తాండూరు: ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన తాండూరు మున్సిపల్ కౌన్సిల్ తొలి సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తాండూరులోని కాగ్నా నది (వాగు) నుంచి ఇసుక తవ్వకాలను అరికట్టేలా అధికారులను ఆదేశిస్తామన్నారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఉపేక్షించమని,వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
జిల్లాలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన తాండూరులో సిమెంట్ కంపెనీలు, నాపరాతి పరిశ్రమలు అధికంగా ఉన్నాయన్నారు. ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణా కోసం తాండూరుకు నిత్యం వందలాది లారీలు రాకపోకలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. లారీలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నందున ట్రాఫిక్ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రమాదాలు తగ్గించి, ట్రాఫిక్ సమస్య ను పరిష్కరించేందుకు తాండూరులో ఔట ర్ రింగురోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు సు మారు రూ.50 కోట్లు అవసరమవుతాయని మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారన్నారు. రూ.80 కోట్ల కేంద్రం నిధులతో కోట్‌పల్లి ప్రాజె క్టు నుంచి తాం డూరు పట్టణంలోని అన్ని వార్డులకు తాగునీరు సరఫరా మెరుగు పర్చడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఈ నిధులు త్వరగా మంజూరయ్యేలా చూస్తానన్నారు.
కాగ్నాలో రూ.8.52కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యేలా చూస్తానన్నారు. తాండూరులో ప్రొ.జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పట్టణ మధ్యలో ఉన్న లారీ పార్కింగ్‌కు అవసరమైన స్థలం కేటాయిస్తామన్నారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం కేసీఆర్ కచ్చితంగా నెరవేరుస్తారన్నారు. ఎంత భారం పడినా, ఇబ్బందులు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. పల్లెలు,పట్టణాల్లో చిన్న ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. జిల్లా,ఏరియా ఆస్పత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
‘మన ఊరు-మన ప్రణాళిక’లో గుర్తించిన ప్రజల అవసరాలను ఐదేళ్లలో ప్రణాళిక బద్ధంగా తీర్చడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలతోపాటు గ్రామాల అభివృద్ధికి పాటుపడతానన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి జిల్లా పరిషత్ నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. తాండూ రు మున్సిపాలిటీకి సుమారు రూ.56లక్షలు, వికారాబాద్‌కు రూ.70లక్షల బీఆర్‌జీఎఫ్ నిధులను మంజూరు చేయనున్నట్టు ఆమె చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ గోపయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమార్కులపై చర్యలు
Published Thu, Jul 24 2014 1:29 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement