అధికారులను కదిలించిన ‘బరితెగింపు’ కథనం | hari narayan respond on illegal sand transportation | Sakshi
Sakshi News home page

అధికారులను కదిలించిన ‘బరితెగింపు’ కథనం

Published Thu, Nov 13 2014 12:13 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

అధికారులను కదిలించిన ‘బరితెగింపు’ కథనం - Sakshi

అధికారులను కదిలించిన ‘బరితెగింపు’ కథనం

 తాండూరు/ యాలాల: ఇసుక అక్రమ రవాణాను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. తాండూరు, యాలాల పరిధిలోని కాగ్నా, కాక్రవేణి వాగుల నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న విషయంపై ఈనెల 8వ తేదీన ‘సాక్షి’ పత్రికలో ‘బరి తెగింపు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై సబ్ కలెక్టర్ హరినారాయణ్ స్పందించారు. ఎస్పీ రాజకుమారి, సబ్‌కలెక్టర్ నేతృత్వంలో మంగళవారం అర్ధరాత్రి విజిలెన్స్ అధికారుల బృందం దాడులు నిర్వహించింది.

యాలాల మండలంలోని కోకట్, విశ్వనాథ్‌పూర్, యాలాల, లక్ష్మీనారాయణపూర్ తదితర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు రెండు వాహనాల్లో వచ్చారు. అర్ధరాత్రి ఆయా గ్రామాలతోపాటు వాగుల్లో తనిఖీలు నిర్వహించారు. తాండూరుకు చెందిన సాజిద్, జాకీర్‌లు రెండు లారీల్లో అక్రమంగా కర్ణాటకకు ఇసుకను తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. రెండు లారీలు పట్టుపడడంతో ఇసుక మాఫియాకు చెందిన మరో ఆరు లారీలు ఇసుకను నింపుకోకుండానే తప్పించుకుపోయాయి.

దాడులతో ఇసుక మాఫియా హడలిపోయింది. అధికారులకు చిక్కకుండా వాహనాలను రహస్య ప్రాంతాలకు తరలించి తప్పించుకున్నారు. బుధవారం ఉదయమే సబ్‌కలెక్టర్ హరినారాయణ్ యాలాలకు వచ్చారు. కాగ్నా, కాక్రవేణి వాగుల్లో తనిఖీలు నిర్వహించారు. కోకట్ నుంచి కాగ్నా వాగు నుంచి ఓ కిలోమీటర వరకు సబ్ కలెక్టర్ నడుచుకుంటూ వెళ్లి తనిఖీలు చేశారు. సంగమేశ్వర దేవాలయం వరకు వాగులో సబ్‌కలెక్టర్ ఇసుక తవ్వకాల తీరును పరిశీలించారు.

తరువాత విశ్వనాథ్‌పూర్ గ్రామానికి వెళ్లగా అక్కడ పెద్దఎత్తున ఇసుక డంపు కనిపించగా సబ్‌కలెక్టర్ ఆశ్చర్యపోయారు. డంప్‌ను సీజ్ చేయించారు. అనంతరం ఆయన యాలాలకు వెళుతుండగా బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో పెద్ద ఇసుక డంప్ చూసి సబ్‌కలెక్టర్ ఆగ్రహించారు. వెంట ఉన్న యాలాల తహసీల్దార్ వెంకట్‌రెడ్డిపై మండిపడ్డారు. ‘రోడ్డు పక్కన ఇంత పెద్ద ఇసుక డంపు ఉంటే మీరు ఏం చేస్తున్నారు.. అసలు డ్యూటీ చేస్తున్నారా? నిద్రపోతున్నారా? ఇసుక డంపులు సీజ్ చేయడానికి వికారాబాద్ నుంచి నేనే రావాలా? అంటూ ఆగ్రహించారు. అక్కడ కూడా డంపు సీజ్ చేయించారు.

డంపులు ఉంటే మీరేం చేస్తున్నారంటూ యాలాల వీఆర్‌ఓ అంజిలయ్యపైనా మండిపడ్డారు. వీఆర్‌ఓకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను   ఆదేశించారు. సబ్‌కలెక్టర్ తనిఖీల్లో కోకట్, విశ్వనాథ్‌పూర్, యాలాల గ్రామాల్లో సుమారు 90 ట్రాక్టర్ల ఇసుక డంపులు బయటపడ్డాయి. వాటిని సీజ్ చేయించారు. ఆర్‌అండ్‌బీ చేపట్టే అభివృద్ధి పనులకు సీజ్ చేసిన ఇసుకను వినియోగించేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

 అర్దరాత్రి విజిలెన్స్ దాడులతోపాటు ఉదయం సబ్‌కలెక్టర్ తనిఖీలతో ఇసుక మాఫియాకు ముచ్చెమటలు పట్టాయి. విజిలెన్స్ దాడులతో రాత్రే ఇసుక మాఫియా తోకముడవగా.. ఉదయం సబ్‌కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలకు రావడంతో ఇసుకాసురులు బెంబేలెత్తిపోయారు. దాదాపు మూడున్నర గంటలపాటు సబ్‌కలెక్టర్ తనిఖీలు నిర్వహించడంతో ఇసుక మాఫియా వణికిపోయింది.  
 
ఇసుక అక్రమ రవాణాను అరికడతాం: సబ్‌కలెక్టర్
 దాడుల అనంతరం సబ్‌కలెక్టర్ హరినారాయణ్ యాలాల తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్పీతో మాట్లాడి క్రితం రోజు రాత్రి విజిలెన్స్ అధికారులతో తనిఖీలు చేయించినట్టు ఆయన వెల్లడించారు. ఈ తనిఖీల్లో రెండు లారీల్లో కాగ్నా వాగు నుంచి కర్ణాటకలోని గుల్బర్గాకు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా బండమీదిపల్లి సమీపంలో విజిలెన్స్ అధికారులు పట్టుకొని సీజ్ చేశారన్నారు. ఈ లారీలను రాత్రే పరిగి పోలీసుస్టేషన్‌కు తరలించామని చెప్పారు.

 ఇసుక డంప్‌లు లభించిన ప్రాంతాలు ఎవరివో గుర్తించి వారిని బైండోవర్ చేస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఇసుక అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో దృష్టిసారించలేదన్నారు. వచ్చే నెల రోజుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు.

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీలు, ట్రాక్టర్ల యజమానుల పేర్లు సేకరించామన్నారు. గుర్తించిన వాహనాల యజమానులను బైండోవర్ చేస్తామన్నారు. ఇందుకు రూ.లక్ష పూచీకత్తు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయినా మళ్లీ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అధికారుల పాత్ర ఉన్నట్టు తేలితే వారిపైనా చర్యలు ఉంటాయన్నారు.

రాత్రి సీజ్ చేసిన రెండు లారీలు తాండూరుకు చెందిన సాజిద్, జాకీర్‌లవిగా గుర్తించామని యాలాల ఎస్‌ఐ రవికుమార్ చెప్పారు. విజిలెన్స్ అధికారులు రాత్రి తమకు రెండు లారీలతోపాటు డ్రైవర్లు వసీం, మహబూబ్‌లను తమ కస్టడీకి ఇచ్చారని పరిగి సీఐ ప్రసాద్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement