కళ్ల ముందే కర్ణాటకకు! | waters moved from 'CAGNA' river | Sakshi
Sakshi News home page

కళ్ల ముందే కర్ణాటకకు!

Published Thu, Aug 28 2014 12:07 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

waters moved from  'CAGNA' river

తాండూరు: వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. యేటా కాగ్నానది పొంగిపొర్లడం.. ఆ జలాలు దిగువనున్న కర్ణాటకకు తరలిపోతుండడం సాధారణమై పోయింది. భారీ వర్షాలు పడిన సమయంలో నీటి వరద పక్క రాష్ట్రానికి తరలిపోకుండా ‘చెక్’ పెట్టాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వరద నీటి వల్ల తాండూరు ప్రాంతానికి ఏ ప్రయోజనమూ ఉండడం లేదు. ప్రతి ఏడాది వర్షాకాలంలో కాగ్నాలోకి పుష్కలంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ వరద నీటిని వినియోగంలోకి తెస్తే వేలాది ఎకరాలను సాగులోకి తీసుకురావొచ్చు. తాండూరు పట్టణంతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ప్రాంతంలోని 33 గ్రామాలకూ తాగునీటిని అందించొచ్చు.

 చెక్‌డ్యాం నిర్మాణమెప్పుడో..!
 కాగ్నా వరద నీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నదిలో చెక్‌డ్యాం నిర్మించాలని గతంలో ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఏడాది క్రితం రూ.8.52కోట్ల నిధులు మంజూరయ్యాయి. చెక్‌డ్యాం నిర్మాణ స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. నదిలో చెక్‌డ్యాం నిర్మిస్తే నది చుట్టుపక్కల ఉన్న సుమారు 400 బోర్లకు పుష్కలంగా నీరు చేరుతుంది. తద్వారా సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందే వీలుంది. ప్రతిపాదిత చెక్‌డ్యాం నిర్మిస్తే 250-300 మీటర్ల పొడవున 0.35 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంటుంది. దాంతో భూగర్భజలాలు వృద్ధి చెంది భవిష్యత్తులో కరువు తలెత్తినా సాగు, తాగునీటికి సమస్య ఉత్పన్నం కాదు.  

 కర్ణాటకకు ఇలా..
 వర్షాకాలంలో కాగ్నా నుంచి తరలిపోతున్న వరద నీటిని కర్ణాటక సద్వినియోగం చేసుకుంటోంది. జలాలు బషీరాబాద్ మండలం ఇందర్‌చేడ్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తాయి. వరద నీరు ప్రవహించే మార్గంలో అక్కడక్కడ చిన్నచిన్న డ్యామ్‌లు సైతం నిర్మించారు. ఆ రాష్ట్రంలోని కోహెడ్, సేడం తదితర ప్రాంతాల్లో చిన్నచిన్న చెరువులు నింపడం, కాలువల ద్వారా వరద నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు.

 1.9టీఎంసీల నీరు కర్ణాటక?
 వర్షాకాలంలో సుమారు 1.9 టీఎంసీ వరదనీరు కాగ్నా నుంచి కర్ణాటకకు తరలిపోతున్నదని సాగునీటి పారుదల శాఖ అధికారుల ప్రాథమిక అంచనా. చెక్‌డ్యాం నిర్మాణంతో ఈ వరద జలాలు అందుబాటులోకి తెవొచ్చని, దాంతో వందలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.8.50కోట్ల నిధులు మంజూరైనా పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. కాగ్నాలో చెక్‌డ్యాం నిర్మాణానికి స్థలాన్ని కూడా అధికారులు ఎంపిక చేశారు. కానీ టెండర్ల ప్రక్రియ నిర్వహించి పనులు మొదలు పెట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement