తాండూరు: కాగ్నా నది (వాగు) ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి పరవళ్లు తొక్కింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఐదు గంటల వరకు యాలాల, పెద్దేముల్, ధారూర్, పూడూరు మండలాల్లో జోరు వాన కురిసింది. దీంతో కాగ్నాకు వరద నీరు పోటెత్తింది. చెరువులు, వాగులు సైతం నిండి వరద నీరు పొంగిపొర్లింది.
కాగ్నా నది ఉధృతితో తాండూరు- మహబూబ్‌నగర్ రహదారిపై రాకపోకలు మూడు గంటలపాటు స్తంభించాయి. చాలాకాలం తర్వాత కాగ్నా ఉప్పొంగడంతో చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు రెండు కి.మీ.మేరకు వాహనాలు నిలిచిపోయాయి. తాండూరు రూరల్ సీఐ రవి, ఎస్‌ఐ రవికుమార్ సిబ్బందితో కాగ్నా వంతెన వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వరదనీరుతో ముళ్ల చెట్లు, చెత్తాచెదారం కొట్టుకొచ్చి వంతెనపై చేరాయి. అధికారులు జేసీబీని తెప్పించి వాటిని తొలగించారు. ఉదయం 10గంటల తర్వాత ప్రవాహం కాస్త తగ్గడంతో వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిచ్చారు.
తాండూరు పట్టణానికి తాగునీటి సరఫరాచేసే ప్రాంతంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహించింది. భారీ వర్షం నేపథ్యంలో తాండూరు పట్టణం జలమయమైంది. గ్రీన్‌సిటీ, సాయిపూర్, కోకట్ మార్గంలోవాగు, పాలిషింగ్ యూనిట్లు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణ సమీపంలోని చిలకవాగు, కోకట్‌వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ఉదయం వేళ ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
పట్టణంలోని రైల్వే ఫ్లైవర్ బ్రిడ్జీ మార్గంలో రోడ్లు దెబ్బతిన్నాయి. సాయిపూర్‌లోని ప్రభుత్వ నంబర్-1 పాఠశాల, బాలికల హాస్టళ్లు జలమయమయ్యాయి. పట్టణ సమీపంలోని కంది, పత్తి, పెసరు తదితర పంటలు నీటమునిగాయి. పలుచోట్ల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉదయం మున్సిపల్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. మధ్యాహ్ననికి కాగ్నా నదికి వరద ఉధృతి తగ్గింది. తాండూరు పట్టణంలో 52.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ధారూరులో 74.2 మిల్లీమీటర్ల వర్షం
ధారూరు: ధారూరు మండలంలో సోమవారం రాత్రి 74.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ధారూరు, బాచారం గ్రామాల సమీపంలో ప్రవహిస్తున్న వాగులు రాత్రి వేళ ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు మంగళవారం ఉదయం వరకు నిలిచిపోయాయి. వర్షానికి చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరింది. వర్షాలు లేక వడపడిన పంటలన్నీ కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి.
ధారూరు మండలంలో భారీ వర్షం కురిసినా కోట్‌పల్లి ప్రాజెక్టులోకి మాత్రం నీరు అంతగా చేరలేదు. కేవలం ఒకటిన్నర అడుగులు మాత్రమే పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.5 అడుగుల నీటి నిల్వ ఉంది. మర్పల్లి, బంట్వారం మండలాల్లో వర్షాలు కురిస్తేనే ఈ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ధారూరు మండంలోని ధర్మాపూర్, నర్సాపూర్, అనంతగిరిగుట్ట ప్రాంతాల్లో వర్షాలుకురిస్తే వాగు ప్రవహించి ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం ఉం ది. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో సోమవారం నాలుగు అడుగులు ఉన్న నీటి మట్టం అదేరోజు రాత్రి కురిసిన వర్షానికి ఏడు అడుగులకు చేరింది.
చేపల వేట
పెద్దేముల్: భారీ వర్షం కారణంగా చెరువులు వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాల్లో ప్రజలు చేపల వేటకు దిగారు. పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ వాగులో గ్రామ ప్రజలు వలలువేసి చేపలు పట్టుకున్నారు.
వికారాబాద్ డివిజన్‌లో..
వికారాబాద్ రూరల్: వికారాబాద్ డివిజన్‌లో సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు ఆయా మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌లో 33.2 మి.మీలు, ధారూర్‌లో 74.2, బంట్వారంలో 14.0, పెద్దేముల్ 90.0, తాండూరు 52.4, బషీరాబాద్ 46.0, యాలాల 72.0 మి.మీటర్ల వ ర్షపాతం నమోదైంది.
భారీ వర్షానికి తెగిన రోడ్డు
పరిగి: పరిగి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. మల్కాపూర్ వాగు పొర్లుతుండడంతో పరిగి-షాద్‌నగర్, పరిగి-మహబూబ్‌నగర్ వెళ్లే దారిలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన రోడ్డు తెగిపోయింది.
మల్కాపూర్ సమీపంలో షాద్‌నగర్ రోడ్డుపై వంతెన నిర్మాణంలో ఉండడంతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. భారీ వర్షానికి మల్కాపూర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు తెగింది. వాగుకు అవతల పొలాలకు వెళ్లిన వారు, పశువులు, మేకలు, గొర్రెలు అవతలే ఉండిపోయాయి.
ముంచెత్తిన వాన
Published Tue, Aug 26 2014 11:45 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement