తాండూరు: కాగ్నా నది (వాగు)లో చెక్‌డ్యాం నిర్మాణానికి పునాదిరాయి కూడా పడలేదు. చెక్‌డ్యాం గురించి ప్రజాప్రతినిధులు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి పెంచి కాగ్నా వరద జలాలను వినియోగంలోకి తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు శ్రద్ధ కనబరచడం లేదనే విషయం స్పష్టమవుతోంది. చెక్‌డ్యాం నిర్మాణానికి 2013 మార్చిలో సుమారు రూ.8.52 కోట్ల నిధులు (అడ్మిస్ట్రేషన్ సాంక్షన్) మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ చెక్‌డ్యాం నిర్మాణంతో సుమారు 35 టీఎంసీల జలాలు అందుబాటులోకి వస్తాయి.
దాంతో కాగ్నా వరద జలాలు వినియోగంలోకి వచ్చి తద్వారా మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్‌లోని సుమారు 39 గ్రామాలతో, తాండూరు పట్టణ వాసులకు తాగునీటి కష్టాలు తీరుతాయి. కాగ్నాకు చుట్టుపక్కల సుమారు 750 ఎకరాల ఆయకట్టుకూ సాగునీరు అందుతుంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోకపోవడంతోనే చెక్‌డ్యాం పనులు మొదలవడానికి ఆలస్యమవుతోంది.
గత ఏడాది చివరిలోనే చెక్‌డ్యాం నిర్మించనున్న ప్రాంతంలో ‘సాయిల్ బేరింగ్ కెపాసిటీ’ (ఎస్‌బీసీ)లో భాగంగా మట్టి పరీక్షలు నిర్వహించారు. చెక్‌డ్యాం నిర్మాణానికి కాగ్నా సమీపంలోని యాలాల మండల పరిధిలో ఒకటిరెండు గ్రామాల్లో దాదాపు 5ఎకరాల 2గుంటల భూమిని సేకరించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. కానీ నిర్మాణ పనులకు మోక్షం కలగడం లేదు.
నిధుల సాంకేతిక మంజూరు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేశామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. చెక్‌డ్యాం నిర్మాణం ప్లాన్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉండటం కూడా ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చెక్‌డ్యాం నిర్మాణానికి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించి పనులు మొదలయ్యేలా ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
మట్టి పరీక్షలతోనే సరి!
Published Thu, Jul 10 2014 11:56 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement