cagna river
-
కాగ్నాలో కొట్టుకుపోయిన దంపతులు
బషీరాబాద్: కూరగాయలు అమ్మి తిరిగి వస్తుండగా భార్యాభర్తలు కాగ్నా నది దాటుతూ వరదలో కొట్టుకుపోయారు. మూడు రోజుల తర్వాత కర్ణాటకలోని జెట్టూరు వద్ద శవాలై తేలారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టిలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నాటికేరి బుగ్గప్ప (50), యాదమ్మ (45) భా ర్యాభర్తలు. వీరికి మంతట్టి గ్రామ శివారులోని కాగ్నానది పరీవాహక ప్రాంతంలో పొలం ఉంది. ఆదివారం సాయంత్రం పొలంలో కూరగాయలు కోసుకొని చంద్రవంచలో విక్రయించి.. రాత్రి బంధువుల దగ్గర ఉండి మరుసటి రోజు వస్తామని కొడుకు వెంకటప్పకు చెప్పి వెళ్లారు. అయితే వారు సోమవారం రాకపోవడంతో కొడుకు.. బంధువుల దగ్గర ఆరా తీయగా ఉదయమే మంతట్టికి వెళ్లారని తెలిపారు. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో వారికోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం ఉదయం వెంకటప్పకు బంధువులు కర్ణాటకలోని జెట్టూరు కాగ్నా నదిలో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాల ఫొటోలు పంపారు. అక్కడికి వెళ్లి చూ డగా తన తల్లిదండ్రులేనని గుర్తుపట్టాడు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుగ్గప్ప, యాదమ్మ దంపతులు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారని, చివరకు మరణంలోనూ కలిసే ఉన్నారని గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. -
తాండూరులో పొంగిపొర్లుతున్న వాగులు
-
తాండూరులో పొంగిపొర్లుతున్న వాగులు
తాండూరు డివిజన్ పరిధిలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి కాగ్నానది వంతెనకు 3ఫీట్లపై నుంచి ప్రవహిస్తోంది. తాండూరు- హైదరాబాద్‌కు మధ్య రాకపోకలు స్తంభించాయి. తాండూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. -
‘కాగ్నా’కు జలకళ
తాండూరు: తాండూరు శివారులోని కాగ్నా నది పరవళ్లు తొక్కుతుంది. సోమ, మంగళవారాలతోపాటు బుధ, గురువారాల్లో ఏకధాటిగా కురిసిన వర్షంతో కాగ్నాకు జలకళ వచ్చింది. కాగ్నాతోపాటు డివిజన్ పరిధిలోని చిన్న వాగులు, వంకలు వరదనీరుతో పొంగిపొర్లాయి. దాంతో నదీపరీవాహక ప్రాంతంలోని బోర్లు, బావుల్లోని నీటిమట్టాలు పెరిగాయి. తాండూరు పట్టణానికి తాగునీటిని అందించే పంప్‌హౌస్‌తోపాటు, మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్, యాలాల మండలంలోని పలు గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే మరో పంప్‌హౌస్‌లో నీటి మట్టం పెరిగింది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 232.7 మిల్లీమీటర్లకుగానూ ఇప్పటివరకు 122 మిల్లీమీటర్లు(12.2సెంటీమీటర్లు) వర్షపాతం నమోదైందని స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా.సి.సుధాకర్ పేర్కొన్నారు. తాజాగా కురిసిన వర్షాలతో భూమి బాగా తడవడం వల్ల రబీ పంటల సాగుకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. పెరిగిన నీటి మట్టం కాగ్నా నది సమీపంలోని పంప్‌హౌస్‌లో సుమారు నాలుగు అడుగుల నుంచి 12అడుగులకు, పాతతాండూరులోని మరో పంప్‌హౌస్ వద్ద మూడు అడుగుల నుంచి 10 అడుగులకు, కోడంగల్ తాగునీటి పథకానికి సంబంధించిన పంప్‌హౌస్‌లో నాలుగు అడుగుల నుంచి ఎనిమిది అడుగులకు నీటిమట్టం పెరిగింది. కాగ్నా నదిలోని ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లోకి వరద చేరడం పంప్‌హౌస్‌లో నీటి మట్టం పెరగడానికి కారణమని పంప్‌హౌస్ సిబ్బంది పేర్కొన్నారు. ఇన్‌ఫిల్టరేషన్ బావులు వరదనీటిలో మునిగిపోయాయి. పంప్‌హౌస్‌ల్లో నీటి మట్టం పెరగడం వల్ల వచ్చే వేసవి వరకు కూడా తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదని మున్సిపల్ ఏఈ శ్రీను చెబుతున్నారు. ఈ భారీ వర్షం కారణంగా తాండూరు డివిజన్లోని సంగంకలాన్, కోకట్, అగ్గనూర్, బెన్నూర్, తదితర గ్రామాలకు చెందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కళ్ల ముందే కర్ణాటకకు!
తాండూరు: వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. యేటా కాగ్నానది పొంగిపొర్లడం.. ఆ జలాలు దిగువనున్న కర్ణాటకకు తరలిపోతుండడం సాధారణమై పోయింది. భారీ వర్షాలు పడిన సమయంలో నీటి వరద పక్క రాష్ట్రానికి తరలిపోకుండా ‘చెక్’ పెట్టాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వరద నీటి వల్ల తాండూరు ప్రాంతానికి ఏ ప్రయోజనమూ ఉండడం లేదు. ప్రతి ఏడాది వర్షాకాలంలో కాగ్నాలోకి పుష్కలంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ వరద నీటిని వినియోగంలోకి తెస్తే వేలాది ఎకరాలను సాగులోకి తీసుకురావొచ్చు. తాండూరు పట్టణంతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ప్రాంతంలోని 33 గ్రామాలకూ తాగునీటిని అందించొచ్చు. చెక్‌డ్యాం నిర్మాణమెప్పుడో..! కాగ్నా వరద నీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నదిలో చెక్‌డ్యాం నిర్మించాలని గతంలో ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఏడాది క్రితం రూ.8.52కోట్ల నిధులు మంజూరయ్యాయి. చెక్‌డ్యాం నిర్మాణ స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. నదిలో చెక్‌డ్యాం నిర్మిస్తే నది చుట్టుపక్కల ఉన్న సుమారు 400 బోర్లకు పుష్కలంగా నీరు చేరుతుంది. తద్వారా సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందే వీలుంది. ప్రతిపాదిత చెక్‌డ్యాం నిర్మిస్తే 250-300 మీటర్ల పొడవున 0.35 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంటుంది. దాంతో భూగర్భజలాలు వృద్ధి చెంది భవిష్యత్తులో కరువు తలెత్తినా సాగు, తాగునీటికి సమస్య ఉత్పన్నం కాదు. కర్ణాటకకు ఇలా.. వర్షాకాలంలో కాగ్నా నుంచి తరలిపోతున్న వరద నీటిని కర్ణాటక సద్వినియోగం చేసుకుంటోంది. జలాలు బషీరాబాద్ మండలం ఇందర్చేడ్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తాయి. వరద నీరు ప్రవహించే మార్గంలో అక్కడక్కడ చిన్నచిన్న డ్యామ్‌లు సైతం నిర్మించారు. ఆ రాష్ట్రంలోని కోహెడ్, సేడం తదితర ప్రాంతాల్లో చిన్నచిన్న చెరువులు నింపడం, కాలువల ద్వారా వరద నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. 1.9టీఎంసీల నీరు కర్ణాటక? వర్షాకాలంలో సుమారు 1.9 టీఎంసీ వరదనీరు కాగ్నా నుంచి కర్ణాటకకు తరలిపోతున్నదని సాగునీటి పారుదల శాఖ అధికారుల ప్రాథమిక అంచనా. చెక్‌డ్యాం నిర్మాణంతో ఈ వరద జలాలు అందుబాటులోకి తెవొచ్చని, దాంతో వందలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.8.50కోట్ల నిధులు మంజూరైనా పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. కాగ్నాలో చెక్‌డ్యాం నిర్మాణానికి స్థలాన్ని కూడా అధికారులు ఎంపిక చేశారు. కానీ టెండర్ల ప్రక్రియ నిర్వహించి పనులు మొదలు పెట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. -
ముంచెత్తిన వాన
తాండూరు: కాగ్నా నది (వాగు) ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి పరవళ్లు తొక్కింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఐదు గంటల వరకు యాలాల, పెద్దేముల్, ధారూర్, పూడూరు మండలాల్లో జోరు వాన కురిసింది. దీంతో కాగ్నాకు వరద నీరు పోటెత్తింది. చెరువులు, వాగులు సైతం నిండి వరద నీరు పొంగిపొర్లింది. కాగ్నా నది ఉధృతితో తాండూరు- మహబూబ్‌నగర్ రహదారిపై రాకపోకలు మూడు గంటలపాటు స్తంభించాయి. చాలాకాలం తర్వాత కాగ్నా ఉప్పొంగడంతో చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు రెండు కి.మీ.మేరకు వాహనాలు నిలిచిపోయాయి. తాండూరు రూరల్ సీఐ రవి, ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో కాగ్నా వంతెన వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వరదనీరుతో ముళ్ల చెట్లు, చెత్తాచెదారం కొట్టుకొచ్చి వంతెనపై చేరాయి. అధికారులు జేసీబీని తెప్పించి వాటిని తొలగించారు. ఉదయం 10గంటల తర్వాత ప్రవాహం కాస్త తగ్గడంతో వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిచ్చారు. తాండూరు పట్టణానికి తాగునీటి సరఫరాచేసే ప్రాంతంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహించింది. భారీ వర్షం నేపథ్యంలో తాండూరు పట్టణం జలమయమైంది. గ్రీన్‌సిటీ, సాయిపూర్, కోకట్ మార్గంలోవాగు, పాలిషింగ్ యూనిట్లు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణ సమీపంలోని చిలకవాగు, కోకట్వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ఉదయం వేళ ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పట్టణంలోని రైల్వే ఫ్లైవర్ బ్రిడ్జీ మార్గంలో రోడ్లు దెబ్బతిన్నాయి. సాయిపూర్లోని ప్రభుత్వ నంబర్-1 పాఠశాల, బాలికల హాస్టళ్లు జలమయమయ్యాయి. పట్టణ సమీపంలోని కంది, పత్తి, పెసరు తదితర పంటలు నీటమునిగాయి. పలుచోట్ల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉదయం మున్సిపల్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. మధ్యాహ్ననికి కాగ్నా నదికి వరద ఉధృతి తగ్గింది. తాండూరు పట్టణంలో 52.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధారూరులో 74.2 మిల్లీమీటర్ల వర్షం ధారూరు: ధారూరు మండలంలో సోమవారం రాత్రి 74.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ధారూరు, బాచారం గ్రామాల సమీపంలో ప్రవహిస్తున్న వాగులు రాత్రి వేళ ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు మంగళవారం ఉదయం వరకు నిలిచిపోయాయి. వర్షానికి చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరింది. వర్షాలు లేక వడపడిన పంటలన్నీ కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. ధారూరు మండలంలో భారీ వర్షం కురిసినా కోట్‌పల్లి ప్రాజెక్టులోకి మాత్రం నీరు అంతగా చేరలేదు. కేవలం ఒకటిన్నర అడుగులు మాత్రమే పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.5 అడుగుల నీటి నిల్వ ఉంది. మర్పల్లి, బంట్వారం మండలాల్లో వర్షాలు కురిస్తేనే ఈ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ధారూరు మండంలోని ధర్మాపూర్, నర్సాపూర్, అనంతగిరిగుట్ట ప్రాంతాల్లో వర్షాలుకురిస్తే వాగు ప్రవహించి ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం ఉం ది. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో సోమవారం నాలుగు అడుగులు ఉన్న నీటి మట్టం అదేరోజు రాత్రి కురిసిన వర్షానికి ఏడు అడుగులకు చేరింది. చేపల వేట పెద్దేముల్: భారీ వర్షం కారణంగా చెరువులు వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాల్లో ప్రజలు చేపల వేటకు దిగారు. పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ వాగులో గ్రామ ప్రజలు వలలువేసి చేపలు పట్టుకున్నారు. వికారాబాద్ డివిజన్లో.. వికారాబాద్ రూరల్: వికారాబాద్ డివిజన్లో సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు ఆయా మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌లో 33.2 మి.మీలు, ధారూర్‌లో 74.2, బంట్వారంలో 14.0, పెద్దేముల్ 90.0, తాండూరు 52.4, బషీరాబాద్ 46.0, యాలాల 72.0 మి.మీటర్ల వ ర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి తెగిన రోడ్డు పరిగి: పరిగి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. మల్కాపూర్ వాగు పొర్లుతుండడంతో పరిగి-షాద్‌నగర్, పరిగి-మహబూబ్‌నగర్ వెళ్లే దారిలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన రోడ్డు తెగిపోయింది. మల్కాపూర్ సమీపంలో షాద్‌నగర్ రోడ్డుపై వంతెన నిర్మాణంలో ఉండడంతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. భారీ వర్షానికి మల్కాపూర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు తెగింది. వాగుకు అవతల పొలాలకు వెళ్లిన వారు, పశువులు, మేకలు, గొర్రెలు అవతలే ఉండిపోయాయి. -
ఇసుక అక్రమార్కులపై చర్యలు
తాండూరు: ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన తాండూరు మున్సిపల్ కౌన్సిల్ తొలి సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తాండూరులోని కాగ్నా నది (వాగు) నుంచి ఇసుక తవ్వకాలను అరికట్టేలా అధికారులను ఆదేశిస్తామన్నారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఉపేక్షించమని,వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన తాండూరులో సిమెంట్ కంపెనీలు, నాపరాతి పరిశ్రమలు అధికంగా ఉన్నాయన్నారు. ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణా కోసం తాండూరుకు నిత్యం వందలాది లారీలు రాకపోకలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. లారీలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నందున ట్రాఫిక్ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమాదాలు తగ్గించి, ట్రాఫిక్ సమస్య ను పరిష్కరించేందుకు తాండూరులో ఔట ర్ రింగురోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు సు మారు రూ.50 కోట్లు అవసరమవుతాయని మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారన్నారు. రూ.80 కోట్ల కేంద్రం నిధులతో కోట్‌పల్లి ప్రాజె క్టు నుంచి తాం డూరు పట్టణంలోని అన్ని వార్డులకు తాగునీరు సరఫరా మెరుగు పర్చడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఈ నిధులు త్వరగా మంజూరయ్యేలా చూస్తానన్నారు. కాగ్నాలో రూ.8.52కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యేలా చూస్తానన్నారు. తాండూరులో ప్రొ.జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పట్టణ మధ్యలో ఉన్న లారీ పార్కింగ్‌కు అవసరమైన స్థలం కేటాయిస్తామన్నారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం కేసీఆర్ కచ్చితంగా నెరవేరుస్తారన్నారు. ఎంత భారం పడినా, ఇబ్బందులు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. పల్లెలు,పట్టణాల్లో చిన్న ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. జిల్లా,ఏరియా ఆస్పత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో గుర్తించిన ప్రజల అవసరాలను ఐదేళ్లలో ప్రణాళిక బద్ధంగా తీర్చడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలతోపాటు గ్రామాల అభివృద్ధికి పాటుపడతానన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి జిల్లా పరిషత్ నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. తాండూ రు మున్సిపాలిటీకి సుమారు రూ.56లక్షలు, వికారాబాద్‌కు రూ.70లక్షల బీఆర్జీఎఫ్ నిధులను మంజూరు చేయనున్నట్టు ఆమె చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ గోపయ్య తదితరులు పాల్గొన్నారు. -
మట్టి పరీక్షలతోనే సరి!
తాండూరు: కాగ్నా నది (వాగు)లో చెక్‌డ్యాం నిర్మాణానికి పునాదిరాయి కూడా పడలేదు. చెక్‌డ్యాం గురించి ప్రజాప్రతినిధులు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి పెంచి కాగ్నా వరద జలాలను వినియోగంలోకి తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు శ్రద్ధ కనబరచడం లేదనే విషయం స్పష్టమవుతోంది. చెక్‌డ్యాం నిర్మాణానికి 2013 మార్చిలో సుమారు రూ.8.52 కోట్ల నిధులు (అడ్మిస్ట్రేషన్ సాంక్షన్) మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ చెక్‌డ్యాం నిర్మాణంతో సుమారు 35 టీఎంసీల జలాలు అందుబాటులోకి వస్తాయి. దాంతో కాగ్నా వరద జలాలు వినియోగంలోకి వచ్చి తద్వారా మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్‌లోని సుమారు 39 గ్రామాలతో, తాండూరు పట్టణ వాసులకు తాగునీటి కష్టాలు తీరుతాయి. కాగ్నాకు చుట్టుపక్కల సుమారు 750 ఎకరాల ఆయకట్టుకూ సాగునీరు అందుతుంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోకపోవడంతోనే చెక్‌డ్యాం పనులు మొదలవడానికి ఆలస్యమవుతోంది. గత ఏడాది చివరిలోనే చెక్‌డ్యాం నిర్మించనున్న ప్రాంతంలో ‘సాయిల్ బేరింగ్ కెపాసిటీ’ (ఎస్బీసీ)లో భాగంగా మట్టి పరీక్షలు నిర్వహించారు. చెక్‌డ్యాం నిర్మాణానికి కాగ్నా సమీపంలోని యాలాల మండల పరిధిలో ఒకటిరెండు గ్రామాల్లో దాదాపు 5ఎకరాల 2గుంటల భూమిని సేకరించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. కానీ నిర్మాణ పనులకు మోక్షం కలగడం లేదు. నిధుల సాంకేతిక మంజూరు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేశామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. చెక్‌డ్యాం నిర్మాణం ప్లాన్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉండటం కూడా ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చెక్‌డ్యాం నిర్మాణానికి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించి పనులు మొదలయ్యేలా ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి పెంచాలని స్థానికులు కోరుతున్నారు. -
‘కాగ్నా’ను కొల్లగొడుతున్న.. ఇసుక దొంగలు
తాండూరు, న్యూస్‌లైన్: అనుమతి లేకుండా ఇసుక తవ్వరాదు, తరలించడం నేరం.. అంటూ న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నా, పర్యవేక్షించాల్సిన యంత్రాంగం కళ్లు మూసుకుంటోంది. దీంతో అక్రమార్కులు పట్టపగలే ఇసుకను దోపిడీ చేస్తున్నారు. కొందరు రెవెన్యూ, పోలీసు అధికారులను మామూళ్ల మత్తులో ముంచుతూ ఇసుక మాఫియా కాగ్నా నది (వాగు) నుంచి యథేచ్ఛగా ఇసుకను కొల్లగొడుతోంది. అక్రమ రవాణా చేస్తూ జేబులు నింపుకుంటోంది. ఈ మేరకు యాలాల మండలానికి చెందిన ఓ రెవెన్యూ అధికారి బ్యాంకు ఖాతాలో భారీగా ముడుపుల డబ్బు లు జమ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే, ఇసుక రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ టీంల జాడ లేకుండా పోయింది. యాలాల కేంద్రంగా సాగుతున్న ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడటం లేదు. నిన్నమొన్నటి వరకు కాగ్నా నది నుంచి చీకటివేళల్లో ఇసుక దందా కొనసాగించిన అక్రమార్కులు తాజాగా పట్టపగలే బరితెగించి వ్యవహారం చక్కబెట్టుకుంటుం డటం గమనార్హం. ఒకవైపు వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పదేపదే చెబుతున్నా కింది స్థాయిలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మాఫియా రెచ్చిపోయి కాగ్నా నదిని తోడేస్తోంది. ఇక పట్టా భూముల్లో ఒకసారి పర్మిట్ తీసుకుంటూ వందలాది ట్రాక్టర్ల ఇసుకను కాగ్నా నది నుంచి తరలించి పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా బొంరాసిపేట్ సరిహద్ధులో డంపింగ్ చేస్తూ రూ.లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కళ్లుమూసుకోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలోనుంచే దర్జాగా... అక్రమార్కులు పట్టణంలోని పాత తాండూరు మీదుగా విద్యుత్ సబ్‌స్టేషన్ మార్గం నుంచి కాగ్నా నదిలోకి ప్రవేశించి దర్జాగా ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వుకుంటున్నారు. ఈ క్రమంలో తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం వెనుక ఉన్న కాగ్నా నదిలో రోజూ పగ టి పూట ఇసుక తవ్వుతున్నారు. నంబర్లు లేని ట్రాక్టర్లలో ఇసుక తరలించుకుపోతున్నారు. ఇసుక తవ్వకాలతో పరిశోధన కేంద్రం కంచె కూలిపోయి పరిస్థితి నెలకొన్నది. ఇటీవల పరిశోధనా కేంద్రం సిబ్బంది కాగ్నా నదిలోకి వెళ్లగా కూలీలు ట్రాక్టర్లతో సహా అక్కడినుంచి పారిపోయారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోజుకు సుమారు 200 ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా టాస్క్‌ఫోర్స్ టీంలు, ఇతర అధికారులు దీన్ని అరికట్టడంలో దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తాండూరు పట్టణ ప్రజల తో పాటు పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని 36 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చే కాగ్నా నది ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇసుక దందా వ్యవహారాన్ని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దందాకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అధికారులపై చర్యలు చేపడితే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.