల పలు అంశాలపై ప్రయోగ ప్రదర్శనలను అందరినీ ఆకట్టుకున్నాయి. ఎంతో ఆలోజింపచేశాయి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న పాఠశాలల నుంచి 25 పాఠశాలు రానున్న సె ప్టెంబర్ చివరిలో జరుగనున్న రాష్ర్టస్థా యి వైజ్ఞానిక ప్రదర్శకు ఎంపికయ్యాయి. రాష్ట్రస్థాయికి ఎంపిక పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులను జెడ్పీ చైర్పర్సన్ సునీ తారెడ్డి, డీఈఓ రమేష్ సన్మానించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన పాఠశాలలు.. అగ్గనూర్ జెడ్పీహెచ్ఎస్ (నవీన్), తాండూరు గంగోత్రి (రాజశ్రీ సర్దార్/శ్రేయారెడ్డి), మల్రెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (నగేష్), మోత్కుపల్లి జెడ్పీహెచ్ఎస్ (శ్రీకాంత్), వికారాబాద్ జెడ్పీహెచ్ఎస్ (దివ్య), కరన్‌కోట్ జెడ్పీహెచ్ఎస్ (మమత), వెల్చల్ జెడ్పీహెచ్ఎస్ (స్వర్ణలత), ఎన్కతల జెడ్పీహెచ్ఎస్ (కృష్ణవేణి), గోటిగకుర్ధు జెడ్పీహెచ్ఎస్ (శివకుమార్), మద్గుల్ చిట్టంపల్లి (శివలక్ష్మి), సెయింట్ ఆంటోని హైస్కూల్ (భవాని), మోమిన్‌పేట్ జెడ్పీహెచ్ఎస్ (అస్మబే గం), సెయింట్ మేరీ హైస్కూల్ (రోహి త్‌రాజ్), జెడ్పీహెచ్ఎస్ కరన్‌కోట్ (కా వ్య), ప్రతిభా రెసిడెన్షియల్ స్కూల్ (స్వాతికారెడ్డి), జెడ్పీహెచ్ఎస్ గొట్టిముకుల (శివరామరాజు), శ్రీసరస్వతీ శిశుమందిర్ (పవన్‌కళ్యాణ్), యూపీఎస్ పీలా రం (నరేష్కుమార్), ఏపీ మోడల్ స్కూ ల్ (మణిప్రభ), జెడ్పీహెచ్ఎస్ కోత్లాపూర్ (స్వాతి), జెడ్పీహెచ్ఎస్ కోలుకుందా న్యూ (అశ్వంత్), కోటబాస్పల్లి కేరళ మోడల్ హైస్కూల్ (సుజాత), యూపీఎస్ నాగులపల్లి (నర్సింహులు), సెయింట్ మార్క్స్ హైస్కూల్ (శివాని), యూపీఎస్ తిమ్మాయిపల్లి (గీత) పాఠశాలలు, విద్యార్థులు రాష్ర్టస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు. -
కళ్ల ముందే కర్ణాటకకు!
తాండూరు: వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. యేటా కాగ్నానది పొంగిపొర్లడం.. ఆ జలాలు దిగువనున్న కర్ణాటకకు తరలిపోతుండడం సాధారణమై పోయింది. భారీ వర్షాలు పడిన సమయంలో నీటి వరద పక్క రాష్ట్రానికి తరలిపోకుండా ‘చెక్’ పెట్టాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వరద నీటి వల్ల తాండూరు ప్రాంతానికి ఏ ప్రయోజనమూ ఉండడం లేదు. ప్రతి ఏడాది వర్షాకాలంలో కాగ్నాలోకి పుష్కలంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ వరద నీటిని వినియోగంలోకి తెస్తే వేలాది ఎకరాలను సాగులోకి తీసుకురావొచ్చు. తాండూరు పట్టణంతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ప్రాంతంలోని 33 గ్రామాలకూ తాగునీటిని అందించొచ్చు. చెక్‌డ్యాం నిర్మాణమెప్పుడో..! కాగ్నా వరద నీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నదిలో చెక్‌డ్యాం నిర్మించాలని గతంలో ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఏడాది క్రితం రూ.8.52కోట్ల నిధులు మంజూరయ్యాయి. చెక్‌డ్యాం నిర్మాణ స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. నదిలో చెక్‌డ్యాం నిర్మిస్తే నది చుట్టుపక్కల ఉన్న సుమారు 400 బోర్లకు పుష్కలంగా నీరు చేరుతుంది. తద్వారా సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందే వీలుంది. ప్రతిపాదిత చెక్‌డ్యాం నిర్మిస్తే 250-300 మీటర్ల పొడవున 0.35 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంటుంది. దాంతో భూగర్భజలాలు వృద్ధి చెంది భవిష్యత్తులో కరువు తలెత్తినా సాగు, తాగునీటికి సమస్య ఉత్పన్నం కాదు. కర్ణాటకకు ఇలా.. వర్షాకాలంలో కాగ్నా నుంచి తరలిపోతున్న వరద నీటిని కర్ణాటక సద్వినియోగం చేసుకుంటోంది. జలాలు బషీరాబాద్ మండలం ఇందర్చేడ్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తాయి. వరద నీరు ప్రవహించే మార్గంలో అక్కడక్కడ చిన్నచిన్న డ్యామ్‌లు సైతం నిర్మించారు. ఆ రాష్ట్రంలోని కోహెడ్, సేడం తదితర ప్రాంతాల్లో చిన్నచిన్న చెరువులు నింపడం, కాలువల ద్వారా వరద నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. 1.9టీఎంసీల నీరు కర్ణాటక? వర్షాకాలంలో సుమారు 1.9 టీఎంసీ వరదనీరు కాగ్నా నుంచి కర్ణాటకకు తరలిపోతున్నదని సాగునీటి పారుదల శాఖ అధికారుల ప్రాథమిక అంచనా. చెక్‌డ్యాం నిర్మాణంతో ఈ వరద జలాలు అందుబాటులోకి తెవొచ్చని, దాంతో వందలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.8.50కోట్ల నిధులు మంజూరైనా పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. కాగ్నాలో చెక్‌డ్యాం నిర్మాణానికి స్థలాన్ని కూడా అధికారులు ఎంపిక చేశారు. కానీ టెండర్ల ప్రక్రియ నిర్వహించి పనులు మొదలు పెట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. -
ఇక తాండూరుకు ‘ఎల్ఈడీ’ కాంతులు!
తాండూరు: తాండూరు మున్సిపాలిటీ ఇక ధగధగ మెరిసి పోనున్నది. ఎల్ఈడీ విద్యుత్ దీపాల వెలుతురుతో మున్సిపాలిటీ ప్రధాన వీధులు మరింత ప్రకాశించనున్నాయి. ఈ కొత్త ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ప్రాజెక్టుగా జిల్లాలో తాండూరు మున్సిపాలిటీని ఎంపిక చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ను పొదుపు చేయడంతోపాటు వీధిదీపాల వినియోగంలో లక్షల రూపాయల వ్యయాన్ని తగ్గించాలనే ఆలోచనతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఏడు మున్సిపాలిటీలు ఈ ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు ఎంపికయ్యాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో తాండూరు మున్సిపాలిటీ నుంచి సుమారు 300 ఎల్ఈడీ దీపాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులో భాగంగా మొదట సుమారు 200 దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన మార్గాల్లో 250 వాట్స్ కలిగిన సోడియం వేపర్(ఎస్వీ) దీపాలు ఉన్నాయి. వీటి వల్ల విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. నెలకు రూ.9 లక్షలు వ్యయం అవుతుంది. ఈనేపథ్యంలో ఎస్వీ దీపాల స్థానంలో కొత్తగా 90 వాట్స్ కలిగిన ఎల్ఈడీ దీపాలను సర్కారు ఏర్పాటు చేయనున్నది. ఎస్వీ దీపాలకంటే రెట్టింపు వెలుతురు ఉండటంతోపాటు విద్యుత్పొదుపు అవుతుంది. ఖర్చు కూడా తగ్గుతుంది. త్వరలోనే ఈ ఎల్ఈడీ దీపాల ఏర్పాటుతో మున్సిపాలిటీకి కొత్త శోభరానుంది. -
ముంచెత్తిన వాన
తాండూరు: కాగ్నా నది (వాగు) ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి పరవళ్లు తొక్కింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఐదు గంటల వరకు యాలాల, పెద్దేముల్, ధారూర్, పూడూరు మండలాల్లో జోరు వాన కురిసింది. దీంతో కాగ్నాకు వరద నీరు పోటెత్తింది. చెరువులు, వాగులు సైతం నిండి వరద నీరు పొంగిపొర్లింది. కాగ్నా నది ఉధృతితో తాండూరు- మహబూబ్‌నగర్ రహదారిపై రాకపోకలు మూడు గంటలపాటు స్తంభించాయి. చాలాకాలం తర్వాత కాగ్నా ఉప్పొంగడంతో చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు రెండు కి.మీ.మేరకు వాహనాలు నిలిచిపోయాయి. తాండూరు రూరల్ సీఐ రవి, ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో కాగ్నా వంతెన వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వరదనీరుతో ముళ్ల చెట్లు, చెత్తాచెదారం కొట్టుకొచ్చి వంతెనపై చేరాయి. అధికారులు జేసీబీని తెప్పించి వాటిని తొలగించారు. ఉదయం 10గంటల తర్వాత ప్రవాహం కాస్త తగ్గడంతో వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిచ్చారు. తాండూరు పట్టణానికి తాగునీటి సరఫరాచేసే ప్రాంతంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహించింది. భారీ వర్షం నేపథ్యంలో తాండూరు పట్టణం జలమయమైంది. గ్రీన్‌సిటీ, సాయిపూర్, కోకట్ మార్గంలోవాగు, పాలిషింగ్ యూనిట్లు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణ సమీపంలోని చిలకవాగు, కోకట్వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ఉదయం వేళ ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పట్టణంలోని రైల్వే ఫ్లైవర్ బ్రిడ్జీ మార్గంలో రోడ్లు దెబ్బతిన్నాయి. సాయిపూర్లోని ప్రభుత్వ నంబర్-1 పాఠశాల, బాలికల హాస్టళ్లు జలమయమయ్యాయి. పట్టణ సమీపంలోని కంది, పత్తి, పెసరు తదితర పంటలు నీటమునిగాయి. పలుచోట్ల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉదయం మున్సిపల్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. మధ్యాహ్ననికి కాగ్నా నదికి వరద ఉధృతి తగ్గింది. తాండూరు పట్టణంలో 52.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధారూరులో 74.2 మిల్లీమీటర్ల వర్షం ధారూరు: ధారూరు మండలంలో సోమవారం రాత్రి 74.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ధారూరు, బాచారం గ్రామాల సమీపంలో ప్రవహిస్తున్న వాగులు రాత్రి వేళ ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు మంగళవారం ఉదయం వరకు నిలిచిపోయాయి. వర్షానికి చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరింది. వర్షాలు లేక వడపడిన పంటలన్నీ కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. ధారూరు మండలంలో భారీ వర్షం కురిసినా కోట్‌పల్లి ప్రాజెక్టులోకి మాత్రం నీరు అంతగా చేరలేదు. కేవలం ఒకటిన్నర అడుగులు మాత్రమే పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.5 అడుగుల నీటి నిల్వ ఉంది. మర్పల్లి, బంట్వారం మండలాల్లో వర్షాలు కురిస్తేనే ఈ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ధారూరు మండంలోని ధర్మాపూర్, నర్సాపూర్, అనంతగిరిగుట్ట ప్రాంతాల్లో వర్షాలుకురిస్తే వాగు ప్రవహించి ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం ఉం ది. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో సోమవారం నాలుగు అడుగులు ఉన్న నీటి మట్టం అదేరోజు రాత్రి కురిసిన వర్షానికి ఏడు అడుగులకు చేరింది. చేపల వేట పెద్దేముల్: భారీ వర్షం కారణంగా చెరువులు వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాల్లో ప్రజలు చేపల వేటకు దిగారు. పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ వాగులో గ్రామ ప్రజలు వలలువేసి చేపలు పట్టుకున్నారు. వికారాబాద్ డివిజన్లో.. వికారాబాద్ రూరల్: వికారాబాద్ డివిజన్లో సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు ఆయా మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌లో 33.2 మి.మీలు, ధారూర్‌లో 74.2, బంట్వారంలో 14.0, పెద్దేముల్ 90.0, తాండూరు 52.4, బషీరాబాద్ 46.0, యాలాల 72.0 మి.మీటర్ల వ ర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి తెగిన రోడ్డు పరిగి: పరిగి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. మల్కాపూర్ వాగు పొర్లుతుండడంతో పరిగి-షాద్‌నగర్, పరిగి-మహబూబ్‌నగర్ వెళ్లే దారిలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన రోడ్డు తెగిపోయింది. మల్కాపూర్ సమీపంలో షాద్‌నగర్ రోడ్డుపై వంతెన నిర్మాణంలో ఉండడంతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. భారీ వర్షానికి మల్కాపూర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు తెగింది. వాగుకు అవతల పొలాలకు వెళ్లిన వారు, పశువులు, మేకలు, గొర్రెలు అవతలే ఉండిపోయాయి. -
రుణమాఫీ రూ.950 కోట్లు
తాండూరు రూరల్: జిల్లాలోని ఆయా బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.950 కోట్లు మాఫీ కానున్నాయని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. సోమవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలోని అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీతో జిల్లాలోని రెండు లక్షల మందికిపైగా రైతులు లబ్ధిపొందనున్నారని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో ఆయా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో వివరాలు తీసుకున్న అనంతరం 31న జిల్లాస్థాయి కమిటీలో సమావేశమై నివేదికపై చర్చిస్తామన్నారు. జిల్లాస్థాయి సమావేశం అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రుణమాఫీ అయిన రైతుల పేర్లను ప్రకటిస్తామన్నారు. రుణాల మాఫీ ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చేనెల రెండో వారంలో రైతులకు కొత్త రుణాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వేగవంతంగా కంప్యూటరీకరణ చేస్తున్నామని చెప్పారు. -
సైన్స్ఫెయిర్లతో సృజనాత్మకత
తాండూరు టౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఇన్స్పైర్ అవార్డ్స్ సైన్స్‌ఫెయిర్లను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రమేష్ పేర్కొన్నారు. ఆది వారం ఆయన పట్టణంలోని సెయింట్ మార్క్స్ పాఠశాలలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇన్స్పైర్ అవార్డ్స్ సైన్స్‌ఫెయిర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి వచ్చే నెల 11 వరకు నాలుగు చోట్ల సైన్స్‌ఫెయిర్లను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 25 నుంచి 27వరకు తాండూరులో, 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు పరిగిలో, సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు ఇబ్రహీంపట్నంలో, 9 నుంచి 11 వరకు కుత్బుల్లాపూర్‌లలో సైన్స్ఫెయిర్లు నిర్వహించనున్నామన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. సైన్స్‌ఫెయిర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,34,35,500 వెచ్చిస్తోందని ఆయన తెలిపారు. ఇందులో ఒక్కో నమూనా తయారీకి ఒక్కో విద్యార్థికి రూ.5 వేల చొప్పున రూ.1,03,35,000, 3 రోజుల పాటు జరగనున్న సైన్స్‌ఫెయిర్ సందర్భంగా భోజనం తదితర వసతుల కల్పనకు ఒక్కో విద్యార్థికి రూ.1500 చొప్పున మొత్తం రూ. 31,00,500 ఖర్చు చేయనున్నట్లు రమేష్ చెప్పారు. జిల్లావ్యాప్తంగా 2,067 నమూనాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశామన్నారు. సైన్స్‌ఫెయిర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నమూనాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో 500 నమూనాల ప్రదర్శనకు సిద్ధం చేశామని డీఈఓ తెలిపారు. జిల్లాలోని 4 కేంద్రాల్లో ఒక్కో దాని నుంచి 7.5 శాతం చొప్పున నమూనాలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అక్కడ 5 శాతం ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపుతారన్నారు. రాష్ట్రస్థాయిలో వచ్చే నెల చివరి వారంలో సైన్స్‌ఫెయిర్ జరుగుతుందన్నారు. వికారాబాద్ డివిజన్ పరిధిలోని తాండూరులో సోమవారం జరగనున్న సైన్స్‌ఫెయిర్‌లో 382 నమూనాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవానికి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. అనుమతి లేని పాఠశాలలు 15 రోజుల్లో సీజ్ అనుమతి లేని పాఠశాలలకు ఇచ్చిన 2 నెలల గడువు మరో 15 రోజుల్లో ముగిసిపోతుందని డీఈఓ రమేష్ గుర్తు చేశారు. అనంతరం ఆయా పాఠశాలలను సీజ్ చేయనున్నట్లు చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు డీజీ, టాలెంట్, కాన్సెప్ట్, గ్రామర్, టెక్నో వంటి పేర్లను తొలగించాలంటూ నోటీసులు జారీ చేయనున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ కింద రూ.50 వేలు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో ఎస్జీటీ, ఎస్ఏ కలిపి సుమారు 100 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఉపాధ్యాయులు విధిగా పాఠ్యప్రణాళిక, డైరీలను రాయాలన్నారు. మహిళా ఉపాధ్యాయులు వారికి కేటాయించిన 27 సెలవులను యథావిధిగా వినియోగించుకోవచ్చన్నారు. ఎన్ఐఆర్డీ అధికారులు పాఠశాలల్లో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం, నాణ్యమైన విద్య తదితర అంశాలపై 12 మంది టీం సభ్యులుగా తనిఖీలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. -
వలస జీవులకు సర్వే కష్టాలు
తాండూరు రూరల్: సమగ్ర సర్వే నేపథ్యంలో వలస జీవులు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. వారికి సరైన రవాణా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రాత్రి ముంబై నుంచి రైలులో దాదాపు 1500 మంది తాండూరుకు చేరుకున్నారు. వీరంతా వివిధ గ్రామాలకు వెళ్లాల్సి ఉండగా బస్సులు లేక బస్టాండ్‌లో పడిగాపులు కాశారు. పిల్లాపాపలతో వచ్చిన వలసకూలీలు నానా తంటాలు పడుతూ కనిపించారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా అధికారులు వీరిని పట్టించుకోలేదు. జిల్లాలోని గండేడ్, మహహ్మదాబాద్, పరిగి, కుల్కచర్ల మండలాల ప్రజలు ఎక్కువగా ముంబైకి వలస వెళ్తుంటారు. సమగ్ర సర్వే ద్వారా తమకు ప్రభుత్వ పథకాలు అందుతాయని గంపెడాశలతో వలస జీవులు స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో... తవ్వినకొద్దీ అక్రమాలు
తాండూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అంతులేని అవినీతి, అవకతవకలు చూసి అధికారులు అవాక్కవుతున్నారు. ఇళ్లను పరిశీలించడానికి వెళ్లిన సీఐడీ అధికారులకు సిమెంటు దిమ్మెలు తప్ప ఇంకేమీ కనిపించకపోవడంతో ఖంగుతింటున్నారు. గత రెండుమూడు రోజులుగా జిల్లాలోని పలు మండలాల్లో సీఐడీ అధికారులు పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. తాజాగా మంగళవారం బషీరాబాద్, గండేడ్ మండలాల్లో పర్యటించిన అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదులు అందచేశారు. బషీరాబాద్ మండలంలో 21 ఇళ్ల విషయంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మండల కేంద్రంలోని గోసాయి కాలనీలో పేదలకు స్థలాలు కేటాయించి 21 ఇళ్లు నిర్మించామని చెబుతున్న ప్రదేశానికి సీఐ డీ విభాగం డీఎస్పీ జితేందర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి చేరుకున్నారు. అయితే అక్కడ మోకాళ్ల లోతు సిమెంటు దిమ్మెలు మినహాయించి ఇంకేమీ కనిపించకపోవడంతో అధికారులు ఆశ్చర్యానికిలోనయ్యారు. లబ్ధిదారులు, మ ద్యవర్తులు, అధికారులు కుమ్మకై ఈ 21 ఇళ్లకు సంబంధిం చి రూ.2.82 లక్షలు స్వాహా చేసినట్లు తేల్చారు. మధ్యవర్తులు తమ పేర్లపై వచ్చిన బిల్లులు కాజేసి మోసం చేశారని పలువురు లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ సోదాలు
-
ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ సోదాలు
హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై ఉచ్చు బిగుస్తోంది. రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. అర్హులకంటే అనర్హులకే ఇళ్లు మంజారు అయినట్లు అధికారులు గుర్తించారు. ఇళ్లను కట్టకుండానే బిల్లులు మంజూరు అయినట్లు గుర్తించటం జరిగింది. పెద్దేముల్ మండలం రేగొండిలో 291 కుటుంబాలకు గానూ 290 ఇళ్లు నిర్మించారని హౌసింగ్ అధికారులు చెబుతున్నా, వాస్తవం మాత్రం విరుద్ధంగా ఉందని దీనిపై విచారణ చేస్తున్నామని సీఐడీ డీఎస్పీ తెలిపారు. దోషులుగా తేలితే అధికారులపైనా చర్యలు ఉంటాయన్నారు. ఇళ్ల నిర్మాణ అవినీతిలో రంగారెడ్డి జిల్లానే మొదటి స్థానంలో ఉంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆ విభాగం అధికారుల బృందం విచారణను వేగవంతం చేసింది. తాండూరు మండల పరిషత్‌లోని హౌసింగ్ డివిజన్ కార్యాలయంలో, పరిగి హౌసింగ్ డీఈ కార్యాలయంలో అధికారులు వివరాలు సేకరించారు. తాండూరు డివిజన్ కార్యాలయం నుంచి రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. -
తీగ లాగుతున్నారు!
తాండూరు రూరల్, పరిగి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆ విభాగం అధికారుల బృందం విచారణను వేగవంతం చేసింది. సోమవారం తాండూరు మండల పరిషత్‌లోని హౌసింగ్ డివిజన్ కార్యాలయంలో, పరిగి హౌసింగ్ డీఈ కార్యాలయంలో అధికారులు వివరాలు సేకరించారు. తాండూరు డివిజన్ కార్యాలయం నుంచి రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. క్రిమినల్ కేసులు పెడతాం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. తాండూరు హౌసింగ్ డివిజన్ కార్యాలయంలో డీఈ సీతారామమ్మను విచారించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఇళ్లు కట్టకుండా బిల్లులు కాజేసిన వారితోపాటు మధ్యవర్తులపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. సీఐడీ విచారణ ప్రారంభమైందని, ముఖ్యంగా బషీరాబాద్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లలో రూ.కోటి వరకు అవినీతి జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. బషీరాబాద్ మండల కేంద్రానికి సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నామని, త్వరలో విచారణచేసి అక్రమార్కులను అరెస్టు చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా పెద్దేముల్ మండలం రేగొండిలో 291 కుటుంబాలకు గానూ 290 ఇళ్లు నిర్మించారని హౌసింగ్ అధికారులు చెప్పారని, దీనిపై విచారణ చేస్తామని అన్నారు. దోషులుగా తేలితే అధికారులపైనా చర్యలు ఉంటాయన్నారు. అయితే విచారణకు వచ్చిన అధికారులు తమ పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు. అక్రమాల్లో బషీరాబాద్ నంబర్ వన్..! ఇందిరమ్మ ఇళ్ల అక్రమాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే బషీరాబాద్ మండలం ప్రథమ స్థాయంలో ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. దాదాపు 479 ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలు జరిగాయన్నారు. వంద శాతానికి వంద శాతం ఇళ్లు ఎలా నిర్మిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల్లో తిరిగి తాండూరుకు వచ్చి విచారణను పూర్తిస్థాయిలో చేపడుతామన్నారు. ఇప్పాయిపల్లి, చిన్నవార్వాల్ గ్రామాల్లో ఎక్కువ అవినీతి పరిగి హౌసింగ్ డీఈ కార్యాలయాన్ని సందర్శించిన అధికారులు.. తమకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా హౌసింగ్ డీఈ సంగప్పను కోరారు. వివరాల సేకరణకు రెండు మూడు రోజుల సమయం కావాలని కోరడంతో ఓ ప్రొఫార్మాను అందజేస్తూ.. దాని ప్రకారం వివరాలు ఇవ్వాలని సూచించారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తామని, లబ్ధిదారుల ఎంపిక, ఒకే వ్యక్తి రెండు మూడు ఇళ్లు తీసుకోవడం, ఇళ్ల మంజూరులో పైరవీలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు. పరిగి నియోజకవర్గ పరిధిలోని ఇప్పాయిపల్లి, చిన్నవార్వాల్ గ్రామాల్లో ఎక్కువ అవినీతి జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన అధికారులు ముందుగా ఆ రెండు గ్రామాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఇందిరమ్మ ఇళ్లకోసం లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులు సైతం కావాలని హౌజింగ్ అధికారులను అడిగారు. విచారణకు వచ్చిన బృందంలో ఓ డీఎస్పీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఓ సబ్ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులున్నారు. -
పోరాటయోధుడు జయశంకర్ సార్...
తాండూరు టౌన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. బుధవారం జయశంకర్ జయంతిని పురస్కరించుకుని జేఏసీ, టీవీవీ, స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాచౌక్‌లో ఏర్పాటుచేసిన ఆయన విగ్రహాన్ని కోదండరాం, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ‘జీవితం నీది.. బ్రతుకంతా దేశానిది’ అని కవి కాళోజి చెప్పినట్లుగా జయశంకర్ సార్ జీవితమంతా తెలంగాణ పోరాటానికే అంకితమిచ్చారన్నారు. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొనాల్సి ఉండగా ఆయన ప్రయాణిస్తున్న బస్సు పాడైపోవడంతో అక్కడికి వెళ్లలేకపోయినట్లు చెప్పేవారన్నారు. నాడు అక్కడ జరిగిన కాల్పుల్లో పలువురు విద్యార్థులు అమరులయ్యారన్నారు. ఆనాడు ఆయన వె ళ్లకపోవడం వల్లే నేటివరకు మనకు దారి చూపుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయ్యారన్నారు. 1969లో జరిగిన ఉద్యమానికి ప్రాణంపోసి ఆంధ్రుల ఆధిపత్యానికి ఎదురెళ్లారన్నారు. 1996 ప్రారంభమైన మలిదశ ఉద్యమానికి మొలకనాటి నీరుపోసి పోరాటాన్ని ఉధృతం చేయించారన్నారు. కేసీఆర్‌తో కలిసి ఉద్యమాన్ని ఉరకలు పెట్టించారన్నారు. వికారాబాద్‌ను జిల్లాగా చేసి, ఇక్కడి సంపదను స్థానికులకే దక్కేలా నాయకులు చూడాలన్నారు. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. తెలంగాణ గీతాలకు కళాకారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, జేఏసీ నాయకులు కనకయ్య, రంగారావు, టీవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదయ్య, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సాజిద్ అలీ, నాయకులు బైండ్ల విజయ్‌కుమార్, ఆర్.విజయ్, కరణం పురుషోత్తంరావు, రాజుగౌడ్, విజయాదేవి, సునీతాసంపత్, సుమిత్, శోభారాణి, రజాక్, పరిమళ, నీరజ, అనసూయ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్య కోరల్లో కరన్‌కోట్
తాండూరు రూరల్: మండలంలోని కరన్‌కోట్ గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గ్రామశివారులో ఉన్న ‘సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ) ఫ్యాక్టరీ నుంచి ప్రతి రోజు గ్రామంలోకి దుమ్ము, ధూళి వస్తోంది. దీంతో గ్రామస్తులు కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు దీన్ని చూసీచూడనట్లు నిద్రావస్థలో ఉన్నారు. కరన్‌కోట్ చుట్టూ నాపరాతి నిక్షేపాలు ఉండటంతో 1983లో కేంద్ర ప్రభుత్వం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని గ్రామ శివారులో స్థాపించింది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని అప్పట్లో గ్రామస్తులు కం పెనీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉపాధి సంగతేమో గానీ కంపెనీ వచ్చినప్పటినుంచి గ్రామస్తులకు రోగాలు మాత్రం ఎక్కువయ్యాయి. రోగాలపాలు కంపెనీ నుంచి వచ్చే దుమ్ము ఇళ్ల ఆవరణలో పెద్ద మొత్తంలో పేరుకుపోతోం దని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేదబావులు, వాటార్ట్యాంక్ల్లో సైతం దుమ్ము చేరి జనం అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది ఊపిరితిత్తులు, అస్తమా వ్యాధులకు గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ముతో చిన్నారుల కంటి నుంచి నీరుకారుతోందని తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట గ్రామస్తులు నిద్రపోయిన తర్వాత కంపెనీ నుంచి దుమ్ము విపరీతంగా వదులుతున్నారు. ఉదయం చూసేసరికి ఇంటి ఆవరణలో, ఇంట్లో వస్తువులపై పెద్దఎత్తున దుమ్ము పేరుకుపోతోంది. యజమాన్యానికి అనేకసార్లు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఘనంగా కార్గిల్ దివస్
తాండూరు టౌన్ : పట్టణ శివారులోని బాలికల గురుకుల పాఠశాల (ఏపీఆర్ఎస్) విద్యార్థినులు శనివారం ఘనంగా కార్గిల్ దివస్‌ను నిర్వహించారు. విద్యార్థినులు సైనిక దుస్తుల్లో జాతీయ జెండాను చేతపట్టుకుని విజయోత్సాహంతో పరుగులు తీశారు. పలు విన్యాసాలను ప్రదర్శించి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కార్గిల్ ప్రాంతంలో జరిగిన పోరాటంలో మన దేశ సైనికులు విజయబావుటా ఎగురవేశారన్నారు. నాటి యుద్ధంలో మరణించిన వీరులకు జోహార్లు అర్పిస్తూ ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ దివస్‌ను జరుపుకుంటామన్నారు. దేశ సేవకు మించిన కార్యం ఏదీ లేదని, యువత సైన్యంలో చేరి దేశ రక్షణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంబాపూర్ ఎస్ఎంసీ చైర్మన్ వెంకటయ్య, ఉపాధ్యాయులు రాజేశ్వరి, బాలకృష్ణ, శ్రీధర్, రఘు పాల్గొన్నారు. -
జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంపు
తాండూరు: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచుతామని హైదరాబాద్ రేంజ్ డీఐజీ టీవీ శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తాండూరు డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఐజీ విలేకరులతో మా ట్లాడారు. నేరాలను తగ్గించేందుకు జి ల్లా సరిహద్దు అయిన కర్ణాటక బార్డర్లో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పా రు. కొత్త వ్యక్తుల కదలికలపై తమ సిబ్బంది నిఘా ఉంచుతారన్నారు. దారి దోపిడీలను అరికట్టేందుకు హైవే పెట్రోలింగ్‌ను పకడ్బందీగా అమలుపరుస్తామని డీఐజీ పేర్కొన్నారు. పెద్దేముల్ మండలంలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కుందేళ్లు వేట కోసమే అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడి అయిందన్నారు. బైక్ వెళ్తున్న నలుగురుని పోలీ సులు ఆపే ప్రయత్నం చేశారని, ఈక్రమంలో బైక్ రోడ్డు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందినట్లు డీఐజీ వివరిం చారు. ఒక సింగిల్ బోర్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆ యన పేర్కొన్నారు. తాండూరు ప్రాం తంలో మట్కా బెట్టింగ్ వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఐజీ శశిధర్‌రెడ్డి చెప్పారు. పట్టణంలో ట్రాఫిక్ సమ స్య పరిష్కారానికి త్వరలో చర్యలు చేపడతామన్నారు. రంజాన్ పండగ సందర్భంగా ప్రార్థన మందిరాల వద్ద పెట్రోలింగ్‌తో పాటు గట్టి బందోబస్తు ఏర్పా ట్లు చేస్తున్నట్లు డీఐజీ వివరించారు. సీఐల బదిలీల విషయం తన పరిధిలో లేని అంశమని ఆయన చెప్పా రు. డీఎస్పీ కార్యాలయంలో వివిధ కేసుల పురోగతితో పాటు రికార్డులను డీఐజీ పరిశీలించారు. అంతకుముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. సమావేశంలో ఎస్పీ రాజకుమారి, తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, అర్బన్, రూరల్ సీఐలు వెంకట్రామయ్య, రవికుమార్ ఉన్నారు. కాగా సమావేశ అనంతరం డీఐజీ తాండూరు టౌన్, కరణ్‌కోట ఠాణాలను తనిఖీ చేశారు. -
ఇసుక అక్రమార్కులపై చర్యలు
తాండూరు: ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన తాండూరు మున్సిపల్ కౌన్సిల్ తొలి సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తాండూరులోని కాగ్నా నది (వాగు) నుంచి ఇసుక తవ్వకాలను అరికట్టేలా అధికారులను ఆదేశిస్తామన్నారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఉపేక్షించమని,వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన తాండూరులో సిమెంట్ కంపెనీలు, నాపరాతి పరిశ్రమలు అధికంగా ఉన్నాయన్నారు. ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణా కోసం తాండూరుకు నిత్యం వందలాది లారీలు రాకపోకలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. లారీలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నందున ట్రాఫిక్ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమాదాలు తగ్గించి, ట్రాఫిక్ సమస్య ను పరిష్కరించేందుకు తాండూరులో ఔట ర్ రింగురోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు సు మారు రూ.50 కోట్లు అవసరమవుతాయని మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారన్నారు. రూ.80 కోట్ల కేంద్రం నిధులతో కోట్‌పల్లి ప్రాజె క్టు నుంచి తాం డూరు పట్టణంలోని అన్ని వార్డులకు తాగునీరు సరఫరా మెరుగు పర్చడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఈ నిధులు త్వరగా మంజూరయ్యేలా చూస్తానన్నారు. కాగ్నాలో రూ.8.52కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యేలా చూస్తానన్నారు. తాండూరులో ప్రొ.జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పట్టణ మధ్యలో ఉన్న లారీ పార్కింగ్‌కు అవసరమైన స్థలం కేటాయిస్తామన్నారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం కేసీఆర్ కచ్చితంగా నెరవేరుస్తారన్నారు. ఎంత భారం పడినా, ఇబ్బందులు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. పల్లెలు,పట్టణాల్లో చిన్న ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. జిల్లా,ఏరియా ఆస్పత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో గుర్తించిన ప్రజల అవసరాలను ఐదేళ్లలో ప్రణాళిక బద్ధంగా తీర్చడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలతోపాటు గ్రామాల అభివృద్ధికి పాటుపడతానన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి జిల్లా పరిషత్ నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. తాండూ రు మున్సిపాలిటీకి సుమారు రూ.56లక్షలు, వికారాబాద్‌కు రూ.70లక్షల బీఆర్జీఎఫ్ నిధులను మంజూరు చేయనున్నట్టు ఆమె చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ గోపయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెప్పుడు కట్టిస్తరు!
తాండూరు: ‘సకల సౌకర్యాలతో ఇళ్లు కట్టిస్తామన్నరు. అందులో పార్కు, షాపింగ్ కాంప్లెక్స్, రోడ్లు, పాఠశాల, తాగునీరు, విద్యుత్.. అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. నాలుగేళ్ల క్రితం డబ్బులు కట్టించుకున్నరు. ఇప్పటివరకు అతీగతీ లేదు. ఇక మేం ఆగలేం. కట్టిన డబ్బులను వడ్డీతోసహా తిరిగివ్వండి.. లేకుంటే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తాం’ తాండూరులో రాజీవ్ స్వగృహ (ఆర్‌ఎస్‌జీ) జీఎం మారయ్య, ఏజీఎం బసయ్యలను లబ్ధిదారులు నిలదీసిన తీరిది. 2010లో తాండూరులో రాజీవ్ స్వగృహ కింద ప్రభుత్వం ఇళ్లు కట్టించేందుకు కొందరి నుంచి ఇంటికి అయ్యే మొత్తంలో 25శాతం నిధులను సేకరించింది. పెద్దఎత్తున ప్రాజెక్టు నిర్వహించాలని భావించినా కేవలం 29 మందే దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారి నుంచి డబ్బులు తీసుకున్న అధికారులు.. ఏడాదిన్నరలో ఇళ్లు పూర్తిచేస్తామని అప్పట్లో చెప్పారు. కానీ నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ విషయంపై లబ్ధిదారులు ఎన్నాళ్లుగానో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. శుక్రవారం రాజీవ్ స్వగృహ తాండూరు ప్రాజెక్టు జనరల్ మేనేజర్ మారయ్య, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బసయ్యలు పట్టణ శివారులోని ఆర్‌ఎస్‌జీ వద్దకు వచ్చారు. విషయం తెలుసుకుని లబ్ధిదారులు అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘ఇళ్లు వద్దు.. ఏమీ వద్దు.. మా పైసలు మాకు వడ్డీతో సహా ఇచ్చేయండి’ అంటూ నిలదీశారు. నాలుగేళ్లుగా తిరుగుతున్నా పనుల్లో ఎందుకు పురోగతిలేదని లబ్ధిదారులు బిచ్చప్ప, కిరణ్‌కుమార్, వెంకటేశం, శ్యాంరావు, శంకరమ్మ, సుజాత, మాణెప్ప తదితరులు జీఎం, ఏజీఎంలను ప్రశ్నించారు. మేమంతా చిరుద్యోగులమని, అప్పుచేసి డబ్బు తెచ్చి కట్టామని, ఓ వైపు వడ్డీలు పెరుగుతుంటే.. మరో వైపు అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌తో సమస్య వచ్చిందని, మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తిచేసి ఇళ్లు అప్పగిస్తామని జీఎం సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. మీ మాటలతో విసుగు చెందామని, ఇక నమ్మేది లేదంటూ లబ్ధిదారులు మండిపడ్డారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో చివరకు శాంతించారు. మూడు నెలల్లో అప్పగిస్తాం: కాంట్రాక్టర్ మధ్యలో పనులు ఆపేసి వెళ్లిపోయారు. అదే మాట్లాడుతున్నాం. 201 ఎకరాలకు గాను 15 ఎకరాల్లో లేఅవుట్ చేశాం. ఇందులో 29 మందికి ఇళ్లు నిర్మించాల్సి ఉంది. క్లాసిక్(రూ.24లక్షలు)-1, ఇంట్రిన్సిక్ (రూ.19లక్షలు)-1, బేసిక్ (రూ.11.30లక్షలు)-16, సివిక్ (రూ.7.10లక్షలు)-11 ఇళ్లు నిర్మించాలి. వీరంతా నిర్మాణం విలువలో 25శాతం చొప్పున రూ.73.34లక్షలు ఆర్‌ఎస్‌జీకి చెల్లించారు. ఈ ప్రాజె క్టు విలువ సుమారు రూ.మూడు కోట్లు. ఇందులో ఇప్పటికే రూ.కోటి విలువైనపనులు చేశాం. విడుదలైన రూ.50లక్షల నిధులు వికారాబాద్ బ్యాంకులో ఉన్నా యి. కాంట్రాక్టర్ సమస్యను కొలిక్కి తెచ్చి పనులు ప్రారంభిస్తాం. మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తిచేస్తాం. -జీఎం మారయ్య, (ఆర్‌ఎస్‌జీ) రాజీవ్ స్వగృహ -
ఓట్లు సమానంగా వస్తే డ్రా పద్ధతిలో విజేత ఎంపిక
తాండూరు, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా వస్తే డ్రా పద్ధతిలో విజేతను ఎంపిక చేస్తామని తాండూరు మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కౌంటింగ్ సూపర్ వైజర్లు, అసిస్టెంట్లకు నమూనా కంట్రోల్ యూనిట్ ద్వారా ఈనెల 12న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి విలేకరులతో మాట్లాడారు. ఏదైన వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా వచ్చినప్పుడు ఎన్నికల నిబంధనల ప్రకారం డ్రా తీసి విజేతను ఎంపిక చేస్తామని వివరించారు. పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారి నమోదు చేసిన ఓట్ల వివరాలకు ఓట్ల లెక్కింపు రోజు ఓట్ల వివరాలకు తేడా ఉంటే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థికి ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రం అందజేస్తారని తెలిపారు. మొత్తం 31 వార్డుల ఓట్ల లెక్కింపును మూడు రౌండ్లలో పూర్తి చేస్తామన్నారు. మొదటి, రెండో రౌండ్‌కు పది వార్డుల చొప్పున, మూడో రౌండ్లో 11వార్డుల ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి పోటీ చేసిన అభ్యర్థి లేదా అతని తరపున ఎన్నికల/కౌంటింగ్ ఏజెంట్లలో ఒక్కరికి మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. ఓట్ల లెక్కింపునకు వ్యవసాయ,విద్యాశాఖ, గనులు, ఇరిగేషన్, ఆర్అండ్బీ తదితర శాఖలకు చెందిన సీనియర్ అధికారులు మొత్తం 43మందిని నియమించామన్నారు. పది మంది కౌంటింగ్ సూపర్వైజర్లు మరో పది మంది అసిస్టెంట్లు, ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపునకు ఇద్దరు ఇన్చార్జిలు ఉంటారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా ఇద్దరు ఇన్చార్జిలతోపాటు నలుగురు అసిస్టెంట్లను నియమించనున్నట్టు చెప్పారు. ఓట్ల లెక్కింపు వివరాలను రౌండ్ల వారీగా కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయనున్న మీడియా పాయింట్లో విలేకరులకు అందజేస్తామని వివరించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల అధికారి గోపయ్య, ఇంజనీర్ సత్యనారాయణ, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే లక్ష్యం
తాండూరు, న్యూస్‌లైన్: పేదల సంక్షేమమే తన లక్ష్యమని, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలే తన విజయానికి తోడ్పడతాయని వైఎస్సార్ సీపీ తాండూరు అసెంబ్లీ అభ్యర్థి ఎం.ప్రభుకుమార్ అన్నారు. ఆదివారం ఆయన తాండూరు పట్టణంలోని సాయిపూర్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుకుమార్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ హయాంలోనే తాండూరు పట్టణ అభివృద్ధికి అధిక నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా సంక్షేమ పథకాలు అమలు చేసి, పేదలను అన్ని విధాలా ఆదుకోవడమే వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు. నియోజకవర్గంలో పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు పట్టణంలో ప్రజలు తనపై ఎంతో ఆదరణ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. తాండూరులో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీల మాయమాటలు నమ్మవద్దని ఆయన ఓటర్లను కోరారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడే పార్టీలను తరిమికొట్టాలన్నారు. తాను గెలిచిన అనంతరం ఈ ప్రాంత అభివృద్ధితోపాటు పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ ముదిరాజ్, నాయకులు సంతోష్, మధు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు టీడీపీ తొలిజాబితా
తాండూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో తాండూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దాదాపు 20ఏళ్ల క్రితం అన్నదమ్ములు రాష్ట్ర మాజీ మంత్రి మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో బాబాయ్ నారాయణరావు కాంగ్రెస్ నుంచి, అబ్బాయి నరేష్ (నారాయణరావు సోదరుడు చంద్రశేఖర్ కుమారుడు) టీడీపీ నుంచి ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఇంత కాలం ఒకే పార్టీ (కాంగ్రెస్) ..ఒకే కుటుంబంగా ఉన్న మహరాజ్‌లు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఎన్నికల సమరంలో బాబాయ్, అబ్బాయ్ తలపడుతుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. 2009 సార్వత్రిక ఎన్నికల తరువాత మాజీ ఎమ్మెల్యే నారాయణరావు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో ఆయన రాజకీయ పునరాగమనం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీని వీడిన నరేష్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు నారాయణరావు, నరేష్‌లకు సోమవారం టికెట్లను ఖరారు చేశాయి. 2009 ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్‌కు అధిష్టానం మరో అవకాశాన్ని ఇచ్చినా ఆయన సుముఖత చూపలేదు. తనకు బదులు బాబాయ్ నారాయణరావుకు టికెట్ ఇవ్వాలని విన్నవించారు. చివరికి రమేష్ విన్నపాన్ని అధిష్టానం ఆమోదించింది. దాంతో నారాయణరావు తెరపైకి వచ్చారు. ఇదే విధంగా 1994లో నారాయణరావు, ఆయన సోదరుడు మాణిక్‌రావు కాంగ్రెస్ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు పోటీ చేశారు. దాదాపు 20ఏళ్ల తరువాత ఒకే కుటుంబానికి చెందిన బాబాయ్, అబ్బాయ్ తలపడుతుండటం గమనార్హం. ఈనేపథ్యంలో వీరి కుటుంబసభ్యులు ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా నిలబడతారనే సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
‘కాగ్నా’ను కొల్లగొడుతున్న.. ఇసుక దొంగలు
తాండూరు, న్యూస్‌లైన్: అనుమతి లేకుండా ఇసుక తవ్వరాదు, తరలించడం నేరం.. అంటూ న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నా, పర్యవేక్షించాల్సిన యంత్రాంగం కళ్లు మూసుకుంటోంది. దీంతో అక్రమార్కులు పట్టపగలే ఇసుకను దోపిడీ చేస్తున్నారు. కొందరు రెవెన్యూ, పోలీసు అధికారులను మామూళ్ల మత్తులో ముంచుతూ ఇసుక మాఫియా కాగ్నా నది (వాగు) నుంచి యథేచ్ఛగా ఇసుకను కొల్లగొడుతోంది. అక్రమ రవాణా చేస్తూ జేబులు నింపుకుంటోంది. ఈ మేరకు యాలాల మండలానికి చెందిన ఓ రెవెన్యూ అధికారి బ్యాంకు ఖాతాలో భారీగా ముడుపుల డబ్బు లు జమ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే, ఇసుక రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ టీంల జాడ లేకుండా పోయింది. యాలాల కేంద్రంగా సాగుతున్న ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడటం లేదు. నిన్నమొన్నటి వరకు కాగ్నా నది నుంచి చీకటివేళల్లో ఇసుక దందా కొనసాగించిన అక్రమార్కులు తాజాగా పట్టపగలే బరితెగించి వ్యవహారం చక్కబెట్టుకుంటుం డటం గమనార్హం. ఒకవైపు వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పదేపదే చెబుతున్నా కింది స్థాయిలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మాఫియా రెచ్చిపోయి కాగ్నా నదిని తోడేస్తోంది. ఇక పట్టా భూముల్లో ఒకసారి పర్మిట్ తీసుకుంటూ వందలాది ట్రాక్టర్ల ఇసుకను కాగ్నా నది నుంచి తరలించి పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా బొంరాసిపేట్ సరిహద్ధులో డంపింగ్ చేస్తూ రూ.లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కళ్లుమూసుకోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలోనుంచే దర్జాగా... అక్రమార్కులు పట్టణంలోని పాత తాండూరు మీదుగా విద్యుత్ సబ్‌స్టేషన్ మార్గం నుంచి కాగ్నా నదిలోకి ప్రవేశించి దర్జాగా ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వుకుంటున్నారు. ఈ క్రమంలో తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం వెనుక ఉన్న కాగ్నా నదిలో రోజూ పగ టి పూట ఇసుక తవ్వుతున్నారు. నంబర్లు లేని ట్రాక్టర్లలో ఇసుక తరలించుకుపోతున్నారు. ఇసుక తవ్వకాలతో పరిశోధన కేంద్రం కంచె కూలిపోయి పరిస్థితి నెలకొన్నది. ఇటీవల పరిశోధనా కేంద్రం సిబ్బంది కాగ్నా నదిలోకి వెళ్లగా కూలీలు ట్రాక్టర్లతో సహా అక్కడినుంచి పారిపోయారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోజుకు సుమారు 200 ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా టాస్క్‌ఫోర్స్ టీంలు, ఇతర అధికారులు దీన్ని అరికట్టడంలో దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తాండూరు పట్టణ ప్రజల తో పాటు పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని 36 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చే కాగ్నా నది ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇసుక దందా వ్యవహారాన్ని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దందాకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అధికారులపై చర్యలు చేపడితే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. -
తాండూరు యాదిలో ‘ఆనందోబ్రహ్మ’
తాండూరు, న్యూస్‌లైన్: ప్రముఖ హాస్యనటుడు, ఆనందోబ్రహ్మగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి తాండూరుతో అనుబంధం ఉంది. శనివారం రాత్రి ఆయన తుది శ్వాస విడవడంపై తాండూరులో ఆయనతో అనుబంధం ఉన్న వారిని విషాదానికి గురిచేసింది. ఆయనతో కలిసి పనిచేసిన వారు అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుబ్రహ్మణ్యం మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని తాండూరుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనార్దన్ విచారం వ్యక్తం చేశారు. అప్పట్లో ధర్మవరపుతో జనార్దన్ కలిసిమెలిసి ఉండేవారు. ఈ సందర్భంగా ఆయన పలు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. ‘1982లో పంచాయతీ సమితిలో విలేజ్ లెవల్ వర్క్ డెవలప్మెంట్ ఆఫీసర్(వీఎల్‌డబ్ల్యూఓ)గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఏడాదిపాటు తాండూరులో పనిచేశారు. ఆయన ఎప్పుడూ కళల గురించే మాట్లాడుతుండేవారు. స్థానిక ప్రభుత్వ క్వార్టర్స్‌లోనే ఆయన ఉండేవారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌కు వెళ్లేవారు. ఇక్కడ ఉద్యోగం చేస్తూనే ఆల్ఇండియా రేడియోలో మాటా మంతి తదితర కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎప్పుడూ ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం మంచి కళాకారుడని, ఆయన ఇక్కడ పని చేస్తే తనలో ప్రతిభకు గుర్తింపు రాదని అప్పటి పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌కు నేను చెప్పాను. దీంతో సుబ్రహ్మణ్యంను చంద్రశేఖర్ ఇక్కడి నుంచి రిలీవ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్యం హైదరాబాద్‌కు వెళ్లారు. రేడియోలో కార్యక్రమాలు చేస్తుండగానే ఆయనకు బుల్లితెర అవకాశం వచ్చింది. ఆనందోబ్రహ్మలో నటించినఆయనకు మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయన అనేక సీరియల్స్‌లో అవకాశాలు రావడంతోపాటు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. మంచి హాస్యనటుడిగా ఆయన ప్రేక్షకాదరణ పొందారు. ఒక ఏడాదిపాటు తాండూరులో ఆయన పని చేసినప్పుడు ఎదుటి వ్యక్తులను ఎంతో ప్రేమతో పలకరించేవార’ని జనార్దన్ వివరించారు. -
తరలింపు ఇంకెప్పుడు!
తాండూరు, న్యూస్‌లైన్: రోజురోజుకూ తీవ్రమవుతున్న నాపరాతి వ్యర్థాల కాలుష్యంతో తాండూరు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణం చుట్టూ సుమారు 200లకుపైగా నాపరాతి పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా వెలువడే వ్యర్ధాలతో ఉత్పన్నమవుతోన్న కాలుష్యం స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ఈ యూనిట్లను పట్టణానికి దూరంగా తరలించాలని ఏళ్లుగా డిమాండ్ ఉంది. పట్టణ సమీపంలో ఇందుకోసం పారిశ్రామిక వాడ (ఇండస్ట్రియల్ ఎస్టేట్)ను నిర్మించాలని మిగతా 2వ పేజీలో ఠసాక్షి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ ఆవాస్ యోజన కార్యక్రమాన్ని గత సంవత్సరం జూలై 21వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పట్టణ పేదలకు గృహ వసతి కల్పించే ఈ పథకం ద్వారా రూ. 9 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అందుకుగాను తొలుత పైలట్ ప్రాజెక్టుగా శేరిలింగంపల్లిలోని కేశవనగర్ను ఎంపికచేసి .. పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా కేశవనగర్‌లోని 334 కుటుంబాలకు వారుంటున్న ప్రాంతంలోనే ఇళ్లను కట్టాల్సి ఉంది. అందుకుగాను గృహనిర్మాణం పూర్తయ్యేంతదాకా వారు ఉండేందుకు తొలిదశలో 320 ట్రాన్సిట్ హౌసింగ్ యూనిట్లు(ఇళ్లు) నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. రూ. 6.66 కోట్లతో టెండరు దక్కించుకున్న సాయితేజ కన్స్ట్రక్షన్స్కు జీహెచ్ఎంసీలోని గృహనిర్మాణ విభాగం అధికారులు సదరు స్థలాన్ని అప్పగించాల్సి ఉంది. అందుకుగాను అక్కడకు వెళ్లిన గృహనిర్మాణ అధికారులకు ఆ స్థలంలో కొంతభాగం కబ్జా కావడం కనిపించింది. తీరా ఆరా తీస్తే జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులే అక్కడ శ్మశానవాటిక నిర్మాణం కోసం రెండు ప్రహరీలు నిర్మించారని తెలిసింది. దాంతో అక్కడ ట్రాన్సిట్ ఇళ్లు నిర్మించేందుకు ఆటంకం ఏర్పడింది. అంతేకాదు.. కేశవనగర్‌లో ఇళ్లు నిర్మించే కాలనీకి అప్రోచ్ దారి మూసుకుపోయింది. దాన్ని చూసి తెల్లబోయిన గృహనిర్మాణ శాఖ అధికారులు ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డారు. కబ్జా కేసు పెడదామా అంటే పరాయివారు కాదు. తమ జీహెచ్ఎంసీ సోదరులే. రికార్డులున్నా.. సదరు స్థలంలో ట్రాన్సిట్ ఇళ్ల నిర్మాణం కోసం శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దారు సర్వేనెంబరు 37లో జీహెచ్ఎంసీకి ఎకరా 34 గుంటల స్థలాన్ని అప్పగించారు. ఈ విషయాన్ని వివరిస్తూ.. శేరిలింగంపల్లి సర్కిల్ ఇంజనీర్లు నిర్మించిన ప్రహరీలు తొలగించి.. ఇళ్ల నిర్మాణాలకు వీలుగా సదరు స్థలాన్ని తమకు అప్పగించాల్సిందిగా గృహనిర్మాణ శాఖ అధికారులు స్థానిక శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌తోపాటు వెస్ట్‌జోన్ కమిషనర్‌కు సైతం లేఖలు రాశారు. ఇది జరిగి నెల రోజులవుతున్నా ఇంతవరకు ప్రహరీలు తొలగించలేదు. దాంతో ఏం చేయాలో తోచక వారు అయోమయంలో పడ్డారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన.. దేశంలోనే తొలి పైలట్ ప్రాజెక్టుకు ఇలా బ్రేక్ పడింది. -
రైతులకు సహకారమే
తాండూరు, న్యూస్‌లైన్: రబీ రుణాలు ఈసారి కొంతమంది రైతులకే దక్కనున్నాయి. గత ఏడాది రుణాల పంపిణీతో పోల్చితే ఈసారి భారీగా కోత పడింది. సహకార సంఘాలకు డీసీసీబీ చేసిన కొత్త రుణాల అలాట్మెంట్లే ఇందుకు ఉదాహరణ. సహకార సంఘాల పరిధిలోని వేలాది మంది రైతుల్లో కొంతమందికి అందులోనూ అరకొర పంపిణీకే రబీ రుణాలు పరిమితం కానున్నాయి. ఈసారి సహకార సంఘాల్లో ఒక్క రైతుకు రూ.లక్ష రుణ పరిమితి లక్ష్యంగా డీసీసీబీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఖరీఫ్ రుణ బకాయిల వసూలు శాతం ప్రకారం కొత్త అలాట్మెంట్లు అరకొరగా కేటాయించడంతో రబీ రుణాలకు భారీగా కొత పడింది. దీంతో ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో పుట్టెడు నష్టాలను చవిచూసిన రైతులకు రబీ పంట సాగుకు పెట్టుబడుల కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. సహకార సంఘాల్లో రబీ రుణాల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. ఈ నెల 5వ తేదీన కొత్త రుణాల అలాట్మెంట్ జరిగింది. తాండూరు డివిజన్లో తట్టేపల్లి, ఎల్మకన్నె, యాలాల, నవాంద్గి సహకార సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల పరిధిలో సుమారు 5 వేలమందికిపైగా రైతులు ఉన్నారు. 2012-13లో నాలుగు సహకార సంఘాల పరిధిలో మొత్తం రైతుల్లో 2,249మంది రైతులకు రూ.566.83 లక్షల రబీ రుణాలు పంపిణీ అయ్యాయి. గత ఏడాది రబీ రుణాలు పొందిన రైతుల్లో సగం మందికి కూడా ఈసారి రుణాలు అందని పరిస్థితి నెలకొంది. ప్రతిపాదనలు రూ.కోటి.. ఇచ్చింది గోరంతే... 2013-14 సంవత్సరానికిగాను నాలుగు సహకార సంఘాలకు కలిపి కేవలం రూ.70లక్షల రబీ రుణాల అలాంట్మెంట్లు జరిగాయి. నిజానికి ఒక్కొక్క సంఘానికి సుమారు రూ.కోటి అలాట్మెంట్ చేయాలని సహకార సంఘాల పాలకమండళ్లు డీసీసీబీకి ప్రతిపాదనలు చేశాయి. తక్కువైనా కావాల్సింది 1.12 కోట్లు... కానీ అరకొర రుణాలతో సరిపెట్టారు. తక్కువగా ఒక్క రైతుకు రూ.5వేల చొప్పున రుణం ఇవ్వాలన్న గత ఏడాది ప్రకారం 2,249 మందికి సుమారు రూ. కోటి, 12 ల క్షల, 45వేలు అవసరమవుతాయి. అలాట్మెంట్ చేసిన రూ.70లక్షలు ఎంతమంది రైతులకు సరిపోతాయనేది అధికారులకే తెలియాలి. ఒక్కో రైతుకు రూ.3వేలే... ఈ అలాట్మెంట్ ప్రకారం 2,249మంది రైతులనే ప్రామాణికంగా తీసుకున్నా ఒక్కో రైతుకు రూ.3వేల వరకు రుణం అందే అవకాశం ఉంది. రూ.3వేలు పంటల సాగుకు ఎలా సరిపోతాయని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. కనిష్టంగా రూ.10వేలు, గరిష్టంగా రూ.లక్ష వరకు ఈసారి ఒక రైతుకు రుణ పరిమితి లక్ష్యం కేవలం కాగితాలకే పరిమితం కానున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే అరకొరగా జరిగిన రుణ అలాంట్మెంట్లు అందరికీ ఎంతోకొంత పంపిణీ చేస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో ముందుగా కొంతమంది రైతులకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో గత ఏడాది రబీ రుణాలు పొందిన రైతుల్లో ఈసారి కొంతమందికే రుణాలు దక్కే పరిస్థితి ఉంది. కొత్త రైతులకు రుణం నిల్.. ఇటీవల కొత్తగా సహకార సంఘాల్లో సభ్యత్వం పొందిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. తట్టేపల్లి, యాలాల, నవాంద్గి సహకార సంఘాల్లో ఇంకా రబీ రుణాల పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. ఇక తాండూరు మండలంలోని ఎల్మకన్నె సహకార సంఘంలో కేవలం ఐదుగురు రైతులకు రూ.1.5 లక్షల రుణాలు పంపిణీ చేశారు. రబీ కొత్త రుణాల అలాంట్ రూ.70 లక్షలే అయినప్పటికీ.. గత ఏడాది రబీ రుణాలు రూ.566.83లక్షలను కలుపుకొని మొత్తం రూ.636.83 లక్షల అలాట్‌మెంట్‌గా చూపెట్టడం గమనార్హం. ఎంతమందికి ఇస్తారో...ఎంతిస్తారో తెలియని గందరగోళంగా మారింది కొత్త రుణాల పంపిణీ పరిస్థితి. -
రసాభాసగా ‘రచ్చబండ’
తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు మున్సిపాలిటీలో మూడో విడత రచ్చబండ కార్యక్రమం జేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకుల వాగ్వాదానికి వేదికగా మారింది. ‘మీరెంత అంటే.. మీరెంత’ అంటూ ఇరువర్గాల నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. దీంతో మంగళవారం పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్ మున్సిపల్ కమిషనర్ రమణాచారి అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. టీ జేఏసీ నాయకులు రచ్చబండ కార్యక్రమాన్ని కొద్దిసేపు అడ్డుకున్నారు. మరోవైపు పేదోళ్లకు కాకుండా ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు నాయకుల మద్దతుదారులకే ఇస్తున్నారంటూ ప్రజలు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా రేషన్‌కార్డు రాలేదని కొందరు.. ఇళ్లు ఇవ్వలేదని మరికొందరు నాయకులను, అధికారులను ప్రశ్నించారు. టీజేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదాలు, జనాల నిలదీతలో రచ్చబండ గందరగోళంగా మారింది. జనాలంతా ఒక్కసారిగా వేదిక మీదికి దూసుకురావడంతో తోపులాట జరిగింది. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు కిందపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. అసలు అక్కడం ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఫ్లెక్సీలో తెలంగాణ ద్రోహి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోను ఎందుకు పెట్టారంటూ జేఏసీ నాయకులు వేదికపైకి వెళ్లారు. తెలంగాణకు చెందిన జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్ ఫొటో పెట్టాల్సి ఉండేదని.. సీఎం డౌన్ డౌన్ అంటూ నాయకులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అపూలు జేఏసీ నాయకులకు నచ్చజెప్పే యత్నం చేసినా వారు వినలేదు. తెలంగాణ ద్రోహి సీఎం అంటూ ఆయన ఫొటో ఉన్న ఫ్లెక్సీని చింపివేశారు. ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన తెలంగాణవాదులు ఈ క్రమంలో ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి ప్రసంగిస్తుండగా జేఏసీ తాండూరు డివిజన్ చైర్మన్ సోమశేఖర్, మరికొందరు నాయకులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ వేదిక వద్దకు దూసుకువచ్చారు. ఇందిరమ్మ పథకం కింద మున్సిపాలిటీకి చెందిన పేదలకు రెండు,మూడో విడతలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాదాపు ఐదేళ్లు అవుతున్నా లబ్దిదారులకు స్థలాలు అప్పగించలేదంటూ జేఏసీ నాయకులు ప్రశ్నించారు. ఈ తరుణంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రమేష్‌లు వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకే ఇంత వరకు దిక్కులేదు.. ఇప్పుడు కొత్తగా ఇళ్లు ఇస్తామని మంజూరుపత్రాలు ఇస్తూ పేదలను ప్రభుత్వం మోసం చేస్తోందని వాదనలకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో టీడీపీ మాజీ కౌన్సిలర్ రాజుగౌడ్ జోక్యం చేసుకుంటూ ‘మా ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా ఎందుకు అడ్డుతగులుతారంటూ’ జేఏసీ నాయకులను ప్రశ్నించారు. ఇతర టీడీపీ నాయకులు రవిగౌడ్, కరుణం పురుషోత్తంరావు, అబ్దుల్ రవూఫ్లూ సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో జేఏసీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించిన మున్సిపల్ వార్డులకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఇతరపార్టీల కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించిన వార్డుల లబ్దిదారులకు స్థలాలు కేటాయించడంలో కావాలనే వివక్ష చూపించారని జేఏసీ చైర్మన్ మండిపడ్డారు. వారికి న్యాయం చేయాలని వేదిక వద్ద బైఠాయించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పట్టణ సీఐ సుధీర్‌రెడ్డి పోలీసులతో రంగం ప్రవేశం చేశారు. జేఏసీ చైర్మన్ సోమశేఖర్, ఇతర నాయకులను వేదిక వద్ద నుంచి లాక్కెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వదిలిపెట్టారు. ఆ తర్వాత లబ్దిదారులకు పింఛన్, రేషన్, పొదుపు సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని హడావుడిగా ముగించేసి ఎమ్మెల్యే, ఇతర నాయకులు అక్కడినుంచి నిష్ర్కమించారు. -
తాండూరులో 221 ఎకరాల భూ పంపిణీ
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: ఏడో విడత భూపంపిణీలో భాగంగా తాండూరు నియోజకవర్గ్గంలో 221 ఎకరాల ప్రభుత్వ భూమిని 172 మంది రైతులకు పంపిణీ చేశామని సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. గురువారం సాయంత్రం తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాలుగు మండలాల రెవెన్యూ అధికారులతో సబ్ కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. భూ పంపిణీలో భాగంగా గ్రామాల్లో ఉన్న నిరుపేద రైతులకు అసైన్డ్ భూమిని పంపిణీ చేశామని చెప్పారు. తాండూరు మండలంలోని 9 గ్రామాల్లో 9 మంది లబ్ధిదారులకు 14 ఎకరాల 4 గుంటలు పంపిణీ చేసినట్లు తెలిపారు. యాలాల మండలంలోని 4 గ్రామాల్లో 21 మంది లబ్దిదారులకు 13 ఎకరాల 19 గుంటలు, పెద్దేముల్ మండలంలోని 10 గ్రామాల్లో 69 మంది లబ్ధిదారులకు 104 ఎకరాల 12 గుంటలు, బషీరాబాద్ మండలంలోని 10 గ్రామాల్లో 73 మంది లబ్ధిదారులకు 90 ఎకరాల 4 గుంటల ప్రభుత్వ భూమిని పంపిణీ చేసినట్లు చెప్పారు. త్వరలో దీనికి సంబంధించి రైతులకు పట్టాలు ఇస్తామని సబ్ క లెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారులకు త్వరలో ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని కోరారు. దీనిద్వారా రైతులు బ్యాంక్‌లో రుణాలు తీసుకునేందుకు వీలుందని చెప్పారు. అడవుల్లో రైతులు సాగు చేసిన భూమికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చేవిధంగా తాను అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. ఈవిషయమై త్వరలో కలెక్టర్‌తో మాట్లాడనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మహేష్‌గౌడ్, సత్యనారాయణ, స్థానిక నాయకులు కరణం పురుషోత్తంరావు, సురేందర్‌రెడ్డి, రాందాస్, అజయ్‌ప్రసాద్, సంజీవరెడ్డిలు ఉన్నారు. -
ప్రత్యేక బృందాలతో దుండగుల కోసం గాలింపు
తాండూరు, న్యూస్‌లైన్: ఆర్ఎంపీపై దాడి చేసిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ ఆదివారం తెలిపారు. వివరాలు.. తాండూరు ఇందిరానగర్‌కు చెందిన ఆర్ఎంపీ రియాజ్(38) పెద్దేముల్ మండలం మంబాపూర్లో క్లినిక్ నడుపుతున్నాడు. ఈక్రమంలో ఆయన శనివారం రాత్రి 10 గంటల సమయంలో క్లినిక్ నుంచి బైకుపై వస్తున్నాడు. తాండూరు శివారు యాలాల మండలం ఖాంజాపూర్ గేట్ వద్ద సుమారు 30 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు దుండగులు మద్యం మత్తులో ఉండి రియాజ్ వాహనాన్ని అడ్డగించారు. ఆయన వద్ద డబ్బుల కోసం వెతుకుతుండగా ప్రతిఘటించాడు. దీంతో దుండగులు తమ వద్ద ఉన్న కత్తులతో వైద్యుడి తల, కడుపు భాగాల్లో తీవ్రంగా దాడి చేసి డబ్బులు తీసుకున్నారు. అదే సమయంలో కందనెల్లికి చెందిన మహమూద్ తన ఆటోతో వస్తుండగా దుండగులు గమనించి తమ బైకుపై పరారయ్యారు. మహమూద్ రియాజ్‌ను గుర్తించి వెంటనే పట్టణంలోని ప్ర భుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించా డు. రియాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. ఆది వారం ఘటనా స్థలాన్ని ఎస్పీ రాజకుమారి సందర్శించి వివరాలు సేకరించారు. దుండగులు తెలుగులో మాట్లాడినందున స్థాని కులు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రియాజ్ పరిస్థితి మెరుగ్గానే ఉందని రూరల్ సీఐ రవి చెప్పారు. మేజిస్ట్రేట్ కూడా వాంగ్మూలం తీసుకున్నారని సీఐ చెప్పారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు డీఎస్పీ ఇస్మాయిల్ తెలిపారు. అంతుకు ముందు రైతుపై.. పెద్దేముల్ మండలం కందనెల్లికి చెందిన రైతు ఎం. వెంకటయ్యకు మంబాపూర్లో రెండు ఎకరాల పొలం ఉంది. ఈయన శనివారం రాత్రి పొలానికి నీళ్లు పెట్టి సైకిల్‌పై ఇంటికి వెళ్తున్నాడు. మంబాపూర్ సమీపంలోని రైస్‌మిల్లు వద్ద ముగ్గురు దుండగలు ఆయనను అడ్డగించారు. డబ్బుల కోసం వెతకగా అతడి వద్ద లభించలేదు. దీంతో అతడిపై దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కొని బైకుపై పరారయ్యారు. దుండగుల ఆనవాళ్ల ప్రకారం ఆర్ఎంపీపై, రైతుపై ఒక్కరే దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
నాణ్యత పేరుతో దోపిడీ
తాండూరు, న్యూస్‌లైన్: పెసర పంట పండిం చిన రైతులు దారుణంగా మోసపోతున్నారు. మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు కనీస మద్దతు ధర చెల్లించకపోవడంతో ఎంతకోఅంతకు అమ్ముకుని నిరాశతో ఇంటిముఖం పడుతున్నారు. తాండూరు మార్కెట్ యార్డులో ఈనెల 13వ తేదీ నుంచి పెసర బీట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు యార్డులో 1,349 క్వింటాళ్ల పెసర్ల్లు కొనుగోలు చేసిన వ్యాపారులు అతి కొద్ది మందికి మాత్రమే ప్రభుత్వం నిర్ధారించిన మద్దతు ధర రూ.4,400 చెల్లించారు. నాణ్యతలేదనే సాకుతో ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించి అండగా ఉంటున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. యార్డులో గిట్టుబాటు ధర కాకపోయినా కనీసం మద్దతు ధరకు కూడా లభించకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మార్కెట్ కమిటీ అధికారుల ఉదాసీనత కారణంగానే యార్డులో కొందరు కమీషన్ ఏజెంట్లు మద్దతు ధరకు మంగళం పాడుతున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అప్పుచేసి పెట్టుబడి పెట్టిన రైతులు, నిలువ చేసుకునేందుకు వసతిలేని వారు గత్యంతరంలేక ఏజెంట్లు నిర్ణయించిన ధరకే అమ్ముకుంటున్నారు. కొనుగోళ్లు ప్రారంభమైన 13వ తేదీన ముహూర్తంగా ఆరు క్వింటాళ్ల పెసర్ల కొనుగోలు చేశారు. తర్వాత వరుసగా రెండు రోజులు యార్డులో బీట్లు నిర్వహించలేదు. తిరిగి ఈనెల 19న బీట్లు ప్రారంభించి, 20వ తేదీ వరకు కొనుగోళు జరిపారు. 21, 22వ తేదీల్లో బీట్లు జరగలేదు. తొలిరోజు నుంచి ఇప్పటివరకు యార్డులో నిర్వహించిన బీట్లలో పెసర్లకు ఒక్క 19వ తేదీన మినహా ప్రభుత్వ నిర్ధేశించిన మద్దతు ధర ఏనాడూ పలకలేదు. ఈనెల 13న క్వింటాలుకు రూ.4,150, 19వ తేదీన రూ.4,400, 20వ తేదీన రూ.4,300, తాజాగా 23వ తేదీన క్వింటాలుకు రూ.4,000 ధర పలికింది. శుక్రవారం జరిగిన బీట్లనే పరిశీలిస్తే క్వింటాలుకు మద్దతు ధర కన్నా రూ.400 తక్కువ ధరకు కొనుగోళ్లు జరిపారు. అయితే నామమాత్రంగా కొన్నింటిని రూ.4,600-రూ.5,000 ధరకు కొనుగోలుచేస్తూ ఎక్కువ శాతం పెసర్లను మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ ఉన్నతాధికారులు మద్దతు ధర అమలుపై శ్రద్ధ చూపకపోవడం, ప్రభుత్వరంగ సంస్థలైన మార్క్‌ఫెడ్ వంటివి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఆసక్తి చూపకపోవడంవల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని యార్డులో మద్దతు ధర అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా, 19వ తేదీన రూ.4,400 ధర చొప్పున రూ.10,95,600 విలువచేసే 249 క్వింటాళ్లు, 20న రూ.4,300 ధరకు రూ.8.60లక్షల విలువ చేసే 200 క్వింటాళ్లు, 23న రూ.4వేల ధర ప్రకారం రూ.36లక్షల విలువ చేసే 900 క్వింటాళ్ల పెసర్ల కొనుగోళ్లు జరిగాయని మార్కెట్ కమిటీ అధికారులు చెప్పారు. మొత్తం ఇప్పటివరకు సుమారు రూ.55,55,600 విలువచేసే సుమారు 1,349 క్వింటాళ్ల వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. -
తాండూరులో వింత శిశువు జననం
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: తాండూరు మండల పరిధిలో ఓ వింత శిశువు జన్మించాడు. పొట్ట బయటే కాలేయం, పేగు భాగాలు ఉన్నాయి. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబీకులు, వైద్యుల కథనం ప్రకారం.. తాండూరు మండలంలోని రుక్మాపూర్‌కు చెందిన బ్యాగరి నాగప్ప, సువర్ణ దంపతులు. రెండున్నరేళ్ల క్రితం మొదటి కాన్పులో సువర్ణ ఓ బాబుకు జన్మనిచ్చింది. రెండో కాన్పు కోసం సువర్ణ ఇటీవల పుట్టిల్లు చిట్టి ఘనాపూర్‌కు వచ్చింది. ఆమె గర్భంలో ఉన్న శిశువుకు నెలలు పూర్తిగా నిండలేదు. 8 నెలలు ఉండగానే శుక్రవారం తెల్లవారుజామున సువర్ణ సాధారణ ప్రసవంలో బాబుకు జన్మనిచ్చింది. కాగా పుట్టిన శిశువు కాలేయం, పేగు భాగాలు పొట్ట బయటే ఉన్నాయి. దీంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు వెంటనే తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ైవె ద్యులు శిశువుకు ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన చికిత్స కోసం నగరానికి తీసుకెళ్లాలని సూచించారు. అరుదైన సంఘటన.. శిశువు కాలేయం, పేగు భాగాలు పొట్టబయటే ఉండి జన్మించడం చాలా అరుదైన సంఘటన అని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటరమణప్ప తెలిపారు. శిశువు పూర్తిగా నెలలు నిండక ముందే పుట్టడంతో పిండం సరిగా ఎదగక ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు మేనరిక వివాహాలు, శిశువు గర్భంలో ఉన్న సమయంలో గర్భిణులు తీసుకున్న కొన్ని రకాల మందుల వల్ల కూడా ఇలా జరిగే ఆస్కారం ఉంది. శిశువుకు ఆపరేషన్ చేసి బయట ఉన్న భాగాలను పొట్టలో అమర్చవచ్చు. కాగా శిశువు బతికే అవకాశం తక్కువగా ఉందని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.