తాండూరు, న్యూస్‌లైన్: అనుమతి లేకుండా ఇసుక తవ్వరాదు, తరలించడం నేరం.. అంటూ న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నా, పర్యవేక్షించాల్సిన యంత్రాంగం కళ్లు మూసుకుంటోంది. దీంతో అక్రమార్కులు పట్టపగలే ఇసుకను దోపిడీ చేస్తున్నారు. కొందరు రెవెన్యూ, పోలీసు అధికారులను మామూళ్ల మత్తులో ముంచుతూ ఇసుక మాఫియా కాగ్నా నది (వాగు) నుంచి యథేచ్ఛగా ఇసుకను కొల్లగొడుతోంది. అక్రమ రవాణా చేస్తూ జేబులు నింపుకుంటోంది. ఈ మేరకు యాలాల మండలానికి చెందిన ఓ రెవెన్యూ అధికారి బ్యాంకు ఖాతాలో భారీగా ముడుపుల డబ్బు లు జమ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే, ఇసుక రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ టీంల జాడ లేకుండా పోయింది. యాలాల కేంద్రంగా సాగుతున్న ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడటం లేదు. నిన్నమొన్నటి వరకు కాగ్నా నది నుంచి చీకటివేళల్లో ఇసుక దందా కొనసాగించిన అక్రమార్కులు తాజాగా పట్టపగలే బరితెగించి వ్యవహారం చక్కబెట్టుకుంటుం డటం గమనార్హం.
ఒకవైపు వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పదేపదే చెబుతున్నా కింది స్థాయిలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మాఫియా రెచ్చిపోయి కాగ్నా నదిని తోడేస్తోంది. ఇక పట్టా భూముల్లో ఒకసారి పర్మిట్ తీసుకుంటూ వందలాది ట్రాక్టర్ల ఇసుకను కాగ్నా నది నుంచి తరలించి పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా బొంరాసిపేట్ సరిహద్ధులో డంపింగ్ చేస్తూ రూ.లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కళ్లుమూసుకోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
పట్టణంలోనుంచే దర్జాగా...
అక్రమార్కులు పట్టణంలోని పాత తాండూరు మీదుగా విద్యుత్ సబ్‌స్టేషన్ మార్గం నుంచి కాగ్నా నదిలోకి ప్రవేశించి దర్జాగా ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వుకుంటున్నారు. ఈ క్రమంలో తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం వెనుక ఉన్న కాగ్నా నదిలో రోజూ పగ టి పూట ఇసుక తవ్వుతున్నారు. నంబర్లు లేని ట్రాక్టర్లలో ఇసుక తరలించుకుపోతున్నారు. ఇసుక తవ్వకాలతో పరిశోధన కేంద్రం కంచె కూలిపోయి పరిస్థితి నెలకొన్నది. ఇటీవల పరిశోధనా కేంద్రం సిబ్బంది కాగ్నా నదిలోకి వెళ్లగా కూలీలు ట్రాక్టర్లతో సహా అక్కడినుంచి పారిపోయారు.
ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోజుకు సుమారు 200 ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా టాస్క్‌ఫోర్స్ టీంలు, ఇతర అధికారులు దీన్ని అరికట్టడంలో దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తాండూరు పట్టణ ప్రజల తో పాటు పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని 36 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చే కాగ్నా నది ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇసుక దందా వ్యవహారాన్ని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దందాకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అధికారులపై చర్యలు చేపడితే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.